ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఆసియా క్రీడలు ప్రారంభం అయ్యాయి.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా 19వ ఆసియా క్రీడలు శనివారం అధికారికంగా ప్రారంభం అయ్యాయి.
అయితే, ఇప్పటికే పలు క్రీడల ప్రిలిమినరీ మ్యాచ్‌లు మొదలయ్యాయి.
అక్టోబర్ 8 వరకు ఈ క్రీడలు జరుగనున్నాయి.
కరోనా కారణంగా 2022లో నిర్వహించాల్సి ఈ పోటీలు వాయిదా పడ్డాయి.
క్రీడల ప్రారంభోత్సవంలో భారత పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ జాతీయ జెండా బేరర్లుగా వ్యవహరించి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
1951లో తొలి ఆసియా క్రీడలు దిల్లీ వేదికగా జరిగాయి.
నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, CHANDRABABU NAIDU/FB
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తమ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు న్యాయవాదులు శనివారం సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఏడాది గ్రూప్-1 పరీక్ష జరిగిన తర్వాత పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో ఆ పరీక్షను రద్దు చేసి, 2023 జూన్ 11న టీఎస్‌పీఎస్సీ మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించింది.
మొత్తం 503 పోస్టులకు గాను రెండోసారి సుమారు 2 లక్షల 30 వేల మంది పరీక్ష రాశారు. జులైలో పరీక్ష కీ విడుదల చేశారు.
అయితే పరీక్షకు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను టీఎస్‌పీఎస్సీ సరిగా సేకరించలేదని, ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు టీఎస్‌పీఎస్సీకి నోటీసులు జారీచేసి, వివరణ తీసుకుంది.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ (శనివారం) తీర్పు ఇస్తూ జూన్‌లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష చెల్లదని, మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
ఇప్పుడు హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్‌కు వెళ్తుందా, లేకపోతే పరీక్ష రద్దుచేసి, మళ్లీ మూడోసారి నిర్వహిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును కించపరిచేలా ఆన్‌లైన్‌లో చేస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ ఈ నెల 9న అరెస్టు చేసింది. అనంతరం ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
అక్కడ జడ్జిగా ఉన్న హిమబిందు ఆదేశాలతో చంద్రబాబును రిమాండ్‌కు తరలించారు.
కోర్టు నిర్ణయం తర్వాత జడ్జి హిమబిందుకు వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి.
దీంతో అలాంటి పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ కస్టడీలోకి తీసుకుంది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని తొమ్మిది మంది అధికారుల బృందం విచారిస్తోంది.
ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ జరగనుంది.
చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.
భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ జైలులోనే ఆయనను విచారిస్తున్నారు.
విచారణ సమయంలో చంద్రబాబు తరఫున ఇద్దరు న్యాయవాదులు హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది.
నిబంధనలను పాటిస్తూ దర్యాప్తు సాగాలని, ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ కేసులో తదుపరి విచారణ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సెప్టెంబర్ 25న జరగనుంది.
మరోవైపు చంద్రబాబుకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన న్యాయవాదులు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.