న్యూస్‌క్లిక్ కేసు: జర్నలిస్టులు ప్రభుత్వానికి ‘సాఫ్ట్ టార్గెట్’ అయ్యారా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆన్‌లైన్ వార్తాసంస్థ ‘న్యూస్‌క్లిక్’ జర్నలిస్టుల ఇళ్లపై దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దాడులు చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకుంది. దీంతో “భారతదేశంలో పత్రికా స్వేచ్చ” ప్రమాదంలో పడిందా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబిర్ పురకాయస్థ, హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్ అమిత్ చక్రవర్తి ఏడు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ‘అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్(యూఏపీఏ)’ కింద వాళ్లిద్దర్నీ అరెస్ట్ చేశారు.
యూఏపీఏ- తీవ్రవాద వ్యతిరేక చట్టం. ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం చాలా కష్టం.
న్యూస్‌క్లిక్ మనీ లాండరింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, దిల్లీ పోలీసుల్లో ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నాయి. న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబిర్ పురకాయస్థ ఈ కేసుల మీద మధ్యంతర స్టే ఉత్తర్వుల్ని తెచ్చుకున్నారు.
జర్నలిస్టుల్ని యుపాలోని సెక్షన్ల కింద అరెస్ట్ చేయవచ్చా? న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల్ని ఇప్పుడీ చట్టం కింద అరెస్ట్ చెయ్యడంతో వారికి బెయిల్ వస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఫొటో సోర్స్, CAAJ
జర్నలిస్టులపై యూఏపీఏ ఎందుకు?
న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల మీద యూఏపీఏ ప్రయోగించడంపై భారతీయ మీడియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి.
“యూఏపీఏ లాంటి క్రూరమైన చట్టాలు ఉండకూడదు. ఈ చట్టాలను అన్ని ప్రభుత్వాలు ఉపయోగించాయి. కొన్ని ప్రభుత్వాలు మిగతా వాళ్ల కంటే ఎక్కువగా ప్రయోగించాయి. మన ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి చట్టాలు ప్రయోగించాల్సిన అవసరం ఏముంది?. టెర్రరిస్టులు, దోపిడీ దారులు, హంతకులు, దేశ ద్రోహులకు వ్యతిరేకంగా దేశంలో చాలా చట్టాలున్నాయి. అలాంటప్పుడు వలస పాలన నాటి చట్టాలు ఎందుకు తెస్తున్నారు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ జర్నలిస్టు ఒకరు చెప్పారు.
యూఏపీఏకి వ్యతిరేకంగా జర్నలిస్టులు కథనాలు రాస్తూనే ఉన్నారు.
“ఈ చట్టాలను అమాయక ప్రజలపై ఉపయోగించవచ్చని మాకు తెలుసు. ఉగ్రవాదులపై కాకుండా తరచుగా సాధారణ ప్రజలపై ప్రయోగిస్తారు. ఎందుకంటే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఇప్పటికే తగినన్ని చట్టాలు ఉన్నాయి" అని సీనియర్ జర్నలిస్టు ఒకరు చెప్పారు.
"ఏ ప్రభుత్వమైనా సరే ప్రశ్నించేవారిని కట్టడి చెయ్యడానికి ప్రయత్నిస్తుంటుంది. తేడా ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు క్రూరంగా, మరి కొన్ని తక్కువ క్రూరంగా ప్రవరిస్తాయి. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం కూడా నిజాయతీగా పని చేసే మీడియాను అంగీకరించలేదు. మీడియా గొంతు నులిమి చంపేస్తుంది. ప్రభుత్వాల దాడికి వ్యతిరేకంగా పోరాడకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుంది. అధికారంలో ఎవరు ఉన్నాసరే... ప్రజలు గొంతు విప్పకపోతే ఇది మరింత దారుణంగా మారుతుంది” అని సీనియర్ పాత్రికేయుడొకరు అన్నారు.
జర్నలిస్టులు తప్పు చేస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తే, అలాంటి వారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వద్ద అనేక మార్గాలున్నాయి. అంతేగానీ, “వాళ్లను తీవ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిర్బంధించడం పూర్తిగా తప్పు” అని సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి మల్హోత్రా చెప్పారు.
“మోదీ ప్రభుత్వం జర్నలిస్టుల్ని అరెస్టుల ద్వారా భయపెట్టాలని అనుకుంటోంది. తీవ్రవాద వ్యతిరేక చట్టాల కింద జర్నలిస్టుల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాము. భారతదేశంలో ఇప్పుడు జర్నలిస్టులు టెర్రరిస్టులయ్యారా? ప్రభుత్వం మమ్మల్ని టెర్రరిస్టులుగా భావిస్తుంటే, మేము రాసిన ఏ కథనాల వల్ల మీరు మమ్మల్ని తీవ్రవాదులుగా భావించారో చెప్పండి” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
పత్రికలు, ప్రసార సాధనాలతో ఇలా వ్యవహరించకూడదనేది జ్యోతి మల్హోత్రా అభిప్రాయం
ఒక వైపు మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎమర్జెన్సీని విమర్శిస్తూ, మీడియా స్వాతంత్ర్యాన్ని కాపాడుతున్నామని చెబుతూ, ఇంకో వైపు జర్నలిస్టుల్ని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు అని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె అన్నారు.
‘‘రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛ ఇచ్చింది. జర్నలిస్టులు ప్రజల వైపు ఉన్నారు. ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల్ని ప్రశ్నిస్తారు. పాలనా వ్యవహారాల్లో జరుగుతున్న తప్పుల మీద కచ్చితంగా మా గొంతు వినిపిస్తాం’’ అని జ్యోతి మల్హోత్రా చెప్పారు.

మీడియా గొంతు నొక్కే ప్రయత్నం: ఎడిటర్స్ గిల్డ్
దిల్లీ, ముంబయిలోని 50 ప్రాంతాల్లో అధికారులు 46 మంది న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల్ని ప్రశ్నించారు. తర్వాత వారి వద్ద ఉన్న డిజిటల్ పరికరాలను జప్తు చేశారు. దిల్లీలోని న్యూస్‌క్లిక్ కార్యాలయానికి సీల్ వేశారు.
చైనా, అమెరికా నుంచి న్యూస్‌క్లిక్‌కు అక్రమ మార్గాల్లో నిధులు వచ్చాయన్న ఈడీ ఆరోపణల మీద ఈ ఏడాది ఆగస్టు 17న దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగానే ఇటీవలి అరెస్టులు జరిగినట్లు చెబుతున్నారు.
న్యూస్‌క్లిక్ మీద పోలీసుల చర్యపై దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు తీవ్రంగా స్పందించాయి.
“మీడియా గొంతు నొక్కేందుకు ఈ దాడులు మరో ప్రయత్నం” అని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది.
‘‘నిజంగానే ఏదైనా నేరం జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అలాంటి ప్రత్యేక కేసుల్లో విచారణ పేరుతో క్రూరమైన చట్టాలతో దాడి చెయ్యకూడదు. భావ ప్రకటనా స్వేచ్చను, ప్రభుత్వంపై వ్యతిరేకతను, విమర్శలను అణచివెయ్యకూడదు” అని ఎడిటర్స్ గిల్డ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
“ప్రజాస్వామ్యంలో స్వేచ్చగా పని చేసే మీడియా అవసరమని ప్రభుత్వానికి మేము మరోసారి గుర్తు చేస్తున్నాం. ఫోర్త్ ఎస్టేట్‌ను గౌరవించడంతోపాటు రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు” పేర్కొంది.

ఫొటో సోర్స్, SOPA IMGES
జర్నలిస్టులపై పక్షపాత వైఖరితో దాడులు: ఎఫ్‌ఎంపీ
"ప్రభుత్వం జర్నలిస్టులు, మీడియా సంస్థలను కొంత మందిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోంది. ఏకపక్షంగా పక్షపాత వైఖరితో దాడులు చేస్తోంది” అంటూ ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ (ఎఫ్‌ఎంపీ) చేసిన ప్రకటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
"దీనికి సంబంధించి క్రూరమైన యూఏపీఏను అమలు చెయ్యడం గతంలో ఎన్నడూ లేనంత ప్రభావం చూపిస్తోంది” అని ఎఫ్ఎంపీ తెలిపింది.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే దేశంలో ప్రభుత్వాన్ని విమర్శించే కొంత మంది జర్నలిస్టులు, పత్రికలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించింది.
జర్నలిస్టులు, మీడియా సంస్థల మీద పోలీసుల దాడులు కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని డిజిపబ్ న్యూస్ ఫౌండేషన్ వ్యాఖ్యానించింది.
‘‘ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ పత్రికలను భయపెట్టడాన్ని వేరొక స్థాయికి తీసుకెళ్లింది. పత్రికా స్వేచ్చ, పౌర హక్కులు, మానవ హక్కులు, మీడియాకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీరు లాంటి ఆంశాలలో భారత దేశం ర్యాంకు రోజు రోజుకీ దిగజారుతోంది’’ అని డిజిపబ్ తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మీడియా స్వేచ్ఛలో భారత్ ఎక్కడ?
ప్రపంచ మీడియా స్వేచ్చ సూచీలో భారత ర్యాంకు 161 నుంచి 180కి దిగజారిందని 2002లో భారతదేశం 150వ స్థానంలో ఉందని గ్లోబల్ మీడియా మానిటరింగ్ ఆర్గనైజేషన్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఈ ఏడాది మేలో విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
భారతదేశంలోని ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్త అధీనంలో ఉన్నాయని ఆర్ఎస్ఎఫ్ తన నివేదికలో ప్రకటించింది.
ప్రభుత్వాన్ని విమర్శించే వారిని ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షించేందుకు మోదీ వద్ద ఓ సైన్యం ఉందని, వీళ్లంతా విమర్శకులపై విష ప్రచారంతో విరుచుకుపడుతున్నారని నివేదిక తెలిపింది. ఈ రెండు వర్గాల మధ్య జర్నలిస్టులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, చాలా మంది స్వేచ్చగా రాయలేకపోతున్నారని ఆర్ఎస్ఎఫ్ నివేదిక వెల్లడించింది.

ఫొటో సోర్స్, @KARNIKKOHLI
‘జర్నలిస్టులు చట్టానికి అతీతులేమీ కాదు, కానీ..’
‘‘జర్నలిస్టులు తేలికపాటి లక్ష్యంగా మారారు. అది కూడా చిన్న చిన్న న్యూస్ పోర్టల్‌లలో పనిచేసేవాళ్లు. పెద్ద పెద్ద సంస్థల్లో ఉండే వారికి ఉన్న రక్షణలు వారికి ఉండవని” సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు.
ఎడిటర్స్ గిల్డ్ చెప్పినట్లు నేరం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అయితే క్రూరమైన చట్టాలను ప్రయోగించి వేధించకూడదన్న ఎడిటర్స్ గిల్డ్ ప్రకటనను ఇండియా టుడే ఛానల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ఆయన సమర్థించారు.
‘‘జర్నలిస్టులు చట్టానికి అతీతులని ఎవరూ చెప్పడం లేదు. అదే సమయంలో వారిని అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్రవాదుల మీద ప్రయోగించే క్రూరమైన చట్టాలను ఉపయోగించడం చట్టాన్ని ఉల్లంఘించడమే. పత్రికా స్వేచ్ఛను కట్టడి చేసే ప్రయత్నం వల్ల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు.
“న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు వస్తున్నాయనే ఆరోపణలతో ఆ సంస్థలో పని చేస్తున్న చిన్నచిన్న ఉద్యోగులను అరెస్టు చెయ్యడం ప్రమాదకరమైన పరిణామం. దీని వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయి. పత్రికా స్వేచ్చ సూచీలో భారత దేశం అట్టడుగున ఉంది. ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీ దగ్గర స్పష్టమైన సమాచారం ఉంటే దాన్ని ప్రజల ముందు ఉంచి ఎలాంటి చర్యలైనా తీసుకోండి” అని అన్నారాయన.
“న్యూస్‌క్లిక్ మీద మనీ లాండరింగ్ కేసు 2021 నుంచి నడుస్తోంది. ఆ కేసును ప్రభుత్వం ఇప్పుడు మనీ లాండరింగ్ వ్యతిరేక చట్టం నుంచి క్రూరమైన యూఏపీఏ కిందకు తీసుకు వచ్చారు” అని రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, @KARNIKKOHLI
‘డిజిటల్ పరికరాలను జప్తు చేస్తే ఎలా?’
న్యూస్‌క్లిక్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన 46 మందికి సంబంధించిన డేటా ఉన్న పరికరాలను ప్రభుత్వం జప్తు చేసింది.
జర్నలిస్టుల సమాచారం ఉన్న ఎలక్ట్రిక్ పరికరాలను సీజ్ చెయ్యడం, వాటి కాపీలను కూడా ఇవ్వకపోవడాన్ని ఫౌండేషన్ ఫర్ మీడియా జర్నలిస్ట్స్ ప్రశ్నించింది. వాటిల్లో ఉండే సమాచారం విలువైనది కావచ్చని, దాన్ని కాపాడుకునే హక్కు జర్నలిస్టులకు ఇవ్వకపోవడం వారి హక్కులను ఉల్లంఘించడం అని తెలిపింది.
జర్నలిస్టులకు సంబంధించిన డిజిటల్ పరికరాలను స్కాన్ చెయ్యడం, జప్తు చెయ్యడానికి వ్యతిరేకంగా ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ నిరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరికరాల్లో జర్నలిస్టుల వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుందని, వాటిని జప్తు చెయ్యడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని వాదించింది.
పోలీసులు, దర్యాప్తు సంస్థలు నిర్వహించే దాడుల్లో ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చట్టం చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని డిజిపబ్ తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మోదీ భయపడ్డారు: కాంగ్రెస్
దైనిక్ భాస్కర్, న్యూస్ లాండ్రీ, ద కశ్మీర్ వాలా, ద వైర్ లాంటి ప్రముఖ మీడియా హౌస్‌ల మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడుల తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిజాలను మాట్లాడే జర్నలిస్టుల మీద ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వానికి అనుబంధ సంస్థలు ఎదురు దాడులు చేస్తున్నాయని ప్రతిపక్షాల కూటమి ఆరోపించింది.
“ప్రధాని మోదీ భయపడ్డారు. ఆయన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారి మీద అసహనంతో ఉన్నారు. వాళ్లు ప్రతిపక్ష నాయకులైనా, జర్నలిస్టులైనా, నిజం మాట్లాడేవారిని హింసిస్తున్నారు. న్యూస్‌క్లిక్ మీద దాడితో మరోసారి అది నిరూపణ అయింది” అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
“దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే పత్రికా స్వేచ్చ కూడా ఉండాలి. పత్రికలు, ప్రసార సాధనాల విషయంలోనూ కొన్ని సంస్థలు తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం లేదు. మీడియాలో ఓ వర్గం మరో మీడియా సంస్థ మీద విమర్శలు చెయ్యడం మీడియా వర్గాల్లో అయోమయం పెంచుతోంది. ఇది సరైనది కాదు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ పాత్రికేయుడు చెప్పారు.
ఇది కూడా చదవండి:
- కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులా? కోచింగ్ సెంటర్లా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- నాందేడ్: ‘డాక్టర్లు లేరు, మెషీన్లు ఆగిపోయాయి.. పిల్లలు చనిపోయాక మా సంతకాలు తీసుకున్నారు’
- బంగారం కొనాలా? బంగారం బాండ్లు కొనాలా? ఏది లాభం?
- ఇందూరు సభ: ‘మీకో రహస్యం చెప్పనా’ అంటూ కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
- దేవ్ రతూడి: సైకిల్‌పై పాలు అమ్మిన ఈ భారతీయుడు, చైనా సినిమాల్లో విలన్‌గా ఎలా సక్సెస్ అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













