'నరకం తలుపులు తెరుచుకున్నట్టు అనిపించింది'.. ఇరాక్ అగ్ని ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, ఎథర్ షెల్బీ
- హోదా, బీబీసీ అరబిక్
ఇరాక్‌లో పెళ్లి వేడుకల్లో జరిగిన భారీ అగ్నిప్రమాంలో వంద మందికి పైగా చనిపోయారు. చాలా మంది గాయాలపాలయ్యారు.
ఉత్తర ఇరాక్‌లోని కరాకోష్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ఘటనతో అక్కడంతా భయానకంగా, గందరగోళంగా మారిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షిఘాలి నసీమ్ బీబీసీతో చెప్పారు.
మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగిన సమయంలో 19 ఏళ్ల ఘాలి నసీమ్ అక్కడే ఉన్నారు. పెళ్లి వేడుకలు జరిగిన అల్ - హైతమ్ బ్యాంకెట్ హాల్(పెళ్లి మండపం)కి కొద్ది మీటర్ల దూరంలో ఆయన ఉన్నారు.
ప్రమాదంలో చిక్కుకున్న తన స్నేహితులను కాపాడేందుకు ఆయన అక్కడికి పరుగెత్తారు.
''అక్కడ ఒక తలుపు మూసి ఉంది. దాన్ని తెరిచేందుకు గట్టిగా నెట్టాం. మండపంలో నుంచి భారీగా మంటలు బయటికొచ్చాయి. అది నరకానికి తలుపు తెరిచినట్టుగా అనిపించింది. భారీగా మంటలు వ్యాపించాయి. ఎంతలా అంటే, అక్కడి పరిస్థితి మాటల్లో చెప్పలేను'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
పెనువిషాదం
వధూవరులు డ్యాన్స్ చేసిన తర్వాత కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.
ఇదో భారీ విషాదమని నసీమ్ చెప్పారు. ''నేనేమీ చేయలేకపోయా. మంటలకు దూరంగా పరుగెత్తా''.
ఫోన్‌లో ఆయన గొంతు పీలగా అనిపించింది. ''అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చిన తర్వాత, నా స్నేహితుల కోసం లోపలికి వెళ్లా. ఒక బాత్రూమ్‌లో 26 మృతదేహాలు కనిపించాయి. ఒక మూలన పూర్తిగా కాలిపోయిన 12 ఏళ్ల బాలిక పడి ఉంది'' అని చెప్పారు.
మండపంలో ఉపయోగించిన బాణసంచా వల్లే మంటలు వ్యాపించాయని ఇరాక్ సివిల్ డిఫెన్స్ మీడియా ప్రతినిధి ఘాదత్ అబ్దుల్ రహ్మాన్ బీబీసీతో చెప్పారు. ఈ పట్టణంలో క్రిస్టియన్ల జనాభా ఎక్కువని ఆయన చెప్పారు.
హాల్ లోపల మండే పదార్థాలు ఉండడంతో మంటలు భారీగా చెలరేగాయని అన్నారు.
''మండపంలో ఉన్న అతిథులు ఒక్కసారిగా ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఎక్కువ లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది'' అని నసీమ్ అభిప్రాయపడ్డారు.

కుటుంబ సభ్యుల కోసం వెతుకులాట..
తన స్నేహితులు సురక్షితంగా ఉన్నారని ఆయన చెప్పారు. మంటలు చెలరేగిన సమయంలో 17 ఏళ్ల టొమి ఉదయ్ తలుపు వద్దే ఉన్నారని, దీంతో వెంటనే తప్పించుకోగలిగారని అన్నారు.
''పైకప్పు నుంచి నల్లటి పొగ దట్టంగా అలుముకుంది. ఆ వెంటనే అక్కడి నుంచి పరుగెత్తా. ఐదు నిమిషాల్లోనే దారుణం జరిగిపోయింది'' అన్నారు.
ప్రమాదంలో చనిపోయిన 50 మంది మృతదేహాలను బుధవారం ఖననం చేశారు. మిగిలిన వాటిని ఖననం చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటికి చాలా మంది తమ కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నారు.
మంటలు వ్యాపించిన సమయంలో తన 33 ఏళ్ల భార్య, 5 ఏళ్ల కొడుకు, 13 ఏళ్ల కూతురు నుంచి ఘజ్వాన్ దూరమయ్యారు.
''ఆయన మరో కూతురు మండపం నుంచి బయటికి వచ్చింది. అప్పటికే ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది'' అని ఘజ్వాన్ సోదరి ఇసాన్ బీబీసీతో చెప్పారు.
భార్య, పిల్లల కోసం తన సోదరుడు ఆస్పత్రుల్లో వెతుకుతున్నారని ఆమె చెప్పారు.
'అక్కడి పరిస్థితి చెప్పలేను'
ప్రమాదంలో 60 శాతానికి పైగా కాలిపోయిన వారి పరిస్థితి విషమంగా ఉందని మోసుల్‌లోని స్పెషల్ మెడికల్ సెంటర్ ఫర్ బర్న్స్ (అగ్నిప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రత్యేక ఆస్పత్రి) డాక్టర్ వాద్ సలీం బీబీసీతో చెప్పారు.
''చాలా మంది ముఖాలు, ఛాతి, చేతులు కాలిపోయాయి. మహిళలు, చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి'' అని ఆయన చెప్పారు.
గాయాలపాలైన వారికి రాత్రంతా చికిత్స చేస్తూనే ఉన్నారు చీఫ్ నర్స్ ఇస్రా మొహమ్మద్. దాదాపు 200 మందికి చికిత్స చేసినట్లు బీబీసీతో చెప్పారు.
''చాలా బాధాకరం. కొంతమంది 90 శాతం కాలిపోయారు. ఆస్పత్రికి తీసుకొచ్చేప్పటికే 50 మంది చిన్నారులు చనిపోయారు'' అని చెప్పారు.
ఒక్కసారిగా అంతమందిని తీసుకురావడంతో ఆస్పత్రిలో మందుల కొరత ఏర్పడిందని, ఇతర సదుపాయాల కొరత కూడా ఉందని చెప్పారు.
నసీమ్, అతని స్నేహితులు ఇలాంటి భయానక ఘటనను అంత త్వరగా మర్చిపోలేరు.
''దాని గురించి ఏం చెప్పలేను. ఒక్కో కుటుంబంలో అందరూ చనిపోయారు. అలాంటివి కనీసం మూడు కుటుంబాలు ఉన్నాయి. వాళ్లలో ఎవరూ బతకలేదు. అందరూ విషాదంలో ఉన్నారు. ఈ ప్రావిన్స్ మాత్రమే కాదు. మొత్తం ఇరాక్ శోకసంద్రంలో ఉంది'' అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మహిళ దేహాన్ని నోట కరుచుకుని కనిపించిన 13 అడుగుల భారీ అలిగేటర్
- ఒసిరిస్ రెక్స్: ప్రమాదకరమైన బెన్నూ ఆస్టరాయిడ్ శాంపిళ్లతో నాసా వ్యోమనౌక భూమిపై ఎలా దిగింది?
- అణుబాంబుల ఆనవాళ్లు వెతుకుతుంటే కొత్త జీవులు బయటపడ్డాయి, ఎలాగంటే...
- పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకొని కాలి నడకన భారత్ చేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కథ..
- టార్గెట్ కిల్లింగ్స్ మీద అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















