ఆంధ్రప్రదేశ్ - వరికపూడిశెల ప్రాజెక్ట్‌: ముగ్గురు సీఎంలు.. నాలుగు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్టు కథేంటి?

కృష్ణా నదీ జలాలు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

పల్నాడు జిల్లాలో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేస్తున్నారు. రూ. 340 అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నారు.

‘‘వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం’’ కింద ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది.

దీనికి అవసరమైన కీలకమైన అటవీ, పర్యావరణంతో పాటు అన్ని రకాల అనుమతులు సాధించినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలి దశలో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించాలన్నది లక్ష్యమని ప్రభుత్వం అంటోంది.

ఈ ప్రాజెక్టు పూర్వాపరాలు ఏంటంటే..

వర్షాభావ పరిస్థితులు కారణంగా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని మూడోవంతు లోటు వర్షపాతం నమోదైంది. సగటు కన్నా తక్కువ వర్షపాతం రికార్డయింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి 9 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

పల్నాడు జిల్లాలో సగటు వర్షపాతం కన్నా 16 శాతం తక్కువ కురిసింది. అసలే మెట్ట ప్రాంతం కావడంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు పల్నాడు వాసులను కలవరపరుస్తున్నాయి.

ఈ ఏడాది మిర్చి పంట కూడా ఆశించిన స్థాయిలో సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. సాగునీటి కొరతకి తోడు వర్షాకాలం ముగింపు దశలోనే కొన్ని గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలవుతున్నాయి.

పల్నాడుని నీటి కష్టాల నుంచి గట్టెక్కించే వరికపూడిశెల ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా ఎదురుచూపులతోనే గడపాల్సి వస్తోంది.

ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు సార్లు శంకుస్థాపనలు చేశారు. అయినా పునాదిరాళ్ల దశ దాటిన దాఖలాలు లేవు.

ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. అంటే ఇది నాలుగో శంకుస్థాపన.

కృష్ణా జలాలను వినియోగించుకుంటూ...

కృష్ణా ప్రవాహానికి చేరువలో ఉన్నప్పటికీ పల్నాడులోని కొన్ని ప్రాంతాలకు కనీసం గుక్కెడు నీరు కూడా దొరక్క అల్లాడిపోయిన రోజులున్నాయి.

నాగార్జున సాగర్ దిగువనే ఉన్న మాచర్ల, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

గడిచిన నాలుగేళ్లుగా వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ, ఈసారి మాత్రం పరిస్థితి భిన్నం.

నైరుతి రుతుపవనాలు ఆశించిన మేరకు స్పందించకపోవడంతో కరువు ఛాయలు అలముకుంటున్నాయి. అందులోనూ పల్నాడులో అది స్పష్టంగా కనిపిస్తోంది.

ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాల్లో సుమారు 24,900 ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు 70 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు వరికపూడిశెల ప్రాజెక్టును ప్రతిపాదించారు.

పల్నాడు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ప్రాంతానికి కూడా సాగు, తాగునీరు అందించే అవకాశం ఉంటుంది.

మొత్తంగా 1.2లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెబుతున్నారు.

కృష్ణా నదీ జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించి, వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చేందుకు వరికపూడిశెల ఆవశ్యాన్ని గుర్తించి అడుగులు వేశారు.

వరికపూడిశెల ప్రాజెక్టు డిమాండ్ 1950ల నుంచే ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే చర్చ నడిచింది.

1980లలో వరికపూడిశెల కోసం ఉద్యమం నడిచింది. ఫలితంగా 1996లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది.

ఇదొక ఎత్తిపోతల పథకం. సాగర్ దిగువన ఎత్తిపోతల ప్రాంతంలో నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు ప్రాంతానికి సరఫరా చేయాలనేది దీని లక్ష్యం.

ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు రూ.1650 కోట్లు.

వరికపూడిశెల ప్రాజెక్టు

ఫొటో సోర్స్, UGC

గతంలో మూడు సార్లు శంకుస్థాపన

తొలుత 1996లో చంద్రబాబు హయాంలో ఓసారి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత 2008లో వైఎస్సార్ ప్రభుత్వం ఉండగా మరోసారి శంకుస్థాపన చేశారు. అనంతరం 2018లో చంద్రబాబు నాయుడు మరోసారి శంకుస్థాపన చేశారు.

చంద్రబాబు, వైఎస్సార్ హయంలోనే నిర్మాణం మొదలుపెడతామని ప్రకటించినా అది ఆచరణ రూపం దాల్చకపోవడంతో మూడు దశాబ్దాలుగా పల్నాడు వాసులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

అందులోనూ వర్షాలు సజావుగా కురిస్తే పెద్ద సమస్య గుర్తు రాకపోయినప్పటికీ ఈ ఖరీఫ్ మాదిరిగా వర్షాభావం ఎదురైతే మాత్రం వరికపూడిశెల చుట్టూ విస్తృత చర్చ సాగుతోంది.

బిందెడు నీళ్ల కోసం..

ఏటా వేసవిలో పల్నాడులోని అనేక ప్రాంతాలు తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటాయి. కానీ ఈసారి అక్టోబర్ మొదటి వారంలోనే తాగునీటి సమస్య తప్పడం లేదని స్థానికులు అంటున్నారు.

‘‘ఏడాది పొడవునా ట్యాంకర్లతో నీటిని అందించాల్సిందే. లేదంటే మేము మంచినీటి కోసం టిన్నుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈసారి వర్షాలు లేక ఈ సమస్య పెరిగింది.

ఒకటి రెండు రోజులు ట్యాంకు ఆలస్యమయినా మేము నీటి కోసం ఎదురుచూడాల్సిందే. కాలువలు, చెరువులన్నీ ఎండిపోయాయి.

ఇప్పుడే ఇలా ఉంటే జనవరి తర్వాత బిందెడు నీళ్లు కావాలంటే ఎన్ని ప్రయాసలు పడాలో అర్థం కావడం లేదు’’ అని దుర్గి మండలం అడిగొప్పుల గ్రామానికి చెందిన సత్తార్ బీబీ అన్నారు.

మంచినీటి ట్యాంకులు, పైప్ లైన్లు ఎన్ని ఉన్నా వేసవి వచ్చిందంటే చుక్క నీటి కోసం చిక్కులు తప్పడం లేదని అంటున్నారామె.

వరికపూడిశెల వంటివి పూర్తయితే కష్టాలు గట్టెక్కుతాయని ఆశిస్తున్నట్టు సత్తార్ బీబీ, బీబీసీతో అన్నారు.

వరికపూడిశెల ప్రాజెక్టు కోసం డిమాండ్

ఫొటో సోర్స్, UGC

రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి...

వరికపూడిశెల ప్రాజెక్టుని తాము అధికారంలోకి వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

ఆయన విపక్షంలో ఉండగా ఓదార్పు యాత్ర, పాదయాత్ర సమయాల్లో పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు.

కానీ ఆయన పాలనా కాలం ముగింపు దశకు వస్తున్నప్పటికీ వరికపూడిశెలకు మోక్షం లభించలేదు.

పైగా గడిచిన రెండు సీజన్ల వారీగా వచ్చే నెలలో పనులు మొదలెడతామంటూ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు, స్థానిక ఎంపీ లావు కృష్ణదేవరాయులు సహా ప్రజా ప్రతినిధులు ప్రకటనలయితే ఇస్తున్నారు.

కానీ పనులు మొదలయిన దాఖలాలు లేవు.

"ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం అందరికీ అలవాటుగా మారింది. పల్నాడు ప్రాంత వాసుల కష్టాలు తీరడం లేదు. ఈ ఏడాది సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. మిరప ఇంకా సగం కూడా పంట వేయలేదు. ఇతర పంటల విషయం చెప్పనక్కర్లేదు. రైతులకు పంటల్లేక, కూలీలకు పనుల్లేక తీవ్రంగా అవస్థలు ఎదురయ్యే ప్రమాదం ఉంది" అంటూ ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

పల్నాడులో ఉన్న నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని వరికపూడిశెలకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

‘ఎదురుగా సాగర్ ఉన్నా.. మాకు ఉపయోగం లేదు’

ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నాగార్జున సాగర్ పల్నాడు జిల్లాలోనే ఉంటుంది.

మాచర్ల వాసులకు ఎదురుగా కనిపిస్తుంది. కానీ సాగర్ జలాలను వినియోగించుకునే అవకాశం ఎక్కువగా ఉండడం లేదు.

అందుకే సాగర్ దిగువన ఎత్తిపోతల ప్రాంతంలో నీటిని లిఫ్ట్ చేసి పల్నాడు పొలాలకు తరలించాలన్నది వరికపూడిశెల లక్ష్యం.

ఈ ప్రాజెక్టు కోసం పల్నాడు జిల్లాకు చెందిన నేతలు, రైతులు వివిధ ఉద్యమాలు నిర్వహించారు.

వరికపూడిశెల పూర్తి చేయాలని నినదించిన నేతలు గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్నప్పటికీ రైతుల ఆకాంక్ష అలానే మిగిలిపోవడంతో ఈ ఏడాది సమస్య ఎదుర్కోవాల్సి వస్తోందనే అభిప్రాయం ఉంది.

"వరికపుడిసెల ప్రాజెక్టు పల్నాడు ప్రాంతానికి తలమానికమనే చెప్పాలి. పల్నాడు ప్రాంతంలోనే ఉన్న నాగార్జునసాగర్‌, కృష్ణా నీరు మాకు ఉపయోగపడటం లేదు. అందుకే వరికపూడిశెల పూర్తి చేయాలని ఆశిస్తున్నాం.

గతంలో కొంత ప్రయత్నం చేశాం. కదలిక వచ్చింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు దానిని విస్మరించాయి.

సీఎం జగన్ దృష్టికి కూడా వరికపూడిశెల ఆవశ్యం గురించి తీసుకెళ్లాం. త్వరలోనే పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నాం" అంటూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు.

మండలిలో కూడా మా ప్రాంత సమస్యను ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, కానీ కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో ఆలస్యమవుతోందని ఆయన అన్నారు.

వరికపూడిశెల ప్రాజెక్టుకు అనుమతులు

ఫొటో సోర్స్, UGC

పర్యావరణ అనుమతుల్లో జాప్యం

వరికపూడిశెల ప్రాజెక్టు ఆచరణ రూపం దాల్చాలంటే అసలు సమస్య అటవీభూములు. రిజర్వు అటవీ ప్రాంతంలోని 19.13 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం వినియోగించాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వ నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది.

డీ ఫారెస్ట్ చేయాల్సిన ఈ భూమికి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించేందుకు కూడా సిద్ధమయ్యింది.

అందుకు తగ్గట్టుగా అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖతోపాటు జాతీయ వన్యప్రాణి బోర్డు సభ్య కార్యదర్శికి డీపీఆర్ సహా నివేదికలు అందించినట్టు ఏపీ నీటిపారుదల శాఖ చెబుతోంది.

"వైఎస్సార్ పల్నాడు దర్భిక్ష నిర్మూలన కమిషన్ ద్వారా రూ.1650 కోట్ల నిధులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం సానుకూలంగా స్పందించింది. అనుమతులు వస్తున్నాయి.

త్వరలోనే పనులు మొదలవుతాయి. పల్నాడు జిల్లా ప్రజల ఏడు దశాబ్దాల కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

అందుకు తగ్గట్టుగా అన్ని ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి" అంటూ నరసారావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు.

ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన పంప్ హౌస్, ప్రెజర్ మెయిన్, బ్రేక్ ప్రెజర్ ట్యాంక్, ఇతర నిర్మాణాలు చేపట్టడానికి కావాల్సిన భూమి అటవీ ప్రాంతంలో ఉండడం, దానికి సంబంధించిన అనుమతుల్లో జాప్యం మూలంగానే నిర్మాణ ఆలస్యానికి కారణమని ఆయన తెలిపారు.

ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూమికి పరిహారంగా 54 ఎకరాలు కేటాయించినట్టు ఎంపీ తెలిపారు. 2024లోగా తొలిదశ పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వ అనుమతుల విషయంలో పూర్తిస్థాయి స్పష్టత లేకపోవడం, నిధుల విడుదల వ్యవహారం మూలంగా ప్రాజెక్టు పనుల ప్రారంభానికి నిర్ణయించిన ముహూర్తాలు కూడా దాటిపోతున్నాయి.

అధికార పార్టీ నేతలు చేసిన ప్రకటనలు ఆచరణ రూపం దాల్చడం లేదు. వరికపూడిశెల సాధించి ఎన్నికలకు వెళతానంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలోనే ప్రకటించి ఉన్నారు.

సీఎం హామీ, మాచర్ల ఎమ్మెల్యే పంతం ఎప్పటికి నెరవేరుతాయన్నది కీలకంగా మారింది.

ఎప్పటికి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతుందన్న దానిని బట్టి పల్నాడు భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)