కతియా: మిస్టరీగా మారిన శ్మశాన వాటిక, అక్కడ దెయ్యాలు ఉన్నాయని గ్రామస్తులు ఎందుకు భయపడ్డారు?

ఫొటో సోర్స్, ABHAYANI GS
ప్రపంచ పురాతన పట్టణ నాగరికతల్లో ఒకటిగా భావిస్తున్న సింధు నాగరికత విలసిల్లిన చోట శాస్త్రవేత్తలు ఓ శ్మశాన వాటికను కనుక్కున్నారు. ఈ సమాధుల్లో వెలికి తీసిన అవశేషాలు భారతీయ నాగరికతపై మరిన్ని పరిశోధనలు చెయ్యడానికి తోడ్పడతాయంటున్నారు బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్.
2019లో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోని కతియా గ్రామంలో శాస్త్రవేత్తలు ఇసుక నేలను తవ్వుతున్నప్పుడు అక్కడ ఈ అవశేషాలు దొరుకుతాయని అసలు ఊహించలేదు.
“మేం తవ్వడం మొదలు పెట్టినప్పుడు అదొక పురాతన ఆవాస ప్రాంతం అనుకున్నాం. వారం రోజుల్లోనే అదొక శ్మశాన వాటిక అని తెలిసింది” అని కేరళ యూనివర్సిటీలో పని చేస్తున్న ఆర్కియాలజిస్టు ఎస్‌వీ రాజేష్ తెలిపారు.
ఆయనే ఈ తవ్వకాలకు నాయకత్వం వహించారు.
40 ఎకరాల స్థలంలో 150 మంది భారతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మూడు సీజన్లలో ఈ తవ్వకాలు జరిపారు.
ఇక్కడున్న 500 సమాధులు ప్రపంచ అతి పురాతన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికతకు చెందినవిగా భావిస్తున్నారు. ఇందులో రెండు వందల సమాధులను తవ్వి అందులో అవశేషాలను బయటకు తీశారు.
ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం 5,300 ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందింది. వందేళ్ల క్రితం ఈ నాగరికతను కనుగొన్నప్పుడు భారత్, పాకిస్తాన్‌లలో రెండు వేల చోట్ల తవ్వకాలు జరిపి నాటి అవశేషాలను బయటకు తీశారు.

ఫొటో సోర్స్, ABHAYAN GS
“ మేం కనుగొన్న వాటిలో ఇది చాలా ముఖ్యమైనది”
గుజరాత్‌లోని కతియా గ్రామంలో శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ శ్మశానం పురాతన నాగరికతలకు సంబంధించి అతి పెద్ద శ్మశాన వాటికగా భావిస్తున్నారు. ఇది క్రీస్తు పూర్వం 3,200 నుంచి 2,600 సంవత్సరాల మధ్య 500 ఏళ్ల పాటు అస్థిత్వంలో ఉండవచ్చని భావిస్తున్నారు.
తవ్వకాల్లో ఇప్పటి వరకు చెక్కుచెదరకుండా ఉన్న ఒక పురుష అస్తిపంజరం బయటపడింది. అంతేకాకుండా పాక్షికంగా సంరక్షించిన పుర్రెతో పాటు పుర్రె శకలాలు, కొన్ని ఎముకలు, దంతాలు లభించాయి.
అస్తిపంజరానికి సంబంధించిన అవశేషాలతో పాటు కొన్ని కళాఖండాలు కూడా ఈ తవ్వకాలలో బయటపడ్డాయి.
ఇందులో వందకు పైగా గాజులు, నత్తగుల్లతో చేసిన 27కి పైగా పూసలు, పింగాణీ పాత్రలు, గిన్నెలు, పాత్రలు, మట్టి కుండలు, చిన్న చిత్ర పటాలు, పెద్ద గిన్నెలు, వాటర్ కప్పులు, బాటిళ్లు, జార్లు లభించాయి. చిన్న చిన్న వాటికొస్తే కొన్ని పూసలు, మరకతం రాళ్లు కూడా ఈ తవ్వకాలలో బయటపడ్డాయి.
సమాధుల నిర్మాణంలోనూ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
సమాధి చుట్టూ పెద్ద పెద్ద బండరాళ్లతో నాలుగు వైపులా చిన్న గోడల్లాగా నిర్మించారు. ఈ రాళ్లలో కొన్ని పెద్దవి, చిన్నవి ఉన్నాయి. వీటిని చాలా పద్దతిగా అమర్చారు. వీటిలో చిన్నపిల్లల సమాధులు కూడా ఉన్నాయి. మృతదేహాలను వెల్లకిలా పడుకోబెట్టారు. ఈ ప్రాంతమంతా క్షార మృత్తిక నేల కావడంతో మృతదేహాల్లోని ఎముకలు కుళ్లిపోయాయి.
“ మేం కనుగొన్న వాటిలో ఇది చాలా ముఖ్యమైనది” అని మిషిగన్‌లోని అల్బియోన్ కాలేజ్‌లో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ బ్రాడ్ చేజ్ అన్నారు.

ఫొటో సోర్స్, ABHIYAN GS
ఈ సమాధుల్లో ఏం లభించాయి?
“గుజరాత్‌లో కొన్ని పురాతన శ్మశాన వాటికల్ని కనుగొన్నాం. ఇది చాలా పెద్దది. తాజాగా వెలుగులోకి వచ్చిన అవశేషాలు ఆర్కియాలజిస్టులకు చాలా ఉపకరిస్తాయి. పురాతన నాగరికతను అర్థం చేసుకోవడానికి అంతకుముందు కనుగొన్న చిన్న శ్మశాన వాటికల్ని విశ్లేషించడానికి ఇవి ఉపకరిస్తాయి” అని చేజ్ చెప్పారు.
గతంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించిన తవ్వకాల్లో బయటపడిన అవశేషాల ద్వారా సింధులోయ ప్రజల శవాలను సమాధి చేసే విధానం తెలిసింది.
సింధు ప్రజలు అంత్యక్రియలను ఈజిప్ట్, మెసపుటోమియాలోని ఉన్నత వర్గాల మాదిరిగా కాకుండా నిరాడంబరంగా నిర్వహించారు. మరణించిన వారి సమాధుల్లో ఆభరణాలు, ఆయుధాలు ఏమీ ఉంచలేదు. ఇందులో చాలా వరకూ మృతదేహాలను వస్త్రాలతో చుట్టి దీర్ఘచతురస్రాకార చెక్క శవపేటికలలో ఉంచారు.
శవపేటికను గొయ్యిలో దింపడానికి ముందు అందులో వివిధ రకాల పదార్ధాలున్న కుండలు ఉంచేవారని సింధు లోయ నాగరికతను అధ్యయనం చేస్తున్న విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన జోనాథన్ మార్క్ కెనోయర్ చెప్పారు.

'దెయ్యాలు ఉన్నాయని చెప్పేవారు'
కొన్ని మృతదేహాలను వారి శరీరానికున్న కంకణాలు, పూసలు, తాయెత్తులతోనే ఖననం చేశారు. కొంతమంది స్త్రీల సమాధులలో రాగితో చేసిన అద్దాలు ఉన్నాయి. పెద్దల మృతదేహాల వద్ద ఆహారాన్ని అందించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే పాత్రలతో పూడ్చి పెట్టారు.
మహిళలకు వారి ఎడమ చేతికి కొన్ని నిర్దిష్ట ఆభరణాలు, పెంకు గాజులు ఉంచారు. పిల్లల మృతదేహాలకు ఇలాంటివేమీ లేకుండా సాధారణంగా ఖననం చేసేవారు.
సమాధులలో ఏదైనా సంపద ఉన్నట్లు ఆధారాలు లేవు.
ఈ మృతదేహాల అవశేషాలను చూస్తే అప్పట్లో వారికి మంచి ఆహారం లభించేదని, ఆరోగ్యంగా ఉన్నారని అర్ధం చేసుకోవచ్చు. అయితే కొంతమందికి కీళ్ల నొప్పులు, శారీరక ఒత్తిడికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే గుజరాత్‌లో బయటపడిన అతి పెద్ద శ్మశాన వాటిక వెనుక మిస్టరీని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.
శాస్త్రవేత్తలకు సంబంధించినంత వరకూ తాజాగా బయటపడిన సమాధులు చరిత్ర తెలుసుకోవడానికి మంచి అవకాశం. 2016లో కతియా గ్రామ పెద్ద కేరళకు చెందిన ఆర్కియాలజీ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ ప్రాంతాన్ని చూపించారు.
తవ్వకాలు నిర్వహించిన ప్రాంతం కతియా గ్రామం నుంచి 300 మీటర్ల దూరంలో ఉంది.
400 మంది ప్రజలు నివసించే కతియాలో ఎక్కువ మంది రైతులు వర్షాధార పంటలైన వేరుశనగ, పత్తి పండిస్తారు. ఈ శ్మశాన వాటిక కొంతమంది పొలాల్లోకి విస్తరించి ఉంది.
“వర్షాలు కురిసిన తర్వాత అక్కడక్కడా మట్టి పాత్రలు, ఇతర వస్తువులు బయటకు వస్తుంటాయి. కొంతమంది ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పేవారు. అయితే మా పక్కనే ఇంత పెద్ద శ్మశాన వాటిక ఉందనే విషయం మాకు ఇప్పటి దాకా తెలియదు” అని అన్నారు గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ్ భాయ్ జజాని.

ఫొటో సోర్స్, ABHAYAN GS
ఈ సమాధుల్లో ఉన్నది ఎవరు?
ఏటా కొంతమంది శాస్త్రవేత్తలు దేశ విదేశాల నుంచి మా ఊరికొచ్చి ఈ సమాధుల గురించి, అందులోని మృతదేహాల వివరాలు తెలుసుకునేవారు.
గుజరాత్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన సమాధుల్లో ఏం రహస్యాలున్నాయి? ఈ సమాధుల్లో ఉన్నది ఎవరు? వారిని సమాధి చేసింది ఎవరు? అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
వందల మందిని ఒక ప్రాంతంలో సమాధి చెయ్యడంతో ఈ ప్రాంతం ప్రాముఖ్యత గురించి సందేహాలు పెరుగుతున్నాయి. అప్పట్లో స్థానికంగా చుట్టుపక్కల ఉన్న సముదాయాలకు ఇదొక్కటే శ్మశాన వాటిక ఉందా? లేకపోతే ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు నివసించేవారా?.
సంచార జాతులకు ఇదొక పవిత్ర ప్రాంతంగా ఉందా? సమాధుల అవశేషాల్లో లభించిన మరకత రాళ్లు అఫ్గానిస్తాన్‌కు చెందినవా? వారి ఎముకల్ని దాచి పెట్టే మరో శ్మశాన వాటికగా ఉందా? ఇలాంటి వివరాల గురించి పరిశోధకులను అడిగితే..
“ఏమో మాకు తెలియదు. దీని పక్కన ప్రజలు నివసించేవారని చెప్పేందుకు మేమింకా ఏమీ కనుక్కోలేదు. తవ్వకాలు జరుపుతున్నాం“ అని యూనివర్సిటీ ఆఫ్ కేరళలో ఆర్కియాలజిస్టు జీఎస్ అభ్యాన్ చెప్పారు.
“ఈ శ్మశానానికి సంబంధించి కొన్ని స్థావరాలు ఉండాలి. అయితే ఇప్పటి వరకూ వాటిని కనుక్కోలేదు. బహుశా అవి ఈ గ్రామం కింద కూడా ఉండవచ్చు” జోనాథన్ మార్క్ కెనోయర్ చెప్పారు.
శ్మశానవాటికల్లో సమాధుల్ని పద్దతి ప్రకారం తీర్చి దిద్దిన రాతి గోడలతో నిర్మించారు. రాతితో నిర్మించడం ప్రజలకు సుపరిచితం అని ఇది సూచిస్తోంది.
ఈ రాతి నిర్మాణాలను చూస్తే.. సింధు ప్రజలు రాళ్లతో నిర్మాణాలు చెయ్యడంలో నిపుణులని చాటుతోంది. ఇవి శ్మశాన వాటిక నుంచి 19-30 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తాయి.
ఇక్కడ జీవించిన వారి గురించి తెలుసుకోవాలంటే ఈ మానవ అవశేషాలపై మరికొన్ని రసాయన పరీక్షలు, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
సింధు నాగరికత గురించి కొత్త కొత్త రహస్యాలు బయటపడుతూనే ఉన్నాయి.
అప్పటి ఆవాసాల గురించి తెలుసుకోవడానికి కతియా గ్రామానికి సమీపంలోనే తవ్వకాలు జరపాలని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు.
ఆ తవ్వకాల్లో ఏదైనా బయటపడితే ఈ శ్మశానవాటిక రహస్యం వీడిపోయినట్లే. అలా జరక్కపోతే మరి కొన్ని తవ్వకాలు జరపాల్సి రావచ్చు.
“ఏదో ఒక రోజు మేం ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కుంటాం” అని రాజేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హమాస్ దాడుల షాక్‌లో ఇజ్రాయెల్, తర్వాత ఏం జరగబోతోంది?
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
- పారిస్‌పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..
- వరల్డ్ కప్ 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ వస్తుంది?
- శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










