హమాస్ దాడుల షాక్‌లో ఇజ్రాయెల్, తర్వాత ఏం జరగబోతోంది?

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, గాజా నుంచి ప్రయోగించిన రాకెట్ ల్యాండ్ అయిన టెల్ అవీవ్ ప్రాంతంలోని ఇజ్రాయెల్ ప్రజలు
    • రచయిత, యోలండే నెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, జెరూసలేం

ఇజ్రాయెల్‌పై ఈజిప్ట్, సిరియాల ఆకస్మిక దాడితో మొదలైన యోమ్ కిప్పూర్ యుద్ధానికి 50 ఏళ్లు గడిచాయి.

ఈ తరహాలోనే పాలస్తీనా మిలిటెంట్లు కూడా తాజాగా ఆకస్మికంగా ఒక పెద్ద దాడిని మొదలుపెట్టారు.

గాజా స్ట్రిప్‌లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే అక్కడ ఉద్రిక్తతలు పెరగాలని అటు హమాస్‌గానీ, ఇటు ఇజ్రాయెల్‌ గానీ కోరుకోలేదు.

దీనికి బదులుగా హమాస్ ఒక భారీ, సమన్వయంతో కూడిన ఆపరేషన్‌ను ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోంది.

శనివారం తెల్లవారుజామున జెరుసలెం, టెల్ అవీవ్ నగరాలను తాకేలా రాకెట్లను భారీగా ప్రయోగించింది.

మరోవైపు పాలస్తీనా ఫైటర్లు సముద్రం, గగనం, భూమార్గాల గుండా దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు.

ఇజ్రాయెల్‌లోని పట్టణాలు, ఆర్మీ స్థావరాలను కొన్ని గంటల పాటు వారు ముట్టడించారు. చాలా మందిని చంపేశారు. మరికొందరు ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను గాజాలో బందీలుగా ఉంచడానికి తీసుకెళ్లారు. బందీలైన వారి సంఖ్యపై స్పష్టత లేదు.

రేవ్ పార్టీ
ఫొటో క్యాప్షన్, గిలి యోస్కోవిచ్

ఈ తతంగమంతా సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది.

గాజాకు సమీపంలోని మైదానాల్లో రాత్రంతా జరిగే పార్టీ కోసం వెళ్లిన వేలాదిమంది ఇజ్రాయెల్ పౌరులు కూడా హమాస్ దాడుల్లో చిక్కుకున్నారు. కాల్పులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వారంతా పరుగులు తీస్తున్నట్లు వీడియో ఫుటేజీలు చూపించాయి.

భారీ ఆయుధాలతో ఉన్న పాలస్తీనా ఫైటర్ల నుంచి తప్పించుకునేందుకు చెట్ల మధ్యలో దాక్కున్నట్లు గిలి యోస్కోవిచ్ అనే మహిళ బీబీసీతో చెప్పారు.

‘‘వారు ప్రతీ చెట్టు వద్దకు వెళ్లి కాల్పులు జరుపుతున్నారు. నా చుట్టూ ఉన్న జనం చనిపోతుండటం నేను చూశాను.

ఓకే... నేను కూడా చావబోతున్నా అనే అనుకున్నా. సరే, కళ్లు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకోవాలనుకున్నా. అక్కడ అంతటా కాల్పులు జరుగుతున్నాయి. నాకు చాలా సమీపంలో ఇదంతా జరిగింది’’ అని ఆమె వివరించారు.

తమకు సహాయం చేయడానికి ఇజ్రాయెల్ భద్రతా బలగాలు త్వరగా రాలేదని చాలామంది ఇజ్రాయెల్ పౌరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాలు, ట్యాంకుల్లోని సైనికులు బందీలు అయినట్లు లేదా చనిపోయినట్లుగా హమాస్ చానెళ్లలో షేర్ చేసిన వీడియోలు చూపించాయి.

గాజా
ఫొటో క్యాప్షన్, గాజాలో ఇజ్రాయెల్ ట్యాంకును స్వాధీనం చేసుకున్నారు

ఇజ్రాయెల్ మిలిటరీ వాహనాలను స్వాధీనం చేసుకొని వాటిని గాజా వీధుల్లో తిప్పుతూ సంబరాలు చేసుకుంటున్న కొన్ని ఫొటోలు కూడా వచ్చాయి.

‘‘అల్ అక్సాలో ఇజ్రాయెల్ చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి హమాస్ ఇప్పటివరకు చేసిన పనులతో నేను సంతోషంగా ఉన్నా’’ అని గాజాకు చెందిన ఒక యువకుడు బీబీసీతో చెప్పారు.

ఆల్ అక్సా మసీదు, ఇస్లాంలో మూడో పవిత్రమైన ప్రదేశం. యూదులకు కూడా ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం. దీన్ని ‘టెంపుల్ మౌంట్‌’గా పిలుస్తారు.

ఇజ్రాయెల్ ఆర్మీ దాడి చేయడానికి సమీపంలోనే పొంచి ఉందని హెచ్చరించిన తర్వాత తన అపార్ట్‌మెంట్‌ను విడిచి వెళుతున్న ఆ యువకుడు, తర్వాత ఏం జరుగుతుందో అనే భయాన్ని వ్యక్తం చేశారు.

‘‘మాకు భయంగా ఉంది. 2021లో ఇజ్రాయెల్, షౌరౌక్ టవర్‌పై దాడి చేసినప్పుడు మా షాప్ ధ్వంసమైంది. ఈసారి హమాస్ తీసుకున్న చర్యలు ఇంతకు ముందు చేపట్టిన అన్ని చర్యలకన్నా చాలా పెద్దవి. ఇజ్రాయెల్ నుంచి అంతకంటే పెద్ద ప్రతిస్పందన ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ వైమానిక దాడులు సృష్టించిన పెను విధ్వంసం కారణంగా పాలస్తీనాలోని ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి.

హమాస్, పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచిన ఏడాది తర్వాత, అంటే 2007లో గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈజిప్ట్, ఇజ్రాయెల్ ఆ ప్రదేశంపై తమ పట్టును మరింత కఠినతరం చేశాయి. గాజాలో దాదాపు 23 లక్షల మంది పాలస్తీనా ప్రజలు ఉంటారు.

గాజాలో నిరుద్యోగంతో పాటు పేదరికం ఉంది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు

2021లో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సంక్షోభం ముదిరిన తర్వాత ఈ రెండింటి మధ్య పరోక్ష చర్చలకు ఈజిప్ట్, ఖతర్, ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించాయి.

దీని వల్ల గాజా ప్రజలు ఇజ్రాయెల్‌లో పనిచేయడానికి, ఇతర పరిమితులను సడలించడానికి ఈ చర్చలు ఉపయోగపడ్డాయి.

ఈ దాడులతో తనపై ఉన్న మిలిటెంట్ ఆర్గనైజేషన్ అనే ముద్రను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే ప్రణాళికకు హమాస్ కట్టుబడి ఉంది.

ఇజ్రాయెల్ ఆక్రమణను తుడిచిపెట్టడానికి చేసే చర్యలో పాలస్తీనియన్లు, అరబ్బులు భాగం కావాలంటూ ఇజ్రాయెల్‌పై దాడి ప్రారంభం సందర్భంగా హమాస్ మిలిటెంట్ కమాండర్ మొహమ్మద్ డీఫ్ పిలుపునిచ్చారు.

ఆక్రమిత వెస్ట్ బ్యాక్, తూర్పు జెరూసలెం, ఇంకా ఆ రీజియన్‌లోని మిగతా ప్రాంతాల్లో ఉన్న పాలస్తీనా ప్రజలు ఆయన పిలుపును పాటిస్తారా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, హమాస్ చేతిలో బందీలుగా ఇజ్రాయెల్ పౌరులు

ఇజ్రాయెల్ ఇప్పుడు నిస్సందేహంగా యుద్ధం చేయడం వైపే మొగ్గు చూపుతుంది. ఇందులో మరో కోణం ఏంటంటే ఇది శక్తిమంతమైన లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాను ఆకర్షించగలదు.

మరోవైపు, ఇజ్రాయెల్ మిలిటరీ తమ బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసింది.

గాజాపై తీవ్ర వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్‌ను కూడా చేపట్టాలని యోచిస్తోంది.

బందీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను బేరసారాలకు వినియోగించుకోవాలని పాలస్తీనా మిలిటెంట్లు ఆశిస్తున్నారు. ఇది మరింత తీవ్రమైన సమస్య.

‘‘మేం ప్రస్తుతం ఆ ప్రాంతంపై పట్టును తిరిగి సాధించడంలో బిజీగా ఉన్నాం. విస్తృతంగా దాడులు చేస్తున్నాం. ముఖ్యంగా గాజా స్ట్రిప్‌ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా చూస్తున్నాం.’’ అని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు.

హమాస్ దాడులను ముందుగానే పసిగట్టడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, భద్రతా బలగాలు ఎలా విఫలమయ్యాయి? దాన్ని ఎందుకు నిరోధించలేకపోయాయి? అనే కోణంలో కూడా పూర్తి సమీక్ష త్వరలోనే ఉండొచ్చని తెలిపారు.

వీడియో క్యాప్షన్, గాజా దాడులను పసిగట్టడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఎలా విఫలమైంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)