చిన్నా రివ్యూ : సిద్ధార్థ్ ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమా ఎలా ఉందంటే...

ఫొటో సోర్స్, ChinnaMovie
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
సిద్ధార్థ్.. సహాయ దర్శకుడిగా మొదలై హీరోగా ఎదిగాడు. కథకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేశాడు. చిత్ర నిర్మాణంపై ఆయన అభిరుచి కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు తాను ప్రధాన పాత్రలో నటిస్తూ 'చిన్నా' అనే సినిమా నిర్మించాడు.
తమిళనాట ‘చిత్తా’ గా విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు తెలుగులో చిన్నా పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై సిద్ధార్థ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ సినిమా నచ్చకపొతే ఇకపై తెలుగులో తన సినిమా విడుదల చేయననీ ప్రకటించాడు.
అంత నమ్మకం కలిగించిన ఈ 'చిన్నా' కథ ఏమిటి? సిద్దార్థ్ ఈ కథతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాడా?

ఫొటో సోర్స్, @thinkmusicofficial
చిన్నారి వెతుకులాటతో చీకటి కోణాలు
ఈశ్వర్ అలియాస్ చిన్నా (సిద్ధార్థ్). పురపాలక శాఖలో ఉద్యోగి. అన్నయ్య చనిపోవడంతో అన్నయ్య కూతురు సుందరి అలియాస్ చిట్టి, వదిన బాధ్యతలు దగ్గరుండి చూస్తుంటాడు. చిన్నాకి చిట్టి అంటే ప్రేమ. బాబాయ్ అంటే చిట్టికి కూడా ఎంతో ఇష్టం. ఉద్యోగం, ఇల్లు తప్పితే చిన్నాకు మరో ప్రపంచం లేదు.
అంతా సజావుగా సాగుతున్న సమయంలో చిన్నాపై ఒక పెద్ద నింద పడుతుంది. చిట్టి స్నేహితురాలు మున్ని అనే పాపని ఈశ్వర్ అత్యాచారం చేశాడనేది ఆ నింద. ఈ ఘటనతో చిన్నా జీవితం తలకిందులైపోయింది.
చిన్నా ఏం తప్పు చేయలేదని తెలిసేలోపల చిట్టి కనిపించకుండాపోతుంది. అసలు చిట్టి ఎక్కడికి వెళ్లింది? తనని ఎవరు తీసుకెళ్లారు? కనిపించకుండాపోయిన చిట్టిని వెతకడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ఈ ప్రయాణంలో సమాజంలోని ఎలాంటి రుగ్మతలు, ఊహించడానికి కూడా ఇబ్బందిపడే సంఘటనలు వెలుగు చూశాయి? అనేది తక్కిన కథ.

ఫొటో సోర్స్, YT//@thinkmusicofficial
సిద్ధార్థ్ నమ్మకం నిజమైందా?
‘ఈ సినిమా నచ్చలేదంటే ఇకపై నేను ఇక్కడికి రాను, నా సినిమాల్ని తెలుగులో విడుదల చేయను’ అని సిద్ధార్థ్ అంత నమ్మకంగా ఎందుకు ప్రకటించారో చిన్నా సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఈ సినిమా చూస్తున్నంత సేపు నచ్చడం, నచ్చకపోవడం అనే ప్రశ్నే రాదు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అకృత్యాలు, పైశాచికత్వాలు, మనిషనే స్పృహ కోల్పోయి, జాలి, దయ, కరుణ లేని కొందరు మృగాల మధ్య మనం బతుకుతున్నామా? అనే ఆలోచననే దిగ్భ్రాంతిని కలిగిస్తుంది.
పసి పిల్లలపై అత్యాచారం నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తమిళ్‌లో గార్గి, తెలుగులో లవ్ స్టోరీ, హిందీలో హైవే లాంటి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఈ అంశాన్ని స్పృశించారు.
అయితే, చిన్నా ఇందుకు భిన్నమైన చిత్రం. అబలలు, పసికందులపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు ప్రధాన నేపథ్యంగా సాగిన చిత్రమిది. ఈ సినిమా చూస్తున్నంత సేపు.. మనసులో కలతగా ఉంటుంది. గుండె బరువెక్కిపోతుంది.
సున్నిత మనస్కులు ఇలాంటి కంటెంట్ చూడడానికి ఇబ్బంది పడినప్పటికీ.. చిన్నారుల రక్షణ విషయంలో కుటుంబం, సమాజం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక హెచ్చరికగా నిలుస్తుంది.

ఫొటో సోర్స్, YT//@thinkmusicofficial
చిన్నపిల్లలపై పైశాచిక క్రీడ
చిన్నా, చిట్టి అనుబంధాన్ని చూపిస్తూ ఈ కథని మొదలుపెట్టాడు దర్శకుడు. మరోవైపు శక్తి పాత్రలో కూడా ఏదో ఒక బలమైన అంశం ఉందనే సంగతి ప్రేక్షకుడికి అర్థమవుతుంది. పాత్రలని వాటి ఎమోషన్‌ని పరిచయం చేసిన తర్వాత, ఆ ఎమోషన్ ప్రేక్షకుడికి పట్టిన తర్వాత.. చిట్టి, మున్నీలకు ఏ క్షణం, ఏం జరుగుతుందో అనే కంగారు, భయం ప్రేక్షకుడు ఫీలవుతాడు.
మున్నీ, చిట్టి పాడుబడ్డ గుడి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత పాపం ఏ క్షణం ఏం జరుగుతుందో.. పసిపిల్లలు ఏమైపోతారో అనే భయం ప్రేక్షకుడిలో మొదలైపోతుంది.
మున్నీ ఒక్కత్తే ఆటో ఎక్కినపుడు.. ‘’వద్దు’’అని గట్టిగా అరవాలనిపిస్తుంది. అంతలా ఆ పాత్రలతో కనెక్ట్ చేశాడు దర్శకుడు.
అయితే, వాస్తవాల్ని చూపించ క్రమంలో హద్దులు పెట్టుకోలేదు దర్శకుడు. ఆల్రెడీ మున్నీ ఒక ప్రమాదం నుంచి బయటపడుతుంది. ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకునే లోపే చిట్టి పాత్రని కూడా ప్రమాదంలో పడేసి మరింత కలతపెట్టేశారు.
నిజానికి మున్నీకి జరిగిన ఘోరాన్ని, దానికి కారణమైన వారిని వెతికిపట్టుకుని శిక్ష విధించవచ్చు. అయితే, ఈ ఘాడత సరిపోదని భావించాడేమో దర్శకుడు.. మరో పాప జీవితాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టి విరామం ఇచ్చాడు.
విరామానికి బయటికి వచ్చిన ప్రేక్షకుల్లో సున్నితమైన మనసున్నవారు కొందరు రెండో భాగాన్ని చూసే ధైర్యం చేయరు. అంత హార్డ్ హిట్టింగ్ ఉంటుందీ 'చిన్నా'లో.

ఫొటో సోర్స్, YT//@thinkmusicofficial
ఆందోళనకరమైన సస్పెన్స్
మొదటి నుంచి చిన్నాని కాస్త సస్పెన్స్ తో నడిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చిన్నాపై అత్యాచార నింద పడటం, ఈ క్రమంలో వచ్చిన కొన్ని సన్నివేశాలు చిన్నా పై కాసేపు అనుమానం రేకెత్తించేలా చేశాడు. ఈ క్రమంలో చిన్నా ఎదుర్కొన్న అవమానం కూడా మనసుని కలవరపరుస్తుంది. అయితే వెంటనే దానికి పుల్ స్టాప్ పెట్టేశాడు.
సెకండాఫ్‌లో ఈ సస్పెన్స్ మళ్లీ కొనసాగుతుంది. గుర్తు తెలియని అమ్మాయి శవం కనిపించడం, ఆమె చిట్టీనా, కాదా అనే అనుమానాలు .. ఇవన్నీ కాసేపు సస్పెన్స్‌ని కొనసాగిస్తాయి.
అయితే, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఈ సస్పెన్స్‌ని భరించలేరు. ఎందుకంటే అక్కడ ప్రమాదంలో ఉన్నది ముక్కుపచ్చలారని ఓ పాపాయి. స్కూల్ గౌన్, కళ్లజోడు, వాటర్ బాటిల్‌తో చిట్టీ గుర్తు వచ్చినప్పుడల్లా గుండె తరుక్కుపోతుంటుంది.
ఒక దశలో దర్శకుడిపై కోపం కూడా వస్తుంది. సమస్య అర్థమైంది. త్వరగా పాపని రక్షించండని మనసు ఆందోళనతో కొట్టుకుంటుంది.

ఫొటో సోర్స్, YT//@thinkmusicofficial
సెల్‌ఫోన్ వెరీ డేంజర్
‘బస్ ఎక్కిన అమ్మాయి ఎవరి చేయి తగలకుండా దిగడం ఒక అదృష్టం’ అని ఇందులో శక్తి పాత్ర చెప్పే డైలాగ్. నిజమే .. ఈ రోజుల్లో పరిస్థితులు అలానే ఉన్నాయి. ఎన్ని నిర్భయ, దిశా చట్టాలు చేసినా అకృత్యాలు ఆగడం లేదు.
చిన్నారుల సంరక్షణ విషయంలో కుటుంబం సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కోణాన్ని కూడా ఈ కథ ఆవిష్కరిస్తుంది. ఎవరూ తాకకుండా చూసుకోవాలని చిట్టికి తల్లి జాగ్రత్తలు చెబుతున్నప్పుడు.. నిజంగా ప్రతి తల్లి చెప్పాల్సిన జాగ్రత్తలే అనిపిస్తుంది. అలాగే, అత్యాచార బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం కూడా నొక్కిచెబుతుందీ కథ.
ఇంకో ప్రధాన అంశం.. ఒకప్పుడు పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి లోబరుచుకోవడం, ఎత్తుకెళ్లడం జరిగేవని వినే ఉంటాం. ఇప్పుడు కాలం మారింది. చిన్న పిల్లలు కూడా గంటల తరబడి సెల్ ఫోన్స్‌లో ఉంటున్నారు. గేమ్స్ అడుగుతున్నారు.
ఒకసారి వీడియో గేమ్స్ మైకంలో పడిపోయి ఎవరు ఫోన్ ఇచ్చినా అందులో ఆడుకుంటూ వాళ్లతో పాటే వెళ్లిపోతున్నారు. సెల్ ఫోన్ ఒక మత్తు పదార్థంలా తయారైంది. ఈ విషయంలో కూడా తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అదే విషయాన్ని ఈ కథలో అంతర్లీనంగా చెప్పారు.

ఫొటో సోర్స్, twitter/Asian Cinemas
డీగ్లామరస్ రోల్‌లో లవర్ బాయ్
సిద్ధార్థ్‌కి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ఎన్ని పాత్రలు చేసినా ఆయన్ని లవర్ బాయ్‌గానే గుర్తుపెట్టుకుంటారు చాలా మంది. అయితే, చిన్నా కోసం ఆయన పూర్తి వైవిధ్యమైన పాత్రని ఎంచుకున్నారు. ఈశ్వర్ పాత్రలో ఒదిగిపోయారు. తనపై అత్యాచార నిందపడినప్పుడు మానసికంగా ఎంత కుంగిపోతాడో చాలా సహజంగా చూపించాడు.
అలాగే, పాప కోసం పడే తాపత్రయం కూడా ప్రేక్షకుడిని వెంటాడుతుంది. చిట్టి పాత్రలో చేసిన పాప కూడా ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. అలాగే మున్నీ కూడా. శక్తి పాత్రలో చేసిన నిమిషా సజయన్‌ది కూడా కీలకమైన పాత్రే. మిగతా నటీనటులంతా సహజంగా కనిపించారు.
సాంకేతికంగా చూస్తే, నేపథ్య సంగీతం కట్టిపడేస్తుంది. కెమెరా పనితనం కూడా బావుంది. ఎడిటింగ్ కూడా రేసీగా ఉంటుంది. డబ్బింగ్ కూడా బావుంది. చిత్రీకరణలో అన్నీ తెలుగు బోర్డులు కనిపించాయి. కథ కథనాన్ని నిజాయితీగా నడపడానికి ప్రయత్నించాడు దర్శకుడు.
ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని మనసు బరువెక్కే సన్నివేశాలతో, చిన్నారుల రక్షణ విషయంలో సమాజానికి ఒక బలమైన, అవసరమైన సందేశం లాంటి హెచ్చరిక చేసిన, జాగ్రత్తలు చెప్పిన చిత్రం చిన్నా.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: లులు మాల్లో దొంగలు పడ్డారా? ఆ ట్రెండింగ్ వీడియోల్లో ఏముంది?
- భగత్ సింగ్ ఎవరినైనా ప్రేమించారా? ఆ ఉత్తరంలో ఏముంది?
- రోజాపై బండారు వ్యాఖ్యల వివాదం: రాజకీయాల్లో మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలి?
- మీ నోరు కంపు కొడుతోందా? ముందు ఈ 4 అపోహలు తొలగించుకోండి
- లండన్‌కు వెళ్లిన విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో..














