గాజా దాడులను పసిగట్టడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఎలా విఫలమైంది?

ఇజ్రాయెల్ మిలటరీ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫ్రాంక్ గార్డ్‌నర్
    • హోదా, బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్

''ఇదెలా జరిగిందో మాకు తెలియడం లేదు.''

విస్తృతమైన నిఘా వ్యవస్థ కలిగిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఈ దాడులను ఎందుకు పసిగట్టలేకపోయిందని నేను అడిగినప్పుడు ఇజ్రాయెలీ అధికారులు చెప్పిన సమాధానం ఇది.

డజన్ల కొద్దీ సాయుధులు ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ మధ్య ఉన్న అత్యంత పటిష్టమైన రక్షణ కంచెను బుల్డోజర్లతో కూల్చేసి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించగలిగారు. గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు.

ఇజ్రాయెల్‌ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్ బెట్, గూఢచార సంస్థ ( స్పై ఏజెన్సీ) మొసాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడులను అంచనా వేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఒకవేళ వాళ్లకి ముందే తెలిసి ఉన్నట్టయితే, ఈ దాడులను తిప్పికొట్టడంలో వారు విఫలమైనట్టే.

మిడిల్ ఈస్ట్ దేశాల్లో అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతమని నిస్పందేహంగా చెప్పొచ్చు. దానికి ఎప్పుడూ నిధుల కొరత కూడా ఉండదు.

పాలస్తీనియన్ మిలిటెంట్ల గ్రూపుల్లోనూ, లెబనాన్, సిరియా, ఇంకా ఇతర దేశాల్లో ఇజ్రాయెల్ ఏజెంట్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఇన్ఫార్మర్లూ ఉన్నారు.

కంచెను కూల్చివేస్తున్న బుల్డోజర్

ఫొటో సోర్స్, ASHRAF AMRA/ANADOLU AGENCY VIA GETTY IMAGES

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గతంలో మిలిటెంట్ నేతల కదలికల గురించి పక్కా సమాచారం తెలుసుకుని, సరైన సమయంలో దాడులు చేసి వారిని అంతం చేసింది.

కొన్నిసార్లు డ్రోన్లతో దాడులు, ఏజెంట్ల సాయంతో కార్లకు జీపీఎస్ పరికరాలు అమర్చి ట్రాక్ చేసి దాడి చేయడం ద్వారా పని పూర్తి చేసేది. గతంలో కొన్నిసార్లు సెల్‌ఫోన్‌ పేలుళ్లు కూడా జరిగాయి.

ఉద్రిక్త పరిస్థితులు ఉండే ఇజ్రాయెల్, గాజా సరిహద్దు కంచె వెంట కెమెరాలు, గ్రౌండ్ మోషన్ సెన్సార్లు, సాధారణ సైన్యం పెట్రోలింగ్ కూడా ఉంటుంది.

మిలిటెంట్ల చొరబాట్లను నిరోధించేందుకు సరిహద్దులో ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగినట్టు చొరబాట్లు జరగకుండా ఉండేందుకే దీన్ని ఏర్పాటు చేశారు.

ఇంటెలిజెన్స్ వైఫల్యం

హమాస్ మిలిటెంట్లు ఆ కంచెను కత్తిరించి ఇజ్రాయెల్‌లోకి చొరబడి ఉండొచ్చు. లేదా సముద్ర మార్గంలో, పారాగ్లైడింగ్ ద్వారా ప్రవేశించి ఉండొచ్చు.

ఇజ్రాయెల్‌‌పై మూకుమ్మడి దాడి చేసేందుకు వేల సంఖ్యలో రాకెట్లను సిద్ధం చేసి ప్రయోగించడానికి, ఈ సంక్లిష్టమైన దాడులను సమన్వయంతో నిర్వహించేందుకు హమాస్ వద్ద భారీ మిలిటెంట్ వ్యవస్థే ఉండి ఉండాలి.

ఈ దాడులు ఎలా జరిగాయని ఇజ్రాయెలీ మీడియా అక్కడి మిలిటరీ అధికారులను, రాజకీయ నాయకులను ప్రశ్నిస్తోంది. 1973లో యొమ్ కిప్పుర్ యుద్ధం జరిగిన 50 ఏళ్ల తర్వాత ఈ అనూహ్య దాడి జరిగింది.

ఈ దాడులపై సమగ్ర విచారణ ప్రారంభమైందని ఇజ్రాయెల్ అధికారులు నాకు చెప్పారు. ప్రశ్నలకు సమాధానమిస్తూ ''ఇది ఏళ్ల పాటు కొనసాగుతుంది'' అన్నారు.

గాజాపై ఇజ్రాయెల్ దాడి

ఫొటో సోర్స్, MOHAMMED SALEM/REUTERS

అయితే, ప్రస్తుతం ఇజ్రాయెల్‌ తక్షణం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సరిహద్దు ప్రాంతంలో ఇజ్రాయెల్ వైపు భూభాగంలో అక్కడి ప్రజలను నియంత్రణలోకి తీసుకున్న హమాస్ మిలిటెంట్లను అంతం చేయడంతో పాటు, దక్షిణ సరిహద్దు వెంట చొరబాట్లను నివారించాల్సి ఉంది.

చర్చల ద్వారా అయినా, లేదా సైనిక చర్య చేసైనా బంధీలుగా ఉన్న తమ పౌరులను కాపాడుకోవాల్సిన అవసరముంది.

అలాగే, తమ దేశంపైకి రాకెట్లను ప్రయోగించిన అన్ని స్థావరాలనూ ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది. అయితే అది దాదాపు అసాధ్యం. ఎందుకంటే ప్రత్యర్థులు తక్కువ సమయంలోనే ఎక్కడి నుంచైనా రాకెట్లను ప్రయోగించే అవకాశం ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో హమాస్‌కి ఆయుధాలు అందకుండా ఎలా అడ్డుకోవాలి, దాడులు వెస్ట్‌బ్యాంక్‌కు విస్తరించకుండా నియంత్రించడమెలా, ఈ దాడుల ప్రేరణతో లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న హిజ్బుల్లా ఫైటర్స్‌ కూడా యాక్టివ్ అవుతారా? అనేవి ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు ఆందోళన కలిగిస్తున్న అంశాలని చెప్పవచ్చు.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య అసలు వివాదం ఏంటి... ఎలా మొదలైంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)