హమాస్ దాడిని తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్‌ ఆర్మీకి అంత సమయం ఎందుకు పట్టింది?

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గోర్డన్ కొరెరా
    • హోదా, బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్

గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు ఇష్టారాజ్యంగా తిరుగుతూ విధ్వంసం సృష్టించినప్పుడు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఏం చేస్తున్నాయని కొందరు ఇజ్రాయెల్ పౌరులు ప్రశ్నిస్తున్నారు.

‘‘వెంటనే దాడులకు ప్రతిస్పందించడంలో సైన్యం పూర్తిగా విఫలమైంది’’ అని ఒక ఇజ్రాయెల్ పౌరుడు అన్నారు.

దాడులకు గురైన ప్రాంతాలకు సైన్యం రావడం ఆలస్యం కావడంతో కొందరు ప్రజలు ఎలా సివిలియన్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ (పౌర రక్షణ దళాల)పై ఆధారపడ్డారో ఆయన వివరించారు.

ఇలా ఎందుకు జరిగిందో పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది.

హమాస్ ఎవరూ ఊహించని విధంగా, భారీ స్థాయిలో, మెరుపు వేగంతో చేసిన దాడులను చూస్తుంటే ఇజ్రాయెల్ బలగాలు గందరగోళానికి గురైనట్లు, అసలు ఇలాంటి దాడికి వారు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

హమాస్ దాడిలో ఎవరూ ఊహించని రీతిలో విరుచుకుపడటం అనేది కీలకంగా మారింది.

ఈ దాడుల కోసం హమాస్ వేసిన ప్రణాళికలను కనిపెట్టడంలో ఇజ్రాయెల్ నిఘా విభాగం పూర్తిగా విఫలమైంది. ఇలాంటి దాడి హమాస్ చేయలేదని లేదా హమాస్‌కు దాడి చేయడానికి ఇష్టం లేదని ఇజ్రాయెల్ బలగాలు నమ్మేలా చేయడంలో హమాస్ సఫలమైంది.

అదే సమయంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు దూరం జరుగుతూ తమ ఆపరేషన్ గురించి బయటకు తెలియకుండా హమాస్ చాలా జాగ్రత్త పడింది.

ఆ తర్వాత ఊహంచని విధంగా భారీ స్థాయిలో, మెరుపు వేగంతో దాడిచేసే వ్యూహాలపై హమాస్ ఎంచుకుంది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఆపరేషన్ మొదలైన వెంటనే వేల రాకెట్లను మొదట హమాస్ ప్రయోగించింది. అదే సమయంలో సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుందో కనిపెట్టేందుకు ఉపయోగించే ‘మానిటరింగ్ ఎక్విప్‌మెంట్’పై డ్రోన్లతో దాడులు చేపట్టింది. ఆ తర్వాత భారీ పేలుళ్లతో దాదాపు 80 చోట్ల కంచెలను దాటుకుంటూ ఇజ్రాయెల్‌లోకి హమాస్ మిలిటెంట్లు ప్రవేశించారు.

భారీ వాహనాలతోపాటు మోటరైజ్డ్ హ్యాంగ్-గ్లైడర్స్, మోటార్‌బైక్‌ల సాయంతో హమాస్ ఫైటర్లు చొరబడ్డారు. మొత్తంగా 800 నుంచి 1000 మంది సాయుధులు గాజా నుంచి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు.

ఈ వ్యూహాల వల్ల, కొంత సేపు ఏం జరుగుతోందో అర్థం కాని స్థితిలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు పడిపోయాయి.

ముఖ్యంగా ఈ వ్యూహాలన్నీ ఇజ్రాయెల్ కమాండ్, కంట్రోల్ సెంటర్‌లలో చాలా గందరగోళానికి కారణమయ్యాయి. అప్పటికే శనివారం సెలవు దినం కావడంతో వారు ఈ దాడిని అసలు ఊహించలేదు.

కొంత మంది హమాస్ ఫైటర్లు సాధారణ పౌరులు జీవించే ప్రాంతాలపై దాడులు చేశారు. మరికొందరు సైనిక అవుట్‌పోస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా భద్రత తక్కువగా ఉండే పోస్టులను వీరు ఎంచుకున్నారు. కొన్ని ఇజ్రాయెల్ ట్యాంకులు కూడా హమాస్ చేతిలోకి వచ్చినట్లు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.

బందీలుగా తీసుకున్నవారిని గాజాలోకి తీసుకెళ్లేవరకూ ఈ సరిహద్దులు తెరచే ఉన్నాయి. చివరగా ట్యాంకుల సాయంతో ఈ సరిహద్దులను మూసివేశారు.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: పెరుగుతున్న హింస మరో యుద్ధానికి దారి తీస్తుందా?

ఇజ్రాయెల్ రక్షణ బలగాల మోహరింపుల్లో కొన్నిచోట్ల దాడికి అనువైన ప్రాంతాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వీరు కొన్ని నెలల నుంచి గాజాకు బదులుగా వెస్ట్‌బ్యాంక్‌పైనే ఎక్కువ దృష్టి సారించారు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విధానాల విషయంలో ఇజ్రాయెల్‌లో తలెత్తిన శాంతి, భద్రత సమస్యలతో బలగాలు తీరిక లేకుండా గడపడాన్ని కూడా హమాస్ తనకు అనువుగా మలచుకుంది.

ఇజ్రాయెల్ సైనిక, నిఘా వ్యవస్థలను పశ్చిమాసియాలో అత్యున్నతమైనవిగా భావిస్తారు. అంతేకాదు, ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన సైన్యాల్లో ఒకటిగా ఇజ్రాయెల్‌ మిలిటరీకి పేరుంది. అయితే, వీరు తమ ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేశారు.

ఈ దాడులను అమెరికాపై జరిగిన 9/11 దాడులతో చాలా మంది పోలుస్తున్నారు. అప్పుడు కూడా విమానాలను ఆయుధాలుగా ఉపయోగించొచ్చని ఎవరూ ఊహించలేదు. దీన్ని అప్పట్లో ‘ఫెయిల్యూర్ ఆఫ్ ఇమాజినేషన్’గా చెప్పేవారు.

ప్రస్తుతం ఇజ్రాయెల్ వైఫల్యానికి కారణాల్లో అది కూడా ఒకటి కావచ్చు. ప్రత్యర్థి నుంచి ఈ స్థాయి దాడిని వారు ఊహించలేకపోయారు.

దాడులపై జరిగే సమగ్ర విచారణలో దాదాపు అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టొచ్చు. ప్రస్తుతం జరిగిన దాన్ని మళ్లీ గుర్తుచేసుకునే కంటే, తర్వాత ఏం చేయాలనే అంశంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)