ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి: వీడియోలు, సోషల్ మీడియాలో వెల్లడైన సూపర్‌నోవా ఫెస్టివల్ మారణకాండ

హమాస్ దాడులు

ఫొటో సోర్స్, TELEGRAM

ఫొటో క్యాప్షన్, హమాస్ దాడులు మొదలవ్వగానే సూపర్‌నోవా ఫెస్టివల్ ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్న సెక్యూరిటీ
    • రచయిత, సీన్ సెడన్, జోషువా చీతమ్, బెనెడిక్ట్ గర్మన్
    • హోదా, బీబీసీ న్యూస్

హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని వివరాలు మీ మనసును కలచివేయవచ్చు

హారర్ మొదలవ్వకముందు తీసిన చివరి వీడియోలు, సూపర్‌నోవా మ్యూజికల్ ఫెస్టివల్ కూడా ఇతర వేడుకల మాదిరిగానే సరదాగా సాగినట్లు చూపిస్తున్నాయి. అందులో తెల్లవారుజామున యువకులు, యువతులు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.

కొన్ని లెక్కల ప్రకారం, మ్యూజికల్ పార్టీకి 4 వేల మంది హాజరయ్యారు. వీడియో ఫుటేజీలలో దాదాపు వారందరూ 30 ఏళ్లలోపు ఉన్నట్లు తెలుస్తోంది.

సూపర్‌నోవా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఒక మారుమూల ప్రాంతానికి వారంతా వచ్చారు.

రహస్య ప్రదేశంలో జరిగే ఈ ఈవెంట్‌లో డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్, డ్రింక్స్ ఉంటాయని అందులో పాల్గొనేవారికి నిర్వాహకులు హామీ ఇచ్చారు.

గాజాకు 6 కి.మీ దూరంలోని రీమ్ కిబ్బుజ్‌కు ఉత్తరాన ఉన్న ఒక ప్రదేశానికి రావాలని మ్యూజికల్ పార్టీ టిక్కెట్లు కొన్నవారికి నిర్వాహకులు చెప్పారు.

ఈ పార్టీ ఒక ‘‘ఐక్యత, ప్రేమ ప్రయాణం’’ అని నిర్వాహకులు అభివర్ణించారు.

బీబీసీ

స్థానిక కాలమానం ప్రకారం 7:22 గంటలకు అప్‌లోడ్ అయిన ఒక వీడియోలో పార్టీలోని వారంతా ఆనందంగా కనిపించారు. తెల్లవారుజాము వెలుగులో నవ్వుతూ, డ్యాన్స్‌లు చేస్తున్నారు.

కానీ, అప్పుడే కమ్ముకుంటోన్న నల్లటి పొగ మేఘాలు, సమీపిస్తోన్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.

గాజా నుంచి ప్రయోగించిన రాకెట్లను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ మిలిటరీ ఉపయోగించిన క్షిపణులు వదిలేసిన పొగలా ఆ మేఘాలు కనిపిస్తున్నాయి.

ఇది జరిగిన కొన్ని గంటల్లో, హమాస్ వేలాది రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది.

హమాస్ దాడులు
ఫొటో క్యాప్షన్, పార్టీ సైట్‌లో కొంతమంది డ్యాన్స్ చేస్తుండగా, మరికొందరు ఆకాశంలో కనిపిస్తోన్న రాకెట్లను గమనించారు

ధ్రువీకృత వీడియోలు, సోషల్ మీడియా పోస్ట్‌లతో పాటు, ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి ఆ మ్యూజికల్ ఫెస్టివల్‌లో జరిగిన రక్తపాతానికి సంబంధించిన ఘటనలను 'బీబీసీ వెరిఫై' క్రోడీకరించింది.

ఆ ఫుటేజీల్లో పార్టీ చేసుకుంటున్నవారిలో కొంతమంది తమ తలల మీదుగా ఏర్పడిన నల్లటి మేఘాలను చూస్తుండటం కనిపిస్తోంది. మిగతా వారు ఇదేమీ తెలీకుండా డ్యాన్స్ చేస్తున్నారు.

కాసేపటి తర్వాత పోస్ట్ చేసిన మరో వీడియోలో, మ్యూజిక్ ఆగిపోయింది.

పార్టీ జరుగుతున్న ప్రదేశం నుంచి అందరూ పారిపోవడం మొదలెట్టారు. కొందరు భయంతో కనిపించారు. మరికొందరు దాక్కోవడానికి ప్రయత్నించారు. కొందరేమో బయటకు వెళ్లే దారి వైపు నడుస్తున్నారు.

మిలిటెంట్ల దాడులు

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

‘‘అంతటా వారే’’

రాకెట్ల దాడి ప్రారంభానికి, సాయుధులు చేరుకోవడానికి మధ్య ఎన్ని నిమిషాలు గడిచాయనే అంశంపై స్పష్టత లేదు.

కానీ, ఇదంతా చాలా త్వరగా జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

‘‘రాకెట్లు వచ్చాయి. తర్వాత వారు కాల్పులు మొదలుపెట్టారు. వివిధ దిశల నుంచి బుల్లెట్లు వస్తున్నాయి.

వారు కిందకు దిగడం చూశాను. వెంటనే మేం జీపు ఎక్కి పొలాల్లోకి వెళ్లాం’’ అని బీబీసీతో 31 ఏళ్ల గిలాడ్ కార్‌ప్లస్ చెప్పారు.

మ్యూజికల్ ఫెస్టివల్‌లో గిలాడ్ ఒక మసాజ్ థెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మహిళ పోస్ట్ చేసిన స్టోరీలో ఆకాశంలో రాకెట్లు, పార్టీ ప్రదేశం నుంచి అందరూ పరిగెత్తడం కనిపిస్తుంది.

‘‘మేం ప్రధాన రహదారి గుండా వెళ్లాం. ఒక నిమిషం తర్వాత తీవ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని ఎవరో అరవడం మొదలుపెట్టారు.

మరో రెండు నిమిషాలకు అక్కడ చాలామంది తీవ్రవాదులు ఉన్నట్లు మేం గ్రహించాం’’ అని తన ఫాలోయర్లను ఉద్దేశించి గిలాడ్ పోస్ట్‌లో రాశారు.

ఆ ప్రాంతంలో పార్టీ జరుగుతుందనే విషయం మిలిటెంట్లకు ముందుగానే తెలుసో లేదో నిర్ధారించడం అసాధ్యం.

కానీ, నిశ్శబ్ధంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిధ్వనించే మ్యూజిక్‌ను వారు కచ్చితంగా విని ఉండొచ్చు.

మిలిటెంట్లు ఆ ప్రదేశాన్ని పొరపాటున కనుగొన్నారో లేక సరైన సమాచారంతోనే వచ్చారో గానీ వారు మాత్రం అందర్నీ చంపాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆటోమెటిక్ ఆయుధాలు పట్టుకున్న మిలిటెంట్లు పార్టీ జరుగుతున్న చోటంతా ఎలా విస్తరించారో బీబీసీ న్యూస్‌తో గిలి యోస్కోవిచ్ చెప్పారు.

ఒక వ్యాన్ నుంచి మరిన్ని ఆయుధాలు బయటకు తీయడాన్ని తాను చూసినట్లు గుర్తు చేసుకున్నారు.

పార్టీ క్యాంపు ముట్టడికి గురైందని, దాని చుట్టుపక్కల రహదారులన్నీ బ్లాక్ అయినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాలు చెబుతున్నాయి.

అక్కడి వారంతా దొరికిన చోటుకు పారిపోతున్నప్పటికీ, కొంతమంది గన్‌మెన్లకు దొరికిపోయారు.

ఇజ్రాయెల్ ఆర్మీలో పనిచేసిన గిలాడ్ మాట్లాడుతూ, ‘‘వాళ్లు రోడ్లను బ్లాక్ చేస్తారని మాకు తెలుసు. ఆ రోడ్లమీద కచ్చితంగా చాలా మందిని చంపేసి ఉంటారు.

మేం పొలాల్లోకి వెళ్లి వారి నుంచి దాక్కునేందుకు ప్రయత్నించాం. తర్వాత పొలాల్లో మరింత దూరం వెళ్లిపోయాం. అప్పుడు వారు వివిధ స్థానాల నుంచి భారీ ఆయుధాలతో, స్నైపర్ రైఫిల్స్‌లో కాల్చడం మొదలుపెట్టారు’’ అని చెప్పారు.

హమాస్ దాడులు

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

కెమెరాలో మారణకాండ దృశ్యాలు

కొందరు పొలాలు, ఎడారిలోకి పారిపోతుండగా మిలిటెంట్లు వారిని చంపడం కోసం పార్టీ సైట్‌లో కలియతిరుగుతున్నారు.

పార్క్ చేసిన ఒక కారులో నుంచి తీసినట్లుగా కనిపిస్తోన్న డాష్‌క్యామ్ ఫుటేజీలో 9:23 నిమిషాల టైమ్ స్టాంప్ ఉంది. ఆ ఫుటేజీలో మారణకాండలో పాల్గొన్న ముగ్గురు గన్‌మెన్లు కనబడుతున్నారు.

కారు పక్కన చలనం లేకుండా శవంలా పడి ఉన్న ఒక వ్యక్తితో ఆ వీడియో ఫుటేజీ మొదలవుతుంది.

ఆటోమెటిక్ ఆయుధాన్ని పట్టుకున్న ఒక మిలిటెంట్, రక్తం కారుతున్న మరో వ్యక్తిని చొక్కా పట్టుకొని లాక్కుపోతుండటం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి బతికి ఉన్నారో, చనిపోయారో తెలియదు.

అప్పుడు కారు పక్కన శవంలా పడి ఉన్న వ్యక్తి మెల్లిగా తల పైకెత్తి చూడటం కనిపిస్తుంది. ఇదే ఆయన చేసిన పెద్ద పొరపాటు.

కొన్ని సెకన్లకే మరో మిలిటెంట్ వచ్చి ఆయనను పాయింట్ బ్లాంక్‌లో గురిపెట్టి కాల్చేసి వెళ్లిపోవడం కెమెరా ఫుటేజీలో నిక్షిప్తం అయింది.

అదే ఫుటేజీలోని తర్వాతి సెక్షన్‌లో ఒక పురుషుల సమూహం కనిపిస్తుంది. అందులో ఒకరి దగ్గరే ఆయుధాలు ఉన్నాయి. వారు అక్కడికి దోచుకోవడానికి వచ్చినట్లుగా కనిపించారు.

కారు పక్కన చనిపోయిన వ్యక్తి జేబులతో పాటు పార్క్ చేసి ఉన్న వాహనాల్లోని సూట్‌కేసులను వారు వెదికారు.

అప్పుడు వారు కార్లలో దాక్కున్న ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించి వారిని తమ అదుపులోకి తీసుకున్నారు. . అందులో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు.

రెండు నిమిషాల తర్వాత వారు తీసుకెళ్లిన మహిళ మళ్లీ ఫుటేజీలో కనిపించారు. బహుశా ఆమె సహాయం కోసం గాలిలో చేతులు ఊపుతున్నారు. ఈ సమయానికి ఇజ్రాయెల్ రక్షణ దళాలు, మిలిటెంట్ల చొరబాటును తిప్పికొట్టే పనిని మొదలుపెట్టాయి.

కానీ, సెకన్ల వ్యవధిలో బుల్లెట్లు ఆమె చుట్టూ దూసుకెళ్లాయి. ఇంతలో ఆమె నేల మీద పడిపోయారు. ఆ మహిళ ప్రాణాలతో బయటపడ్డారో లేదో తెలియదు.

ఈ ఫుటేజీని బీబీసీ విశ్లేషించింది. ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ సహాయంతో అందులో కనిపించిన గన్‌మెన్లను గుర్తించేందుకు ప్రయత్నించింది.

వారిలో ఒకరి ముఖం, గాజాలోని సుసీరత్ మున్సిపాలిటీ వెబ్‌సైట్‌లో పోలీసు యూనిఫామ్‌లో ఉన్న ఒక వ్యక్తి ముఖంతో సరిపోలింది.

మేం అమెజాన రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ సహాయంతో వీరిని పోల్చి చూడగా, 94-97 శాతం సారుప్యత స్కోరు వచ్చింది.

మిలిటెంట్లు
ఫొటో క్యాప్షన్, దాడిలో పాల్గొన్న ముగ్గురు మిలిటెంట్లు

అంతటా అవే దృశ్యాలు

పార్టీ జరిగిన ప్రదేశం అంతటా దాదాపు ఇవే ఘటనలు పునరావృతం అయ్యాయి.

260కి పైగా మృతదేహాలను ఆ చోటు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రెస్క్యూ ఏజెన్సీ జాకా చెప్పింది. మొబైల్, డ్రోన్ ఫుటేజీలు హమాస్ దాడి స్థాయిని వెల్లడిస్తున్నాయి.

ఆ మ్యూజికల్ పార్టీ ఒక వార్‌జోన్‌గా మారిపోయింది. అక్కడి నుంచి చాలా మందిని బందీలుగా చేసుకున్నట్లు హమాస్ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా సుమారు 100 మందిని గాజాలో బందించినట్లు ఇజ్రాయెల్ ప్రజలు చెబుతున్నారు. ఈ మ్యూజికల్ ఫెస్టివల్‌కు సంబంధించిన అత్యంత బాధాకరమైన వీడియోల్లో ‘నోవా అర్గామని’ అనే మహిళకు సంబంధించినది కూడా ఉంది.

సోషల్ మీడియాలో హమాస్ పంచుకున్న ఈ వీడియోలో.. ఏడుస్తున్న ఆమెను మోటార్ సైకిల్ మీద మిలిటెంట్లు తీసుకెళ్లడం కనిపిస్తుంది.

గాజాలో ఆమె ప్రాణాలతోనే ఉన్నట్లు చూపించే ఫుటేజ్ ఆన్‌లైన్‌లో ప్రసారం అయింది. అయితే, అది నిజమో, కాదో అస్పష్టంగా ఉంది. పార్టీ నుంచి అపహరణకు గురైన వారి కుటుంబాలు తమ ప్రియమైన వ్యక్తుల రాక కోసం ఎదురు చూస్తున్నాయి.

వారిని ఎలా వెనక్కి తీసుకురావాలనే అంశంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అస్పష్టతతోనే ఉంది.

అదనపు రిపోర్టింగ్: షెరీన్ షెరీఫ్, షయాన్ సర్దారిజాదే, అలెక్స్ ముర్రే, జెమీమా హెర్డ్, అలైస్ కడీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)