ఇజ్రాయెల్‌ కళ్లుగప్పి హమాస్ ఎలా దాడి చేసింది... 100 ఏళ్ళుగా సాగుతున్న ఈ హింసకు అసలు కారణాలేంటి?

ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకు స్వాధీనం
    • రచయిత, జెరెమీ బోవెన్
    • హోదా, బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్

హమాస్ ఊహకందని దాడితో ఇజ్రాయెల్ నిర్ఘాంతపోయింది.

ఏం జరుగుతుందో తెలియనంతగా అనూహ్య దాడి జరిగింది. గాజా, ఇజ్రాయెల్‌ను వేరు చేసే పటిష్టమైన కంచెను హమాస్ ధ్వంసం చేసి ఇజ్రాయెల్‌‌లోకి చొచ్చుకొచ్చి దాడి చేసింది. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్‌పై జరిగిన అతిపెద్ద దాడి ఇదే.

1973 నాటి మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఈజిప్ట్, సిరియా చేసిన అనూహ్య దాడులకు సరిగ్గా 50 ఏళ్లు గడచిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. ఆ రోజును హమాస్ నాయకత్వం ఇంకా మరిచిపోలేదని ఈ దాడి గుర్తుచేస్తోంది.

తమ దేశం యుద్ధంలో ఉందని, శత్రువులు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

ఈ దాడుల్లో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరులు, సైనికుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

ఆయుధాలు ధరించిన హమాస్‌కి చెందిన కొందరు వ్యక్తులు సైనికులను, పౌరులను బంధీలుగా తీసుకెళ్తున్న దృశ్యాలు ఇజ్రాయెలీలను ఆగ్రహానికి గురిచేశాయి.

బోర్డర్‌లో కంచె కూల్చివేత

ఫొటో సోర్స్, ASHRAF AMRA/ANADOLU AGENCY VIA GETTY IMAGES

దాడి జరిగిన కొద్ది గంటల్లోనే గాజాపై వైమానిక దాడులు చేసి ఎంతోమంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. బోర్డర్ దాటి ఎదురెదురుగా పోరాడేందుకు కూడా సైనికాధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా అక్కడ ఉండడంతో అవతలి భూభాగంలోకి చొచ్చుకెళ్లడం గతంతో పోలిస్తే క్లిష్టతరంగా మారే అవకాశం ఉంది.

కొద్దినెలలుగా పాలస్తీనాకు చెందిన సాయుధ గ్రూపులకు, ఇజ్రాయెల్‌కు మధ్య ఏ క్షణమైనా భయంకర దాడులు జరిగే అవకాశం ఉందన్న పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో హమాస్‌కి చెందిన సాయుధ విభాగం జరిపిన ఆకస్మిక దాడులు నిర్ఘాంతపోయేలా చేశాయి.

జెరూసలెం నుంచి జోర్డానియన్ బోర్డర్ వరకూ ఉన్న వెస్ట్‌ బ్యాంక్‌పై నియంత్రణ కోసం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం కొనసాగుతోంది. 1967 నుంచి ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న ఈ ప్రాంతం గురించే ఏడాది పొడవునా ఇరువర్గాల మధ్య నిరంతరం ఘర్షణలు, హింస చెలరేగుతున్నాయి.

సాయుధ పాలస్తీనియన్లు, మరీ ముఖ్యంగా వెస్ట్ బ్యాంక్‌కు వెలుపల ఉన్న జెనిన్, నబ్లస్ పట్టణాల నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనికులు, అక్కడ స్థిరపడిన యూదులపై దాడులు చేస్తున్నారు.

ఇజ్రాయెల్ సైన్యం కూడా డజన్ల సంఖ్యలో దాడులు చేసింది. సాయుధులైన సెటిలర్లు పాలస్తీనా గ్రామాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

గాజా - ఇజ్రాయెల్ దాడులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

తమ ఆధీనంలో ఉన్న ఉన్న ప్రాంతాలు ముమ్మాటికీ తమ అంతర్భాగమని, అది యూదు భూభాగమని జాతీయవాద ఇజ్రాయెల్ ప్రభుత్వం మరోసారి వాదించింది.

హమాస్ ఎంతో నేర్పుతో, ఎవరికీ అనుమానం రాకుండా ఇంత సంక్లిష్టమైన ఆపరేషన్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఎవరూ ఊహించలేదు.

గూఢచార సంస్థల వైఫల్యంపై ఇప్పటికే ఇజ్రాయెల్‌లో ఆరోపణలు మొదలయ్యాయి. ఇన్ఫార్మర్లు, ఏజెంట్లు, హైటెక్ నిఘాతో ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని అంతా అనుకున్నారు.

చివరికి, వారాంతంలో సెలవు రోజున, ఇజ్రాయెలీలు ఏమరపాటుగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్ కళ్లుగప్పి హమాస్ దాడి చేయగలిగింది.

జెరూసలెంలోని మసీదులకు ముప్పు ఉందని, అందుకే ఈ దాడులు చేసినట్లు హమాస్ తెలిపింది. సౌదీ అరేబియాలోని మక్కా మసీదు తర్వాత ముస్లింలు మూడో అత్యంత పవిత్ర ప్రదేశంగా భావించే అక్సా మసీదు ప్రాంగణంలో గత వారం కొంతమంది యూదులు ప్రార్థనలు చేశారు.

ఆ ప్రాంతాన్ని యూదులు కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీనిని బైబిల్‌లో చెప్పినట్లు యూదు దేవాలయంగా పరిగణిస్తారు. యూదుల ప్రార్థనా మందిరం టెంపుల్ మౌంట్‌గా చెబుతున్నప్పటికీ అది అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ, ఇది పాలస్తీనియన్లలో ఆగ్రహజ్వాలలకు కారణమవడంతో ఇజ్రాయెల్ ఈ ప్రాంతంపై నిషేధం విధించింది.

అయినప్పటికీ, ఇది జాతీయ, మతపరమైన వివాద కేంద్రంగా మారిపోయింది. ఇవేవీ అనూహ్యంగా తలెత్తిన ఉద్రిక్తతలు కావు.

హమాస్ దాడి చేసిన విధానాన్ని పరిశీలిస్తే అందుకోసం కొద్దినెలలుగా ప్రణాళిక రచించినట్లుగా కనిపిస్తోంది. ఈ దాడి గత వారంలో, లేదా అంతకుముందు జరిగిన పరిణామాలతో ఆవేశపూరితంగా తీసుకున్న తొందరపాటు చర్య ఏమాత్రం కాదు.

గాజా దాడుల్లో చిక్కుకున్న ఇజ్రాయెల్ పౌరులు

ఫొటో సోర్స్, REUTERS

హమాస్, ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యేందుకు చాలా లోతైన కారణాలే ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా హెడ్‌లైన్స్‌లో లేకపోయినప్పటికీ ఆ ఉద్రిక్తతలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉన్నాయి.

అయినప్పటికీ, ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని అధికారిక ప్రకటనలు ఇచ్చే దేశాలు ఇజ్రాయెల్ పక్కనే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును మాత్రం విస్మరించాయి. 1990లలో ఓస్లో శాంతి ప్రక్రియ ప్రారంభమైన సమయంలో రెండు రాజ్యాలు ఏర్పాటు అవుతాయని ఆశించారు. కానీ, అది ముగిసిపోయిన నినాదంగా మారిపోయింది.

పాలస్తీనా - ఇజ్రాయెల్ వివాదం జోబైడెన్ ప్రభుత్వానికి అంత ప్రాధాన్యమైన విషయం అంశం కాదు. ఇజ్రాయెల్‌తో సయోధ్యకు వచ్చినందుకు ప్రతిఫలంగా సౌదీ అరేబియాకు భద్రతాపరమైన భరోసా ఇచ్చేందుకు అనువైన మార్గాలను అన్వేషించే పనిలో వాష్టింగ్టన్ డీసీ ఉంది.

శాంతి ప్రక్రియను పున:ప్రారంభించేందుకు బరాక్ ఒబామా హయాంలో అమెరికా చేసిన చివరి ప్రయత్నం విఫలమైంది.

మధ్యధరా సముద్రానికి, జోర్డాన్ నదికి మధ్యలో ఉన్న ప్రాంతంపై నియంత్రణ కోసం అటు అరబ్బులు, ఇటు యూదులకు మధ్య శతాబ్ద కాలంగా నెలకొన్న వివాదం అపరిష్కృతంగా కొనసాగుతూనే ఉంది.

వరుస దాడులు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ వివాదం అంత సులువుగా పరిష్కరింగలిగేది కాదని స్పష్టమవుతోంది. ఈ వివాదం కొనసాగుతున్నంత కాలం హింస, రక్తపాతం జరుగుతూనే ఉంటుందని అర్థమవుతోంది.

వీడియో క్యాప్షన్, హమాస్ అంటే ఏంటి, గాజా స్ట్రిప్ ఎక్కడుంది? కొన్ని కీలక ప్రశ్నలు... సమాధానాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)