ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి: పాలస్తీనాకు భారత్ దూరం జరుగుతోందా?

పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
    • రచయిత, ప్రియాంకా ఝా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ శనివారం తెల్లవారుజామున గాజా నుంచి ఇజ్రాయెల్‌పై భారీ దాడులు చేసింది.

ఇజ్రాయెల్ లక్ష్యంగా వందల కొద్దీ రాకెట్లను హమాస్ ప్రయోగించింది. మునుపెన్నడూలేని రీతిలో ఆ దాడి జరిగింది. గాజా నుంచి రాకెట్ల దాడి మొదలైన కొద్దిసేపటికే ఈ ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ సాయుధులు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో చాలావాటిపై మళ్లీ పట్టు సాధించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

గాజాపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఈ దాడులకు వారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ప్రపంచ దేశాల నాయకులు ఖండించారు.

అయితే, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులపై ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కానీ, ఈ దాడిని ‘టెర్రరిస్టు’ దాడిగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు తోడుగా ఉంటామని ఆయన అన్నారు.

మరోవైపు దాడులు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్న ఓ వీడియోను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ‘‘నేడు ఇజ్రాయెల్‌ పరిస్థితి ఇదీ. 2004-2014 (యూపీఏ ప్రభుత్వ హయాంలో) భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది’’ అని వ్యాఖ్యలు చేసింది. బీజేపీ ట్వీట్ చేసిన వీడియోలో భారత్‌లో దాడులకు సంబంధించిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాల తర్వాత ఇజ్రాయెల్-పాలస్తీనా వివాద విషయంలో భారత్ విధానం మారిందా? అనే చర్చ మరోసారి మొదలైంది.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

పాలస్తీనాపై భారత్ విధానం మోదీ ప్రభుత్వ హయాంలో మారిందా?

దశాబ్దాలనాటి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి ఇజ్రాయెల్, పాలస్తీనా పేరుతో రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమని (టూ స్టేట్) చాలా మంది ప్రపంచ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు తరచూ చెబుతుంటారు. భారత్ కూడా ఇదే అభిప్రాయాన్ని చాలాసార్లు వెల్లడించింది.

టూ-స్టేట్ పరిష్కారంలో భాగంగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే వాదన ఎప్పటినుంచో ఉంది. 1967 తర్వాత వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, ఈస్ట్ జెరూసలేంలను కలిపి పాలస్తీనాగా కొన్ని దేశాలు గుర్తించాయి కూడా.

అయితే, ఈ ఏడాది ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై ప్రవేశపెట్టిన తీర్మానం విషయంలో భారత్ వైఖరిపై పెద్దయెత్తున చర్చ జరిగింది.

ఈస్ట్ జెరూసలేంతోపాటు కొన్ని పాలస్తీనా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ‘ఆక్రమణ’లకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

పాలస్తీనా భూభాగాలను చాలా కాలం నుంచీ ఇజ్రాయెల్ ‘ఆక్రమించడం’పై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) విచారణ కూడా చేపట్టాలని ఈ తీర్మానం ముసాయిదాలో కోరారు.

ఈ తీర్మానానికి అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓటు వేశాయి. కానీ, భారత్‌తోపాటు బ్రెజిల్, జపాన్, మియన్మార్, ఫ్రాన్స్‌ ఓటింగ్‌కు దూరం జరిగాయి.

అప్పుడు కూడా పాలస్తీనాకు భారత్ దూరం జరిగి, ఇజ్రాయెల్‌కు దగ్గర అవుతోందనే వార్తలు వచ్చాయి.

కానీ, అంతర్జాతీయ నిపుణులు మాత్రం పాలస్తీనా విషయంలో భారత్ విధానం మారలేదని అంటున్నారు. కానీ, ‘డీహైఫెనేషన్’ దిశగా భారత్ అడుగులు వేస్తోందని విశ్లేషిస్తున్నారు.

అంటే ఇప్పటికీ పాలస్తీనాకు భారత్ గట్టి మద్దతు ఇస్తోంది. అదే సమయంలో దీనికి సమాంతరంగా తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్‌తోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తోంది.

అయితే, నానాటికీ పాలస్తీనా ప్రయోజనాల అంశం మరుగున పడుతోందని నిపుణులంతా ఏకీభవిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లో రీసెర్చర్, పశ్చిమాసియా వ్యవహారాల నిపుణుడు ఫజ్జుర్ రహమాన్ సిద్దిఖీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా భారత్ మాత్రమే కాదు, దాదాపు అన్నీ దేశాలు ఇజ్రాయెల్‌కు దగ్గర అవుతున్నాయి. ఫలితంగా ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని ఆయన అన్నారు.

మహమ్మద్ అబ్బాస్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2017లో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో నరేంద్ర మోదీ

ఎందుకు ఇలా జరుగుతోంది?

పాలస్తీనా అంశం మరుగున పడటానికి ఆ దేశంలోని భిన్న వర్గాల మధ్య విభేదాలు, పొరుగున ఉన్న దేశాల్లో సంక్షోభాలే కారణమని రహమాన్ అభిప్రాయపడ్డారు.

‘‘పాలస్తీనా అంశం మరుగున పడటానికి ప్రధాన కారణం పాలస్తీనా నాయకుల మధ్య విభేదాలే. అసలు ఇక్కడ ఎన్నికలే నిర్వహించడం లేదు. ఒకవైపు భూభాగం ఇక్కడ హమాస్ చేతుల్లో ఉంది. పాలస్తీనా అథారిటీ రెండో వైపు ప్రాంతాలను నడిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.

రెండో కారణంగా పొరుగునున్న దేశాల్లో పరిస్థితులను రహమాన్ ఉదహరించారు. ‘‘సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాక్, ఇరాన్, మొరాకో, ట్యునీషియా, సూడాన్.. ఇలా ఏ దేశాన్ని తీసుకున్నా సంక్షోభాలే కనిపిస్తున్నాయి. నేడు పాలస్తీనా అంశం వారికి అంత ముఖ్యమైనది కాదు’’ అని ఆయన చెప్పారు.

ప్రపంచ రాజకీయాల్లో మార్పులను మూడో కారణంగా రహమాన్ చెప్పారు. ‘‘అమెరికాలో మీరు డెమొక్రటిక్ పార్టీని తీసుకోండి లేదా రిపబ్లికన్ పార్టీని తీసుకోండి.. ఎవరైనప్పటికీ ఇజ్రాయెల్‌తో సంబంధాలకు వారు పెద్దపీట వేస్తున్నారు’’ అని రహమాన్ అన్నారు.

‘‘ట్రంప్ హయాంలోనూ అమెరికా బహిరంగంగా ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇక్కడ తటస్థం అనే మాటే లేదు’’ అని రహమాన్ చెప్పారు.

మహమ్మద్ బిన్ సల్మాన్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో నరేంద్ర మోదీ

భారత్ వైఖరి ఏమిటి?

చరిత్రను పరిశీలిస్తే, పాలస్తీనా ప్రజల హక్కులకు కూడా భారత్ మొదట్నుంచీ గట్టి మద్దతు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతు ప్రకటించడమనేది భారత్ విదేశాంగ విధానంలో అతిముఖ్యమైన అంశమని భారత్ విదేశాంగ శాఖ పలుమార్లు స్పష్టంచేసింది.

1974లో పాలస్తీనా ప్రజల ప్రతినిధి యాసర్ అరాఫత్ నేతృత్వంలోని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో)ను గుర్తించిన తొలి నాన్-అరబ్ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

అప్పట్లో భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, యాసర్ అరాఫత్‌ల మధ్య మంచి సంబంధాలు ఉండేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతుంటారు.

1988లో పాలస్తీనా స్టేట్‌ను గుర్తించిన తొలి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. 1966లో గాజాలో ఒక ‘ప్రతినిధి కార్యాలయం’ను కూడా భారత్ ఏర్పాటుచేసింది. 2003లో దీన్ని రామల్లాకు మార్చారు.

ఇజ్రాయెల్ నిర్మిస్తున్న గోడకు వ్యతిరేకంగా 2003 అక్టోబరులో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ కూడా మద్దతు పలికింది. మరోవైపు 2011లో పాలస్తీనాకు యునెస్కోలో శాశ్వత సభ్య దేశంగా చోటు కల్పించేందుకు కూడా భారత్ మద్దతు పలికింది.

2012లో ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్ హక్కులు లేకుండా ‘నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేట్’ హోదా ఇచ్చేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. ఈ తీర్మానానికి మద్దతుగా భారత్ ఓటు కూడా వేసింది.

మరోవైపు ఐక్యరాజ్యసమితి ప్రాంగణంలో పాలస్తీనా జెండాను ఏర్పాటుచేసే ప్రతిపాదనకు కూడా భారత్ మద్దతు పలికింది.

భారత్, పాలస్తీనా అథారిటీల మధ్య ఉన్నత స్థాయి నాయకుల పర్యటనలు కూడా తరచుగా జరిగేవి.

అంతర్జాతీయ, ద్వైపాక్షిక స్థాయిలో గట్టి మద్దతు ఇవ్వడమే కాదు, పాలస్తీనాకు భారత్ ఆర్థిక సాయం కూడా అందిస్తోంది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థుల కోసం గాజా సిటీలోని అల్ అజహర్ యూనివర్సిటీలో జవహర్‌లాల్ నెహ్రూ లైబ్రరీ, దిర్ అల్-బలాలోని పాలస్తీనా టెక్నికల్ కాలేజీలో మహాత్మా గాంధీ లైబ్రరీ లాంటి ఎన్నో సదుపాయాలను భారత్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అంతేకాదు పాలస్తీనా ప్రజల కోసం ప్రత్యేక ప్రాజెక్టులను కూడా చేపడుతోంది.

2008 ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ పాలస్తీనాలో పర్యటించారు. పాలస్తీనా అత్యున్నత పురస్కారం ‘‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ను కూడా మోదీకి పాలస్తీనా అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్ ప్రదానం చేశారు.

నిరుడు ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ సోలిడారిటీ విత్ పాలస్తీనియన్స్’నాడు ప్రధాన మంత్రి నరేంద్ర ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. పాలస్తీనాకు తాము గట్టి మద్దతు ఇస్తున్నామని దీని ద్వారా మోదీ చెప్పారు.

‘‘భారత్, పాలస్తీనాల మధ్య ఏళ్ల నుంచి సంబంధాలు పెనవేసుకున్నాయి. సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా పాలస్తీనా ప్రజలకు మేం ఎప్పుడూ అండగా నిలుస్తూనే ఉన్నాం. పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం విషయంలో రెండు వర్గాలు నేరుగా చర్చలు జరపాలని మేం కోరుకుంటున్నారు. అప్పుడే ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ప్రతిఫలం వస్తుంది’’ అని మోదీ అన్నారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

పరిస్థితులు ఎలా మారుతున్నాయి?

పాలస్తీనాకు సంఘీభావం తెలపడంలో భాగంగా ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా సౌదీ అరేబియా గుర్తించదు. నేటికీ ఇజ్రాయెల్‌తో సౌదీకి దౌత్య సంబంధాలు లేవు.

సౌదీ-ఇజ్రాయెల్‌ల మధ్య సంబంధాలను గాడినపెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే, దీనికిగాను పాలస్తీనా ప్రజల కోసం ‘సివిలియన్ న్యూక్లియర్ ప్రాజెక్టు’లు మరికొన్ని డిమాండ్లను సౌదీ కోరుతోంది.

అయితే, సౌదీకి ముందే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను ఏర్పరుచుకున్నాయి.

2020లో అమెరికా మధ్యవర్తిత్వంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌ కలిసి ఇజ్రాయెల్‌తో ‘అబ్రహామిక్ ఎకార్డ్స్’ కుదుర్చుకున్నాయి. దీనిలో భాగంగా ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరుచుకున్నాయి.

ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలు కూడా ఏదో ఒక్క రోజులో మెరుగుపడలేదని జామియా మిలియా యూనివర్సిటీలోని నేల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిసొల్యూషన్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమానంద్ మిశ్ర అన్నారు.

‘‘ఇక్కడ కొన్ని అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్‌తో సంబంధాలు మెరుగుపరచుకున్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి’’ అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్-వెస్ట్ బ్యాంక్.. చరిత్ర ఇదీ

పాలస్తీనాను చూసే కోణం మారిందా?

ఈ ప్రశ్నపై ప్రేమానంద్ మిశ్ర మాట్లాడుతూ, ‘‘భారత్‌లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌ను పాలస్తీనా కోణంలో, పాలస్తీనాను ఇజ్రాయెల్ కోణంలో చూడటాన్ని పక్కనపెట్టేసింది’’ అని చెప్పారు.

‘‘ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో భారత్ సమతూకం పాటిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కచ్చితంగా పాలస్తీనాకు భారత్ మద్దతు ప్రకటిస్తుంది. జాతీయ ప్రయోజనాలకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తోంది’’ అని ఆయన అన్నారు.

అయితే, రాజకీయంగా పరిస్థితులు మారినప్పుడు క్షేత్రస్థాయిలోనూ మార్పులు ఉంటాయని డాక్టర్ మిశ్ర అన్నారు. ‘‘ఇంతకుముందులా నేడు యూఏఈలో ప్రజలు వీధుల్లోకి వచ్చి పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేపట్టడం లేదు’’ అని చెప్పారు.

భారత్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘నేడో, రేపో భారత్‌పై కూడా అలాంటి దాడి జరిగితే ఏమవుతుంది? మీరు ఏ ఉద్దేశంతో వారికి (హమాస్‌కు) మద్దతు పలుకుతారు? ప్రస్తుతానికి ఈ వివాదంలో భారత్ ఇజ్రాయెల్ వైపు నిలబడింది. రెండు దేశాల్లోనూ రైట్ వింగ్ ప్రభుత్వాలే ఏర్పడటం కూడా దీనికి కారణం కావచ్చు. కానీ, ఇజ్రాయెల్ విషయంలో భారత్ విధానాలు పరిస్థితులకు అద్దం (రియలిస్టిక్ రిలేషన్స్) పడుతున్నాయి. అదే సమయంలో పాలస్తీనా విషయంలో అనుసరించే ఐడియలిస్టిక్ విధానాలు కూడా కొనసాగుతాయి’’ అని చెప్పారు.

మరోవైపు తాజా దాడుల తర్వాత ఇజ్రాయెల్‌కు మద్దతుగా నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో పాలస్తీనా విషయంలో భారత్ వైఖరేమీ మారబోదని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఏసియన్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ముదస్సిర్ కమర్ అన్నారు.

‘‘మోదీ విడుదల చేసిన ప్రకటనలో.. టెర్రరిస్టు దాడి నడుమ ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసింది. పౌరులను లక్ష్యంగా చేసుకుంది. ఇది రెండు సైన్యాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. భారత్‌కు ఇజ్రాయెల్ ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి. ప్రధాని మోదీ ప్రకటనను ఈ కోణంలోనే మనం చూడాల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)