వరల్డ్ పోస్ట్ డే - 2023: 'పోస్టాఫీస్ లేకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో ఊహించడమే కష్టం'

world post day 2023

ఫొటో సోర్స్, C Harikrishna

    • రచయిత, చిట్టత్తూరు హరికృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మంచి మధ్యాహ్నం. వేడిగాలి వీస్తోంది. అయినా గేటు దగ్గర నుంచి కదిలిపోవడానికి మనసు రావడం లేదు. నలిగిన టోపీతో సైకిల్ మెల్లగా తోసుకుంటూ వచ్చే కనూభాయ్ కోసమే ఆ ఎదురుచూపులు. ఆయన జీఈబీ ఏరియా పోస్ట్‌మ్యాన్. అమ్మ రాసిన ఉత్తరం ఈరోజైనా చేతికందుతుందా అనే ఆత్రుత.

అవును. అది ఈరోజుల్లా వాట్సాప్‌లో హాయ్ చెప్పే కాలం కాదు. 90ల చివర్లలో... ఉంటున్నది ఇంటికి 1700 కిలోమీటర్ల దూరంలో. రాత్రి 8 గంటల నుంచి కాల్ రేట్స్ మారుతాయని 7 గంటల 58 నిమిషాల నుంచే మధ్య మధ్యలో కాల్స్ ట్రై చేసినా, కాల్ కలవగానే డిజిటల్ మీటర్‌లో అంకెలు పరుగులు తీస్తుంటాయి.

నాన్నా, అమ్మా ఎలా ఉన్నారు. ఆ నేను బాగున్నా.... లెటర్ రాశావా, సరే.. ఇలాంటి కొన్ని మాటలతో కాల్ పూర్తయిపోతుంది.. జస్ట్ మాట్లాడాం అనే తృప్తి. అసలే ఉద్యోగం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే జేబుకు భారమని కట్ చేసేస్తా. ఫోన్లో అమ్మ చెప్పిన ఆ లెటర్ కోసం తర్వాత వారం రోజులూ ఎదురుచూపులు ఉండేవి.

పోస్టు బాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తరాలే ఓదార్పు..

డిగ్రీ అయిపోగానే, ఇక చదివింది చాల్లే ఉద్యోగం వెతుక్కుందామనుకుని అక్కా, బావ కుటుంబంతో గుజరాత్‌లోని బరోడా చేరిన క్షణాలవి. అప్పట్లో బరోడా అంటే కిరణ్ మోరే సిటీ అనే తెలుసు. కానీ, దాన్నే హిందీలో బడౌదా, గుజరాతీలో వడోదర అంటారని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది.

ఒకవైపు ఉద్యోగ ప్రయత్నాలు. డిగ్రీకే ఏం ఉద్యోగాలు వచ్చేస్తాయనే ఎత్తిపొడుపు మాటలు వింటూనే రోజులు గడిపేస్తున్న కాలమది. ఆ సమయంలో నాకు ఓర్పునిచ్చింది, ఓదార్చింది ఆ ఉత్తరాలే. మా ఇంటివైపు చూడకపోయినా హరికృష్ణ అని నా పేరు పోస్ట్ మాన్‌కు గుర్తు చేసేవాడిని.

తనకు కూడా నేను బాగా అలవాటైపోయా. వీధిమలుపు తిరగ్గానే ఆయన మా ఇంటి వైపు చూశాడంటే. లెటర్ చేతికి అందకముందే నా కళ్లు మెరిసేవి. చిన్నా అనే పిలుపుతో అమ్మ రాసే ఆ లెటర్ నా ముందు నిలబడి చెప్పినట్టే ఉండేది. ఎందుకంటే నాన్నకు రాసే తీరికా, ఓపికా ఉండేవి కావు. మా ఊరి నుంచి కాళహస్తి చేరుకుని రాత్రి 8 గంటల వరకూ వేచిచూసి అక్కతో మాట్లాడిన తర్వాత... మిగిలిన నాలుగు మాటలూ నాతో ఫోన్లోనే మాట్లాడేసేవారు.

ఈరోజుల్లో వాట్సాప్‌లు, టెలిగ్రాంలు ఎన్ని వచ్చినా, అనుకున్న క్షణమే వీడియో కాల్ చేసుకుని ఒకర్నొకరు చూసుకోగలుగుతున్నా... రోజుల ఎదురుచూపుల తర్వాత ఆ చిన్న కాగితం ఇచ్చే ఆ ఫీలింగ్, చదివిన తర్వాత అదే ఫీలింగ్‌తో రిప్లై రాయడం తలుచుకుంటే ఇప్పటికీ కళ్లు చెమర్చుతాయి.

పోస్ట్ కార్డు

ఫొటో సోర్స్, Getty Images

అమ్మతోపాటూ అర్ధాంగి నుంచి...

తర్వాత ఒక ఉద్యోగం వెతుక్కోవడం.. ఆ వెంటనే ఒక ఇంటివాడిని కావడం.. ఏడాది తిరక్కముందే తండ్రి కావడం చకచకా జరిగిపోయాయి.

బాబు పుట్టిన నాలుగో రోజే తిరిగి ఉద్యోగం కోసం బరోడా వచ్చేయడంతో వాడు బోర్లా పడ్డం నుంచీ... మోకాళ్లపై దోగాడింది.. గోడ పట్టుకుని నిలబడుతోంది అన్నీ నా కళ్లకు కట్టింది శ్రీమతి రాసిన ఆ ఉత్తరాలే మరి. ఆ ఉత్తరాలు చదివిన తర్వాత ఒక్కోసారి దేవుడు పక్షులకు మాత్రమే రెక్కలు ఎందుకిచ్చాడు అని చాలా కోపం వచ్చేది.

పోస్టల్ డే అనే మాట వచ్చినప్పుడల్లా ఆ రోజు ఈ పోస్టాఫీసులు, ఆ ఉత్తరాలే లేకుంటే అసలు నేనేమైపోయేవాడినో అనిపిస్తుంది.

తన ఉత్తరం వచ్చిన వెంటనే తీసుకుని డాబాపైకి వెళ్లిపోవడం, దాన్ని చదువుతుంటే మధ్య మధ్యలో అక్షరాలు మసకబారడం మర్చిపోలేని జ్ఞాపకం. తర్వాత ఊరి నుంచి తెచ్చుకున్న ఇన్‌లాండ్ కవర్ తీసి సమాధానం రాయాలి. మళ్లీ రిప్లై ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడాలి.

డైరీలో భద్రంగా దాచుకున్న ఆ లెటర్లను ఇప్పడు 20 ఏళ్ల తర్వాత తీసి చదువుతుంటే.. కన్నీళ్లు పడి చెదిరిన అక్షరాలు ఆనాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తాయి. అప్పుడప్పుడూ బయటపడిన ఆ పాత లెటర్లను చదివే నా కుమారుడు.. ఆ కాలంలో మా ఆటలు, పాటలతోపాటు ఈ ఉత్తరాల ఫీలింగ్ కూడా మిస్సయ్యాడని బాధ పడుతుంటాడు.

టెక్నాలజీ వల్ల ఉత్తరాలకు కాలం చెల్లినా, ఈమెయిళ్లు, వాట్సాప్, స్నాప్ చాట్ వాడే ఈ తరం వాళ్లకు చాలామందికి అసలు పోస్టాఫీసయినా తెలుసా అనిపించినా.. ఎస్టీడీ కాల్ రేట్ల పుణ్యమా అని ఆ సమయంలో ఒక మనసులోని మాటలను వందల కిలోమీటర్లు ప్రయాణం చేయించి అవతలి మనసుకు చేర్చినవి ఆ లేఖలేనని కచ్చితంగా ఒప్పుకోవాలి.

పోస్టాఫీస్

ఫొటో సోర్స్, Getty Images

ఆరు నెలల కొడుకును చూపించింది

ఇప్పుడంటే హాస్పిటల్‌లో బిడ్డ పుట్టగానే వీడియో కాల్ చేసి అందరికీ చూపించేస్తున్నారు. బిడ్డ ప్రతి క్షణాన్నీ స్మార్ట్ ఫోన్‌తో క్లిక్ మనిపించేస్తారు. కానీ, ఆ రోజుల్లో బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకూ ఫొటోలే తీసేవారు కాదు.

అలాంటిది, కొడుకు పుట్టిన నాలుగో రోజే వదిలి వెళ్లిపోయిన నా పరిస్థితి ఎలా ఉంటుంది. దానికి తోడు లెటర్లలో వాడు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అంటే అదొక తీయటి పెయిన్.

ఆరు నెలలు అయ్యిందో లేదో ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్‌తో తీయించిన బాబు ఫొటోలను మోసుకొచ్చింది కూడా ఆ పోస్ట్ మ్యానే. ఫొటోలు తీయించాం అని చెప్పినప్పటి నుంచీ ఎప్పుడెప్పుడు వాటిని చూస్తామా అనే ఆతృతకు దాదాపు వారం రోజుల తర్వాత తెర పడింది.

పోస్ట్ డే

ఫొటో సోర్స్, C Harikrishna

సరదాగా మొదలైన ఉత్తరం

చిన్నతనంలో నాకో సందేహాం ఉండేది.. ఎక్కడో హైదరాబాద్‌ నుంచి ప్రభాకర్ మామ రాసిన ఉత్తరం మన ఊరి పోస్ట్ మాన్ ధర్మయ్య చేతికి ఎలా వస్తుందా అని.

ఆ సందేహానికి నేనే సమాధానం వెతుక్కున్నా. అదంతా సరదాగా జరిగింది. హైస్కూల్ చేరగానే చాలా మంది పిల్లలకు పోస్ట్ కార్డు రాయడం ఉత్సాహంగా ఉండేది. ఒక రోజు అందరూ ఒక అడ్రస్ షేర్ చేసుకుంటున్నారు. ఆ అడ్రస్‌కు కార్డు రాస్తే కథల పుస్తకాలు వస్తాయని చెబుతున్నారు.

చిన్నతనం నుంచీ చందమామ చదువుతూ పెరిగిన వాడిని. ఫ్రీగా కథల పుస్తకం అంటే వదిలేస్తానా. నేను కూడా రాశా. వచ్చాయి. అలా మొదలైంది ఉత్తరం రాసే సరదా.

కాలేజీ అయిన తర్వాత బరోడా వెళ్లే వరకూ వాటి అవసరం గానీ, అవి పంచే ఆనందం కానీ నాకు తెలీదు. ఇప్పుడు వాటి విలువ, అవి పంచిన సుఖాలు, దుఃఖాలు అన్నీ నా జీవితాంతం గుర్తుండిపోతాయేమో అనిపిస్తుంది.

ఫోన్ కాల్స్ భారంగా మారిన ఆ సమయంలో పావలా కార్డు ముక్క రాసి వేస్తే, నాలుగు రోజుల తర్వాత అయినా క్షేమ సమాచారం ఇంటికి చేరుతుందిగా అనుకునే ఆ రోజులు ఇప్పటికీ మదిలో మెదులుతాయి.

హైస్కూల్ చదివేటప్పుడే.. ఇంటికొచ్చి చినబాబూ ఒక జాబు రాసిస్తావా అని అందరూ నన్ను పిలుచుకు వెళ్లేవారు. ఊళ్లో కొందరికి నేను ఎంతగా లెటర్లు రాసి ఇచ్చేవాడినంటే.. వాళ్లు ఆ లెటర్లు రాసే అడ్రస్‌లు నాకు గుర్తుండిపోయేవి. ‘నీ లెటర్ చదువుతుంటే.. నువ్వే మా ముందు నిలబడి మాట్లాడినట్లు ఉంటుంది' అని అందరితో అనిపించుకున్నానంటే..చిన్న తనం నుంచీ అలా రాయడమే కారణం అనిపిస్తుంది.

పోస్టు కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

తృప్తినిచ్చిన మనీ ఆర్డర్‌

ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నెలకు కాస్తో కూస్తో సంపాదించగలుగుతున్నా. సంపాదన కాస్తయినా ఇంటికి పంపిద్దాం అనే కోరిక ఉంటుంది కదా. ఇప్పుడంటే గూగుల్ పేలు, ఫోన్ పేలు లాంటి పేమెంట్ యాప్స్ వచ్చేశాయి కాబట్టి డబ్బులు క్షణాల్లో పంపించేస్తున్నాం. లేదంటే బ్యాంకుల్లో పొడవాటి క్యూలో నిలబడి గంటలు గంటలు వేచిచూడాల్సి వచ్చేది.

అందులోనూ ఉంటున్నది ఊరుకాని ఊరు. అప్పటికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అందుకే నెల నెలా కొంత డబ్బు నాన్నకు మనీ ఆర్డర్ చేసేవాడిని. ఇంటికి నేను పంపేది వాళ్లకు ఏ మూలకూ రాదని తెలిసినా, అప్పట్లో ఆ మనీ ఆర్డర్ లేకుంటే ఇప్పుడు ఈ లోకంలో లేని అమ్మానాన్నలకు నా సంపాదన పంపగలిగాను అనే తృప్తి లేకుండా పోయేది.

ఆఫీసుకు వెళ్తూ మధ్యలో జీఈబీ పోస్టాఫీసుకు వెళ్లి మనీ ఆర్డర్ ఫాం తీసుకుని.. చకచకా ఫిల్ చేసి, అమౌంట్ ఇచ్చేశాక.. ఆ ఫామ్ కింద ఉన్న చిన్న స్థలంలో ఎన్నో రాయాలనిపించేది. మనీ ఆర్డర్ అందినట్టు రిసిప్ట్ అందాక అందులో అందమైన నాన్న సంతకాన్ని అలాగే చూస్తుండిపోవాలని అనిపించేది.

పోస్టాఫీసు

ఫొటో సోర్స్, CHarikrishna

పొదుపు నేర్పిందీ పోస్టాఫీసే...

ఐదు పదుల వయసులో ఇప్పుడు ‘పర్లేదు మనం కూడా ఎంతో కొంత పొదుపు చేశాం. ఇల్లూవాకిలీ ఉన్నాయి అనే ధీమా ఉందంటే.. ఇదంతా హైస్కూల్లో పోస్టాఫీస్ నేర్పిన పొదుపే. ప్రతి నెలా అన్నకు, నాకు అమ్మ ఇచ్చే రూ.50ని పోస్టాఫీసుకు తీసుకెళ్లి పిచ్చన్న చేతికి ఇచ్చి పాస్ బుక్కులో సీల్ వేసుకుని వచ్చేవాళ్లం.

ఊళ్లో మా పోస్ట్ మాస్టర్ సీల్ వేసిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్తున్న ప్రతిసారీ..అక్కడే తిన్నెపై కూర్చుని నేనూ, మా అన్న ఇప్పటివరకూ ఎంత జమచేశామో ఆ సీళ్లు చూసి లెక్కలేసుకునేవాళ్లం. హమ్మయ్య రూ.500 పొదుపు చేశాం అనుకునేవాళ్లం. తర్వాత రెండు మూడేళ్లకు వాటిని అమ్మ తీసి ఖర్చు పెట్టేసినా.. చిన్నతనంలో పొదుపు నేర్పిన పోస్టాఫీస్ జ్ఞాపకాలు ఇప్పటికీ విలువైనవే.

పోస్ట్ బాక్సులు

ఫొటో సోర్స్, Getty Images

టెలిగ్రాం, మార్ ఫోన్...

పోన్లు అందుబాటులో లేని ఆ రోజుల్లో పోస్టాఫీస్ తీసుకొచ్చిన టెలిగ్రాంలు, పోస్టాఫీస్ పక్కనే పొడవాటి ఏరియల్ ద్వారా పనిచేసే మార్ ఫోన్ నుంచి అవసరమైనప్పుడు కాల్స్ చేసిన సందర్భాలు కూడా గుర్తే. చివరకు నా పెళ్లికి బరోడా నుంచి స్నేహితులు పంపిన శుభాకాంక్షలను పెళ్లి మండపంలో అడుగుపెడుతున్న సమయంలో నాకు చేర్చింది కూడా ఈ పోస్టాఫీసే.

ఇప్పటివారికి పోస్టాఫీసుతో ఈ అనుభవాలు, అనుభూతులు లేకపోయినా.. నాలా ఉత్తరాలు, రేడియోల కాలం నుంచీ ప్రపంచాన్ని అరచేతిలో ఉంచే స్మార్ట్ ఫోన్ల వరకూ మధ్య కాలాన్ని చూసిన ఎంతోమందికి ఇలాంటివి కచ్చితంగా చాలానే ఉంటాయి.

కానీ, ఇప్పుడు ఇంటికి దూరంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో దేశ రాజధానిలో ఉంటున్న ఈ సమయంలో ఈ టెక్నాలజీనే లేకుంటే నాలాంటి వాళ్లు ఏమైపోయేవారో అనే భయమూ వేస్తుంది.

అందుకే చివరగా ఒకే మాట చెప్పాలనిపిస్తుంది. అప్పట్లో ఆ కాలంలో నీకు మేం ఆసరాగా నిలిచామని బీరువాలో భద్రంగా ఉన్న ఉత్తరాలు అంటుంటే, కాలంతోపాటూ మీరూ మారాలి, పరుగులు తీయాలి అని.. ఇప్పుడు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్.. తనతో కలిసి పరిగెత్తమని చెబుతున్నట్టు ఉంటోంది.

నేడు వరల్డ్ పోస్ట్ డే..

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవం. ప్రతీ ఏటా అక్టోబర్ 9వ తేదీన ‘‘వరల్డ్ పోస్ట్ డే (ప్రపంచ తపాలా దినోత్సవం) ’’ను జరుపుకుంటారు.

1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) ఏర్పాటుకు గుర్తుగా 1969లో యూనివర్సల్ పోస్ట్ కాంగ్రెస్, టోక్యోలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది అక్టోబర్ 9న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

రోజువారీ ప్రజల జీవితాల్లో, వ్యాపారాల్లో, ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ఉత్తరాల పాత్రపై అవగాహన కల్పించడమే ఉద్దేశంగా దీన్ని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)