చంద్రయాన్-3: అక్కడ పగలు ముగుస్తోంది...విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌లు స్పందించే అవకాశాలు ఇక లేనట్లేనా?

విక్రమ్ ల్యాండర్

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ల్యాండర్ విక్రమ్
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, ఢిల్లీ

చంద్రుడి మీద దక్షిణ ధృవంలో పగటి సమయం పూర్తికావొస్తోంది. రాత్రి సమయం మొదలవనుంది. ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌‌లు యాక్టివేట్ అయ్యే అవకాశాలు తగ్గిపోయినట్లే అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇస్రో పేర్కొన్నట్లుగా సెప్టెంబర్ 22న స్లీప్ మోడ్ నుంచి యాక్టివేట్ అవ్వాల్సిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌‌లు ఇప్పటికీ స్పందించడం లేదు. రోజులు గడిచే కొద్దీ అవి మేల్కొంటాయనే ఆశలు తగ్గిపోతున్నాయి.

భవిష్యత్తులో ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను మేల్కొలిపే ప్రయత్నాలను ఎలా ఉండబోతున్నాయో ఇస్రో ఇంకా స్పష్టతనివ్వలేదు. ల్యాండర్, రోవర్‌లు మాత్రం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేశాయని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.

భారత్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది.

అమెరికా, సోవియట్ యూనియన్, చైనాల తరువాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా నిలిచింది.

చంద్రుడిపై దిగినప్పటి నుంచి 14 రోజుల పాటు ల్యాండర్, రోవర్‌లు విలువైన సమాచారం, చిత్రాలను సేకరించి పంపాయి. అనంతరం చంద్రుడిపై రాత్రి సమయం మొదలుకావడంతో బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత వాటిని స్లీప్ మోడ్‌లోకి పంపారు శాస్త్రవేత్తలు.

సెప్టెంబర్ 22న సూర్యరశ్మి వచ్చే సమయానికి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను యాక్టివేట్ చేస్తామని ఇస్రో తెలిపింది. అయితే, ఆశించినట్లుగా అవి స్పందించలేదు.

చంద్రుడిపై విక్రమ్, ప్రజ్ఞాన్ లు ఉన్న ప్రదేశాలు

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, రోవర్ ప్రయాణించిన దూరాన్ని తెలిపే చిత్రం

మసకబారుతున్న అవకాశాలు..

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు చంద్రుడి మీద సూర్యకాంతిలో రెండు వారాలపాటు పనిచేసేలా రూపొందించామని తొలుత తెలిపింది. అయితే, బ్యాటరీలు రీఛార్జ్ అయితే, మళ్లీ చంద్రుడిపై సూర్యరశ్మి వచ్చిన తర్వాత వాటిని యాక్టివేట్ చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.

కానీ, ఊహించిన దానికి భిన్నంగా ల్యాండర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఈ విషయమై శాస్త్రవేత్తలను బీబీసీ సంపద్రిస్తే, సమయం గడిచేకొద్దీ అవి తిరిగి మేల్కొనే అవకాశాలు క్రమంగా మసకబారుతున్నట్లు వారు అభిప్రాయపడ్డారు.

ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్‌ను శుక్రవారం బీబీసీతో మాట్లాడుతూ, “ఇప్పటి వరకు విక్రమ్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. ఇక అవి యాక్టివేట్ అయ్యే అవకాశాలు తగ్గిపోయాయి” అన్నారు.

“చంద్రుడిపై ఉండే కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా విక్రమ్‌ను సిద్ధం చేశారు. కానీ రాత్రి సమయాన చంద్రుడిపై ఉష్ణోగ్రత -200 సెల్సియస్ నుంచి -250 సెల్సియస్‌లకు చేరతాయని తెలిపారు. ల్యాండర్ ఈ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపొందించినది కాదు” అని అన్నారు.

ఆదిత్య ఎల్-1

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఆదిత్య ఎల్-1 ప్రయోగం

ఆదిత్య ఎల్-1 పై దృష్టి

మొదటి చంద్రయాన్ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన అన్నాదురై స్పందిస్తూ..విక్రమ్‌ ల్యాండర్‌ను మేల్కొలిపే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. అయితే ఆ ప్రయత్నాలు తగ్గొచ్చని అన్నారు.

“ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొత్తం సమయమంతా దీనిపైనే వెచ్చించలేం. ఇప్పుడు సూర్యుడిపై అధ్యయనం చేసే లక్ష్యంతో తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్-1పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆదిత్య ఎల్-1 పరిణామాలపై ఎక్కువగా సమయం కేటాయించాల్సి ఉంటుంది” అన్నారు.

“ల్యాండర్, రోవర్‌లు మేల్కొనట్లేదన్న విషయాన్ని గ్రహించి, ముందుకు సాగాల్సి ఉంది” అన్నారు.

ఇస్రో తొలి నుంచి చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తూనే ఉంది.

రోవర్, ల్యాండర్‌లు తీసిన చిత్రాలు, సమాచారాన్ని పంచుకుంది. చంద్రయాన్ 3 నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసిందని కూడా ఇస్రో ప్రకటించింది.

“విక్రమ్ ల్యాండర్‌పై చేపట్టిన హాప్ ప్రయోగం అనేది లక్ష్యంలో భాగం కాదు. కానీ విక్రమ్ ఈ ప్రయోగాన్ని కూడా దాటింది. లక్ష్యాన్ని అధిగమించింది” అని చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరక్టర్ పి.వీరముత్తువేల్ చెప్పినట్లుగా ఇండియాటుడే కొన్నిరోజుల కిందట తెలిపింది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)