'గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో లేజర్ లైట్ చూశాక బతుకే చీకటైపోయింది... లేజర్ కిరణాలతో కంటిచూపు పోతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రాచి కులకర్ణి
- హోదా, బీబీసీ కోసం
ఇరవై మూడేళ్ల అనికేత్ షిగవాన్ ప్రతి సంవత్సరంలాగే సాయంత్రం 5:30 గంటలకు వినాయక నిమజ్జన ఊరేగింపు కోసం బయలుదేరాడు.
ఊరేగింపులో డ్యాన్స్ చేసిన తర్వాత, తన స్నేహితులతో కలిసి లక్ష్మీ వీధి వినాయకుడి నిమజ్జనంలోనూ స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేయాలనుకున్నాడు.
వినాయకుడి ఊరేగింపు కొనసాగుతోంది. ఆ ఊరేగింపులో అనికేత్ డ్యాన్స్ చేస్తూ లేజర్ లైట్ వైపు చూస్తుండగా అకస్మాత్తుగా అతని కళ్ల ముందు అంతా చీకటైపోయింది.

“గుంపులో ఉండడం వల్ల అలా జరిగిందనుకున్నా. స్నేహితుడితో కలిసి సమీపంలోని మందుల దుకాణానికి వెళ్లి మందులు కొనుక్కున్నా. అయినా కూడా కళ్లు కనిపించలేదు.
ఆ తర్వాత ఇంటికి వెళ్లి పడుకున్నా. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూస్తే నాకు కళ్లు సరిగ్గా కనిపించడం లేదు. దీంతో డాక్టర్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నా’’ అని అనికేత్ చెప్పారు.
"వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారు చెప్పింది విని నాకు భయమేసింది."
లేజర్ కిరణాలు అనికేత్ కళ్లలోకి చొచ్చుకెళ్లడంతో కంటి లోపల బ్లీడింగ్ అయింది. దీంతో అనికేత్ 70 శాతం చూపు కోల్పోయారు.
పుణెలోని పార్వతి ప్రాంతంలో తల్లిదండ్రులు, నానమ్మ, సోదరితో కలిసి అనికేత్ నివసిస్తున్నారు. పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆదరువుగా ఉంటున్నారు.
కంటి చూపు పోయిందని వినగానే కాళ్లకింద భూమి ఒక్కసారిగా కంపించింపోయింది.

లేజర్ వల్ల చూపు పోతుందా?
“అనికేత్‌తో పాటు ఇలాంటిదే మరో కేసు నా దగ్గరకు వచ్చింది. ఇద్దరి కళ్లకూ లేజర్ గాయాలయ్యాయి. లేజర్ కిరణాలు నేరుగా కంటిపై పడినప్పుడు కళ్లు మండుతాయి'' అని డాక్టర్ అనిల్ దుధ్భాటే బీబీసీతో చెప్పారు.
''సాధారణంగా లేజర్‌ను మనం సర్జరీల్లో ఉపయోగిస్తాం. సర్జరీల్లో వాడే లేజర్లకు అనుమతులు అవసరం. అయితే, ఇక్కడ ఎలాంటి ఫిల్టర్ వాడకపోవడంతో ఇలా జరిగింది. అతన్ని చూస్తే బాధగా ఉంది'' అన్నారు.
అనికేత్ ఒక కన్ను పూర్తిగా కనిపించడం లేదు. మరో కంట్లో నుంచి బ్లీడింగ్ అవుతుండడంతో అస్పష్టంగా ఉంది. చికిత్స అందిస్తున్నామని, కంటిచూపు సాధారణ స్థితికి వచ్చేందుకు ఏడురోజుల వరకూ పడుతుందని డాక్టర్ చెబుతున్నారు. అయినా కంటిచూపు మెరుగవకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
అయినప్పటికీ కంటిచూపు 20 నుంచి 30 శాతం మందగించే అవకాశం ఉంది. దీంంతో మూడు భయాలు అనికేత్‌ను వెంటాడుతున్నాయి. సర్జరీకి అయ్యే ఖర్చు, ఉద్యోగం, భవిష్యత్తు పరిస్థితి తలుచుకుని ఆందోళన చెందుతున్నారు.

చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేవు
''ఈ లైట్లు ఇప్పుడు మార్కెట్‌లో సులువుగా దొరుకుతున్నాయి. కానీ లైటింగ్ వేసేవాళ్లు కొత్తవాటిని కొనేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో ఇలా కళ్లకు గాయాలైన ఘటనలు జరగలేదు. ఈ లైట్లు వాడకూడదని, వీటి వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని, ఊరేగింపుల్లో వాడాలంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని మేం ముందే హెచ్చరిస్తాం'' అని సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ జనరేటర్స్ అసోసియేషన్ బబ్లూ రంజాని చెప్పారు.
ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే, ఈ లైటింగ్ విషయంలో చర్యలు తీసుకునేందుకు చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేవు.
''ఎయిర్‌పోర్ట్ ఏరియాలో మాత్రమే లేజర్స్‌పై ఆంక్షలు ఉన్నాయి. వేరే ఏ ప్రాంతాల్లోనూ ఆంక్షలు లేవు. చట్టంలోనూ అలాంటి ప్రస్తావన లేదు.
ఎవరికైనా, ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి బాధ్యుడైన వ్యక్తిపై కేసు నమోదు చేయొచ్చు. అదే దీనికీ వర్తిస్తుంది.
శబ్దాల విషయంలో కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయి'' అని పుణె పోలీస్ స్పెషల్ బ్రాంచి డిప్యూటీ కమిషనర్ ఆర్ రాజా బీబీసీతో చెప్పారు.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఊరేగింపుల్లో లేజర్ లైట్ల వినియోగంపై ఆంక్షలు విధించాలని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు డిమాంగ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో లేదో వేచిచూడాలి.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గాజా దాడులను పసిగట్టడంలో ఎలా విఫలమైంది?
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- తాజ్ మహల్: షాజహాన్ అమర ప్రేమకథలో ట్విస్టు.. ముంతాజ్ మహల్‌తో నిశ్చితార్థం, మరో యువరాణితో పెళ్లి
- ఇజ్రాయెల్-గాజా: హమాస్ అంటే ఏంటి? కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














