మెటావర్స్: లక్షల కోట్ల రూపాయల నష్టానికి జుకర్‌బర్గ్ ఐడియాలే కారణమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ క్లేటన్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
ChatGPT ఆవిష్కరణకు ముందు టెక్ ప్రపంచం ఒక పూర్తి భిన్నమైన అంశం గురించి ఎక్కువగా మాట్లాడుకునేది.
మీకు Metaverse గుర్తుందా?
కొన్నాళ్ల క్రితం వార్తలన్నీ దీని చుట్టూనే తిరిగేవి. మనల్ని మైమరపించే, కళ్లు తిప్పుకోనివ్వని వర్చువల్ రియాలిటీ గురించి వాటిలో మాట్లాడుకునేవారు. మన సమయం మొత్తం దానిపైనే గడిపేలా ఆ వీఆర్( వర్చువల్ రియాలిటీ) ఉంటుందని వార్తల్లో రాసుకొచ్చారు.
ఈ Metaverse కథ మొత్తం మార్క్ జుకర్‌బర్గ్ చుట్టూ తిరిగేది.
దిగ్గజ టెక్ బిలియనీర్లలో ఒకరైన జుకర్‌బర్గ్ Metaverseపై చాలా ఆశలు పెట్టుకున్నారు. 2021 అక్టోబరులో Facebook పేరును కూడా ఆయన Metaగా మార్చారంటే దీనిపై ఆయనకు ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
‘‘ప్రస్తుత క్షణాలను అద్భుతంగా ఆస్వాదించేలా మెటావర్స్ మీకు దారి చూపిస్తుంది’’ అని పేరు మార్చే కార్యక్రమంలో జుకర్‌బర్గ్ చెప్పారు.
‘‘వేరొక వ్యక్తితో మనసుకు నచ్చినట్లు ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేలా చేయడమనేది సోషల్ టెక్నాలజీ అంతిమ లక్ష్యం. అందుకే మేం ఆ దిశగా కృషి చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
‘‘మెటావర్స్‌లో మీరు కలగన్న ప్రతిదాన్నీ నిజం చేసుకోవచ్చు. ఏదైనా చేసేలా మీకు ఇది సాయం చేస్తుంది’’ అని ఆయన చెప్పారు.
అయితే, ఈ విషయంలో ఆయన పట్టుదలతో పనిచేయలేదని ఎవరూ అనరు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, రెండేళ్ల తర్వాత జుకర్‌బర్గ్ లక్ష్యం గాడి తప్పినట్లుగా అనిపిస్తోంది.
గత ఏప్రిల్‌లో ఈ ఆలోచనను పక్కన పెట్టేయలేదని ఆయన చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
‘‘మెటావర్స్ నుంచి మేం దూరం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో ఎలాంటి నిజమూ లేదు’’ అని గత ఏప్రిల్‌లో ఇన్వెస్టర్లతో ఆయన చెప్పారు.
‘మెటా కనెక్ట్’ పేరుతో వార్షిక వర్చువల్ రియాలిటీ ఈవెంట్‌ను మెటా నిర్వహిస్తోంది.
మంచి లాభాలు తెచ్చిపెట్టే సోషల్ మీడియా రంగం నుంచి తమ దృష్టిని అసలు లాభాలే రాని వర్చువల్ రియాలిటీ దిశగా ఎందుకు మరలిస్తున్నారో ఇన్వెస్టర్లకు, ప్రజలకు చెప్పేందుకు ఇది ఆయనకు ఒక మంచి అవకాశం లాంటిది.
అసలు వర్చువల్ రియాలిటీతో లాభాలే రావడం లేదా? మెటా తాజా గణాంకాలు చూస్తే పరిస్థితి అలానే కనిపిస్తోంది.
మెటా వర్చువల్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ బ్రాంచ్ Reality Labs ఒక ఏడాదిలో 21 బిలియన్ డాలర్లు (1.74 లక్షల కోట్లు) సంపదను ఆవిరి చేసింది.
అయితే, వీటిలో కొంత దీర్ఘకాలిక పెట్టుబడిగా మెటా భావిస్తోంది. అంటే స్వల్ప కాలంలో ఎలాంటి ఫలితాలు కనిపించకపోవచ్చు. కానీ, ఇక్కడ ఆందోళనకు గురిచేసే అంశం ఏమిటంటే.. కోట్లు కుమ్మరిస్తున్నా ఫలితం కనిపిస్తుందని ఎలాంటి సంకేతాలు రావడం లేదు.
మెటా తీసుకొచ్చిన కొత్త గేమ్ Horizon Worlds. కంపెనీ చెబుతున్న మెటావర్స్‌కు ఇది కొంత దగ్గరగా ఉంటుంది.
దీనిలో నెటిజిన్లు సరదాగా గడిపేందుకు వర్చువల్ కెఫేలు, కామెడీ క్లబ్స్, నైట్ క్లబ్స్, బాస్కెట్‌బాల్ కోర్టులకు వెళ్లొచ్చు. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.
నెలకు 3,00,000 మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నట్లు మెటా చెబుతోంది. అయితే, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని బిలియన్ల నెటిజన్లకు దీనితో అసలు పోలికే లేదు.
నిజానికి దీనిపై గేమ్స్ ఆడేవారిని గమనిస్తే ఆ సంఖ్య మరింత తక్కువగా కనిపిస్తుంది.
దీని కింద రివ్యూలలో ‘అన్నీ గాలి మాటలే’, ‘సరదా గడిపేందుకు ఇది సరిపోదు’ లాంటి రివ్యూలు కనిపిస్తున్నాయి. దీనిపై గేమ్స్ ఆడేవారిలో పిల్లలే ఎక్కువమంది ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్నింటికంటే పెద్ద సమస్య దీని లుక్స్. 2006నాటి Nintendo Wii గేమ్ తరహా గ్రాఫిక్స్ దీనిలో కనిపిస్తున్నాయి. అసలు జుకర్‌బర్గ్ చెప్పిన ఆ వర్చువల్ రియాలిటీ అనుభూతికి దీనికి అసలు సంబంధమే లేనట్లు కనిపిస్తుందని విమర్శకులు చెబుతున్నారు.
ఇక మెటా వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్స్ విషయానికి వస్తే, ఇప్పటివరకూ 2 కోట్ల వరకూ యూనిట్లను విక్రయించినట్లు ద వెర్జ్ వెబ్‌సైట్ ఒక కథనం ప్రచురించింది. అయితే, ఇవి మరీ అంత చెత్తగా ఏమీలేవు. Quest 2 హెడ్‌సెట్‌కు విమర్శకుల నుంచి మంచి రివ్యూలే వచ్చాయి.
అయితే, మొత్తంగా చూసుకుంటే దీనికంటే మెరుగ్గా పనిచేస్తున్న హెడ్‌సెట్లు మార్కెట్‌లో చాలా ఉన్నాయి.
ఉదాహరణకు సోనీ ప్లే స్టేషన్ 5ను తీసుకోండి. ఇవి 4 కోట్లకుపైనే అమ్ముడుపోయాయి.
అయితే, ఇక్కడ గేమ్ లేదా హెడ్‌సెట్ పనితీరుతో జుకర్‌బర్గ్ విజయాన్ని పోల్చలేం. ఎందుకంటే మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా పనిచేస్తున్నాం, ఒకరితో మరొకరం ఎలా మాట్లాడుతున్నాం.. ఇలా అన్నింటిలోనూ ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు.
సూటిగా చెప్పాలంటే వర్చువల్ రియాలిటీ ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉంది. ఇది కేవలం ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుకోవడానికే పరిమితం కాదు. అలానే ఖాళీ సమయంలో సరదాగా గడిపే విధానమూ కాదు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘అసలు డబ్బు మొత్తాన్ని ఎందుకు అలా ఖర్చుపెడుతున్నారు? నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పగలరా?’’ అని గత ఇన్వెస్టర్ల సమావేశంలో ఒక వ్యక్తి జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు.
‘‘మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది. నేను సరైన మార్గంలోనే ముందుకు వెళ్తున్నానని కచ్చితంగా చెప్పలేను. కానీ, ప్రపంచం ఈ దిశగానే ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను’’ అని ఆనాడు జుకర్‌బర్గ్ చెప్పారు.
ఈ వారం సమావేశంలో మెటా కొత్త హెడ్‌సెట్ Quest 3, Horizon Worlds లపై ప్రకటనలు చేయొచ్చు. కొత్త ఏఐ టెక్నాలజీలనూ ఆవిష్కరించొచ్చు.
భవిష్యత్‌లో మెటావర్స్ గురించి ఆయన ఇంకా మాట్లాడొచ్చు. ఎందుకంటే అసలైన మెటావర్స్ ఎలా ఉంటుందో ఇప్పటివరకూ చూపించలేదు.
దీనిపై జుకర్‌బర్గ్ చాలా ఆశలు పెట్టురకున్నారు. ఇవి మెటా చెక్‌బుక్ రూపంలో మనకు కనిపిస్తున్నాయి. గత జులై సమావేశంలోనే రియాలిటీ ల్యాబ్ వచ్చే ఏడాది మరిన్ని నష్టాలు చవిచూడొచ్చనే సంకేతాలు ఇచ్చారు.
మెటావర్స్‌కు ప్రాణం పోసేందుకు మెటా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే, చాలావరకు మిగతా టెక్ ప్రపంచం ఇప్పటికే దీన్ని దాటుకుని ముందుకు వెళ్లిపోయింది.
ఇవి కూడా చదవండి:
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















