క్రికెట్ ప్రపంచ కప్ 2023: సొంతగడ్డపై అభిమానుల కేరింతలతో భారత్ మరోసారి వరల్డ్ కప్ గెలుస్తుందా?

2011 వరల్డ్ కప్ గెలిచిన భారత్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సురేష్ మీనన్
    • హోదా, స్పోర్ట్స్ రైటర్

2023 క్రికెట్ ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకోగలదా?

ఈ ప్రశ్నకు 'అవును, వాళ్లు తప్పకుండా గెలవగలరు' అనే సమాధానం వినిపిస్తోంది.

ప్రపంచంలోని ఉత్తమ జట్లలో ఒకటి భారత్. అందులోనూ సొంతగడ్డపై ఆడబోతున్నారు. ఇటీవల టీమిండియా మంచి ఫామ్‌లో కూడా ఉంది. ప్రపంచంలోని 9 ఉత్తమ జట్లలో అయిదు జట్లు పాల్గొన్న ఆసియా కప్‌ను కూడా సొంతం చేసుకుంది.

అయితే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి ఇతర జట్లకు కూడా ప్రపంచ కప్ గెలుచుకునే అవకాశాలు సమానంగానే ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఇప్పటి వరకూ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోలేకపోయాయి.

1983లో మొదటిసారి ప్రపంచ కప్ గెలుచుకున్న నాటి నుంచి, ఇప్పుడు స్వదేశంలో వరల్డ్ కప్ పోటీల వరకూ భారత్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంటూనే వస్తోంది. అయితే, సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు అదనపు ఒత్తిడి ఉంటుందంటూ 1987లో ఒక సీనియర్ ఆటగాడు సంప్రదాయ ఆలోచనలను తల్లకిందులు చేశాడు.

అర్థం చేసుకోలేని ప్రేక్షకుల మితిమీరిన అంచనాల్లో వాస్తవ పరిస్థితులు కొట్టుకుపోతాయనే వాదనలు కూడా వచ్చాయి.

చివరికి, సెమీఫైనల్స్‌లోనే భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

సచిన్ తెందూల్కర్ ఆడిన చివరి ప్రపంచ కప్

ఫొటో సోర్స్, Getty Images

నిలకడ ముఖ్యం

అయితే, 2011 ప్రపంచ కప్‌లో అలా జరగలేదు. ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్సర్‌తో సొంతగడ్డపై భారత్ మరోసారి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది.

1983, 2011ల మధ్య 2003లో సౌతాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్‌లో భారత్‌ కుప్పకూలింది.

ఇప్పుడు 2011 తరహాలో భారత్ మరోసారి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంటుందన్న అంచనాలు పెరిగిపోయాయి.

అయితే, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని విచిత్రమైన టోర్నమెంట్ ప్రపంచ కప్. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లు దాదాపు ఆరువారాల పాటు సాగే మ్యాచుల్లో రాణించాల్సి ఉంటుంది. ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న పది జట్లు ప్రతి ఒక్క జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ తొలి మ్యాచుల్లో ఓడిపోయినా అదేమీ పెద్ద విషయం కాబోదు.

1992లో సరిగ్గా అలాగే జరిగింది. ఎలిమినేట్‌ అయ్యే దశలో ఉన్న పాకిస్తాన్ జట్టు, కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో తిరగబడిన పులుల్లా విజృంభించి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది.

ప్రపంచ కప్ పోటీల్లో జట్టు నిలకడగా రాణించడం చాలా ముఖ్యం. 2003లో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో భారత్ తరహాలో ఒక జట్టు ముందు బాగా ఆడి, తర్వాత ఓడిపోవచ్చు కూడా. అందువల్ల నిలకడగా రాణించడం అవసరం.

తమ ఆటగాళ్లను దృఢంగా, సిద్ధంగా ఉంచడం కోచ్‌లకు ఎదురయ్యే అతిపెద్ద సవాల్. ఒక్కో ఆటగాడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సరైన సమయంలో, సరైన ఆటగాడిని ఉపయోగించుకునేలా ప్రపంచ కప్ పోటీలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

ఆసియా కప్ మ్యాచుల్లో పాకిస్తాన్‌పై ఏకంగా 350కిగా పైగా పరుగులు చేయడం, ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 50 పరుగులకే శ్రీలంకను మట్టికరిపించడంతో ప్రపంచ కప్‌లో భారత్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

గాయాలపాలైన ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు కోలుకుని మళ్లీ జట్టులోకి రావడం, గాడిలో పడడం కూడా భారత్‌కు సంతోషం కలిగించే విషయం. ప్రారంభంలోనే కీలక వికెట్లను పడగొడుతూ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అత్యుత్తమ బౌలింగ్‌తో రాణిస్తున్నాడు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడబోతున్నట్టు కేవలం ఐదు నిమిషాల ముందు చెప్పినప్పటికీ, సెంచరీతో అదరగొట్టాడు కేఎల్ రాహుల్. సాధారణంగా చేసే పొరపాట్లను అధిగమించి వికెట్లను కాపాడుకున్నాడు.

2013 ప్రపంచ కఫ్ ఫేవరెట్‌గా టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

అదొక్కటే వెలితి..

యువఆటగాళ్లు సైతం ఉత్తమంగా రాణించారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే, ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఇషాన్ కిషన్‌కి ఉంది. 2011 ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఒకే ఒక్క ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టన్నింగ్ సెంచరీ చేశాడు.

అయితే, బ్యాట్స్‌మెన్లలో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలిగిన వారు లేకపోవడం ఒక వెలితిగా చెప్పొచ్చు. ప్రపంచ కప్ మ్యాచ్‌లో అలాంటి వారు అవసరమయ్యే అవకాశం ఉంది.

అలాగే కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్‌ టెక్నిక్‌లో కొద్దిగా మార్పులు చేశాడు. కొద్దిగా దూరం నుంచి, బంతిని వేగంగా వేయడం అతనికి బాగా కలిసొస్తోంది.

సుమారు ఆరుగురు నుంచి ఏడుగురు బౌలింగ్ చేయగలిగే ఆటగాళ్లు ఉండేలా చూసుకున్న జట్లు ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో ముందున్నాయి. 1996 నాటి శ్రీలంక జట్టు అందుకు ఉదాహరణ. మ్యాచ్‌లో ఎవరైనా బౌలర్ ఫామ్‌ కొనసాగించలేకపోయినా, లేదా మ్యాచ్‌లో గాయపడినా మరొకరు బౌలింగ్ వేయగలిగేలా ఉండడం ఉత్తమం.

భారత్‌ విజయం సాధించాలంటే ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్, ఐదుగురూ బౌలర్లూ నిలకడగా రాణించాలి. అందువల్ల జట్టు ఎంపిక అత్యంత కీలకం. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌ కూడా కీలకమే. అవసరమైతే టోర్నమెంట్ పొడవునా బౌలింగ్ చేసేలా ఫిట్‌గా ఉండాలి.

క్రికెట్‌లో వెస్టిండీస్ హవా కొనసాగిన రోజుల్లోనూ, 1975 నుంచి మొదటి మూడు ప్రపంచ కప్‌ల వరకూ ఏ జట్టూ టైటిల్ ఫేవరెట్‌గా ఉండేది కాదు. ఈ శతాబ్దం తొలినాళ్లలో ఆస్ట్రేలియా వరుసగా మూడుసార్లు ప్రపంచ కప్ నెగ్గినా అలాంటి పరిస్థితే ఉండేది.

ప్రపంచ కప్ పోటీలకు ఉన్న ప్రత్యేకత అదే. గత మూడు సీజన్లలో మూడు దేశాలు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)