నోబెల్ పురస్కారం - ఎకనామిక్స్: మహిళల ఉద్యోగాలు, జీతాల్లో వివక్షపై పరిశోధన చేసిన అమెరికన్ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌

నోబెల్ ప్రైజ్

ఫొటో సోర్స్, HARVARD UNIVERSITY

ఫొటో క్యాప్షన్, క్లాడియా గోల్డిన్
    • రచయిత, లూసీ హూకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆర్ధిక రంగంలో అమెరికాకు చెందిన ఎకనామిక్ హిస్టారియన్ (ఆర్ధిక చరిత్రకారిణి) క్లాడియా గోల్డిన్‌కు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ లభించింది.

మహిళలకు ఉద్యోగాలు, వేతనాల రంగంలో ఆమె చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది.

వేతనాల విషయంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాకు కారణాలపై ప్రొఫెసర్ గోల్డిన్ చేసిన పరిశోధన అనేక కీలక అంశాలను వెల్లడించిందని రాయల్ స్వీడిష్ అకాడెమీ తెలిపింది.

ఆర్ధిక రంగంలో నోబెల్ బహుమతి అందుకున్న మూడో మహిళ గోల్డిన్. అలాగే మరొక వ్యక్తితో కలిసి కాకుండా సింగిల్‌గా ఈ అవార్డు అందుకున్న మొదటి మహిళ ఆమెనే.

ప్రస్తుతం గోల్డిన్ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో లేబర్ మార్కెట్ హిస్టరీ సబ్జెక్టును బోధిస్తున్నారు.

నోబెల్ ప్రైజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళలు, పురుషుల వేతనాలలో అంతరాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి

లేబర్ మార్కెట్‌పై విస్తృత పరిశోధన

అమెరికా లేబర్ మార్కెట్‌లో లింగ అసమానతలు సంబంధించి గోల్డిన్ 200 సంవత్సరాల డేటాను పరిశీలించారని, ఈ కాలంలో స్త్రీ పురుషుల ఉద్యోగావకాశాలు, వేతనాలలో వచ్చిన మార్పులను ఆమె విశ్లేషించారని రాయల్ స్వీడిష్ అకాడెమీ వెల్లడించింది.

‘‘మహిళల లేబర్ మార్కెట్‌పై మనకున్న అవగాహనను ఆమె పరిశోధన మరింత విస్తృతం చేస్తుంది’’ అని అకాడెమీ పేర్కొంది.

‘‘ఈ ఏడాది ఎకనామిక్స్‌లో నోబెల్ బహుమతి పొందిన క్లాడియా గోల్డిన్, కొన్ని శతాబ్ధాలుగా అమెరికా ఉద్యోగాలలో మహిళల సంపాదనకు సంబంధించి సమగ్రమైన సమాచారం అందించారు’’ అని నోబెల్ ప్రైజ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

‘‘ఉద్యోగాల విషయంలో స్త్రీ పురుష అసమానతలలో క్రమానుగతంగా వచ్చిన మార్పులకు కారణాలను వివరించడమే కాక, ఇంకా కొన్ని అసమానతలు కొనసాగడానికిగల కారణాలను ఆమె పరిశోధన వివరిస్తుంది’’ అని అకాడెమీ పేర్కొంది.

1800 సంవత్సరం తర్వాత వచ్చిన పారిశ్రామికీకరణ సమయంతో వివాహం అయిన మహిళలు చాలా తక్కువమంది ఉద్యోగాలలో చేరేవారని, కానీ 1900 సంవత్సరాల తర్వాత ఈ సంఖ్యలో పెరుగుదల ఉందని ఆమె పరిశోధన తేల్చింది.

మహిళలకు చదువుకునే అవకాశాలు పెరగడం, గర్భనిరోధక మాత్రలు ఈ మార్పుకు కారణమని, అయితేే వేతనాలలో అసమానతలు మాత్రం అలాగే కొనసాగాయని ఆమె పరిశోధనలు పేర్కొన్నాయి.

విద్యార్హతల కారణంగా గతంలో మహిళలకు తక్కువ వేతనాలు ఉండేవని, కానీ నేటి కాలంలో సంతానం కారణంగా వేతన వివక్ష కొనసాగుతోందని ప్రొఫెసర్ గోల్డిన్ పరిశోధన తేల్చింది.

‘‘క్లాడియా గోల్డిన్ పరిశోధనల ప్రభావం మన సమాజం మీద ఎంతో ఉంది’’ అని నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యులలో ఒకరైన రాండి జల్మార్సన్ అన్నారు.

‘‘ఈ సమస్య తీవ్రతను, లింగ వివక్షలో చారిత్రకంగా వచ్చిన మార్పులను ఆమె పరిశోధన వివరిస్తోంది’’ అని జల్మార్సన్ అన్నారు.

గోల్డిన్‌ను ఒక డిటెక్టివ్‌‌గా అభివర్ణించిన ప్రొఫెసర్ జల్మార్సన్, ఆమె పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా విధాన రూపకర్తలకు ఉపయోగపడతాయని జల్మార్సన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, పెరిగిన ఖర్చులకు సరిపడా వస్తున్న జీతం చాలకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం కనుక్కున్న మౌనిక

కొనసాగుతున్న అసమానతలు

ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో 50 శాతం మంది పనిలో ఉండగా, పురుషులలో 80 శాతంమంది పని చేస్తున్నారు. అయితే, పురుషులకన్నా తక్కువ వేతనాలు పొందుతుండటమే కాకుండా, కెరీర్‌లో వారు ఉన్నత స్థానాలకు చేరుకోవడం చాలా కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయని నోబెల్ ప్రైజ్ కమిటీ వ్యాఖ్యానించింది.

1989లో ప్రొఫెసర్ ఉద్యోగం పొందిన గోల్డిన్, హార్వార్డ్ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్లో ఆ పదవిని స్వీకరించిన తొలి మహిళ. ఎకనామిక్స్ అనేది మహిళలకు సరిపడని వ్యవహారమన్న అభిప్రాయం ఉందని 2018లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోల్డిన్ వ్యాఖ్యానించారు.

‘‘కాలేజీలో ప్రవేశించిన విద్యార్ధులు కూడా ఎకనామిక్స్‌కు ఒక మహిళా ప్రొఫెసర్ ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఎకనామిక్స్ అనేది మహిళలకంటే పురుషులకే సరైన కెరీర్‌గా వారు భావిస్తారు.’’ అని అన్నారామె

2009 సంవత్సరంలో ఎలినార్ ఒస్ట్రామ్ అనే మహిళ తొలిసారి ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. ఆ ఏడాది ఆమె ఆలివర్ విలియమ్‌సన్‌తో సంయుక్తంగా ఆమెకు ఈ అవార్డు లభించింది.

2019లో ఎస్టేర్ డూఫ్లో తన భర్త అభిజిత్ బెనర్జీ, మైఖెల్ క్రెమర్‌లతో కలిసి ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్ పొందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)