గాజాలో కరెంటు కోత: ‘వెలిగించడానికి కొవ్వొత్తులు కూడా లేవు, ఈ చీకటిలో ఎలా బతకాలి’

ఫొటో సోర్స్, BBC / Adnan Al Bursch
- రచయిత, అద్నాన్ అల్ బుర్ష్, ఈథర్ శాలబీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పాలస్తీనాకు చెందిన ఫాత్మా అలీ (36) జబాలియాలోని ఉత్తర ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో చీకటిలో రోజు గడపడం కష్టమవుతోందని ఆమె అంటున్నారు.
"గాజా ఇప్పుడు పూర్తిగా అంధకారంలో ఉంది" అని ఫాత్మా చెబుతుండగానే ఇజ్రాయెలీ రాకెట్లు భవనాలపైకి దూసుకుపోతున్నాయి.
“కొవ్వొత్తులు కూడా లేవు. దుకాణాలు మూసేశారు. మా వద్ద ఉన్నది చిన్న LED టార్చ్ మాత్రమే. ఇది 5 గంటలే పనిచేస్తుంది” అని ఫాత్మా చెబుతుండగా ఆమె గొంతు వణుకుతోంది.
బీబీసీకి చెందిన అద్నాన్ అల్ బుర్ష్ బుధవారం సాయంత్రం గాజా చీకటిలో ఒక ఫోటో తీశారు.

ఫొటో సోర్స్, BBC / Adnan Al Bursch
అమానవీయం
అక్టోబర్ 9న గాజాను ముట్టడించింది ఇజ్రాయెల్. రెండు రోజుల తర్వాత మొత్తం స్ట్రిప్‌లో విద్యుత్తు నిలిపివేశారు.
ఇది చాలా అమానవీయమైన పరిస్థితి అని అంటున్నారు ఫాత్మా. కరెంటు లేకపోవడం వల్ల నీటి సరఫరా ఉండదని ఆమె భయపడుతున్నారు.
ఇజ్రాయెల్ దాడికి ముందు నిల్వ చేసిన రెండు చిన్న బారెల్స్ నీటినే ఫాత్మా , ఆమె వృద్ధ తల్లిదండ్రులు వాడుతున్నారు.
"విద్యుత్ లేకపోవడం వల్ల ఆహారం భద్రపరిచే వీలు లేకుండా పోయింది. ఫ్రిడ్జ్‌లోని ఆహారం పూర్తిగా పాడైపోయింది. డస్ట్‌బిన్‌లో పడేశాం" అని ఆమె తెలిపారు.
ఇస్లాం ఆచారం ప్రకారం రోజు ఐదుసార్లు ప్రార్థన చేయడానికి తాము శరీరాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందని, ఇప్పుడది కష్టంగా మారిందని ఫాత్మా ఆవేదన చెందుతున్నారు.
పవర్ కట్ కారణంగా ఫాత్మాతో పాటు ఆమె పొరుగింటివారు కూడా ఆహారం, నీటిని పొదుపుగా వాడుతున్నారు.
"యుద్ధం ప్రారంభానికి ముందు మా వద్ద ఉన్న కొద్దిపాటి స్టాక్ తప్ప ఇప్పుడు ఆహారం లేదు. మేం జాతార్ (మూలికలతో చేసిన పదార్ధం ) , కొన్ని ఆలివ్‌లపై మాత్రమే ఆధారపడతాం'' అని ఫాత్మా అన్నారు.
పిల్లల విషయంలో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇదే భవనంలో ఉండే తమ పిల్లలు సంతోషంగా ఆడుకునే పరిస్థితి ఇపుడు లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో జనరేటర్లు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో అంధకారంలోనే ఉందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, BBC / Adnan Al Bursch
దుస్తులు, దుప్పట్లు దొరికితే అదృష్టవంతులే
బీబీసీ ప్రతినిధి ఈశాన్య గాజాలోని జబాలియాలో రద్దీగా ఉండే శరణార్థుల శిబిరానికి వెళ్లినప్పుడు, అక్కడి ప్రజలు ధ్వంసమైన ఇళ్ల నుంచి బయటికి వెళ్లిపోతున్నారు.
ఆ సమయంలో దుప్పట్లు లేదా దుస్తులు దొరికితే వాళ్లు అదృష్టవంతులే. శిబిరంలో జీవితం దాదాపు అసాధ్యంలా కనిపిస్తోంది. ఎందుకంటే పదేపదే దాడులకు గురైన ప్రాంతమది.
జబాలియా శరణార్థి శిబిరంలో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.
"మాకు తాగడానికి నీరు, ఆహారం, సరైన గాలి కూడా లేదు. ఇదేం జీవితం?" అని శిబిరం మధ్యలో ఒక వ్యక్తి ఏడుస్తూ అన్నాడు.
అతని పక్కన నిలబడి ఉన్న మరో వ్యక్తి, "ఇది మామూలు యుద్ధం కాదు. సర్వ నాశనం చేసే యుద్ధం" అని అరుస్తున్నారు. శిబిరంలోని పాలస్తీనియన్ల పరిస్థితి భయంకరంగా ఉందని వారంటున్నారు.
డెబ్బైల వయస్సులో ఉన్న పాలస్తీనియన్ అబూ సక్ర్ అబూ రోక్బా తన ముగ్గురు పిల్లలను కోల్పోయారు.
అతను తన పరిస్థితిని బీబీసీ ప్రతినిధికి వివరిస్తూ ఏడుస్తున్నారు.
“నా కుటుంబం మొత్తాన్ని కోల్పోయా. నా పిల్లల అంత్యక్రియలకు శ్మశానానికి వెళ్లి వచ్చేలోగానే నా ఇల్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, BBC / Adnan Al Bursch
ప్రతిరోజూ దాడులే
జబాలియా శరణార్థి శిబిరంలోని భవనాలపై ఇజ్రాయెల్ క్షిపణులు బాంబు దాడి చేశాయి. శిబిరంలో ఉన్న వారిలో కొందరు కొన్నిరోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు.
గాజా స్ట్రిప్ ఈశాన్య అంచున ఉన్న బీట్ హనౌన్ నుంచి వచ్చామని, జబాలియాలో పరిస్థితి దారుణంగా ఉందని లైలా (పేరు మార్చాం) అన్నారు.
''మా ప్రాంతంలో ప్రతిరోజూ దాడులే. నా భర్త, కొడుకు చనిపోయారు. నా మిగిలిన పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు" అని ఆమె ఏడుస్తూ బీబీసీ ప్రతినిధికి చెప్పారు.
బతకడానికి తమ దగ్గరున్న కొద్దిపాటి ఆహారం, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడుతున్నామని శిబిరం వద్దకు వచ్చిన నిరాశ్రయులు తెలిపారు .
వారం ఆహారం నిల్వలు అయిపోవచ్చనని వారు బీబీసీకి చెప్పారు. ఇక నీటి కోసం సమీపంలోని బావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వారిది.

ఫొటో సోర్స్, BBC / Adnan Al Bursch
గన్ పౌడర్, అనారోగ్యం
కరెంట్ లేకపోవడంతో జనరేటర్లకు ఇంధనం కష్టతరంగా మారుతోంది. ఒకప్పుడు జబాలియా శరణార్థి శిబిరంలో ఏళ్లుగా ఉంటున్న వారికి ఇపుడు అక్కడ ఆశ్రయం లేదు.
ఆకాశంలో నల్లటి పొగ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గన్ పౌడర్ వాసనతోనే తమ రోజు ప్రారంభమవుతోందని చాలామంది అంటున్నారు.
మరోవైపు వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు విద్యుత్తు లేకుండా నడవవు. జబాలియా శరణార్థి శిబిరం వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. వీటన్నింటి వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు.
పాలస్తీనా శరణార్థుల కోసం ఒకప్పుడు యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) పాఠశాల తరగతి గదులలో శిబిరాలు ఏర్పాటుచేసేది.
ఇపుడు వాటిలోనే నిరాశ్రయలు ఆశ్రయం పొందుతున్నారు. అయితే, ఇపుడది కిక్కిరిసి పోయింది.
ముప్ఫై ఏళ్ల వయస్సులో ఉన్న ఒక వ్యక్తి తన కుటుంబానికి ఆశ్రయం కల్పించేందుకు అక్కడ టెంట్ వేసుకుంటున్నారు.
“శిబిరం కోసం నైలాన్, ప్లాస్టిక్, కలపను సేకరించాను. ఇక్కడ అందరికీ స్థలం లేదు” అని ఆయన తను సొంతంగా నిర్మించుకున్న ఆశ్రయాన్ని చూపిస్తూ చెప్పారు.
అదే సమయంలో ఊపిరాడక బాధపడుతున్న బాలుడితో ఓ వ్యక్తి అంబులెన్స్ వైపు పరుగెత్తుతున్నాడు.

ఫొటో సోర్స్, BBC / Adnan Al Bursch
'పిల్లలకు ఊపిరాడటం లేదు'
సరిగ్గా పాఠశాల ముందు ఒక వ్యక్తి చిన్న పిల్లవాడిని అంబులెన్స్‌లోకి తీసుకెళుతున్నారు. పారామెడిక్ ఆ బిడ్డను తీసుకున్నారు.
బాంబు పేలుళ్ల వల్ల కలిగే పొగ, ధూళి కారణంగా ఊపిరాడకుండా బాధపడుతున్న పిల్లలు, మహిళల కోసం వైద్యం అందిస్తున్నామని ఆయన బీబీసీతో తెలిపారు.
అత్యవసర సేవలుండటంతో చాలామంది చిన్నారులు, మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నారని అక్కడి వైద్యుడు అంటున్నారు.
విద్యుత్ కోతలు ఆసుపత్రులకు ఇబ్బందికరంగా మారాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
38 మంది పిల్లలతో సహా డయాలసిస్ చేయాల్సిన 1,100 మంది కిడ్నీ రోగుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది.
100 మంది శిశువులున్న ఇంక్యుబేటర్లకు ఇకపై విద్యుత్తును అందించలేమని మంత్రిత్వ శాఖ చెప్పింది.
ఇవి కూడా చదవండి
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














