బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసే లోన్ యాప్‌‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?

భూమి సిన్హా
ఫొటో క్యాప్షన్, భూమి సిన్హా
    • రచయిత, పూనం అగర్వాల్, నుపుర్ సొనార్, స్టీఫెన్ హెగార్తీ
    • హోదా, బీబీసీ ఐ పరిశోధన

లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఏషియాల్లోని దేశాలతో పాటు భారత్‌లోని ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు రుణాలు అవసరమైన వారికి ఉచ్చు వేసి, వారికి అప్పులిచ్చిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తున్న పెద్ద కుంభకోణం ఇది.

లోన్ యాప్‌ల కోసం పని చేస్తున్న రికవరీ ఏజెంట్ల తిట్లు, వేధింపులు భరించలేక దాదాపు 60 మంది భారతీయులు ప్రాణాలు తీసుకున్నారు. చైనా, భారత్‌లో ఉంటూ ఈ కుంభకోణం ద్వారా లాభం పొందుతున్న కొంతమంది చీకటి జీవితాలను బీబీసీ అండర్ కవర్ ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి తెచ్చింది.

“మీ అమ్మని ఇంట్లో నుంచి వెళ్లనివ్వద్దు” అంటూ ఆస్తా సిన్హా అత్త ఫోన్‌లో అరుస్తూ ఉండటంతో ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది.

నిద్రమత్తులోనే ఆమె పక్కగదిలోకి వెళ్లింది. అక్కడ ఏడుస్తూ, పిచ్చిపట్టినట్లుగా ఉన్న తల్లిని చూసి ఆస్తా సిన్హా వణికిపోయారు.

ఎప్పుడూ సరదాగా ఉంటూ, భయమంటే ఏంటో తెలియని భూమి సిన్హా....ముంబయిలో ఓ ప్రాపర్టీ లాయర్. ఆమె భర్త చనిపోయారు. ఒంటరిగానే తన కుమార్తె కోసం కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆమె ఇప్పుడు పరిష్కారం లేని సమస్యల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారు.

“ఆమె గుండె బద్ధలైంది.” అని ఆస్తా సిన్హా అన్నారు. తన ముఖ్యమైన పత్రాలు, ఫోన్‌లోని నెంబర్లు బయటకు ఎలా వెళ్లాయా అనే ఆలోచనతో భూమి సిన్హా చిగురుటాకులా వణికిపోతున్నారు.

ఆమెను ఆపాలని ఆస్తాకు తెలుసు “మీ అమ్మను బయటకు వెళ్లనివ్వద్దు. ఎప్పుడూ కనిపెట్టుకునే ఉండాలి. ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకోవచ్చు” అని ఆస్తాను ఆమె అత్త హెచ్చరించారు.

ఆస్త సిన్హా

ఫొటో సోర్స్, Prarthna Singh/BBC

ఫొటో క్యాప్షన్, తల్లి పరిస్థితి చూసి ఆస్తా చాలా ఆందోళనకు గురయ్యారు

భూమి సిన్హాకు కొన్ని అప్పులున్నాయని, వాటికి సంబంధించి ఆమెకు కొంత మంది వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయని కూతురు ఆస్తాకు తెలుసు. అయితే తల్లి కొన్ని నెలలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనతో జీవిస్తున్నారని మాత్రం తెలియదు.

రుణాల వసూళ్ల పేరుతో కస్టమర్లను పరువు ప్రతిష్టల్ని బజారుకీడుస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తూ, వారి జీవితాలను నాశనం చేస్తూ, 14 దేశాల్లో విస్తరించిన ఆ నెట్‌వర్క్‌‌కు భూమి సిన్హా బాధితురాలుగా మారారు.

ఈ వ్యాపారం క్రూరమైనది, చాలా సింపుల్ కూడా.

ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిముషాల్లోనే మీకు అప్పు ఇచ్చే యాప్స్ చాలా ఉన్నాయి. వాటిలో అన్నీ ఇలా వేటాడవు. కానీ కొన్ని మాత్రం మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే మీ ఫోన్‌లోని నెంబర్లు, ఫోటోలు, ఐడీ కార్డులు, ఇతర సమాచారాన్ని లాగేసుకుంటాయి.

కస్టమర్ ఎవరైనా సమయానికి డబ్బులు చెల్లించకుంటే, కొన్నిసార్లు చెల్లించినా, యాప్ ద్వారా సేకరించిన కస్టమర్ల సమాచారం అంతా కాల్‌సెంటర్‌కు పంపిస్తాయి. అక్కడ అప్పు చెల్లించాలని కస్టమర్లను వేధించడం, హింసించడం, అవమానించడం, నోటికొచ్చినట్లు తిట్టడంలో శిక్షణ పొందిన యువతీ యువకులు....ల్యాప్‌టాప్‌లు, ఫోన్లతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఆస్త, భూమి

2021 చివర్లో భూమి సిన్హా తన ఖర్చుల కోసం కొన్ని లోన్‌యాప్‌ల నుంచి 47వేల రూపాయలు అప్పు తీసుకున్నారు. డబ్బులు వెంటనే వచ్చినా అందులో పెద్ద మొత్తం చార్జెస్ కింద యాప్‌ సంస్థలు కట్ చేసుకున్నాయి. ఏడు రోజుల తర్వాత ఆమె అప్పు చెల్లించాల్సి ఉంది. అయితే ఆమెకు వేరేవాళ్ల నుంచి రావల్సిన సొమ్ము రాలేదు.

దీంతో ఆమె మరో యాప్‌ నుంచి రుణం తీసుకుని పాత అప్పు చెల్లించారు. ఆమె తీసుకున్న అప్పు, దానికి వడ్డీ కలిసి ఆమె చెల్లించాల్సిన మొత్తం 20 లక్షల రూపాయలకు చేరుకుంది.

రికవరీ ఏజంట్లు ఆమెకు ఫోన్ చెయ్యడం మొదలు పెట్టారు. చాలా త్వరగానే వారు భూమిని కించపరచడం, అవమానించడం, బూతులు తిట్టడం ప్రారంభించారు. డబ్బు చెల్లించానని చెప్పినా, అబ్దదాలు ఆడుతున్నావని అనేవారు. రోజుకి 2వందల సార్లు కాల్స్ చేసేవారు. నువ్వు ఎక్కడ ఉంటున్నావో మాకు తెలుసనేవారు. ఆమె చనిపోయినట్లు ఉన్న ఫోటోలు పంపించి హెచ్చరించేవారు.

ఆమె ఫోన్‌లో ఉన్న 486 నెంబర్లకు ఆమె ఒక వ్యభిచారి, దొంగ అని మెసేజ్ పంపిస్తామని వేధించేవారు. ఆమె కుమార్తె గురించి కూడా ఇలాగే చేస్తామని బెదిరించడంతో భూమి సిన్హాకు నిద్ర పట్టేది కాదు.

ఆమె స్నేహితులు, బంధువులతో పాటు 69 యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నారు. ప్రతీ రోజూ రాత్రి ఆమె ప్రార్థన ఒక్కటే. ఈ రోజు లాగా రేపు ఉండకూడదని. అయితే ఉదయం ఏడు గంటలు కాగానే ఫోన్ నిరంతరాయంగా మోగుతూనే ఉండేది.

కొంచెం కొంచెంగా భూమి అప్పులు చెల్లించడం మొదలు పెట్టారు. అయితే అసన్ లోన్ అనే యాప్ మాత్రం ఫోన్లు చెయ్యడం ఆపలేదు. దీంతో ఆమె విసిగిపోయారు. పని మీద దృష్టి పెట్టలేకపోయారు. అప్పుడప్పుడూ స్పృహ తప్పి పడిపోయేవారు.

ఒక రోజు ఆమె కొలీగ్ ఒకరు పిలిచి తన ఫోన్‌లో ఉన్న ఫోటో చూపించారు. అది ఆమె నగ్నంగా ఓ పురుషుడితో కలిసి ఉన్న ఫోటో.

ఆమె చిత్రాన్ని చాలా దారుణంగా ఫోటోషాప్‌లో మార్ఫింగ్ చేశారు. భూమి సిన్హా మొహాన్ని మరొకరితో శరీరంతో అతికించారు. అయినప్పటికీ ఆ చిత్రం చూసి ఆమె సిగ్గుతో వణికిపోయారు. తన కొలీగ్ డెస్క్ వద్దనే కూలబడిపోయారు.

అసన్‌ లోన్ యాప్‌ వాళ్లు ఆమె ఫోన్‌లో ఉన్న ప్రతీ నెంబర్‌కీ ఆ ఫోటో పంపించారు. అదంతా చూసిన తర్వాత చనిపోతే బావుండనిపించిందని భూమి సిన్హా అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు నడుపుతున్న ఇలాంటి స్కాములకు సంబంధించిన ఆధారాలు బీబీసీకి దొరికాయి.

లోన్‌యాప్‌ల వేధింపుల వల్ల భారత దేశంలోనే 60 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. అందులో 50 శాతానికి పైగా బాధితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే ఉన్నారు.

ఆత్మహత్య చేసుకున్న వారిలో ఎక్కువ మంది 20, 30 ఏళ్ల వయసు వారే. అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు, అవార్డు గెలుచుకున్న సంగీతకారుడు ఒకరు, మూడేళ్లు, ఐదేళ్ల పిల్లలున్న ఓ యువ జంట, ఓ తాతయ్య, ఓ మనవడు...ఇలా అనేకమంది ఇలాంటి లోన్‌యాప్‌ల వలలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఈ 60 మందిలో ఎంతో భవిష్యత్ ఉన్న నలుగురు కుర్రాళ్లు కూడా ఉన్నారు.

బాధితుల్లో చాలామంది ఈ స్కామ్ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడి ముందుకు రావడం లేదు. వాళ్లను వేధిస్తున్నవాళ్లు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నారు. వాళ్లెవరో, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు.

ఈ యాప్స్ కోసం పని చేసే వారి కోసం కొన్ని నెలలు వెతికిన తర్వాత, లోన్‌ యాప్ సంస్థల్లో పని చేసిన ఓ వ్యక్తిని బీబీసీ గుర్తించింది. లోన్ యాప్స్ కాల్‌ సెంటర్ల నుంచి ఫోన్ చేసి కస్టమర్లను తిట్టడం స్వయంగా చూసినట్లు రోహన్ ( ఇది అతని అసలు పేరు కాదు) మాతో చెప్పారు.

రోహన్‌ను కలిసిన బీబీసీ రిపోర్టర్
ఫొటో క్యాప్షన్, రుణ రికవరీ ఏజెంట్‌గా పనిచేసిన రోహన్ అక్కడి వ్యవహారాలు ఎలా ఉంటాయో బీబీసీకి వివరించారు

కస్టమర్లలో చాలా మంది ఏడుస్తారు, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని అంటారు. “ఇది రాత్రంతా నన్ను వెంటాడుతూనే ఉంటుంది” అని ఆయన చెప్పారు. ఈ స్కామ్‌ను బయటపెట్టడంలో బీబీసీకి సహకరించేందుకు రోహన్ అంగీకరించారు.

ఆయన గతంలో రెండు కాల్‌ సెంటర్లలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. అందులో ఒకటి మేజస్టీ లీగల్ సర్వీసెస్, రెండోది కాల్‌ఫ్లెక్స్ కార్పోరేషన్. ఆ తర్వాత కొన్ని నెలల పాటు రహస్యంగా కాల్‌సెంటర్లలో దృశ్యాలను చిత్రీకరించారు.

ఆయన చిత్రీకరించిన వీడియోల్లో ఏజెంట్లు కస్టమర్లను వేధిస్తున్న దృశ్యాలున్నాయి. అందులో ఒక మహిళా ఏజెంట్ “మర్యాదగా మాట్లాడు లేకపోతే తంతాను” అని ఓ మహిళతో అనడం కనిపించింది. ఆమె ఓ కస్టమర్‌తో మీ ఇంట్లో ఆడవాళ్లను పడుకోబెట్టి డబ్బులు సంపాదించమని చెబుతోంది. తర్వాత ఆమె పెద్దగా నవ్వడం మొదలు పెట్టింది. మరో ఏజెంట్ అయితే “మీ అమ్మతో వ్యభిచారం చేయించి రుణం తీర్చు” అని సలహా ఇచ్చింది.

కస్టమర్లను వేధిస్తూ, హింసిస్తున్న వందకు పైగా సంఘటనలను రోహన్ రికార్డు చేశారు. ఒక పద్దతి ప్రకారం వేధిస్తూ బాధితుల్ని దోచుకుంటున్న దృశ్యాలు తొలిసారి కెమెరాలో రికార్డయ్యాయి.

కాల్‌ఫ్లెక్స్ కార్పోరేషన్‌లో, ఓ క్లయింట్‌ను ఘోరంగా తిడుతున్న ఓ సంఘటనను చూశారు. దిల్లీకి సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో ఏజెంట్లు అసహ్యకరమైన భాష ఉపయోగిస్తూ కస్టమర్లను అవమానిస్తూ బెదిరిస్తుంటారు.

ఈ ఏజంట్లందరినీ పర్యవేక్షించేందుకు, వారికి గైడెన్స్ ఇచ్చేందుకు కాల్ సెంటర్లలో మేనేజర్లు ఉంటారు. అలాంటి వారిలో ఒకరు విశాల్ చౌరాసియా.

చౌరాసియా నమ్మకాన్ని చూరగొన్నారు రోహన్. ఇన్వెస్టర్‌గా చెప్పుకునే ఓ జర్నలిస్టు, రోహన్‌తో కలిసి చౌరాసియాతో సమావేశం అయ్యారు. లోన్ యాప్ నెట్‌వర్క్ ఎలా పని చేస్తుందో వివరించాలని ఆయన్ని అడిగారు.

విశాల్ చౌరాసియా
ఫొటో క్యాప్షన్, క్లయింట్లను ఎలా వేధింపులకు గురిచేస్తారో విశాల్ చౌరాసియా చెప్పారు. ఇది రికార్డు చేస్తున్న విషయం ఆయనకు తెలియదు

“ఎవరైనా కస్టమర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని లోన్ తీసుకోగానే అతని ఫోన్‌లోని నెంబర్లు యాప్‌లోకి వస్తాయి. కాల్‌ఫ్లెక్స్ కార్పోరేషన్ రికవరీ ఏజంట్లను నియమించుకుంటుంది. కస్టమర్లు ఎవరైనా సమయానికి డబ్బు చెల్లించకపోతే వాళ్లను వేధించడం మొదలు పెడతాం. కస్టమర్ ఫోన్‌లో ఉన్న నెంబర్లకు కాల్స్ చేస్తాం. డబ్బు వసూలు చేసే దాకా మీరు ఏదైనా చేయండని నేను నా సిబ్బందికి చెబుతాను” అని చౌరాసియా వివరించారు.

“పరువు పోతుందనే భయంతో కస్టమర్ డబ్బు చెల్లిస్తాడు” అని ఆయన అన్నారు. “అతని ఫోన్‌లో ఉన్న ఒక్క నెంబర్ చాలు అతని జీవితం నాశనం కావడానికి” అని చెప్పారు.

బీబీసీ ప్రతినిధి చౌరాసియాను నేరుగా సంప్రదించినప్పుడు, దీనిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఆయనను మళ్లీ కలిసేందుకు మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా కాల్‌ఫ్లెక్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

లోన్ యాప్స్‌వల్ల పోయిన చాలా ప్రాణాల్లో తెలంగాణకు చెందిన కిర్ని మౌనిక కూడా ఒకరు.

సిద్దిపేటకు చెందిన 24 ఏళ్ల మౌనిక ప్రభుత్వ ఉద్యోగి. కుటుంబంలో బాగా చదువుకున్న వ్యక్తి కూడా. ఆమె చదివిన స్కూల్‌లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన విద్యార్థిని ఆమె ఒక్కరే. ముగ్గురు సోదరులకు ప్రియమైన సోదరి. ఆమె తండ్రి రైతు. మాస్టర్స్ చదివేందుకు ఆమెను ఆస్ట్రేలియా పంపించాలని అనుకున్నారాయన.

మూడేళ్ల క్రితం ఒక రోజు మౌనిక ఆత్మహత్య చేసుకున్నారు.

ఆమె ఎప్పటిలాగే తన ఉద్యోగానికి స్కూటర్ మీద బయల్దేదారారు. “ఆమె నవ్వుతూనే వెళ్లింది” అని తండ్రి కిర్ని భూపాణి చెప్పారు.

పోలీసులు మౌనిక ఫోన్ కాల్స్, బ్యాంకు స్టేట్‌మెంట్లు పరిశీలించినప్పుడు ఆమె 55 లోన్ యాప్స్ నుంచి అప్పు తీసుకున్నట్లు గుర్తించారు. ఇదంతా ఆమె ఓ లోన్ యాప్‌ నుంచి 10వేల రూపాయల అప్పు తీసుకోవడంతో మొదలైంది. లోన్ యాప్స్‌కు ఆమె తీసుకున్న రుణానికి 30 రెట్లు అధికంగా అంటే మూడు లక్షల రూపాయలు చెల్లించారు. రికవరీ ఏజెంట్లు ఆమెను అసభ్యకరమైన, నీచమైన మెసేజ్‌లతో వేధించారని, ఆమె ఫోన్‌లో ఉన్న నెంబర్లకు మెసేజ్‌లు పంపించారని పోలీసులు గుర్తించారు.

మౌనిక తండ్రి
ఫొటో క్యాప్షన్, మౌనిక తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఏనాడూ తండ్రితో చెప్పలేదు

మౌనిక గది ప్రస్తుతం ఒక గుడిలాగా మారింది. ఆమె ఐడీ కార్డు ఇంటి తలుపుకు వేలాడుతోంది. ఆమె తల్లి దాచి ఉంచిన వస్తువుల్లో పెళ్లిచూపుల కోసం తీసిన ఫోటో ఒకటి భద్రంగా ఉంది.

ఆమె తండ్రిని బాగా కుంగదీసిన విషయం ఏంటంటే, ఆమె తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఏనాడూ ఆయనతో చెప్పలేదు. “మమ్మల్ని అడిగి ఉంటే ఆ డబ్బులు ఇచ్చేవాళ్లం” అని ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు.

ఆమె చావుకి కారణమైన వారి పట్ల ఆగ్రహంతో ఉన్నారాయన.

ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకు వస్తున్నప్పుడు ఆమె ఫోన్ మోగింది, ఆ కాల్‌కి ఆయన చాలా ఆగ్రహంతో, వాళ్లను తిడుతూ సమాధానం చెప్పారు. “ వాళ్లు ఆమె మాకు డబ్బు చెల్లించాలని అడిగారు. ఆమె చనిపోయింది” అని చెప్పానని అన్నారు.

ఆమెను వేధించింది వీళ్లేనా అని ఆయన ఆశ్చర్యపోయారు

హరి (అసలు పేరు కాదు) మౌనిక లోన్ తీసుకున్న యాప్ కంపెనీలో పని చేస్తున్నారు. అందులో జీతం బాగానే ఉన్నప్పటికీ మౌనిక మరణంలో తాను కూడా భాగమైనందుకు ఆయన బాధగా ఉన్నారు.

కస్టమర్లను తిట్టే కాల్స్ తాను చెయ్యనని చెప్పినా, తాను మర్యాదగా మాట్లాడే బృందంలో ఉన్నప్పటికీ మేనేజర్లు మాత్రం కస్టమర్లను తిట్టాలని స్టాఫ్‌కు చెప్పేవాళ్లని ఆయన అన్నారు.

లోన్ తీసుకున్న వ్యక్తి దొంగ అని, మోసగాళ్లని రుణగ్రహీత ఫోన్‌లో ఉన్న కాంటాక్టులకు ఏజెంట్లు సందేశం పంపిస్తారు.

“ప్రతీ ఒక్కరికీ తమ కుటుంబంలో పరువు, ప్రతిష్టలు ఉంటాయి. ఐదు వేల రూపాయల కోసం వాటిని ఎవరూ నాశనం చేసుకోవాలని అనుకోరు” అని ఆయన చెప్పారు.

రుణం చెల్లించగానే కంప్యూటర్ నుంచి సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. దీంతో వాళ్లు తర్వాతి కస్టమర్‌కు కాల్ చేస్తారు.

క్లయింట్లు ఎవరైనా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటామని చెప్పినా లోన్ యాప్ ఏజెంట్లు పట్టించుకోరు. ఇలాంటప్పుడే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటామని అన్నప్పుడు వేధించండం ఆపేయాలా అని తమ నాయకుడు పరశురామ్ టాక్వేని అడుగుతారు ఏజెంట్లు.

ఆ తర్వాతి రోజు టాక్వే ఆఫీసుకు వచ్చారు. ఆయన చాలా కోపంగా ఉన్నారు. “ మీకు చెప్పింది చెయ్యండి. డబ్బులు వసూలు చెయ్యండి” అంటూ ఆయన ఏజెంట్లను అరిచారని హరి చెప్పారు. దీంతో ఏజెంట్లు ఆయన చెప్పినట్లే చేశారు.

కొన్ని నెలల తర్వాత మౌనిక చనిపోయారు.

టాక్వేకు దయ, జాలి లేదు. ఆయనొక్కరే ఈ సంస్థను నడిపించడం లేదు. “కొన్ని సార్లు తాము వాడుతున్న సాఫ్ట్‌వేర్ ఎలాంటి హెచ్చరిక లేకుండా హఠాత్తుగా చైనీస్ భాషలోకి మారిపోతుందని” హరి చెప్పారు.

టాక్వే చైనా మహిళ లియాంగ్ టియన్ టియన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి లోన్ రికవరీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. హరి పని చేస్తున్న పుణే ఆఫీసులో జియాలియాంగ్ ఉంటారు.

టాక్వే, లియాంగ్‌
ఫొటో క్యాప్షన్, టియాన్ లియాంగ్‌, పరశురామ్ టాక్వేలను పోలీసులు అరెస్టు చేశారు.

వేధింపుల కేసు విచారణలో భాగంగా 2020 డిసెంబర్‌లో టాక్వే, లియాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ‌తర్వాత కొన్ని నెలలకు వారు బెయిల్ మీద విడుదలయ్యారు. 2022 ఏప్రిల్‌లో వారి మీద దోపిడీ, బెదిరింపులు, ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించడం లాంటి నేరాభియోగాలు నమోదయ్యాయి. ఏడాది చివరి నాటికి వాళ్లు పారిపోయారు.

టాక్వేను సంప్రదించేందుకు మేము ప్రయత్నించినా వీలు కాలేదు. అయితే జియాలియాంగ్ పని నిర్వహిస్తున్న యాప్‌ల గురించి పరిశోధిస్తున్నప్పుడు చైనా వ్యాపారవేత్త షి జియాంగ్‌ను కలిశాం.

ఆన్‌లైన్‌లో ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఆయన దగ్గర పని చేస్తున్న ఓ ఉద్యోగి నుంచి ఆయన ఫోన్ నెంబర్ సంపాదించాం. ఇన్వెస్టర్లుగా చెప్పుకుని ఆయనను కలవాలనుకుంటున్నట్లు చెప్పాం.

ఆయన మొహంలో అయిష్టాన్ని ప్రదర్శిస్తూనే కెమెరా ముందుకొచ్చారు. భారత దేశంలో తన వ్యాపారాల గురించి చెప్పుకొచ్చారు.

“భారతీయులకు మాదొక చైనా సంస్థ అని తెలియకుండా మేము ఇంకా పని చేస్తున్నాం.” అని ఆయన చెప్పారు. ఒకసారి 2021లోకి వెళితే లోన్ యాప్‌ల వేధింపుల మీద నమోదైన కేసుల్లో భాగంగా లీ కి చెందిన రెండు సంస్థలపై పోలీసులు దాడి చేశారు. ఈ సంస్థలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు.

వీడియో క్యాప్షన్, బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసే లోన్ యాప్‌‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
లీ షియాంగ్
ఫొటో క్యాప్షన్, లీ షియాంగ్

“పెట్టుబడిని త్వరగా రాబట్టుకోవడమే మన లక్ష్యం. మనం కచ్చితంగా స్థానిక పన్నులేమీ చెల్లించం. స్థానికంగా ఉన్న చట్టాలను ఉల్లంఘించి అధిక వడ్డీలు వసూలు చేస్తాం”. అని ఆయన చెప్పారు.

మెక్సికో, కొలంబియా, భారతదేశంలో తమ సంస్థకు సొంత లోన్ యాప్‌లు ఉనాయని లీ మాతో చెప్పారు. తాను ఈ రంగంలో రిస్కుని నియంత్రించడంలో, రుణాలు వసూలు చెయ్యడంలో ఎదురు లేని వాడినని అన్నారు.

ప్రస్తుతం ఆయన తన వ్యాపారాన్ని సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి లాటిన్ అమెరికా, ఆఫ్రికాతో పాటు 3వేల మంది సిబ్బందితో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, భారతదేశంలో “ ఆఫ్టర్ లోన్’’ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు మాతో చెప్పారు,

తర్వాత రుణాలు వసూలు చేసేందుకు తమ సంస్థ ఏం చేస్తుందో వివరించారు.

“డబ్బులు చెల్లించకపోతే, ఆ కస్టమర్ నెంబర్‌ని వాట్సాప్‌లో యాడ్ చేస్తారు. ఆ తర్వాత మూడో రోజు నుంచి రోజంతా వాట్సాప్ సందేశాలు పంపిస్తుంటారు. ఫోన్‌లో ఉండే వేరే నెంబర్లకు కాల్స్ చేస్తారు. నాలుగో రోజు కూడా డబ్బు చెల్లించకపోతే, వారి కోసం మా దగ్గర ప్రత్యేకమైన విధానం ఉంది” అని ఆయన వివరించారు.

“మేము అతని కాల్ రికార్డుల్ని తీసుకుంటాం. అందులో చాలా సమాచారం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే అతను మా ముందు నగ్నంగా నిలబడినట్లు ఉంటుంది.” అని అన్నారు.

భూమి సిన్హా ఈ వేధింపులు, బెదిరింపులు, తిట్లు అన్నింటినీ భరించారు, అయితే ఆమెను మరో వ్యక్తితో నగ్నంగా ఉన్నట్లు పంపిన ఫొటోలను మాత్రం తట్టుకోలేకపోయారు.

“ఆ ఫోటో, నన్ను దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా ప్రపంచం ముందు నిలబెట్టినట్లు ఉంది” అని ఆమె అన్నారు. “నేను నా గౌరవం, నైతిక బలం, హోదా అన్నింటినీ క్షణంలో కోల్పోయాను”

ఆ ఫోటోను వాళ్లు లాయర్లు, ఆర్కిటెక్టులు, ప్రభుత్వ అధికారులు, ఆమె బంధువులు, స్నేహితుల తల్లిదండ్రులు అందరికీ షేర్ చేశారు. వాళ్లెవరూ మరోసారి ఆమె వైపు చూడకుండా చేశారు.

“అది నా హృదయాన్ని ముక్కలు చేసింది, పగిలిపోయిన అద్దాన్ని తిరిగి అతికించినా, దానిపై పగుళ్లు కనిపిస్తాయి” అని ఆమె చెప్పారు.

ఆమె 40 ఏళ్లుగా జీవిస్తున్న ప్రాంతంలో ఆమె చుట్టుపక్కల వాళ్లు ఆమెను బహిష్కరించారు.

“ప్రస్తుతం నాకెవరూ స్నేహితులు లేరు. కేవలం నేను మాత్రమే ఉన్నాను” అని ఆమె విషాదం నిండిన నవ్వుతో చెప్పారు.

ఆమె కుటుంబ సభ్యులు కొంతమంది ఆమెతో ఇప్పటికీ మాట్లాడటం లేదు. తనతో పని చేస్తున్న పురుషులంతా తనను నగ్నంగా చిత్రీకరిస్తున్నారా అన్న ఫీలింగ్ కలుగుతుంటుందని ఆమె అన్నారు.

తాను తల్లడిల్లడాన్ని తన కుమార్తె ఆస్తా గుర్తించిందని ఆమె తెలుసుకున్నారు. ఏది ఏమైనా సరే ఈ దుర్మార్గంతో పోరాడాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. “నేను మిగతా వారిలా చనిపోకూడదు” అని అనుకున్నారు.

వీడియో క్యాప్షన్, దిల్లీలో 'స్కామ్' కాల్‌సెంటర్ గుట్టు రట్టు చేసిన బీబీసీ... ఇద్దరు హైటెక్ మోసగాళ్ళ అనుభవాలు

ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు. ఆమె చేసిందల్లా ఏంటంటే, సిమ్ కార్డు మార్చేశారు. దీంతో వాళ్లు ఆమె కుమార్తె ఆస్తాకు ఫోన్లు చెయ్యడం మొదలు పెట్టారు. దీంతో ఆస్తా కూడా తన సిమ్‌కార్టు తీసేశారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, కొలీగ్స్, సన్నిహితులకు లోన్ యాప్స్ వాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్‌లను పట్టించుకోవద్దని చెప్పారు. తర్వాత అవి ఆగిపోయాయి.

లోన్‌యాప్ వేధింపుల నుంచి భూమి సిన్హాకు ఆమె అక్కచెల్లెళ్లు, యజమాని, ఆన్‌లైన్ స్నేహితులు అండగా నిలిచారు. అయితే ఆమె కుమార్తె ఇంకా ఎక్కువగా మద్దతిచ్చారు.

“నాకు ఇలాంటి కూతురు దొరికిందంటే నేను ఏదో ఒక మంచిపని చేసి ఉండాలి” అని ఆమె అన్నారు. “ఆమె నాకు అండగా నిలబడకుంటే లోన్ యాప్‌ల వల్ల ప్రాణాలు కోల్పోయిన అనేక మందిలో నేను కూడా ఉండేదాన్ని” అని చెప్పారు.

ఈ ఆరోపణలను మేము పరారీలో ఉన్న అసన్ లోన్ యాప్, లియాంగ్ టియన్ టియన్, పరశురామ్ టాక్వే ముందు ఉంచాం. అయితే వాళ్లెవరూ స్పందించలేదు.

దీనిపై స్పందించాలని లి జియాంగ్‌ను అడిగినప్పుడు ఆయన తాను, తన సంస్థలు స్థానిక చట్టాలు, నియమావళి ప్రకారమే పని చేస్తున్నాయని బీబీసీతో చెప్పారు. తాను ఎన్నడూ యాప్స్ ద్వారా వేధించలేదని అన్నారు.

జియాలియాంగ్‌తో సంబంధాలను తెంచుకున్నానని, కస్టమర్ల ఫోన్లలో నెంబర్లు, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం లేదని చెప్పారు.

తమ లోన్ రికవరీ కాల్ సెంటర్లు కఠిన నియమావళికి కట్టుబడి ఉన్నాయని, సామాన్యుల్ని వేధించడం ద్వారా లాభాలు పొందడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారు.

కస్టమర్ల కాంటాక్టుల్ని ఉపయోగించి రుణాలను వసూలు చేస్తున్నామన్న ఆరోపణల్ని మెజస్టీ లీగల్ సర్వీసెస్ తిరస్కరించింది. ఫోన్లు చేసి తిట్టడం, బెదిరించడం లాంటివి చేసినా, కంపెనీ నియమాలను ఉల్లంఘించినా ఉద్యోగం నుంచి తొలగిస్తామని తమ ఏజెంట్లను ఆదేశించినట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు.

(ఈ కథనం కోసం రోన్నీ సేన్, శ్వేతికా ప్రసార్, సయద్ హసన్, అంకుర్ జైన్, బీబీసీ ఐ బృందం పని చేసింది. మరి కొంతమంది తెరచాటున పని చేశారు. భద్రత దృష్ట్యా వారి పేర్లను గోప్యంగా ఉంచుతున్నాం.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)