గాజా స్ట్రిప్: ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే ‘అతిపెద్ద ఓపెన్ ఎయిర్ జైల్’ అని ఎందుకంటారు?

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌పై గత వారాంతంలో తాము ఇంతకుముందు ఎప్పుడూ చేయని రీతిలో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడి చేసింది.
ఈ బాంబుల వర్షం ప్రపంచంలోనే అత్యంత పేద, అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఒకటైన గాజా స్ట్రిప్ నుంచి జరిగింది.
గాజా స్ట్రిప్‌లో అనేక సాయుధ పోరాటాలు సుదీర్ఘంగా కాలంగా జరుగుతున్నాయి. ఇందులో చరిత్రను మార్చేసిన తీవ్ర ఘర్షణలు కూడా ఉన్నాయి.
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. 2007 నుంచి గాజా హమాస్ నియంత్రణలో ఉంది.
గత శనివారం ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి, ఈ తరంలో ఆ దేశంపై జరిగిన అతి పెద్దదాడిగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. హమాస్‌కు కూడా గాజా నుంచి నిర్వహించిన ఈ దాడి ఎంతో కీలకమైనది.
ఈ సందర్భంలో, గాజా ప్రాంత చరిత్ర ఏంటి, ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ జైల్ అని మానవ హక్కుల నిపుణులు ఎందుకు వ్యవహరిస్తారు అన్నది తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Getty Images
ఆక్రమణల భూమి
సెప్టెంబరు 1992లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఇత్సాక్ రాబిన్, ‘‘ఈ గాజా ప్రాంతం సముద్రంలో మునిగిపోవాలని కోరుకుంటున్నాను. కానీ, అది జరిగే పని కాదు కాబట్టి, దానికి మనం ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి’’ అని అమెరికా ప్రతినిధి బృందంతో అన్నారు.
రాబిన్‌ను 1995లో ఒక యూదు అతివాది కాల్చి చంపారు.
ఇది జరిగి 30 ఏళ్లు దాటినా ఆ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు.
గాజా స్ట్రిప్ ప్రాంతం ఇజ్రాయెల్, ఈజిప్ట్, మధ్యధరా సముద్రం మధ్య 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు ఉండే భూభాగం. ఇందులో దాదాపు 23 లక్షల మంది నివసిస్తున్నారు.
ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి. దీని చరిత్ర కూడా చిన్నది కాదు. దాదాపు నాలుగు వేల సంవత్సరాలుగా ముట్టడులు, ఆక్రమణలు, దాడుల చరిత్రను ఈ ప్రాంతం తనలో నింపుకుంది.
క్రీస్తుకు కొన్ని వందల సంవత్సరాల ముందు నాటి ప్రాచీన ఈజిప్టు పాలన నుంచి 16వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్ళే వరకు ఈ ప్రాంతం వివిధ రాజవంశాలు, సామ్రాజ్యాలు, రాజుల ఏలుబడిలోకి వెళ్లింది. అనేకసార్లు నాశనమైంది, అలాగే పునరుజ్జీవం కూడా పొందింది.
అలెగ్జాండర్ నుంచి రోమన్ సామ్రాజ్యపు ముస్లిం పాలకుడైన అమ్ర్ ఇబన్ అల్-ఆస్ వరకు అనేక మంది ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాలకులను బట్టి ఇక్కడి మత విశ్వాసాలు కూడా మారుతూ వచ్చాయి.
1917 వరకు ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది గాజా. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. బ్రిటిషర్లు ఇక్కడ ఏకీకృత అరబ్ రాజ్య ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి ఒట్టోమన్ సామ్రాజ్యపు భాగమైన గాజా స్ట్రిప్‌తోపాటు కొన్ని ఆసియా అరబ్ భూభాగాల భవిష్యత్తు గురించి బ్రిటన్, టర్కీ (నేటి తుర్కియే) మధ్య ఒక ఒప్పందం జరిగింది.
కానీ, 1919నాటి పారిస్ పీస్ కాన్ఫరెన్స్ సందర్భంగా, మొదటి ప్రపంచ యుద్ధ విజేతలైన యూరోపియన్ శక్తులు అరబ్ రాజ్య స్థాపన ప్రయత్నాలను అడ్డుకున్నాయి.
ఈ మొత్తం భూభాగాన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించి బ్రిటన్, ఫ్రాన్స్ అధీనంలో ఉంచారు. అలా బ్రిటన్ పరిధిలోకి వచ్చింది పాలస్తీనా. 1920 నుంచి 1948 మధ్య ఇది బ్రిటన్ అధీనంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధాలు, భూభాగాల పంపిణీ
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, పాలస్తీనాపై నిర్ణయాన్ని కొత్తగా పుట్టిన ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్)కి బదిలీ చేయాలని బ్రిటిష్ వారు నిర్ణయించుకున్నారు.
1947లో ఆ సంస్థ 181వ తీర్మానాన్ని ఆమోదించింది. దీని ద్వారా పాలస్తీనాను విభజించి 55% భూభాగాన్ని యూదులకు ఇచ్చారు. జెరూసలెంను అంతర్జాతీయ నియంత్రణలో ఉంచారు. గాజా సహా మిగిలిన భూభాగాన్ని అరబ్బులకు కేటాయించారు. 1948 మేలో అమల్లోకి వచ్చిన ఈ తీర్మానంతో పాలస్తీనాపై బ్రిటిష్ అధికారం తొలగిపోయి ఇజ్రాయెల్ రాజ్య ఆవిర్భావానికి దారితీసింది.
ఇజ్రాయెల్ ఏర్పడిన వెంటనే యుద్ధం కూడా ప్రారంభమైంది. 1948లో అరబ్బులు, ఇజ్రాయెలీలు యుద్ధానికి దిగారు. వేల మంది పాలస్తీనియులు శరణార్థులుగా మారి, గాజా స్ట్రిప్‌కు చేరుకుని అక్కడే స్థిరపడ్డారు.
యుద్ధ విరమణ తర్వాత గాజా ప్రాంతం 1967 వరకు ఈజిప్టు అధీనంలో ఉంది. అదే సంవత్సరం ఆరు రోజుల యుద్ధం జరిగింది. యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ సంకీర్ణాన్ని ఇజ్రాయెల్ ఓడించింది. ఈ యుద్ధం తర్వాత గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంను ఇజ్రాయెల్ ఆక్రమించింది. అప్పటి నుంచి మొదలైన హింసాత్మక ఘటనలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
1987లో గాజాలో ఇజ్రాయెలీల పాలనకు వ్యతిరేకంగా మొదటిసారి తిరుగుబాటు జరిగింది. అప్పుడే మిలిటెంట్ సంస్థ హమాస్ కూడా పుట్టింది. ఈ తిరుగుబాటు తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య 1993లో జరిగిన ఓస్లో ఒప్పందం పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ (పీఎన్ఏ) ఏర్పాటుకు దారి తీసింది. గాజా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని కొన్ని ప్రాంతాలకు పరిమిత స్వయంప్రతిపత్తి మంజూరయింది.
2005లో మరో తిరుగుబాటు, తీవ్ర హింస తర్వాత గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ తన దళాలను, 7 వేల మంది సెటిలర్లను ఉపసంహరించుకుంది.
ఏడాది తర్వాత జరిగిన ఎన్నికల్లో హమాస్ స్పష్టమైన విజయాన్ని సాధించింది. 2007లో హమాస్, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతా పార్టీ మధ్య హింసాత్మక పోరాటం జరిగింది.
హమాస్ గాజాలో విజయం సాధించింది. అప్పటి నుంచి అక్కడ అధికారంలో కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో మూడు యుద్ధాలు, 16 సంవత్సరాల దిగ్బంధాన్ని గాజా ఎదుర్కొంది.
ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తానని హమాస్ ప్రతిజ్ఞ చేసింది. ఇజ్రాయెల్ స్థానంలో ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్నది హమాస్ లక్ష్యం.
హమాస్‌ను కొందరు సైనిక విభాగంగా చెప్పుకుంటున్నా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్, యూకేతోపాటు ఇతర ప్రపంచ శక్తులు దానిని మిలిటెంట్ గ్రూప్‌గా అభివర్ణిస్తుంటాయి. హమాస్‌కు ఇరాన్ మద్ధతిస్తోంది. ఆర్థిక, ఆయుధ సాయం కూడా చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
దిగ్బంధనం
హమాస్ అధికారంలోకి వచ్చిన తరువాత, ఇజ్రాయెల్, ఈజిప్ట్ గాజాపై భూమి, గాలి, సముద్ర మార్గాల్లో అనేక మార్లు దిగ్బంధనాన్ని విధించాయి.
ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల సంఘాలు దీన్ని తప్పుబడుతున్నప్పటికీ, 2007 నుంచి ఇజ్రాయెల్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది.
ఈ దిగ్బంధనం కారణంగా గాజా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇజ్రాయెల్‌కు చెందిన మానవ హక్కుల గ్రూప్ బీటీ సీలెమ్ ప్రకారం ‘‘అత్యవసరమైన ప్రాణాంతక వైద్య పరిస్థితులు, ట్రేడింగ్ లాంటి కొన్ని సందర్భాల్లో తప్ప పాలస్తీనియన్లు తమ దేశంలో ప్రవేశించకుండా ఇజ్రాయెల్ నిషేధాజ్ఞలు కొనసాగిస్తుంది’’
గాజాలోని పరిస్థితులను ‘ఓపెన్-ఎయిర్ జైలు’తో పోల్చుతోంది హ్యూమన్ రైట్స్ వాచ్. దీనిని బట్టి ఇజ్రాయెల్ అక్కడి పాలస్తీనియన్లపై ఏ స్థాయిలో పరిమితులను విధిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే, హమాస్ నుంచి తమ పౌరులను రక్షించుకోవడానికి ఈ దిగ్బంధనం తప్పదని ఇజ్రాయెల్ చెబుతోంది. తరచూ ఈజిప్టు కూడా గాజాస్ట్రిప్‌పై ఆంక్షలు విధిస్తుంటుంది.
అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ ఈ దిగ్బంధనాన్ని చట్టవిరుద్ధమైనదని, జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించే చర్య అని అభివర్ణిస్తుంటుంది. ఇజ్రాయెల్ అధికారులు ఈ వాదనను ఖండిస్తున్నారు.
ఈ దిగ్బంధనాన్నిబట్టి గాజా ఇప్పటికీ ఇజ్రాయెల్ సైనిక ఆక్రమణలో ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని యునైటెడ్ నేషన్స్‌తోపాటు వివిధ మానవ హక్కుల సంఘాలు, న్యాయనిపుణులు అంటుంటారు.
దిగ్బంధనాన్ని తప్పించుకోవడానికి, హమాస్ సొరంగాల నెట్‌వర్క్‌ను నిర్మించింది. సరుకులు, ఆయుధాలను గాజా స్ట్రిప్‌కు చేర్చడంతోపాటు, అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్‌గా కూడా వీటిని ఉపయోగిస్తుంటుంది.
ఈ సొరంగాలు తమకు పెనుముప్పుగా ఇజ్రాయెల్ భావిస్తూ, సైనిక దాడుల్లో తరచూ వాటిని లక్ష్యంగా చేసుకొంటుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పేదరికం
ఇజ్రాయెల్ గత 16 సంవత్సరాలుగా గాజాస్ట్రిప్‌కు ఎగుమతులు, దిగుమతుల మీద నిషేధాలు, నియంత్రణలు విధించడం వల్ల ఆ ప్రాంతం ఆర్థికంగా పతనం అంచుకు చేరుకుంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలో నిరుద్యోగిత రేటు 40 శాతం కంటే ఎక్కువ.
ఐక్య రాజ్యసమితి ప్రకారం ఇక్కడి జనాభాలో 65 శాతానికంటే ఎక్కువ మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చెప్పినదాని ప్రకారం గాజా జనాభాలో 63 శాతం మంది ప్రజలు ‘ఆహార అభద్రత’లో ఉన్నారు.
యువత
గాజాలో నివసిస్తున్న పాలస్తీనియన్లలో 19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు సగం మంది ఉండగా, వారి సామాజిక ఆర్థిక వృద్ధి, బయటి ప్రపంచంతో సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి.
‘‘నిత్యం హింసకు గురికావడం వల్ల దీర్ఘకాలిక మానసిక ప్రభావాలతో జీవించే" తరానికి ఆరోగ్య సంరక్షణ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడి యువతలో డిప్రెషన్‌తోపాటు ఇతర మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.
"గాజా దిగ్బంధనం ప్రతిభావంతులు, వృత్తి నిపుణులు సమాజానికి ఏమీ చేయనివ్వలేని పరిస్థితి కల్పిస్తోంది. ఇతర ప్రాంతాలలో వారికి అవకాశాలు దక్కనీయకుండా చేస్తోంది’’ అని హ్యూమన్ రైట్స్ వాచ్ తన 2021 రిపోర్టులో పేర్కొంది.

జనసాంద్రత
కేవలం 360 చదరపు కిలోమీటర్ల పరిధిలో దాదాపు 23 లక్షలమంది ప్రజలు గాజాలో నివసిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్జీవో గిషా ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటి.
కేవలం ఎనిమిది శిబిరాల్లో ఆరు లక్షలమంది శరణార్ధులు కిక్కిరిసిపోయి జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
లండన్‌లాంటి నగరంలో సగటున ఒక చదరపు కిలోమీటరుకు 5,700 మంది నివసిస్తుండగా, గాజా నగరంలో ఈ సంఖ్య 9,000 కంటే ఎక్కువ ఉంటుంది.
ఇస్లామిక్ మిలిటెంట్ల రాకెట్ దాడుల నుంచి తమను తాను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి డిఫెన్స్ జోన్‌ను ప్రకటించింది. ఆ డీలిమిటేషన్ కారణంగా, ఇళ్లు, పొలాల కోసం అందుబాటులో ఉన్న భూమి తగ్గిపోయింది.
విద్యుత్తు అంతరాయాలు గాజాలో చాలా సాధారణ వ్యవహారం.
ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రకారం, చాలా ఇళ్లలో రోజుకు మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఉంటుంది.
గాజా స్ట్రిప్‌కు అవసరమైన విద్యుత్తులో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ నుంచి వస్తుంది. గాజాలో ఉన్న ఏకైక పవర్ ప్లాంట్ నుంచి కొంత, ఈజిప్టు నుంచి కొంత విద్యుత్ సరఫరా అవుతుంది.
నీటి కొరత గాజా ప్రజలను వేధిస్తున్న మరో సమస్య.
ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో ఉంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో అనేక ఆసుపత్రులు, క్లినిక్‌లు దెబ్బతిన్నాయి.
ఇప్పుడు హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో గాజాలో ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















