పోప్ ఫ్రాన్సిస్: శరణార్థులను అక్కున చేర్చుకోండి.. నిర్లక్ష్యం వద్దు

ఫొటో సోర్స్, Getty Images
క్రిస్మస్ సందర్భంగా వాటికన్ సిటీ కళకళలాడుతోంది. ఆదివారం సాయంత్రం పోప్ ఫ్రాన్సిస్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
స్వదేశాల్లో బతకలేక.. బతుకు భారమై పొరుగు దేశాలకు వలస వస్తున్న లక్షలాది మంది శరణార్థులను నిర్లక్ష్యం చేయవద్దని మానవ సమాజాన్ని పోప్ అర్థించారు.
ఈ శరణార్థులను.. క్రిస్టియన్ పురాణ పాత్రలు మేరీ, జోసెఫ్‌లతో ఆయన పోల్చారు. బైబిల్‌లోని వారి కథను స్మరిస్తూ.. వారు నాజరెత్ నుంచి బెత్లెహామ్‌కు ఏవిధంగా ప్రయాణించారో వివరించారు.
అమాయకుల ప్రాణాలను బలి తీసుకునే నాయకుల నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రజలు వలసలు పోతున్నారని ఆయన అన్నారు.
క్రిస్మస్ సందర్భంగా సోమవారం నాడు పోప్ ఫ్రాన్సిస్ ‘దివ్య ప్రసంగం’ చేయనున్నారు. ఆదివారం సాయంత్రం వాటికన్‌లో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ..
''మేరీ, జోసెఫ్‌లు నడిచిన దారిలో కనపడని అడుగులు ఎన్నో..! తమ ఆత్మీయులను, పుట్టిన గడ్డను వదిలి బలవంతంగా వలస పోతున్న లక్షలాది మందిని నిర్లక్ష్యం చేయకండి. వారికి ఆహ్వానం పలకండి..'' అన్నారు.
81 సంవత్సరాల పోప్ ఫ్రాన్సిస్ పూర్వీకులు కూడా ఇటలీ నుంచి వలస వచ్చిన వారే!
ప్రపంచవ్యాప్తంగా వలసలు పోతున్న ప్రజల గురించి తన ప్రసంగంలో పోప్ ఫ్రాన్సిస్ ఎక్కువగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మందికి పైనే వలస పోతున్నారని ఆయన అన్నారు.
బెత్లెహామ్‌లో క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి బెత్లెహామ్ చర్చికి యాత్రికులు వచ్చారు.
జీసస్ పుట్టిన ప్రదేశంగా భావిస్తున్న ప్రాంతంలోనే ఈ చర్చిను నిర్మించారు.
అయితే.. గతంతో పోలిస్తే ఈ క్రిస్మస్‌కు బెత్లెహామ్ వచ్చిన యాత్రికుల సంఖ్య తక్కువే! ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెమ్‌ను గుర్తించినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మా ఇతర కథనాలు
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- జెరూసలెంలో భారత సంతతి సంగతేంటి?
- 'జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా ఒప్పుకునేదే లేదు'
- జెరూసలెం: మూడు మతాలకు పవిత్ర క్షేత్రంగా ఎలా మారింది?
- రోహింజ్యా సంక్షోభం: ఒక్క నెలలోనే 6,700కు పైగా హత్యలు
- రాయలసీమ అంటే హింస, వెన్నుపోట్లు, రక్తదాహం: వర్మ
- ఇలాగైతే.. లండన్‌లో తెలుగోళ్లకు ఇల్లు కష్టమే!
- ఇరాన్లో పుట్టింది మనింటికొచ్చింది - ఏంటది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









