విశాఖ: అప్పికొండ బీచ్‌లో బండరాళ్ల మధ్య మచిలీపట్నం యువతి ఎలా చిక్కుకుపోయారు? ఆమెతోపాటు వచ్చిన యువకుడు ఎక్కడ?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నం శివారు ప్రాంతమైన అప్పికొండ తీరంలో అక్టోబర్ 8 ఆదివారం రాత్రి ఓ యువతి ‘నన్ను కాపాడండి’ అంటూ రాత్రంతా అరుస్తూనే ఉన్నారు.
ఆ అరువులు వినేందుకు అక్కడ ఎవరూ లేరు. కానీ ఏదైనా సహాయం దొరుకుతుందేమోననే ఆశతో ఆ యువతి అరుస్తూ ఉన్నారు. బండరాళ్ల మధ్య చిక్కుకుని పోయిన ఆ యువతిని అక్టోబరు 9 సోమవారం స్థానిక జాలర్లు గుర్తించారు.
ఆమెను మచిలీపట్నానికి చెందిన దాసరి కావ్యగా గుర్తించారు.
ఆమె మచిలీపట్నం నుంచి విశాఖ ఎందుకొచ్చారు? బండరాళ్ల మధ్య ఎలా చిక్కుకుపోయారు?
అప్పికొండ బీచ్‌లో సోమవారం ఏం జరిగింది?
అప్పికొండ బీచ్ సమీపంలో ఒక శివాలయం ఉంది. శివరాత్రి సమయంలో తప్ప ఇక్కడ పెద్దగా జన సంచారం ఉండదు.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు మాత్రమే ఉదయం, సాయంత్రం తీరంలో కనిపిస్తుంటారు. ఆ తర్వాత అంతా బీచ్‌లో సందడే ఉండదు.
సోమవారం సాయంత్రం వేట నుంచి తిరిగి వచ్చి, ఇళ్లకు వెళ్తున్న మత్స్యకారులకు, ‘కాపాడండి’ అంటూ యువతి వేసిన కేకలు వినిపించాయి.
ఆ వైపు వెళ్లిన మత్స్యకారులకు రాళ్ల మధ్య చిక్కుకుని బయటకు రాలేకపోతున్న యువతి కనిపించారు.
“అతి కష్టం మీద ఆమెను బయటకు తీశాం. రాళ్ల మధ్య చిక్కుకుని పోయారు. ఆ రాయి కూడా ఎత్తుగా ఉండటంతో కింద చిక్కుకున్న ఆమెను గుర్తించడం కష్టమైంది. ఆమెను ఎలాగోలా బయటకు తీశాం. డోలి కట్టి ఒడ్డుకు తీసుకుని వచ్చాం. ఇక్కడకు ఎలా వచ్చారని అడిగితే మాత్రం ఏ వివరాలూ చెప్పలేదు. చాలాసేపటి తర్వాత తన పేరు దాసరి కావ్య అని, మచిలీపట్నం నుంచి వచ్చామని, తనతోపాటు ఒక యువకుడు కూడా ఉన్నాడని చెప్పారు. అయితే అతను ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు అనే వివరాలు మాత్రం చెప్పలేదు” అని కావ్యను కాపాడిన మత్స్యకార బృందంలో ఒకరైన అప్పలరాజు బీబీసీతో చెప్పారు.
‘‘కాసేపటి తర్వాత ఆ అబ్బాయి నంబరు చెప్పారు. అతనికి ఫోన్ చేసి విషయం చెప్పాం. వస్తున్నాను అని చెప్పారు. కానీ ఆ అబ్బాయి రాలేదు, అంబులెన్స్ పంపించారు. ఆమెను అంబులెన్స్ ఎక్కించాం. కాళ్లకు బలంగా దెబ్బలు తగిలిన ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తీసుకుని వెళ్లారు’’ అని అప్పలరాజు తెలిపారు.

సెప్టెంబర్ 29నే మచిలీపట్నంలో మిస్సింగ్
ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అప్పికొండ బీచ్‌లో ఒక బండరాయిని పట్టుకుని చిమ్మచీకట్లో భయాందోళనతో ఉండిపోయిన కావ్య, తన వివరాలు చెప్పేందుకు ముందు నిరాకరించారు. పోలీసులు ప్రశ్నించడం మొదలుపెట్టాక ఒక్కొక్కటిగా ఆమె చెప్పడం ప్రారంభించారు.
విశాఖ సౌత్ ఏసీపీ టి. త్రినాథ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను బీబీసీకి చెప్పారు.
‘‘అప్పికొండపై ఒక యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలతో ఉందని, బండరాళ్ల మధ్య చిక్కుకున్న ఆమెను రక్షించి ఒడ్డుకు తీసుకుని వచ్చామని స్థానిక జాలర్లు మాకు సోమవారం సాయంత్రం ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్నాం. ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాం. అయితే ఆమె చెప్పేందుకు నిరాకరించారు. కానీ తర్వాత ఆమె తల్లిదండ్రుల ఫోన్ నంబరు ఇవ్వడంతో వారికి ఫోన్ చేసి సమాచారం అందించాం.
తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం కావ్య సెప్టెంబర్ 29న మచిలీపట్నం నుంచి కనిపించకుండా పోయారు. ఆ విషయమై కావ్య తల్లిదండ్రులు అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 29నే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
దాంతో అక్కడి పోలీసులకు మేం సమాచారం అందించాం. దాంతో వారు కూడా విశాఖపట్నం బయలుదేరి వచ్చారు’’ అని త్రినాథ్ వివరించారు.
శివాలయంలో పెళ్లి
మచిలీపట్నం పోలీసులు రావడంతో కావ్య మరికొన్ని వివరాలు చెప్పారు.
కావ్య, భీమవరానికి చెందిన ఫణివర్మ ఇద్దరూ సెప్టెంబర్ 29న విశాఖప్నటంలోని గోపాలపట్నం వచ్చారు. అక్కడే ఒక లాడ్జ్‌లో బస చేశారు.
అక్టోబర్ 2న అప్పికొండ శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అరకు లోయ వెళ్లారు.
కొన్ని రోజుల తర్వాత అంటే అక్టోబర్ 8న మళ్లీ వారు వివాహం చేసుకున్న అప్పికొండ శివాలయానికి వచ్చారు. సాయంత్రం వరకు అక్కడే గడిపారు.
సాయంత్రం అక్కడున్న రాళ్లపై ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో కావ్య పెద్ద రాయిపై నుంచి కిందకు జారిపడిపోయారు.
అక్కడ నుంచి పైకి రాలేకపోయారు. అయితే ఆమెతో వచ్చిన అబ్బాయి ఏమయ్యారో తెలియడం లేదు.

ఫణివర్మ ఎక్కడ?
కావ్య పడిపోయిన తర్వాత అక్కడ ఫణివర్మ కనిపించలేదు. ఇప్పటికీ ఆయనెక్కడున్నారో తెలియలేదు.
ఆ యువకుడు ఏమయ్యారనే విషయంపై కావ్య సమాధానం చెప్పలేదు. కేవలం ఆయన మంచివాడని, ఆయన్ను ఏమీ అనకండి అనడమే కానీ మిగతా వివరాలు ఏమీ చెప్పడం లేదు.
పైగా తానంతట తానే జారిపడ్డానని, ఇందులో ఎవరి ప్రమేయమూ లేదని చెప్పడంతో తాము కూడా ఈ కేసులో ఇంకేమీ చేయడానికి లేదని పోలీసులు చెప్పారు.
కావ్య తల్లిదండ్రులు విశాఖపట్నం రావడంతో, కేజీహెచ్‌లో చికిత్స అనంతరం ఆమెను మచిలీపట్నం తీసుకుని వెళ్లిపోయారు.
కావ్య మచిలీపట్నం వెళ్లిపోవడం, ఆ యువకుడి తప్పేమీ లేదని కావ్యే స్వయంగా స్టేట్‌మెంట్ ఇవ్వడంతో తాము ఈ కేసులో ఇక ముందుకు వెళ్లడం లేదని దువ్వాడ పోలీసులు తెలిపారు.
రైలులో పరిచయం, ఫేస్‌బుక్‌లో ప్రేమ
రెండు కాళ్లకు తీవ్ర గాయాలైన కావ్యకు కేజీహెచ్‌లో వైద్యులు చికిత్స అందించారు. ఆ సమయంలో ఆమెను సంప్రదించిన మీడియాతో కావ్య మాట్లాడారు.
తాను, భీమవరానికి చెందిన ఫణివర్మ కలిసి విశాఖ వచ్చామని తెలిపారు.
వర్మ తనకు కొంత కాలం క్రితం కుటుంబంతో కలిసి షిరిడి వెళ్తున్నప్పుడు రైలులో పరిచయం అయ్యాడని, ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో రోజూ చాటింగ్ చేసుకోవడం వల్ల అది ప్రేమగా మారిందని కావ్య తెలిపారు.
తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అప్పికొండ వచ్చామని తెలిపారు.
వర్మ తినడానికి ఏమైనా తీసుకుని వస్తానని చెప్పి వెళ్లడంతో తాను సెల్ఫీలు తీసుకుంటున్నానని, ఆ సమయంలోనే రాయిపై నుంచి జారి పడ్డానని కావ్య చెప్పారు.
దాంతో రాత్రంతా ఎవరైనా వస్తారేమోనని అరుస్తూనే ఉన్నానని, కానీ ఎవరు రాకపోయేసరికి భయం వేసిందని, రాయిని ఆసరాగా చేసుకుని అలా ఆ రాత్రంతా గడిపానని తెలిపారు.
వర్మ ఆచూకీపై తమకు సమాచారం అందలేదని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: “గుండెలు పిసికేసీ తలంతా అదిమినట్లు అనిపిస్తోంది. నాకు ఇంకేమి తెలియదు” అంటూ ఆ గ్రామస్థులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?
- అల్-అక్సా మసీదు: ఇక్కడ మేకను బలి ఇవ్వడం గురించి రెండు మతాల మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతోంది
- ‘‘యుక్రెయిన్, రష్యాల యుద్ధాన్ని ఆపడానికి సాయం చేయండి’’ జిన్‌పింగ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడి వినతి
- కేరళ ఆదివాసీ యువకుడి హత్య కేసులో 5ఏళ్ల తరువాత తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














