ఇజ్రాయెల్ బాంబ్ షెల్టర్ నుంచి తెలుగు యువకుడి అనుభవాలు: ‘‘దాడులు మామూలే కదా అనుకున్నాం, కానీ ఇంత తీవ్రంగా ఉంటాయనుకోలేదు’’

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల దాడి అక్కడి పరిస్థితులన్నింటినీ ఒక్కసారిగా మార్చేసింది. గత శుక్రవారం వరకు అంతా ప్రశాంతంగా, నార్మల్‌గా సాగిన జీవితాలు.. ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడుపుతున్నాయి.
హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది అక్కడ పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, నిజామాబాద్‌కు చెందిన పల్లికొండ కిశోర్ వీడియో సంభాషణలో వివరించారు.
ఈ వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ నగరంలో ఏడేళ్లుగా ఉంటున్నా.
శనివారం ఉదయం ఆరున్నర నుంచి రాకెట్ దాడులు ప్రారంభమయ్యాయి.
సరిగ్గా ఆరున్నరకి రాకెట్ దాడి జరిగింది. అప్పుడు సైరన్ వచ్చింది.
కానీ, ఆ తర్వాత కొత్తగా ఏం జరిగింది అంటే.. సైరన్ రావట్లేదు కానీ రాకెట్లు పేలుతున్నట్లు శబ్దాలు మాకు వినిపిస్తున్నాయి.
20 నిమిషాల్లో 5 వేల రాకెట్లు పేల్చారని ఆ తర్వాత మాకు తెలిసింది.
శుక్రవారం వరకు మా లైఫ్ చాలా నార్మల్‌గానే ఉంది. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేవు. ప్రశాంతంగానే ఉన్నాం. కానీ, శనివారం రాకెట్ దాడుల శబ్దాలు విన్నాం.
తొలుత ఈ దాడులు మేం నార్మలే అనుకున్నాం.
ఎందుకంటే, ఈ ఏడేళ్లలో చాలాసార్లు రాకెట్ దాడులు చూశాం, విన్నాం కూడా. వాటిని ఐరన్ డోమ్‌లు అడ్డుకుంటాయి. వీటి వల్ల ఎవరికైనా గాయాలైతే, ఆ తర్వాత వార్తల్లో చూస్తాం.
కానీ, శనివారం అలా జరగలేదు. రాకెట్లు వస్తూనే ఉన్నాయి. మేమందరం బాంబర్ రూమ్స్‌కి వెళ్లాం. మాకు ఇక్కడ బాంబర్ షెల్టర్లు ఉంటాయి. సైరన్లు విన్న ప్రతీసారి బాంబర్ షెల్టర్స్‌కి వెళ్లాం.

ఫొటో సోర్స్, Getty Images
‘ఎమర్జెన్సీ పరిస్థితి అని ప్రకటించారు’
శనివారం ఉదయం 8 లేదా 9 గంటల ప్రాంతంలో వచ్చి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎమర్జెన్సీ పరిస్థితి అని చెప్పారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఎవరూ కూడా 10 మంది కలిసి బయట గుమికూడా కూడదని చెప్పారు. స్కూల్స్ మూసేశారు.
ఆదివారం ఇక్కడ నార్మల్ డే ఉంటుంది. అంటే శుక్రవారం, శనివారం వీకెండ్. ఆదివారం సాధారణ రోజులు మాదిరి పనులు చేసుకోవాలి. నేను నా పనిని క్యాన్సిల్ చేసుకున్నా.
హమాస్ పాల్పడిన దురాగతాల గురించి తెలుసుకున్న తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైంది.
ఆదివారం కూడా సైరన్లు రావడంతో మేం బంకర్లలోకి వెళ్లాం

‘మేమంతా సేఫ్‌గా ఉన్నాం’
ఇక్కడ తెలంగాణకు చెందిన వారు 600 మంది వరకు ఉంటాం. మేమంతా క్షేమంగా, సురక్షితంగా ఉన్నాం.
నేను నా కుటుంబానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే.. నేను క్షేమంగా ఉన్నా. భయపడకండి.
తెలుగు ప్రజలందరం క్షేమంగానే ఉన్నాం. మాకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఉంది.
ఆ గ్రూప్‌లోనే పరిస్థితుల గురించి ఒకరికొకరం షేర్ చేసుకుంటూ ఉన్నాం.
భారత రాయబారి కార్యాలయం కూడా మాకు అందుబాటులోనే ఉంది. ఏదైనా ఇబ్బంది ఉంటే కాంటాక్ట్ చేయమని చెబుతున్నారు.
వారు మాకు కాల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.
కానీ, బయట నార్మల్ లైఫ్ అయితే లేదు. ఇదైతే నిజం. ప్రజలెవరూ రోడ్డుపైన లేరు.
మందుల షాపులు, నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి తప్ప మిగతావేమీ తెరిచి లేవు. షాపింగ్ కాంప్లెక్స్‌లు అన్ని మూసివేసే ఉన్నాయి. కానీ, మా గురించి దిగులు చెందొద్దు.
ఇప్పుడే ఇక్కడ్నుంచి రావాలని అనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడతాయని అనుకుంటున్నాం ’’
అని పల్లికొండ కిశోర్ ఇజ్రాయెల్‌లో పరిస్థితులను వివరించారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- టైటాన్ సబ్ మెర్సిబుల్: 114 రోజుల తర్వాత దొరికిన శకలాలు, అవశేషాలు
- విశాఖపట్నం: రుషికొండపై నిర్మాణాలు సీఎం కార్యాలయం కోసమేనా, దసరా నుంచి ఇదే పాలనా కేంద్రం అవుతుందా?
- విశాఖ: అప్పికొండ బీచ్‌లో బండరాళ్ల మధ్య మచిలీపట్నం యువతి ఎలా చిక్కుకుపోయారు? ఆమెతోపాటు వచ్చిన యువకుడు ఎక్కడ?
- వరల్డ్ పోస్ట్ డే - 2023: 'పోస్టాఫీస్ లేకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో ఊహించడమే కష్టం'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















