టైటాన్ సబ్ మెర్సిబుల్: 114 రోజుల తర్వాత దొరికిన శకలాలు, అవశేషాలు

ఫొటో సోర్స్, US COAST GUARD
- రచయిత, మైక్ వెండ్లింగ్
- హోదా, బీబీసీ న్యూస్
టైటానిక్ ఓడ శిథిలాలను చూడటానికి వెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. ఈ ఏడాది జూన్‌లో ఈ ఘటన జరిగినప్పటి నుంచి అధికారులు సబ్ మెర్సిబుల్ శకలాల కోసం సముద్రంలో అన్వేషణ కొనసాగిస్తున్నారు. 114 రోజుల తర్వాత అట్లాంటిక్ సముద్రంలో మరికొన్ని శకలాలు, మానవ అవశేషాలను గుర్తించారు.
ఉత్తర అట్లాంటిక్‌లో సముద్రమట్టానికి 3,800 మీటర్ల దిగువన గల టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లిన 'టైటాన్ సబ్‌మెర్సిబుల్' పేలుడుకి గురై, అందులో ప్రయాణిస్తున్న అయిదుగురు మరణించారు.
18 జూన్ 2023న సముద్రంలోకి వెళ్లిన టైటాన్ నుంచి కొద్ది సేపటికే కమ్యూనికేషన్ తెగిపోయింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీంలు అన్వేషణ కొనసాగించాయి. చివరికి టైటాన్ సబ్ మెర్సిబుల్. సముద్రం అడుగు భాగానికి వెళ్లిన కొద్దిసేపటికే పేలిపోయిందని అధికారులు వెల్లడించారు.
ఇంజినీర్లు మంగళవారం టైటాన్ సబ్ మెర్సిబుల్ శిథిలాలు, మానవ అవశేషాలను సేకరించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అట్లాటింక్ సముద్ర తీరంలోని యూఎస్ పోర్ట్ సమీపంలో వీటిని గుర్తించారు. వైద్య అధికారులు మానవ అవశేషాలను పరిశీలించనున్నారు.

ఫొటో సోర్స్, OCEANGATE
కొనసాగుతున్న దర్యాప్తు..
ఓషియన్ గేట్ అనే సంస్థ రూపొందించిన ఈ టైటాన్ సబ్ మెర్సిబుల్‌ను ప్రయోగాత్మక క్రాఫ్ట్‌గా పేర్కొంది ఆ సంస్థ పేర్కొంది.
ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో 3800 మీటర్ల లోతున ఉన్న టైటానిక్ అవశేషాలను చూడాలనుకునే వారిని తీసుకువెళ్లేందుకు దీనిని రూపొందించారు.
18 జూన్ 2023న సముద్రంలోకి వెళ్లిన ఈ సబ్ మెర్సిబుల్‌లోొ సంస్థ చీఫ్ ఎగ్జిక్యుటివ్ స్టాక్టన్ రష్, బ్రిటీష్-పాకిస్తానీ వ్యాపారవేత్త షాహజాదా దావుద్, అతడి కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, మాజీ ఫ్రెంచ్ నేవీ డైవర్ పాల్ హెన్రీలు ఉన్నారు. వీరంతా ప్రమాదంలో మరణించారు.
ఈ ఘటనపై అమెరికా న్యాయస్థానం చేపట్టిన విచారణలో సంస్థ చీఫ్ ఎగ్జిక్యుటివ్ రష్ ఈ సబ్ మెర్సిబుల్‌లో ఉన్న భద్రతా లోపాలు, హెచ్చరికలను పట్టించుకోలేదన్న విషయం బయటకువచ్చింది. ఈ ప్రమాదం తర్వాత ఓషియన్ గేట్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను నిలిపివేసింది.
టైటాన్ సబ్ మెర్సిబుల్ హల్‌ను కార్బన్ ఫైబర్‌తో రూపొందించారు. టైటానియం, స్టీల్ లోహాలతో పోల్చితే కార్బన్ ఫైబర్ చాలా దృఢమైంది. అయితే, ఇది మానవులు లోతైన సముద్రంలో డైవ్ చేయడానికి అనువైనదే అని నిర్థరించడానికి విస్తృత స్థాయిలో పరీక్షలు జరగలేదు.
ఈ ప్రమాదంపై అంతర్జాతీయ దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే దీనిపై పబ్లిక్ హియరింగ్ ఉంటుందని యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది.
టైటాన్ సబ్ మెర్సిబుల్ లోపల ఎలా ఉంటుంది?
సబ్ మెర్సిబుల్ లోపలి భాగం చాలా ఇరుకుగా ఉంటుంది. ఇందులో కేవలం అయిదుగురు మాత్రమే ప్రయాణించవచ్చు.
ఇలాంటి యాత్రలకు తీసుకెళ్లే మిగతా వాటికంటే ఇది పరిమాణంలో పెద్దది అయినప్పటికీ, ఇందులో ప్రయాణికులు కింద కూర్చొనే వెళ్లాల్సి ఉంటుంది. అందులో స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగడం కూడా కష్టమే.
సబ్ మెర్సిబుల్ ముందు భాగాన ఒక పెద్ద గోపురం లాంటి పోర్ట్‌హోల్ (కిటికి వంటి నిర్మాణం) ఉంటుంది. దీనిద్వారా ప్రయాణికులు సముద్ర అంతర్భాగాన్ని చూడొచ్చు. సముద్రం లోతుల్లోకి మానవుల్ని తీసుకెళ్లే సబ్ మెర్సిబుల్ అన్నింటిలోకెల్లా ఇదే అతిపెద్ద వ్యూ పాయింట్ అని కంపెనీ చెప్పింది.
సముద్రం లోతుల్లో విపరీతమైన చలి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సబ్ మెర్సిబుల్ గోడలు వెచ్చగా ఉండేలా నిర్మాణం చేశారు. వెలుతురు కోసం లోపల లైట్లను ఏర్పాటు చేశారు. మ్యూజిక్ వ్యవస్థ కూడా ఉంది.
సబ్ మెర్సిబుల్ ముందు భాగంలో ఒక టాయ్‌లెట్ కూడా ఉంటుంది. దానికి తలుపు కాకుండా కేవలం కర్టెన్ మాత్రమే ఉంటుంది.
ప్రయాణానికి ముందు, ప్రయాణించేటప్పుడు ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రించుకోవాలని అప్పట్లో కంపెనీ వెబ్‌సైట్ సూచనల్లో పేర్కొన్నారు.
సబ్ మెర్సిబుల్ బయట శక్తిమంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. టైటానిక్ శిథిలాలు స్పష్టంగా కనిపించడం కోసం ఈ ఏర్పాటును చేశారు.
అంతేకాకుండా, దీని బయటవైపు అనేక 4కె కెమెరాలను అమర్చారు.
నౌక ఎక్కడుందో తెలుసుకోవడం కోసం లేజర్ స్కానర్, సోనార్లను బయటివైపు బిగించారు. లోపలి సిబ్బంది భారీ డిజిటల్ తెర మీద టైటానిక్ శిథిలాలను చూసే అవకాశం ఉండేది.
టైటాన్‌లో 96 గంటలకు సరిపడా ఆక్సీజన్ నిల్వలు ఉంటాయి. కానీ, సిబ్బంది శ్వాసరేటును బట్టి ఇందులో ఎక్కువ తక్కువలు ఉంటాయి.
ఇంటీరియర్‌లో ఎక్కువ భాగం ‘‘ఆఫ్ ద షెల్ఫ్ టెక్నాలజీ’’ని ఉపయోగించినట్లు కంపెనీ చెప్పింది.

పేలుడుకి కారణమేంటి?
అత్యధిక నీటి పీడనం కారణంగానే టైటాన్ పేలిపోయిందని భావిస్తున్నారు. అయితే, అలాంటి ఒత్తిడిని తట్టుకునేలా ఆ జలాంతర్గామిని నిర్మించారు.
ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల విశ్లేషణ దీనికి సహాయపడనుంది.
టైటాన్ కమ్యునికేషన్ తెగిపోయినప్పుడు అది సముద్ర మట్టానికి 3,500 మీటర్ల దిగువన ఉన్నట్లు భావిస్తున్నారు.
ఆ జలాంతర్గామి చాలా లోతుగా వెళ్లింది. ఆ సమయంలో దానిపై గల నీటి పరిమాణం ఈఫిల్ టవర్ బరువుకు సమానం. అంటే దాదాపు పదివేల టన్నుల బరువు ఉంటుంది.

ఫొటో సోర్స్, AMERICAN PHOTO ARCHIVE/ALAMY
క్షణాల్లో బూడిదగా మారిన శరీరాలు..
టైటాన్‌కు పగుళ్లు లేదా లోపం ఉంటే , దానిపై బయటి నుంచి కలిగే పీడనం తీవ్రత దానిపై పడుతుంది.
జలాంతర్గామి పైభాగం బద్దలైతే, అది గంటకు దాదాపు 2,414 కి.మీ. వేగంతో లోపలికి వెళుతుంది. అంటే సెకనుకు 671 మీటర్లు అని అమెరికా మాజీ న్యూక్లియర్ సబ్‌మెరైన్ అధికారి డేవ్ కోర్లే చెప్పారు.
ఈ నేపథ్యంలో టైటాన్ పూర్తిగా బద్దలవడానికి అవసరమయ్యే సమయం ఒక మిల్లీసెకన్ లేదా సెకనులో వెయ్యో వంతు మాత్రమే. టైటాన్ లోపల ఉండే గాలి హైడ్రోకార్బన్ ఆవిరితో అధిక సాంద్రతను కలిగి ఉంటుంది.
''టైటాన్ పైభాగం పగిలిపోయినపుడు ఆ గాలి స్వయంచాలకంగా మండుతుంది. వేగంగా పేలుతుంది'' అని కోర్లే చెప్పారు. దీంతో మానవ శరీరాలు కాలి తక్షణమే బూడిదైపోతాయి.
ఇవి కూడా చదవండి..
- స్పై డెత్స్: మజ్జోరే సరస్సు పడవ మునకలో గూఢచారుల మరణాలపై అనేక సందేహాలు
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















