హమాస్-ఇజ్రాయెల్ ఘర్షణ: ‘‘ఆకాశం నుంచి మృత్యువు మీదకు దూకుతుంటే ఎక్కడని దాక్కోగలం’’...బాధితుల వేదన

హమాస్, ఇజ్రాయెల్ యుద్దం

ఫొటో సోర్స్, AFP

భీకర యుద్దం జరుగుతున్న గాజా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సామాన్యుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వాళ్లది.

"ఈ దాడులతో భవనంపై ఏదో భూకంపం వచ్చినట్లు అనిపించింది. గుండె భయంతో కొట్టుకొంటోంది. నా శరీరమంతా వణుకుతున్నట్లు అనిపిస్తోంది" అని గాజాకు చెందిన నదియా (పేరు మార్చాం) అన్నారు.

సోమవారం తెల్లవారుజామున తలుపులు, కిటికీలు పగులుతున్న శబ్ధం వినిపించడంతో ఆమె నిద్ర లేచారు.

"ఉదయం 8 గంటలకు దాడి ప్రారంభమైంది, అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒక్క క్షణం కూడా ఆగలేదు" అని నదియా గుర్తుచేసుకున్నారు.

నదియా ఇద్దరబ్బాయిల తల్లి. ఒకరికి ఐదేళ్లు, మరొకరికి మూడు నెలలు.

అక్కడి తీరప్రాంతంలో కొత్తగా కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో ఉంటోంది నదియా కుటుంబం .

ఆమె భర్త అంతర్జాతీయ సహాయ సంస్థలో వైద్యుడు. దాడుల్లో గాయపడిన వారికి చికిత్స చేయడానికి భర్త వెళ్లడంతో నదియా పిల్లలతో ఒంటరిగా ఉన్నారు.

"ఏం జరుగుతోంది? ఇది ఎప్పుడు ఆగుతుంది?" అని ఆమె పెద్దబ్బాయి నదియాను అడుగుతున్నాడు.

పిల్లాడు భయపడకుండా ఉండేందుకు ఆమె యుద్ధం అంటే ఏంటో, బాంబులు ఎలా పేలతాయో చెబుతున్నారు. "పేలిన కొంతసేపటి తర్వాత శబ్ధం వినపడుతుంది" అని అన్నారు నదియా. పిల్లలు సురక్షితంగానే ఉన్నారని వారికి అర్థమవడానికి ఇలా అంటున్నారామె.

ఐదేళ్ల వయస్సులోని పిల్లలు తెలుసుకోకూడని ఘటనలవి. ఆ సమయంలో నదియా ఎంచుకున్న మార్గమే ఉత్తమం. అయితే తన 3 నెలల బాలుడు మాత్రం శబ్ధాల ధాటికి ఏమీ తినడం లేదు.

హమాస్, ఇజ్రాయెల్ యుద్దం

ఫొటో సోర్స్, AFP

'తొందరగా వెళ్లిపో అంటూ అరుపులు'

తన ఇల్లొదిలి రావడానికి నదియా ఇష్టపడలేదు. ఆ ఇంటితోనే ఆమెకు జ్ఞాపకాలున్నాయి.

కానీ, సోమవారం రాత్రి పక్కింటివాళ్లు మెట్లపై పరిగెత్తుతూ 'తొందరగా వెళ్లిపో' అంటూ అరుస్తుండటం విన్నారు.

ఆమెకు కొద్ది సెకన్ల పాటు ఏమీ అర్థం కాలేదు. ఆ సమయంలో తనతో ఇంటి నుంచి ఏం తీసుకెళ్లాలో కూడా తెలియలేదు ఆమెకు. ఆ క్షణంలో ఆమెలో నిస్సహాయత ఆవహించింది.

తర్వాత నదియా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటపడింది. చుట్టు పక్కల ఇళ్లు అప్పటికే నేలమట్టం కావడంతో తనకు పక్కింటివాళ్లు కనిపించలేదని ఆమె చెప్పారు.

తర్వాత నదియా తన పుట్టింటికి వెళ్లడానికి బయలుదేరారు. ఆ క్షణంలో ఆమె ''ఆకాశం నుంచే మృత్యువు మీదకు వస్తుంటే ఎక్కడని దాక్కోగలం'' అని అనుకున్నానని తెలిపారు.

గాజాకు జరిగిన నష్టం ఊహించలేనిదంటూ స్థానికులు, నదియా బీబీసీతో అన్నారు.

ఇల్లు

ఫొటో సోర్స్, Dina Faisal

ఫొటో క్యాప్షన్, ఇల్లు (యుద్దానికి ముందు, తర్వాత)

ప్రశాంతతే లేదు?

రిమల్ తీరప్రాంతంలో 39 ఏళ్ల దినా తన తల్లి, తండ్రి, సోదరి, ఇద్దరు మేనల్లుళ్లతో కలిసి వారి విల్లాలో తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుంచి ఆమె తన కుటుంబాన్ని రక్షించుకోవాలన్నది ఆమె ప్రయత్నం. ఇది సిటీ సెంటర్ నుంచి 3 కి.మీ దూరంలో ఉండే చాలా ప్రశాంతమైన ప్రాంతం.

అయితే, సోమవారం మధ్యాహ్నం భారీ శబ్ధాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది

"మేం ఇంట్లో క్షేమంగా ఉన్నామనుకున్నాం. అకస్మాత్తుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా కిటికీలు పగిలిపోయాయి. తలుపులు ఎగిరిపోయాయి. పైకప్పు భాగాలు మా తల దగ్గరే పడిపోయాయి" అని దినా గుర్తుచేసుకున్నారు. మరో ఆరు వైమానిక దాడులు ఆ ప్రాంతాన్ని తాకడంతో వారు ఇంట్లోనే ఉండిపోయారు.

ఎప్పుడైతే దాడులు ఆగిపోయాయో, వెంటనే దినా కుటుంబం అక్కడి నుంచి బయటికొచ్చేశారు.

అప్పటికే తగిలిన గాయాలకు చికిత్స చేసుకోవడానికి ఆసుపత్రికి పరిగెత్తారు. గాయాల తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో దినా ఊపిరి పీల్చుకున్నారు.

ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ పూర్తిగా చదును చేసి కనిపించింది. వారు ఇప్పుడు తాత్కాలికంగా మరొక ఇంటిలో ఉంటున్నారు.

తన ఇల్లు, జ్ఞాపకాలు, సురక్షితంగా భావించిన స్థలాన్ని కోల్పోవడంతో దిగాలుగా ఉన్నారు దినా. "గాజాలో ఏ ప్రదేశం సురక్షితంగా లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హమాస్, ఇజ్రాయెల్ యుద్దం

ఫొటో సోర్స్, AFP

గాలిలో ప్రాణాలు

అల్షిఫా ఆసుపత్రి గాజా స్ట్రిప్‌లో అతి పెద్దది. ఈ ఆసుపత్రిలో పరిస్థితి భయంకరంగా ఉందంటున్నారు చైర్మన్ డాక్టర్ మొహమ్మద్ అబో సులేమా.

"850 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు" అని అబో సులేమా చెప్పారు.

స్ట్రిప్‌కు విద్యుత్తు నిలిపివేయడంతో ఆసుపత్రి ఎలక్ట్రిక్ జనరేటర్లపై ఆధారపడి నడుస్తోంది. వీటిపై మరో మూడు రోజులు మాత్రమే కొనసాగించడానికి వీలుపడుతుందని ఆయన చెప్పారు.

గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించడంతో ఆసుపత్రిలో డీశాలినేటెడ్ నీటికి కొరత ఏర్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లకే ఈ నీటిని వినియోగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అబో తెలిపారు.

ప్రాణాలను రక్షించడానికే ఇతర డిపార్ట్‌మెంట్లను మూసివేశామన్నారు.

వైద్యుడికి తన రోగుల భద్రతే కాదు, సిబ్బంది రక్షణ కూడా అవసరం. అంబులెన్సులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఒక వైద్యుడిని చంపేశారని అబో తెలిపారు.

యూఎన్ పాలస్తీనియన్ శరణార్థి ఏజెన్సీ (UNRWA) ప్రకారం గత 24 గంటల్లో శరణార్థుల సంఖ్య వేగంగా పెరిగింది. గాజాకు చెందిన 1,87,000 మంది ఆశ్రయం కోరుతూ ఇళ్ల నుంచి బయటికి వచ్చారు.

భారీ బాంబు దాడులు కొనసాగుతున్నందున ఇప్పటివరకైతే 1,37,500 మందికి ఆశ్రయం కల్పించింది ఏజెన్సీ. అయితే త్వరలో ఈ శిబిరం నిండిపోతుందని ఆందోళన చెందుతోంది.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్ దాడులతో గాజాలో భారీ విధ్వంసం... డ్రోన్ దృశ్యాలు

'భయంతోనే బతుకుతున్నాం'

ఇషాక్ (27) తన వృద్ధ తల్లిదండ్రులు, కోడలు, తన ఐదుగురు పిల్లలతో షుజయ్య పరిసరాల్లో నివసించేవారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్దంలోకి దిగామని చెప్పడంతో, ఇషాక్ కుటుంబం పరిస్థితి తీవ్రతను ఊహించారు.

దీంతో తమ అత్యంత విలువైన వస్తువులను తీసుకొని, ఒక్కొక్కరు ఒక్కో బ్యాగ్‌తో పయనమయ్యారు.

దారిలో కిరాణా సామగ్రి కొనాలని చూశారు. అయితే శనివారం దాడుల గురించి తెలుసుకున్న వెంటనే చాలామంది గాజన్లు (గాజా స్ట్రిప్‌కు చెందిన వాళ్లు) సామగ్రి కొనుగోళ్లకు పరిగెత్తడంతో దుకాణాలు ఖాళీ అయిపోయాయి.

దీంతో ఇషాక్ కుటుంబం సిటీ సెంటర్‌లో గల ఎయిర్ రైడ్ షెల్టర్‌లో తలదాచుకున్నారు.

"మేం కరెంట్, నీళ్లు లేకుండా 48 గంటల పాటు అక్కడే ఉన్నాం" అని ఇషాక్ చెప్పారు. అర్ధరాత్రి భవనం విడిచి వెళ్లాలంటూ ఇజ్రాయెల్ సైన్యం నుంచి సోమవారం సాయంత్రం ఆయనకు సందేశం వచ్చింది.

సిటీ సెంటర్‌కు ఉత్తర దిశలో చాలా నిశ్శబ్ధంగా ఉంటుంది. అయితే ఇప్పుడా దారిలో భవనాలు అన్నీ నేలకూలి ఉన్నాయి.

ఇషాక్ కుటుంబంతో పాటు, మరో పది కుటుంబాలు అక్కడ పాక్షికంగా ధ్వంసమైన భవనంలోని పన్నెండో అంతస్తులో తలదాచుకున్నారు.

ఏం జరుగుతుందోననే భయంతోనే బతుకుతున్నామని, భద్రత కోసం పార్థిస్తున్నామని ఇషాక్ అంటున్నారు. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)