ఎటు చూసినా శవాలు, తలలు తెగిన మొండాలు.. కఫార్ అజాలో హమాస్ మారణకాండ ఇదీ

కిబ్బుట్జ్ నగరంలో హమాస్ దాడులు

ఫొటో సోర్స్, OREN ROSENFELD

ఫొటో క్యాప్షన్, తలలు తెగిన మొండాలను చూసినట్లు ఇజ్రాయెల్ సైనికుడు బీబీసీకి తెలిపారు
    • రచయిత, జెరెమీ బోవెన్
    • హోదా, ఇంటర్నేషనల్ ఎడిటర్, దక్షిణ ఇజ్రాయెల్

నోట్:ఈ కథనంలో కలవరపరిచే అంశాలు ఉన్నాయి.

హమాస్ మిలిటెంట్లు సరిహద్దుల్లో ఉన్న కంచెలను ధ్వంసం చేసి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. సరిహద్దుల్లోని కిబ్బుట్జ్‌ కఫార్ అజాలోకి ప్రవేశించి మారణకాండ సృష్టించారు. ఇజ్రాయెల్ సైన్యం నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని, సహాయక చర్యలు చేపట్టింది.

కఫార్ అజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యానికి ధ్వంసమైన ఇళ్లు, రోడ్లపై పడి ఉన్న ప్రజల శవాలు, తలలు నరికిన మృతదేహాలు కనిపించాయి.

అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు బీబీసీ బృందం వెళ్లింది. ఆ దృశ్యాలను చిత్రీకరించి, సైన్యంతో మాట్లాడింది.

ఇజ్రాయెల్ సైన్యం మృతదేహాలను తరలిస్తోంది. అక్టోబరు 7 శనివారం ఉదయం హమాస్ మిలిటెంట్లు సృష్టించిన మారణకాండకు కఫార్ అజాయే నిదర్శనమని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

నగరంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టడానికి ఇజ్రాయెల్ సైన్యానికి 12 గంటలకు పైగా సమయం పట్టిందని యూనిట్ 71 డిప్యూటీ కమాండర్, ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన దావిదీ బెన్ జైయాన్ తెలిపారు.

“భగవంతుడి దయ వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడగలిగాం” అని ఆయన బీబీసీతో అన్నారు.

“వారు మృగాల్లా ప్రవర్తించారు. కాక్‌టైల్ సీసాలను విసిరిన ఘటనలో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు” అని హమాస్ మిలిటెంట్లు ప్రవర్తించిన తీరు గురించి వివరించారు.

‘‘హమాస్ మిలిటెంట్లు నిరాయుధులైన, అమాయక పౌరులను చంపారు. కొంత మందిని శిరచ్ఛేదం చేసి దారుణంగా చంపారు” అని తెలిపారు.

కిబ్బుట్జ్ నగరం

ఫొటో సోర్స్, OREN ROSENFELD

ఫొటో క్యాప్షన్, కిబ్బుట్జ్‌లో హమాస్ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైన ఇళ్లు

పౌరులను దారుణంగా చంపారు: ఇజ్రాయెల్

మరో అధికారి మాట్లాడుతూ.. “పౌరులను దారుణంగా చంపారు. కొంత మందిని శిరచ్ఛేదం చేశారు. ఆ దృశ్యం చూడటానికే భయానకంగా ఉంది. మా శత్రువు ఎవరో, మా లక్ష్యం ఏమిటో మాకు తెలుసు. మేం న్యాయం కోసం పోరాడతాం. ఈ సమయంలో ప్రపంచ దేశాలు మాకు మద్దతుగా నిలవాలి” అని అన్నారు.

మరో అధికారి మాకు స్లీపింగ్ బ్యాగ్‌ను చూపించారు. ఆ బ్యాగ్‌లో మహిళ శవం ఉంది. చివరన కనిపిస్తున్న ఉబ్బిన కాలి బొటన వేలుని చూపిస్తూ, “ఆ మహిళను ఇంటి ఆవరణలోనే శిరచ్చేదం చేశారు. నేను ఆమె శరీరాన్ని చూడలేకపోయాను. ఆమె మృతదేహానికి కాస్త దూరంలోనే హమాస్ సాయుధుడి మృతదేహం మాకు కనిపించింది” అని చెప్పారు.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, OREN ROSENFELD

ఫొటో క్యాప్షన్, పహారా కాస్తున్న ఇజ్రాయెల్ సైన్యం

హమాస్ దాడిలో మొదట దెబ్బతిన్న ప్రాంతం

హమాస్ మెరుపుదాడికి కిబ్బుట్జ్ కఫార్ అజా ప్రాంతమే మొదట దారుణంగా దెబ్బతింది. సరిహద్దులు ధ్వంసం చేసి, ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లను కిబ్బుట్జ్ సరిహద్దు సైన్యం, సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేసిన అనుభవం ఉన్న పౌరులు ఎదుర్కొన్నారు. వారిని నిలువరించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం ఆ మృతదేహాలను గుర్తించి, వాటిని నల్లటి ప్లాస్టిక్ బ్యాగుల్లో చుట్టి తరలిస్తోంది సైన్యం. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది.

1948లో ఇజ్రాయెల్ ఏర్పాటు సమయంలో జియోనిజం ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడింది కిబ్బుట్జ్ నగరం. 2007లో ఇజ్రాయెల్ దేశం గాజా సరిహద్దును మూసివేసినప్పటి నుంచి తరచూ రాకెట్ దాడులకు గురవుతూనే ఉంది.

హమాస్ బెడద ఉన్నప్పటికీ గాజా సరిహద్దున ఉన్న ప్రాంతాల్లోని ప్రజల జీవనం బాగానే సాగింది. ఈ కిబ్బుట్జ్ నగరం అన్ని వసతులతో నిర్మితమైంది. ఇక్కడ ప్రతి ఇంటికి సేఫ్ రూంలు ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాలలు, ప్రజలు సేదతీరేందుకు అనువుగా విడిది ప్రాంతాలు ఉన్నాయి.

అయితే హమాస్ ఇలా దాడులు చేస్తుందని, ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించి మరీ పౌరులను చంపుతుందని ఇక్కడి ప్రజలు సహా ఎవరూ కనీసం ఊహించలేదు.

దాడులను ముందే గుర్తించడంలోనూ, ప్రజలను రక్షించడంలోనూ ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్‌, మిలిటరీ విఫలమయ్యాయని ఇజ్రాయెల్ ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉన్నాయి.

ఆ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు పొదలు, ఇళ్ల ఆవరణల్లో పడి ఉన్నాయి. వాటి సమీపంలో సరిహద్దు దాటేందుకు వినియోగించిన మోటార్ బైక్‌లు పడి ఉన్నాయి. సరిహద్దులను దాటేందుకు వాడిన పారా గ్లైడర్ శిథిలాలు కూడా కనిపించాయి.

కఫార్ అజా ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని, గాజా సరిహద్దుల వద్ద సైన్యాన్ని మోహరించింది ఇజ్రాయెల్.

మేం (బీబీసీ బృందం) కిబ్బుట్జ్ ప్రాంతానికి చేరుకునే సమయానికి వందల కొద్దీ ఇజ్రాయెల్ సైనికులు సరిహద్దుల వద్ద పహారా కాస్తున్నారు. మాకు వారి రేడియో శబ్దాలు వినిపించాయి. గాజా సరిహద్దులో ఉన్న భవనంపై కాల్పులు జరపాలని కమాండర్ ఆదేశించారు. మరుక్షణమే తుపాకుల శబ్దాలు వినిపించాయి.

మేం కఫార్ అజాలో ఉన్న సమయంలో మాకు గాజా నుంచి వైమానిక దాడుల శబ్దాలు వినిపించాయి.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, OREN ROSENFELD

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ సైన్యం

యుద్ధ చట్టాల ఉల్లంఘన

ఊహించని ఈ ఘటన, వందల కొద్దీ పౌరుల మరణాలతో ఇజ్రాయెల్ ఇంకా షాక్‌లోనే ఉంది. మరోవైపు గాజాలో కూడా వందల కొద్దీ పౌరులు చనిపోతున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు పౌరుల ప్రాణాలను రక్షించాలని చెప్తున్నాయి.

హమాస్ వందల మంది పౌరులను చంపడం యుద్ధ చట్టాల తీవ్ర ఉల్లంఘనగా కనిపిస్తోంది. అయితే హమాస్ దాడిని, తాము గాజాపై చేస్తున్న వైమానిక దాడితో పోల్చడాన్ని ఇజ్రాయెల్ ఖండిస్తోంది.

కిబ్బుట్జ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే ఆపరేషన్‌కు సారథ్యం వహించిన మేజర్ జనరల్ ఇతాయ్ వెరువ్‌తో మేం మాట్లాడాం.

“ఇజ్రాయెల్ యుద్ధ చట్టాలను గౌరవిస్తూ పోరాటం చేస్తోంది” అని ఆయన అన్నారు.

“మేం మా విలువలు, సంస్కృతి కోసం పోరాడుతున్నాం. మేం ఇజ్రాయెల్ దేశస్థులం, యూదులం. దూకుడుగా, బలంగా పోరాడుతూనే నైతిక విలువలకు కట్టుబడి ఉంటాం” అని ఆయన అన్నారు.

యుద్ధ చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే పాలస్తీనీయుల మరణాల సంఖ్య పెరిగేకొద్దీ ఇజ్రాయెల్ మరిన్ని విమర్శలను ఎదుర్కోవలసి రావొచ్చు.

వీడియో క్యాప్షన్, దాని ముందున్న సవాళ్లేంటి?

మేం సిద్ధంగా ఉన్నాం..

పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ఇజ్రాయెల్ సైనికుడితో మేం మాట్లాడాం.

తాము కఫార్ అజాకు చేరుకున్న సమయంలో అంతటా ‘ఉగ్రవాదులే’ ఉన్నారని ఆయన తెలిపారు.

“వారిపై పోరాటం కష్టతరంగా అనిపించిందా” అన్న ప్రశ్నకు “అవును. అది మీరు ఊహించను కూడా లేరు” అని ఆయన సమాధానం ఇచ్చారు.

“ఒక సైనికుడిగా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఎదుర్కొన్నారా’’ అని అడిగితే, లేదన్నారు.

“తరువాత ఏం జరుగుతుంది” అని ఆయన్ని అడిగాను.

“నాకు తెలియదు. నా పైఅధికారులు ఏం చెప్తే అది చేస్తాను. బహుశా మేం గాజాలోకి వెళ్లొచ్చు” అన్నారు.

“గాజాలోకి ప్రవేశిస్తే, పోరాటం క్లిష్టంగా మారుతుంది కదా” అని నేను ప్రశ్నించాను. అందుకు ఆయన సమాధానంగా- “అవును. కానీ మేం అందుకు సిద్ధంగా ఉన్నాం” అన్నారు.

కిబ్బుట్జ్‌లో హమాస్ సృష్టించిన మారణకాండను కళ్లారా చూశానని సైనిక అధికారి దావిదీ బెన్ జైయాన్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు రాజకీయంగా భిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నప్పటికీ, ఇప్పుడు అందరూ ఐక్యంగా ఉన్నారని అన్నారు.

మధ్యధరా ప్రాంతంలోని ఉష్ణోగ్రతల వల్ల మృతదేహాలు కుళ్లిన స్థితిలో, దుర్వాసన వస్తున్నాయి. సైనికులు పేలని ఆయుధాలను గుర్తిస్తూ, ట్రాప్‌లేమైనా ఉన్నాయా అని పరిశీలిస్తూ భవన శిథిలాలు, గార్డెన్ ఏరియాల్లో పడి ఉన్న మృతదేహాలను గుర్తించి తరలిస్తున్నారు. ఓ గార్డెన్ ఏరియాలో గ్రెనేడ్‌ను గుర్తించారు.

ఇజ్రాయెల్ సైనికులు హమాస్ రాకెట్ దాడుల హెచ్చరికలను అనుసరించి, తమని తాము రక్షించుకుంటూ, మృతదేహాలను తరలించే పనిలో ఉన్నారు.

మేం కఫార్ అజా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే హెచ్చరికలు పెరిగాయి.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)