రెండో ప్రపంచ యుద్ధంలో మాదిరి ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్ పారాచూట్లను ఎలా వాడింది?

పారాచూట్‌తో ఇజ్రాయెల్‌పై దాడి

ఫొటో సోర్స్, HAMAS

ఫొటో క్యాప్షన్, పారాచూట్ ద్వారా తమ ఫైటర్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడినట్లు తెలుపుతూ ఫోటో విడుదల చేసిన హమాస్ అల్-కస్సమ్ బ్రిగేడ్
    • రచయిత, మొహమ్మద్ హమ్దార్, హనన్ రాజెక్
    • హోదా, బీబీసీ న్యూస్ అరబిక్

ఇజ్రాయెల్‌పై భీకర దాడులలో భాగంగా సరిహద్దును దాటడానికి హమాస్ మిలిటెంట్లు పారాచూట్లను కూడా వినియోగించారు.

హమాస్ మిలటరీ విభాగమైన ‘ఇజ్ అల్ దిన్ అల్-కస్సమ్ బ్రిగేడ్స్’ గాజా స్ట్రిప్ పరిసరాలలోని ఇజ్రాయెల్ పట్టణాలపైనా, వేడుకలకు హాజరయ్యే వారిపైనా విరుచుకుపడింది. భీకరమైన ఈ మెరుపుదాడిని ‘అల్ అక్సా ఫ్లడ్’గా పిలుస్తున్నారు.

సముద్ర తీర ప్రాంతం, భూ భాగాలలోకి పాలస్తీనా ఫైటర్లు పారాచూట్ల ద్వారా చొరబడినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి రిచర్డ్ హెక్ట్ నిర్ధరించారు.

అల్ కస్సమ్ బ్రిగేడ్స్ పారాచూట్ల నుంచి దిగుతున్న ఫోటోలు, వీడియో క్లిప్స్‌ సామాజిక మాధ్యమాలలో షేర్ అయ్యాయి.

ఇజ్రాయెల్‌పై దాడులలో ఈ టెక్నిక్‌ను వాడటం ఇదే మొదటిసారి.

ఇజ్రాయె‌ల్‌పై తన ఫైటర్ దాడి ప్రారంభించిన ఫోటోను అల్ కస్సమ్ విడుదల చేసింది.

హమాస్ ఫైటర్లు

ఫొటో సోర్స్, HAMAS

ఫొటో క్యాప్షన్, తన ఫైటర్లు దాడి ప్రారంభించిన ఫోటోను విడుదల చేసిన హమాస్ అల్-కస్సమ్ బ్రిగేడ్

వాయుమార్గంలో కంచెను దాటి..

ఇజ్రాయెల్‌ నుంచి గాజాను వేరుచేస్తున్న కంచెను పాలస్తీనా మిలిటెంట్లు పారాచూట్లతో దాటగలిగారు. ఒకరిద్దరిని మోసుకుపోగల సామర్థ్యమున్న పారాచూట్లను వారు వాడారు.

జనరేటర్, బ్లేడ్‌లతో నడిచే పారాచూట్లతో గాజా స్ట్రిప్ పరిసరాలలోని ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకుపోగలిగారు.

అక్టోబరు 7న ఇజ్రాయెల్ గాజా సరిహద్దు కంచెను పాలస్తీనియన్లు ధ్వంసం చేశాక, ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోకి మిలిటెంట్లు చొరబడ్డారు.

రెండో ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రెండో ప్రపంచ యుద్ధంలో శత్రు దేశాల్లో దిగేందుకు పారాచూట్లను వాడిన సైనికులు

రెండో ప్రపంచ యుద్ధంలో మోహరింపు

మిలటరీ పారాచూట్లను సహజంగా ఆర్మీ విభాగాలకు ఆయుధాలను, ఇతర ఉపయోగపడే వస్తువులను మోసుకుపోవడానికి వినియోగించేవారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పారచూట్ల టీమ్‌లను మొదటిసారి జర్మనీ, మిత్ర రాజ్యాలు మోహరించాయి.

1987 నంబర్ 26న ఆత్మాహుతి దాడిలో వాడిన ఇంజిన్ గ్లైడర్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 1987 నంబర్ 26న ఆత్మాహుతి దాడిలో వాడిన ఇంజిన్ గ్లైడర్

1987 నాటి గ్లైడర్ దాడిని గుర్తుకుచేస్తోంది

పాలస్తీనా విముక్తి కోసం ఓ పాలస్తీనియుడు, ఓ సిరియన్ కలిసి చేసిన గ్లైడర్ ఆపరేషన్ని హమాస్ అక్టోబరు 7 నాటి దాడి గుర్తుకు తెచ్చింది.

పాలస్తీనా విముక్తి కోసం వారిద్దరూ లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ మిలటరీ స్థావరంపై 1987లో దాడి చేశారు.

మోటార్లతో కూడిన పారాచూట్లను వాడటం ద్వారా ఫైటర్లు చాలా తేలికగా భూమి నుంచే గాలిలోకి ఎగరగలుగుతున్నారు.

ఈ ఇంజిన్ పారాచూట్‌కు గంటకు 56 కిలోమీటర్ల ప్రొపల్షన్ శక్తిని ఇస్తుంది.

భూమికి 5 వేల అడుగుల ఎత్తులో పారాగ్లైడర్స్ మూడు గంటల సేపు ఎగరగలుగుతారు.

పారాగ్లైడింగ్ వెబ్ సైట్ ప్రకారం ఇవి 230 కిలోల బరువుకు సమానమయ్యే నలుగురు మనుషులను మోసుకుపోగలవు.

గొడుగు అకారంలో ఉండే ఈ గ్లైడర్లు ఒక సీటును కలిగి ఉంటాయి. లేదంటే ఇద్దరు వ్యక్తులు కూర్చునే మూడు చక్రాల బండితో కూడి ఉంటాయి.

ఇజ్ అల్-కస్సమ్ బ్రిగేడ్స్‌కు చెందిన మిలటరీ మీడియా పోస్టు చేసిన వీడియోలో పారాగ్లైడర్ల ప్రయోగం కనిపిస్తోంది.

ప్రతి పారాగ్లైడర్‌లో ఒకరో ఇద్దరో ఫైటర్లు ఉన్నారు.

మరో వీడియోలో ఫైటర్లు గాలిలో నుంచే కాల్పులు జరడపం, భూమిపైకి దిగడానికి ముందే ఇజ్రాయెలీ స్థావరాలపై విరుచుకుపడటం కనిపించాయి.

కొన్నిపారాచూట్లను ఫైటర్లు మోటారు సైకిళ్ళపై తీసుకువెళుతున్నారు.

ఈ పారాట్రూప్ దళాలను హమాస్ ‘‘స్కర్ స్క్వాడ్రన్’’గా పిలుస్తోంది.

అక్టోబర్ 10న గాజా నుంచి పేల్చిన రాకెట్లను కిందకి కూల్చిన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 10న గాజా నుంచి పేల్చిన రాకెట్లను కిందకి కూల్చిన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ

ఇజ్రాయెల్ ఆర్మీ పారాచ్యూట్లను ఎందుకు కనిపెట్టలేదు?

గాజా నుంచి పెద్దఎత్తున జరిగిన రాకెట్ల దాడి మాటున పారాగ్లైడర్ గాజా నుంచి ప్రయాణించడం హమాస్ మీడియా పబ్లిష్ చేసిన వీడియోలలో ఉంది.

వారిలో కొందరు తక్కువ ఎత్తులోనూ, మరికొందరు బాగా ఎత్తులోనూ ఎగురుతున్నట్టుగా కనిపించారు.

గాజా పరిసరాలలో వారు ఎగురుతున్న దృశ్యాలు కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వీరిని గుర్తించడంలో ఆర్మీ ఎందుకు విఫలమైందని ఇజ్రాయెలీ మీడియా ప్రశ్నిస్తోంది.

పారాచూట్లతో పాలస్తీనా ఫైటర్లు సరిహద్దు దాటుతున్న దృశ్యాలను పౌరులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.

వీటిని తేలికగా గుర్తించే అవకాశం ఉన్నా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎందుకు స్పందించలేదో ఇజ్రాయెలీ దళాలు వెల్లడించాల్సి ఉంది.

ఐరన్ డోమ్‌, రాడార్లు పారాచూట్లను గుర్తించలేవా?

సరిహద్దు వద్ద పహారా కాయడానికన్నా ఇజ్రాయెలీలు సాంకేతికతను ఎక్కువగా నమ్ముకున్నారా?

ఐరన్ డోమ్, రాడార్ల లాంటి ఇజ్రాయెలీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పారాచూట్ల లాంటి చిన్నపాటి ఎగిరే వస్తువులను గుర్తించలేవని కొన్ని రిపోర్టులు చెపుతున్నాయి.

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మిస్సైల్ నిరోధ వ్యవస్థ గాజా స్ట్రిప్ నుంచి ప్రయోగించిన రాకెట్లను అడ్డుకోవడం మంగళవారం నాడు దక్షిణ ఇజ్రాయెల్‌లో సెడార్ట్ నుంచి కనిపించింది.

హమాస్ ఐదు వేల రాకెట్లతో విస్మయం గొలిపే దాడులు మొదలు పెట్టినట్టు అల్ కస్సమ్ బ్రిగేడ్స్ కమాండర్ ముహమ్మద్ అల్ డెఫ్ మొదటిరోజు ప్రకటించారు.

రాకెట్ల దాడులతో పాటు సముద్ర, భూమార్గాలలోనూ హమాస్ ఫైటర్లు దాడులు చేశారు. వాయుమార్గంలో కూడా పారాచూట్లను వినియోగించారు.

పారాచూట్ దాడులు, ఎయిర్ డిఫెన్స్‌ను తప్పించుకోవడంలో వాటి సామర్థ్యం హమాస్ ఫైటర్లు సరిహద్దులోకి చొచ్చుకు రావడంలో ప్రధాన పాత్ర పోషించినట్టు మీడియా, మిలటరీ రిపోర్టులు సూచిస్తున్నాయి.

మొదటి రోజు ఊహించని స్థాయిలో నష్టం జరిగింది. 100 మంది పౌరులు, సైనికులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకువెళ్లారు. ఇప్పుడు వారిని చంపుతామని బెదిరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)