హమాస్ చెరలోని 150 మంది బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ ఏం చేయనుంది? నెతన్యాహు డైలమా ఏమిటి?

- రచయిత, ఫ్రాంక్ గార్డనర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హమాస్ చెరలోని బందీల విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం డైలమాలో ఉంది. ఇపుడు రిస్క్‌లతో కూడిన సాయుధ ఆపరేషన్‌కు ప్రయత్నిస్తుందా? లేదా రాజీ చేసుకోనుందా?
గత శనివారం హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లో దాదాపు 150 మందిని బందీలుగా పట్టుకున్నారు.
అనంతరం వారిని గాజాలోని రహస్య ప్రదేశాల్లో ఉంచారు. ఈ బందీలలో మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. దీంతో ఇజ్రాయెల్ సైనికులు గాజా సరిహద్దుల్లో వేలల్లో మోహరించారు.
గాజాపై తన సైన్యంతో గ్రౌండ్ అటాక్ చేయాలని ఇజ్రాయెల్ భావిస్తున్న తరుణంలో ఈ బందీలకు ప్రాణహానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఒప్పందం చేసుకుంటాయా?
150 మంది బందీలలో కొందరి వివరాలను బీబీసీ విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. వారిలో 13 మంది చిన్నారులు ఉండగా, 60 ఏళ్లు పైబడిన వారు ఐదుగురు కంటే ఎక్కువున్నారు.
ఇదే క్రమంలో తమ దేశానికి చెందిన 14 మంది హమాస్ బందీలుగా ఉన్నారని థాయ్‌లాండ్ కూడా ప్రకటించింది.
బందీలలో కొందరిని విడిపించేందుకు ఖతార్, ఈజిప్ట్, మరికొన్ని దేశాలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నారు.
ఇజ్రాయెల్‌లో ఖైదు అయిన 36 మంది పాలస్తీనా మహిళలు, యువతకు బదులుగా హమాస్ బందీలలోని మహిళలను, పిల్లలను విడుదల చేసే అవకాశం ఉంది.
‘‘సాధారణ సమయాల్లో ఇజ్రాయెల్ మొదటి ప్రాధాన్యం బందీలను క్షేమంగా తీసుకురావడమే, కానీ నేడు దాని ప్రాధాన్యం హమాస్ నిర్మూలన’’ అని మైఖేల్ మిల్‌స్టెయిన్ అంటున్నారు.
మైఖేల్ ఇజ్రాయెల్‌లోని రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలసీ అండ్ స్ట్రాటజీలో సీనియర్ విశ్లేషకుడు. ఆయన ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లో కూడా పనిచేశారు.
ఇరు వైపులా కోపం, ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌గానీ, హమాస్‌గానీ రాజీపడి పరస్పరం ‘రాయితీలు’ ఇచ్చుకొనే ధోరణిలోనూ లేవు.
మిలిటెంట్లు తమ దక్షిణ సరిహద్దులోకి అంత సులభంగా చొరబడి 1,200 మందిని ఎలా హతమార్చారని ఇజ్రాయెలీలే ఆశ్చర్యపోతున్నారు. వారిపై చాలా కోపంతోనూ ఉన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ ఇప్పటికే రెండు వేలకు పైగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వెయ్యి మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. అంతేకాదు గాజాలో ఇంధనం, విద్యుత్తు, నీరు, మందుల సరఫరా కూడా నిలిపివేశారు.

హమాస్‌కు ఇదో చెడు ప్రత్యామ్నాయమా?
ఇజ్రాయెల్ ఎటువంటి హెచ్చరికలు లేకుండా వైమానిక దాడి చేసి, తమ పౌరులను చంపినందుకు ప్రతీకారంగా బందీలను ఉరితీస్తామని హమాస్ బెదిరించిందని అంటున్నారు.
అయితే హమాస్ ఈ హెచ్చరిక చేసిందనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఎంతకూ తగ్గడం లేదు. గాజాలోని అనేక ప్రాంతాలు శిథిలాలుగా మారుతున్నాయి.
మహిళలు, పిల్లలు, వృద్ధులను బందీలుగా చేసుకుని హమాస్ అంత ఉత్సాహంగా ఉండబోదని మైఖేల్ అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో హమాస్‌కు ఇదో చెడు ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు.
''బందీలను సురక్షితంగా ఉంచాలి, నిరంతర వైమానిక దాడుల మధ్య అది అంత తేలికైన పని కాదు. ఇజ్రాయెల్ సైనిక సిబ్బందిని బందీలుగా పట్టుకోని హమాస్ పెద్ద మొత్తంలో ప్రయోజనాన్ని పొందాలనుకుంటోంది. ఒకవేళ ఏవైనా చర్చలు జరిగితే, వారిని విడుదల చేయడానికి హమాస్ పెద్ద మొత్తంలో డిమాండ్ చేయవచ్చు'' అని అన్నారు మైఖేల్.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ డైలమాలో ఎందుకుంది?
బందీల విషయంలో ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం డైలమాలో ఉంది.
రిస్క్‌లతో కూడిన సాయుధ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందా? లేక హమాస్‌ను తమ వైమానికి దాడులతో బలహీనపరిచి, రాజీ చేసుకునే వరకు వేచి ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఇది ఇజ్రాయెల్‌ను ఇరకాటంలో పెట్టొచ్చు. ఎందుకంటే బందీలను భూగర్భ సొరంగాలు, బంకర్లలో ఉంచినట్లు అనుమానిస్తున్నారు.
అదే సమయంలో వైమానిక దాడులు చేస్తే వారు సురక్షితంగా ఉంటారనడానికి గ్యారెంటీ లేదు. కాపలా ఉన్నవారు భయంతోనో, కోపంతోనో బందీలను చంపే ప్రమాదం కూడా ఉంది.
2012లో నైజీరియాలోని జిహాదీల చేతిలో ఉన్న ఇద్దరు బందీలను రక్షించేందుకు బ్రిటన్, నైజీరియా ప్రత్యేక దళాలు చేసిన ఆపరేషన్ విఫలమైందనేది ఇజ్రాయెల్ దృష్టిలో ఉండే ఉంటుంది.
గాజాకు తీసుకెళ్లిన బందీల ఆచూకీ తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ వార్ రూం ఏర్పాటు చేసుకుంది.
ఇప్పటికే తమ సరిహద్దులో బందీలుగా ఉన్న ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం, ప్రత్యేక దళాలు రక్షించాయి. అక్కడ వాళ్లను నిర్బంధించిన వారిని చంపేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
బందీలను ఇజ్రాయెల్ రక్షించగలదా?
మైఖేల్ మిల్‌స్టెయిన్ ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లో 20 ఏళ్లు పనిచేశారు.
గాజాలోని ప్రతి వీధి లేదా ఇంటి డేటా ఇజ్రాయెల్ సైన్యానికి అందుబాటులో ఉండకపోవచ్చని ఆయన అంటున్నారు. అది హమాస్ నియంత్రణలోని భూభాగమని, సెల్లార్లు, సొరంగాల నెట్‌వర్క్‌లో బందీలను దాచగలదని తెలిపారు.
బందీలను రక్షించడంలో ఇజ్రాయెల్‌కు నైపుణ్యం ఉంది. ఇందుకోసం సైన్యానికి కఠిన శిక్షణ ఇస్తారు.
1957లో ఏర్పాటుచేసిన ఇజ్రాయెల్ రహస్య 'సయెరెట్ మత్కల్' యూనిట్, బ్రిటన్ ఎస్ఏఎస్ లేదా అమెరికా డెల్టా ఫోర్స్ మాదిరి పనిచేస్తుంది.
1976లో యుగాండా విమానాశ్రయంలో విమానం హైజాక్ అయినపుడు మత్కల్ యూనిట్ కమాండోలు బందీలను రక్షించడంతో ఈ ఫోర్సుకు ప్రాచుర్యం లభించింది.
ఆ యూనిట్ కమాండర్ యోనాటన్ నెతన్యాహు. ఆ ఆపరేషన్‌లో మరణించిన ఏకైక ఇజ్రాయెలీ కమాండో ఆయన మాత్రమే. ఆయన సోదరుడు బెంజమిన్ నెతన్యాహు నేడు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి.
చర్చల ద్వారా బందీలను విడుదల చేసే వరకు వేచి ఉండాలా లేక ఆపరేషన్ చేపట్టాలా అనేది ఆయన తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.
దీనికి అమెరికా ఇంటెలిజెన్స్, సాయుధ దళాల రూపంలో సహాయం అందిస్తోందనే వార్తలు వచ్చాయి. ఒక పెద్ద అమెరికన్ నౌకాదళం తూర్పు మధ్యధరా ప్రాంతంలో క్యాంపు వేసుకుని మరీ ఉంది.
ఇదే సమయంలో హమాస్ తనకు తాను భారీ యుద్ధం చేయగలననీ నిరూపించుకుంది. హమాస్ టెక్నాలజీ, అటాక్ సామర్థ్యంలో ఇజ్రాయెల్‌తో పోటీ పడుతోంది.
150 మంది బందీలకు కాపలాగా ఉన్న సాయుధులు వీలైనంత వరకు ఆఫ్‌లైన్‌లోనే ఉంటున్నారు. అదే సమయంలో బందీల వద్ద ఉన్న డిజిటల్ పరికరాలను వారు తప్పనిసరిగా తొలగించి ఉంటారు.
"ఇజ్రాయెల్‌కు తన చరిత్రలో ఇప్పటివరకు ఎదుర్కోని అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఇది" అని మైఖేల్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
- వరదలతో అప్పుల పాలై కూతుళ్లను అమ్ముకొంటున్న రైతులు
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















