గాజాలో భూతల దాడులు చేసి ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని సాధించగలదా?

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

హమాస్‌ను ఈ భూమి మీద లేకుండా తుడిచి పెడతామని ఇజ్రాయెల్ నాయకులు ఇప్పటికే ప్రకటించారు.

ఇటీవల ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడిలో సుమారు 1300 మంది చనిపోయిన నేపథ్యంలో ‘‘ఇక హమాస్‌కు చెందిన ప్రతి సభ్యుడు చనిపోయిన వాడికిందే లెక్క’’ అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

గాజాలో ఇంతకు ముందెన్నడూ నిర్వహించని రీతిలో చర్యలు తీసుకోవడానికి ‘ఆపరేషన్ స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్’ పేరుతో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

ఈ మిలిటరీ ఆపరేషన్ నిజరూపం దాలుస్తుందా ? ఇజ్రాయెల్ కమాండర్లు దాన్ని ఎలా నిర్వహిస్తారు?

గాజా స్ట్రిప్‌పై భూతలం నుంచి ఆపరేషన్ అంటే అది గాజా సిటీలోని ప్రతి ఇంటి మీదా ప్రభావం చూపుతుంది. సాధారణ పౌరులకు అది అపారమైన నష్టాన్ని కలిగిస్తుంది. వైమానిక దాడులు ఇప్పటికే వందల మంది ప్రాణాలను బలిగొన్నాయి. దాదాపు 4 లక్షలకంటే ఎక్కువ మంది ప్రజలు ఇళ్లు వదిలిపెట్టాల్సి వచ్చింది.

గాజాలోని వివిధ ప్రదేశాలలో బందీలుగా ఉన్న తమ దేశానికి చెందిన 150 మందిని రక్షించేందుకు ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్‌కు దిగే ఆలోచనలో ఉంది.

‘‘హమాస్‌ను సర్వనాశనం చేస్తాం’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి ప్రతిజ్ఞ చేసారు. హమాస్ నాయకుడు గాజాలోనే ఉన్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు.

అయితే, 16 ఏళ్ల హమాస్ పాలన తర్వాత గాజా ఎలా ఉంది?

"హమాస్‌లోని ప్రతి సభ్యుడిని ఇజ్రాయెల్ చంపేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే అది ఇస్లామిక్ తీవ్రవాదుల వ్యూహం’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో మిలిటరీ విశ్లేషకుడు అమీర్ బార్ షాలోమ్ అన్నారు.

‘‘అయితే, హమాస్‌ను సాధ్యమైనంతవరకు బలహీనపరచవచ్చు. అప్పుడు అది నిర్వీర్యం అవుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ లక్ష్యం కొంత వరకు వాస్తవికంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ హమాస్‌తో నాలుగుసార్లు యుద్ధం చేసింది. దాని రాకెట్ దాడులను ఆపడంలో పలుమార్లు విఫలమైంది.

‘‘ఈ యుద్ధం ముగిసే సమయానికి హమాస్‌కు ఇజ్రాయెల్ పౌరులను బెదిరించే లేదా చంపే సామర్థ్యం ఉండదు.’’ అని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ అన్నారు.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్-హమాస్ సైనిక బలాలు

భూతల యుద్ధంలో అనేక ప్రమాదాలు

మిలిటరీ ఆపరేషన్ పట్టాలు తప్పకుండా ఉండాలంటే అనేక అంశాలు కలిసి రావాలి.

దీన్ని ఎదుర్కోవడానికి హమాస్ సాయుధ విభాగం ఇజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ సిద్ధంగా ఉండి ఉంటుంది. పేలుడు పదర్ధాలు సెట్ చేసి ఉంటుంది. ఈ బృందం కూడా ఆకస్మిక దాడులను ప్లాన్ చేయగలదు.

ఇజ్రాయెల్ దళాలను ఎదుర్కోవడానికి హమాస్ సొరంగ మార్గాల నెట్‌వర్క్‌ను పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

హమాస్‌కు చెందిన యాంటీ ట్యాంక్ గన్స్, స్నిఫర్ల కారణంగా 2014లో ఇజ్రాయెల్ పదాతి దళాలు బాగా నష్టపోయాయి. అప్పట్లో గాజా ఉత్తర ప్రాంతంలో జరిగిన పోరాటంలో వందలమంది పౌరులు మరణించారు.

గాజా స్ట్రిప్ ఉత్తర భాగం నుంచి దాదాపు 11 లక్షలమంది పాలస్తీనియన్లను ఖాళీచేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించడానికి ఇది ఒక కారణం.

యుద్ధం కొన్ని నెలల పాటు జరగొచ్చని ఇజ్రాయెలీలు హెచ్చరించారు. రికార్డు స్థాయిలో 3 లక్షల 60 వేలమంది రిజర్వ్‌ సైనికులను విధులకు రావాలని ఆదేశించారు.

అయితే, అంతర్జాతీయ సహకారం లేకుండా ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని ఎంత కాలం కొనసాగించగలదనేది ప్రశ్న.

గాజా శరవేగంగా నరకం రూపాన్ని సంతరించుకుంటోందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ హెచ్చరించింది. ఇక్కడ మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలు నిలిచిపోయాయి. ఇప్పుడు జనాభాలో సగంమందికి వారి ప్రాంతం నుంచి పారిపోవాలని హెచ్చరికలు వచ్చాయి.

"తమకు అంతర్జాతీయ సమాజం మద్దతు ఉంటుందని ప్రభుత్వం, మిలిటరీ భావిస్తున్నాయి. కనీసం పాశ్చాత్య దేశాల నాయకులైనా తమకు మద్దతిస్తారని నమ్ముతున్నారు. అందుకే ‘‘ముందు మనం పని మొదలు పెడతాం. మనకు చాలా సమయం ఉంది’’ అన్న సూత్రాన్ని ఇజ్రాయెల్ నమ్ముకుంది’’ అని ఆ దేశానికి చెందిన సెక్యురిటీ అండ్ ఇంటెలిజెన్స్ జర్నలిస్ట్ యోస్సీ మెల్మాన్ అన్నారు.

గాజాలో పరిస్థితులు మరీ దిగజారినట్లుగా తెలిస్తే అగ్రదేశాలు రంగంలోకి దిగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ
ఫొటో క్యాప్షన్, గాజాలో నేలమట్టమవుతోన్న భవనాలు

బందీలను రక్షించడం ఎలా ?

బందీలలో చాలామంది ఇజ్రాయిలీలు. కానీ వారిలో పెద్ద సంఖ్యలో విదేశీ పౌరులు, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు కూడా ఉన్నారు. కాబట్టి అమెరికా, ఫ్రాన్స్, యూకేతో సహా అనేక ఇతర దేశాలు ఈ ఆపరేషన్‌లో తమ వారు సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటారు.

‘‘ఫ్రెంచ్ ప్రభుత్వం తమ పౌరుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడదు’’ అని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు.

బందీల భద్రత అంశం సైనిక వ్యూహకర్తలను ఎంత వరకు ప్రభావితం చేస్తుందో తెలియదు. ఇజ్రాయెల్ నాయకులపై దేశీయంగా కూడా ఒత్తిడి ఉంది.

ఈ పరిస్థితి 1972 నాటి మ్యూనిచ్ ఒలింపిక్స్‌ పరిస్థితిలా ఉందని అమీర్ బార్ షాలోమ్ అన్నారు. అప్పట్లో పాలస్తీన మిలిటెంట్ ఒకరు 11మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను హత్య చేశారు.

గతవారం దాడిలో పాల్గొన్న హమాస్ ప్రతి సభ్యుడిని చంపేందుకు ఈ ఆపరేషన్‌ను ప్రారంభిస్తున్నారని, కిడ్నాప్‌ల వెనుక ఉన్న వారందరినీ ప్రభుత్వం వేటాడుతుందని అమీర్ బార్ షాలో భావిస్తున్నారు.

గాజాలోని వివిధ ప్రాంతాలలో కిడ్నాప్‌కు గురైన వారిని గుర్తించి భద్రంగా తీసుకురావడం ఇజ్రాయెల్ సైన్యంలోని ఎలైట్ యూనిట్ సయెరెట్ మత్కల్ కమాండోలకు తలకుమించిన పనే. ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవడానికి అవసరమైతే బందీలను కాల్చివేస్తామని హమాస్ ఇప్పటికే హెచ్చరించింది.

2011లో కిడ్నాపై, ఐదేళ్ల పాటు హమాస్ చెరలో ఉన్న తమ సైనికుడి కోసం ఇజ్రాయెల్ 1,000 మందికి పైగా హమాస్ ఖైదీలను విడుదల చేయాల్సి వచ్చింది.

కానీ, ఇజ్రాయెల్ ఇప్పుడు మరోసారి అలా ఖైదీల విడుదలకు సానుకూలంగా ఉండదు. ఎందుకంటే గతంలో ఇలా విడుదల చేసిన వారిలో ఒకరైన యాహ్యా సిన్వార్ గాజాలో ప్రముఖ హమాస్ నేతగా ఎదిగారు.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ
ఫొటో క్యాప్షన్, హమాస్ వెనుక మాస్టర్ మైండ్స్ వ్యూహాలు

జాగ్రత్తగా గమనిస్తున్న పొరుగు దేశాలు

ఇజ్రాయెల్ పొరుగు దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది కూడా భూతల యుద్ధం వ్యవధిని, ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది.

గాజాతో సరిహద్దును పంచుకునే ఈజిప్ట్ నుంచి ఇప్పటికే ఒత్తిడి పెరుగుతోంది. తమతో ఉండే రఫా సరిహద్దు క్రాసింగ్ నుంచి సహాయాన్ని ఈజిప్ట్ ఇప్పటికే అనుమతిస్తోంది.

"ఇజ్రాయెల్ సైనిక ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ ఈజిప్టు కూడా గాజా ప్రజల సమస్యలను గమనిస్తుంది. వారి మానాన వారిని వదిలేసి వెళ్లిపోయే ప్రయత్నం చేయకపోవచ్చు’’అని ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌కు చెందిన ఓఫిర్ వింటర్ చెప్పారు.

అయితే, గాజా ప్రజలను తమ దేశంలో రానివ్వడానికి లేదా ఇజ్రాయెల్‌ను సైనికంగా అడ్డుకోవడానికి ఈజిప్ట్‌ ప్రయత్నించకపోవచ్చని వింటర్ భావిస్తున్నారు.

ఇజ్రాయెల్‌కు ఉత్తరాన ఉన్న లెబనాన్‌ సరిహద్దు ప్రాంతంపై కూడా అందరి దృష్టి ఉంది.

ఇప్పటివరకు ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ప్రమేయంతో అనేక సీమాంతర దాడులు జరిగాయి. అయితే, అవి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కొత్త గ్రూప్‌లా మారలేదు.

హిజ్బుల్లాకు ప్రధాన స్పాన్సరైన ఇరాన్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై అమెరికా ఒక హెచ్చరిక చేసింది. ‘‘ఈ పరిణామాలను తమకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నించే ఏ దేశానికైనా, సంస్థకైనా నేను ఒకటే చెబుతున్నా. అలాంటి పని చేయవద్దు’’ అని జోబైడెన్ అన్నారు.

ఆ సందేశాన్ని మరింత బలంగా చెప్పడానికి అమెరికా తన విమాన వాహక నౌకను తూర్పు మధ్యధరా సముద్రంలోకి పంపింది.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ సరిహద్దులు

గాజాలో ఏం జరగబోతోంది?

హమాస్‌ను ఇజ్రాయెల్ పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయగలిగితే, ఆ స్థానంలోకి ఎవరు వస్తారనేది మరో ప్రశ్న?

2005లో ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి వెనక్కి వచ్చిన సమయంలో వేలమంది సెటిలర్లు కూడా గాజా నుంచి వచ్చేశారు. ఇజ్రాయెల్ తిరిగి గాజాను స్వాధీనం చేసుకున్నా కూడా, వారు మళ్లీ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లకపోవచ్చు.

అయితే 2007లో హమాస్ వల్ల పాలస్తీనా అథారిటీ గాజా నుంచి వైదొలగింది. ఒకవేళ హమాస్‌ను కట్టడి చేస్తే, పాలస్తీనా అథారిటీ తిరిగి గాజాలో అడుగుపెట్టి, అధికార మార్పిడి చేయడానికి అవకాశం ఉంటుందని ఓఫిర్ అభిప్రాయపడ్డారు.

కానీ, పాలస్తీనా అథారిటీ మిలిటెంట్ సంస్థ కాదు. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్‌లోని కొన్ని ప్రాంతాలను నియంత్రిస్తోంది.

మరోవైపు ఈజిప్టు కూడా మరింత ఆచరణాత్మకంగా వ్యవహరించబోతుందని ఆయన అన్నారు.

ఇక హమాస్ దాడుల నేపథ్యంలో సరిహద్దు రవాణాలపై ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆంక్షలకు తోడు, ఇజ్రాయెల్ మరిన్ని కఠిన ఆంక్షలను అమలు చేసే అవకాశం ఉంది.

గాజా సరిహద్దు వెంబడి ఉన్న బఫర్ జోన్‌ ప్రాంతాల్లో ఉండే కమ్యూనిటీల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి పూర్తి రక్షణ కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

షిన్ బెట్ సెక్యూరిటీ సర్వీసెస్ మాజీ అధ్యక్షులు యోరమ్ కొహెన్ సరిహద్దుల్లోని భద్రతపై మాట్లాడుతూ, సరిహద్దుల వెంబడి కనీసం 2 కి.మీల పరిధిని ‘షూట్ ఆన్ సైట్’ జోన్‌గా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.

ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఇలాంటి దాడులు భవిష్యత్తులోొ పునరావృతం కాకుండా ఇజ్రాయెల్ చర్యలు తీసుకోవాల్సి ఉంది.

వీడియో క్యాప్షన్, గాజా సరిహద్దులో లక్షల మంది సైనికుల్నిమోహరించిన ఇజ్రాయెల్

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)