ఉత్తర గాజాను ప్రజలు 24 గంటల్లో ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఎందుకు హెచ్చరించింది?

గాజా

ఫొటో సోర్స్, Getty Images

గాజాకు ఉత్తరాన నివసిస్తున్న ప్రజలందరూ 24 గంటల్లోగా దక్షిణ గాజాకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం చెప్పినట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇజ్రాయెల్ ప్రకటన దాదాపు 11 లక్షల మందిని ప్రభావితం చేస్తుందని ఐరాస అంటోంది. ఆ సంఖ్య గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న మొత్తం జనాభాలో దాదాపు సగం.

గాజా, జెరూసలేం కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ హెచ్చరిక జారీ చేసింది.

"ఇంత పెద్ద సంఖ్యలో జనం మరొక ప్రాంతానికి వెళ్లడం విపరీతమైన పరిణామాలకు దారితీస్తుంది" అని ఐరాస ఒక ప్రకటన విడుదల చేసింది.

గత శనివారం దాడి జరిగినప్పటి నుంచి గాజాలోని హమాస్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది.

ఇటీవల గాజా సరిహద్దుకు సైనికులు, యుద్ధ ట్యాంకులు, భారీ మందుగుండు సామగ్రిని తీసుకొచ్చింది ఇజ్రాయెల్. దీంతో, గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ జరగబోతోందని భావించారు.

ఇజ్రాయెల్ దళాలు

ఫొటో సోర్స్, MOSTAFA ALKHAROUF/ANADOLU VIA GETTY IMAGES

ఇజ్రాయెల్ సైన్యం ప్రకటనలో ఏముంది?

అక్టోబర్ 13న గాజా నివాసితులకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు గాజా తూర్పు భాగాన్ని వదిలి దక్షిణం వైపు వెళ్లాలని సూచించింది.

"రాబోయే రోజుల్లో గాజా నగరంలో సైన్యం తన ఆపరేషన్ కొనసాగిస్తుంది. పౌరులు దీని బారిన పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది మీ భద్రత కోసమే. మళ్లీ చెప్పేవరకు గాజాకు రావొద్దు. ఇజ్రాయెల్ కంచె వైపునకు కూడా ఎవరూ రావొద్దు'' అని తెలిపింది.

హమాస్ మిలిటెంట్లు గాజాలోని సొరంగాలు, నివాస భవనాలలో అమాయక పౌరుల మధ్య దాక్కున్నారని ఐడీఎఫ్ ఆరోపిస్తోంది.

"గాజాకు దక్షిణంగా వెళ్లిపోండి. హమాస్ మిలిటెంట్ల నుంచి దూరంగా వెళ్ళండి. వాళ్లు మిమ్మల్ని మానవ కవచాలుగా ఉపయోగిస్తున్నారు" అని ఐడీఎఫ్ పేర్కొంది.

గాజా

ఫొటో సోర్స్, MAHMUD HAMS/AFP VIA GETTY IMAGES

ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం

ఈ ప్రకటనపై గాజాలోని ఐక్యరాజ్యసమితికి ఇజ్రాయెల్ ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. ఉత్తరాన పాఠశాలలు, ఆసుపత్రులు, క్లినిక్‌లు వంటి ఐక్యరాజ్యసమితి స్థావరాలు ఉన్నాయి.

దీంతో వాటిని ఖాళీ చేయాల్సిందిగా కోరారు. దీంతో శుక్రవారం ఐక్యరాజ్యసమితి 'భద్రతా మండలి' సమావేశం కానుంది.

ఈ సమావేశానికి భద్రతా మండలిలోని సభ్యులందరూ (అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్) హాజరుకానున్నారు.

24 గంటల్లో ఖాళీ చేయాలంటే ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రతి గంటకు 40 వేల మంది తరలిపోవాలని, ఇది దాదాపు అసాధ్యమని బీబీసీ మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్ టామ్ బాట్‌మాన్ అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, రెడ్‌క్రాస్ కాన్వాయ్‌లు గాజా నగరం నుంచి దక్షిణంగా కదులుతున్నాయి.

ఈ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాయపడి ఆసుపత్రుల్లో చేరిన పిల్లలు, వృద్ధుల సంఖ్య భారీగా ఉంది.

ఈ యుద్ధం కారణంగా పాలస్తీనియన్లు నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి అంటోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

''వాడి (ఉత్తర) గాజాలోని మొత్తం జనాభా 24 గంటల్లోగా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఐడీఎఫ్ నుంచి ఐరాస ప్రతినిధులకు చెప్పారు. గాజా జనాభా సుమారు 23 లక్షలు. ఐడీఎఫ్ ఉత్తర్వు ప్రకారం ఉత్తర గాజాలో ఉన్న దాదాపు 11 లక్షల మంది దక్షిణానికి వెళ్లాలి. గాజా నగరం కూడా వాడిలోనే ఉంది'' అని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రకటనను ఐక్యరాజ్యసమితి విమర్శించింది. వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరింది.

ఈ చర్య ప్రస్తుత విషాదాన్ని మరింత దిగజార్చుతుందని తెలిపింది.

గాజా, ఇజ్రాయెల్ యుద్దం

ఫొటో సోర్స్, REUTERS

ఐరాస స్పందన సిగ్గుచేటు: గిలాడ్

"గాజా నివాసులకు ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికపై ఐరాస ప్రతిస్పందన సిగ్గుచేటు" అని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ అర్డాన్ వ్యాఖ్యానించారు.

హమాస్‌ చర్యలను ఖండిస్తూ, తనను తాను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంపై ఐరాస దృష్టి పెట్టాలని గిలాడ్ సూచించారని వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది.

''ఇజ్రాయెల్ సకాలంలో గాజా ప్రజలను హెచ్చరించింది, ఎందుకంటే పౌరులకు ఎలాంటి హాని కలగకూడదు" అని ఆయన తెలిపారు.

"హమాస్ ఏళ్లుగా ఆయుధాలను పోగు చేసుకుంటోంది. ఐరాస దానిని పట్టించుకోలేదు. ఆయుధాలు, హత్యలను దాచడానికి హమాస్ దాని పౌరులు, భవనాలు, గాజా స్ట్రిప్‌ను ఉపయోగించుకుంటోంది" అని గిలాడ్ ఆరోపించారు.

"వందలాది మంది అమాయక ప్రజలను కోల్పోయిన ఇజ్రాయెల్‌కు అండగా నిలబడటానికి బదులుగా, ఐరాస మాకే బోధిస్తోంది. బందీలను విడిపించడం, హమాస్‌ చర్యలను ఖండించడం, ఇజ్రాయెల్ హక్కులకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి" అని అన్నారు.

''ఇజ్రాయెల్ హెచ్చరిక నకిలీ ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికే, దాని ఉద్దేశం మా ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి, వారికి హాని చేయడానికి" అని హమాస్ మీడియా చీఫ్ సలామా మరూఫ్ అన్నారు.

గాజా ప్రజలు ఈ హెచ్చరికను పట్టించుకోవద్దని హమాస్ విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)