బిచ్చమెత్తుకునేందుకు వీసాకు రెండు లక్షలు ఖర్చు పెట్టి సౌదీకి వెళ్తున్న పాకిస్తాన్ యాచకులు...

సౌదీలో పాకిస్తానీ యాచకులు

ఫొటో సోర్స్, Getty Images

అక్టోబరు 5న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల గ్యాంగ్ ఒకటి ప్రముఖ ముస్లిం ప్రార్థనా స్థలాలను సందర్శించే యాత్ర (ఉమ్రా) పేరుతో భిక్షాటన కోసం సౌదీ అరేబియాకు వెళ్లేందుకు లాహోర్‌ లోని అల్లామా ఇక్బాల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది.

పాక్ పంజాబ్‌లోని కసూర్ జిల్లాకు చెందిన ఈ ‘ఆర్గనైజ్డ్ బెగ్గర్స్ గ్యాంగ్’లో నస్రీన్ బీబీ, ఆమె సోదరుడు ఆరిఫ్, వీరి బంధువులు అస్లాం, పర్వీన్‌లు ఉన్నారు.

ఉమ్రాకు వెళ్తున్నామని చెబుతూ భిక్షాటన చేసేందుకు సౌదీ, ఇరాన్, ఇరాక్‌ లాంటి దేశాలకు నస్రీన్ బీబీ 16 సార్లు వెళ్లారు. మరోవైపు పర్వీన్ కూడా తొమ్మిదిసార్లు వెళ్లారు.

అస్లాం, ఆరిఫ్‌లు సౌదీ అరేబియాకు వెళ్లడం ఇదే తొలిసారి. అయితే, వీరిద్దరూ ఉమ్రా పేరుతో భిక్షాటన చేసేందుకు ఇదివరకు ఇరాన్, ఇరాక్‌లకు చాలాసార్లు వెళ్లివచ్చారు.

సౌదీలో పాకిస్తానీ యాచకులు

ఫొటో సోర్స్, Getty Images

వీరి నలుగురిని విచారించిన అనంతరం ఇమిగ్రేషన్ అధికారులు వీరిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. అంతేకాదు ‘ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ యాక్ట్-2018’ కింద కేసు నమోదుచేసి, వీరిని అరెస్టు కూడా చేశారు.

ఈ కేసుపై నమోదుచేసిన ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)లో వీరు నలుగురూ ఉమ్రా పేరుతో సౌదీ అరేబియాకు వెళ్తున్నారని, కానీ, వీరి అసలు ఉద్దేశం అక్కడ భిక్షాటన చేయడమేనని పేర్కొన్నారు.

ఆ ఎఫ్ఐఆర్ కాపీని బీబీసీ పరిశీలించింది. దీనిలో వీరు నలుగురు భిక్షాటన కోసం సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్‌లకు వెళ్తున్నట్లు రాసి ఉంది.

వీరి ఏజెంట్ జహాన్‌జెబ్‌కు ఈ నలుగురూ మొబైల్‌లో పంపిన మెసేజ్‌లు, కాల్స్ డేటాను అధికారులు సేకరించారు. వీరి మొబైల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.

నస్రీన్ బీబీ, పర్వీన్‌లను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మహమ్మద్ అస్లాం, ఆరిఫ్‌లను విచారించేందుకు పోలీసులకు అప్పగించారు.

అక్టోబరు 9న స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు నస్రీన్ బీబీని అధికారులు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆమె బీబీసీతో మాట్లాడారు. ‘‘మమ్మల్ని అరెస్టు చేయడంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందా? ఇక్కడి ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు. అక్కడికి వెళ్లి బతుకుతెరువు కోసం అడుక్కోవడంలో తప్పేముంది?’’ అని ఆమె ప్రశ్నించారు.

సౌదీలో పాకిస్తానీ యాచకులు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌కు చెడ్డ పేరు కాదా?

ఇలాంటి అరెస్టులతో భిక్షాటనకు వెళ్లేవారిని అడ్డుకోవడం సాధ్యపడదని నస్రీన్ బీబీ అన్నారు. ‘‘మా లాంటి పేదవారిని తేలిగ్గానే పట్టుకుంటారు. కానీ, దీన్ని నడిపించే శక్తిమంతమైన వారిని పట్టుకోగలరా?’’ అని ఆమె ప్రశ్నించారు.

ఇలా అడుక్కోవడానికి వేరే దేశానికి వెళ్లడంతో పాకిస్తాన్‌కు చెడ్డపేరు వస్తుంది కదా? అని ప్రశ్నించినప్పుడు ‘‘ఎందుకు వస్తుంది?’’ అని నస్రీన్ అడిగారు.

ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి జుల్ఫికర్ హైదర్.. సెనేట్ స్థాయీ సంఘానికి సమర్పించిన సమాచారంలోనూ పొరుగుదేశాల్లో అరెస్టు అవుతున్న యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తాన్‌కు చెందినవారేనని ఉంటున్నారని చెప్పారు.

ఈ అంశంపై బీబీసీ చేపట్టిన పరిశోధనలో యాచకులను కొందరు ఏజెంట్లు పశ్చిమాసియా దేశాలకు ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్‌లకు పంపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. భిక్షాటనలో వచ్చే డబ్బులో ఆ ఏజెంట్లకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే, తాజాగా ఈ విషయంపై పాకిస్తాన్‌కు సౌదీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం నస్రీన్ బీబీ, ఆమె కుటుంబం అరెస్టు అయింది.

పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) తాజా డేటా ప్రకారం, ముల్తాన్, సియాల్‌కోట్‌లలోనూ కొంతమందిని ఇలానే అరెస్టు చేశారు.

దీంతో ఈ బెగ్గింగ్ మూఠాలకు సంబంధించి అరెస్టైన వారి సంఖ్య 37కు పెరిగింది.

సౌదీలో పాకిస్తానీ యాచకులు

ఫొటో సోర్స్, Getty Images

‘తొలిసారి వెళ్తున్నాం’

తాము సౌదీ అరేబియాకు తొలిసారి వెళ్లేందుకు వచ్చామని నస్రీన్ బీబీ బంధువులు అస్లాం, ఆరిఫ్ బీబీసీతో చెప్పారు. అయితే, వీరి కుటుంబం మొత్తం తరతరాల నుంచి భిక్షాటనే చేస్తోందని అధికారులు అంటున్నారు.

వీరు వీసాలు, టిక్కెట్ల కోసం ఒక్కో వ్యక్తికి రూ.2.3 లక్షల చొప్పున చెల్లించారు. 20 రోజులపాటు సౌదీలో ఉండేందుకు వీరు ఏర్పాట్లు చేసుకున్నారు.

టిక్కెట్టుతోపాటు ఇతర ఖర్చులు పోగా తమకు 20 నుంచి 30 వేల రూపాయలు మిగులుతాయని ఆరిఫ్ వివరించారు.

అయితే, పాకిస్తాన్‌లో అరెస్టయ్యే వారు ఎవరూ సౌదీలో తమకు ఎవరు సాయం చేస్తున్నారో పేర్లు చెప్పడం లేదు. ఈ విషయంపై ఎఫ్ఐఏ డిప్యూటీ డైరెక్టర్ ముహమ్మద్ రియాజ్ ఖాన్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది.

సౌదీలో పాకిస్తానీ యాచకులు

ఫొటో సోర్స్, Getty Images

ఇదంతా ముఠా

సౌదీకి భిక్షాటన కోసం వెళ్లడమనేది ‘వ్యవస్థీకృత నేరం’గా మారిపోయిందని బీబీసీతో మహమ్మద్ రియాజ్ ఖాన్ చెప్పారు. ‘‘మా దర్యాప్తులో ఇలాంటి చాలా గ్యాంగ్‌లు పాకిస్తాన్‌తోపాటు విదేశాల్లోనూ క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు తేలింది’’ అని ఆయన అన్నారు.

‘‘తాజా కేసులో ఈ నలుగురు సంపాదించిన దానిలో సగం డబ్బు ఆ ఏజెంట్‌కు వెళ్తోంది. ఎందుకంటే వీరికి ట్రావెల్ డాక్యుమెంట్లు, వీసాలతోపాటు సౌదీలో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు వారే చూసుకుంటున్నారు’’ అని ఆయన తెలిపారు.

యాచకులను నియమించుకునేందుకు ఒక ఫేస్‌బుక్ పేజీ నడుపుతున్న ఓ ఏజెంట్‌తోనూ బీబీసీ మాట్లాడింది. ‘‘ఇక్కడ మీకు పాకిస్తానీ రూపాయల్లో డబ్బు వస్తుంది. అదే సౌదీలో అయితే రియాల్స్‌ వస్తాయి. అక్కడ చాలా తేడా ఉంటుంది’’ అని చెప్పారు.

ఉమ్రా, ఉద్యోగాల పేరుతో చాలా మందిని తాను సౌదీకి పంపిస్తుంటానని ఆయన చెప్పారు. ఒక్కోసారి 15 మందిని, ఒక్కోసారి 25 మందిని పంపిస్తామని, ఐదు నెలలుగా తాము ఇదే పనిచేస్తున్నామని వివరించారు.

పాకిస్తాన్‌లో ఇతర ఏజెంట్లలానే వీరు కూడా భిక్షాటన కోసం వ్యక్తులను నియమించుకునేందుకు ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఉపయోగిస్తున్నారు.

నిజానికి చాలా మంది కూలి పని కోసం వీరిని ఆశ్రయిస్తుంటారు. అయితే, ఏ పనీ దొరకనప్పుడు వీరికి భిక్షాటన వైపు ఏజెంట్లు మళ్లిస్తుంటారు.

సౌదీలో పాకిస్తానీ యాచకులు

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తానీ యాచకుల గురించి ఎలా తెలిసింది?

ఈ అంశంపై పాకిస్తానీ ప్రభుత్వానికి సౌదీ అరేబియా పంపిన కొన్ని పత్రాలను బీబీసీ పరిశీలించింది.

భిక్షాటన, డ్రగ్స్ ట్రాఫికింగ్, వ్యభిచారం, నకిలీ పత్రాలతో సౌదీకి రావడం లాంటి నేరాల్లో పాకిస్తానీల పాత్ర నానాటికీ పెరుగుతోందని 2023 జూన్ 16న పాకిస్తానీ ప్రధాని కార్యాలయానికి సౌదీ అరేబియా ఈ డాక్యుమెంట్ పంపించింది.

సౌదీ అరేబియా ఫిర్యాదు అనంతరం పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం హోం శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలను అప్రమత్తం చేసింది.

సౌదీలో పాకిస్తానీ యాచకులు

ఫొటో సోర్స్, Getty Images

బ్యాగులో చిప్పలు

సౌదీ, ఇరాన్, ఇరాక్‌ల నుంచి సమాచారం తీసుకుని, కొందరి ప్రయాణికులను ప్రొఫైలింగ్ చేశామని ఎఫ్ఐఏ డిప్యూటీ డైరెక్టర్ ఖ్వాజా హమ్మదుల్ రెహ్మాన్ అన్నారు.

‘‘ఇక్కడ ప్రొఫైలింగ్ అంటే ప్రయాణికులకు సంబంధించి ముఖ్యమైన వివరాలను పరిశీలించడం. ఉదాహరణకు ఉమ్రా కోసం వారు సౌదీ అరేబియాకు వెళ్లాలని అనుకుంటే, వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వారికి అసలు ఈ యాత్ర చేపట్టగల సమార్థ్యముందా? లాంటి వివరాలను పరిశీలిస్తాం’’ అని చెప్పారు.

ప్రొఫైలింగ్‌లో భాగంగా హోటల్ బుకింగ్స్, రిటర్న్ టికెట్లు, వారి చేతిలో డబ్బు లాంటి వాటిని కూడా పరిశీలిస్తామని అన్నారు.

ఈ ప్రొఫైలింగ్ ద్వారా 2023 సెప్టెంబరు 29న 16 మందిని ముల్తాన్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొత్త మార్గదర్శకాల్లో భాగంగా అనుమానం ఉండే ప్రయాణికులను పిలిపించి విచారిస్తున్నారు.

‘‘మేం దృష్టిపెట్టిన వారిలో దాదాపు అందరూ యాచకులుగానే తేలారు’’ అని ఖ్వాజా హమ్మదుల్ రెహ్మాన్ చెప్పారు.

‘‘వీరు ఎవరూ హోటల్స్ బుక్ చేసుకోలేదు. వీరి ఆర్థిక పరిస్థితి ఉమ్రా యాత్రకు వెళ్లే స్థాయిలో లేదు. కొందరి లగేజీల్లో చిప్పలు కూడా కనిపించాయి’’ అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో ఓ ప్రేమికుడు కట్టిన మరో తాజ్ మహల్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)