పాకిస్తాన్: మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం సిగ్గు చేటా? ఒకప్పుడు బెల్లీ డ్యాన్సర్ల ప్రదర్శనలు జరిగిన దేశంలో ఇప్పుడు ఎందుకింత వివక్ష?

మిస్ యూనివర్స్ పోటీలు

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, ‘మిస్ యూనివర్స్ పాకిస్తాన్’ ఇరికా రాబిన్
    • రచయిత, సహేర్ బాలోచ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

24 ఏళ్ళ ఇరికా రాబిన్ మిస్ యూనివర్స్ పోటీల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించనుండటం పాక్‌లో అలజడి రేపుతోంది.

ఈ పోటీల్లో పాల్గొనడం సిగ్గు చేటైన విషయమని జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన సెనేటర్ ముస్తాక్ అహ్మద్ అన్నారు.

పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ ఇంకో అడుగు ముందుకేసి దీనిపై విచారణకు ఆదేశించారు. పాకిస్తానీ పురుషులైతే ఈ పోటీలపై ఆన్‌లైన్‌లో ఘాటైన చర్చలు జరుపుతున్నారు.

ఇంతటి అలజడికి కారణమైన మహిళ ఇరికా రాబిన్. ఆమె కరాచీ నగరానికి చెందిన ఓ క్రిస్టియన్. ఈమె సంప్రదాయాలను గట్టిగా పాటించే పాకిస్తాన్‌ తరపున మిస్ యూనివర్స్ పోటీలలో ప్రాతినిధ్వం వహించనున్నారు.

మాల్టీవులలో జరిగిన అందాల పోటీల్లో ఇరికా రాబిన్ మిస్ యూనివర్స్ పాకిస్తాన్‌గా ఎంపికయ్యారు.

ఈ పోటీలను దుబాయ్ కేంద్రంగా నడిచే యుజెన్ గ్రూప్ నిర్వహించింది. ఈ గ్రూప్‌కు మిస్ యూనివర్స్ బహ్రయిన్, మిస్ యూనివర్స్ ఈజిప్ట్ పోటీలు నిర్వహించే హక్కులు కూడా ఉన్నాయి.

‘మిస్ యూనివర్స్ పాకిస్తాన్‌’ పోటీలకు తమకు పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు ఈ గ్రూప్ చెప్పింది. ఎల్ సాల్వడార్‌లో నవంబర్‌లో మిస్ యూనివర్స్ ఫైనల్స్ జరగనున్నాయి.

మిస్ యూనివర్స్ పోటీలు

ఫొటో సోర్స్, YUGEN GROUP

నిరసన.. మద్దతు

‘‘పాకిస్తాన్‌ కు ప్రాతినిధ్యం వహించడం గొప్పగా ఉంది. కానీ దీనిపై వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తోందో నాకు తెలియదు. బహుశా మగవారితో నిండిన గదిలో స్విమ్మింగ్ దుస్తులతో తిరగడమే ఇందుకు కారణమై ఉండవచ్చు’’ అని ఇరికా రాబిన్ బీబీసీతో చెప్పారు.

ఇలాంటి అందాల పోటీలను ఇష్టపడని పాకిస్తాన్‌ తరపున ఆమె పోటీపడుతున్నారని, ఇటువంటి పోటీలు ముస్లింలు మెజారిటీలైన పాకిస్తాన్‌లో చాలా అరుదని ఇరికా రాబిన్ ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకిస్తున్నవారు చెపుతున్నారు.

మిస్ పాకిస్తానీ వరల్డ్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీ సంతతికి చెందిన మహిళల కోసం నిర్వహిస్తారనేది తెలిసిన విషయమే. ఈ పోటీలు మొదటిసారిగా 2002లో టొరంటోలో జరిగాయి. కానీ 2020లో లాహోర్‌కు మారాయి. వీటిలో మిస్ పాకిస్తాన్ యూనివర్సల్, మిసెస్ పాకిస్తాన్ యూనివర్సల్ తోపాటు మిస్ ట్రాన్స్ పాకిస్తాన్ పోటీలు కూడా ఉన్నాయి.

72 ఏళ్ళ ఈ అందాల పోటీ చరిత్రలో పాకిస్తాన్ ఏనాడూ మిస్ యూనివర్స్‌కు నామినేట్ కాలేదు.

జూమ్‌లో జరిగిన అందాల పోటీల రెండో దశను ఇరికా రాబిన్ గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా, ‘‘నీ దేశం కోసం ఏం చేయాలనుకుంటున్నావు’’ అనే ప్రశ్నకు- ‘‘పాకిస్తాన్ వెనుకబడిన దేశమనే భావనను మార్చాలనుకుంటున్నాను’’ అని ఆమె సమాధానమిచ్చారు.

ఇరికా రాబిన్‌ను మోడల్స్, రచయితలు, జర్నలిస్టులు అభినందించారు. మరియానా బాబర్ అనే జర్నలిస్టు ‘ఎక్స్’(ట్విట్టర్)పై ఆమెను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ ప్రశంసించారు.

‘‘‘మిస్టర్ పాకిస్తాన్’ పేరుతో జరిగే అంతర్జాతీయ పోటీలన్నీ వీరికి బాగానే అనిపిస్తాయి. కానీ ఒక మహిళ ఏదైనా సాధిస్తే ఏమిటి సమస్య’ అని ఇరికా రాబిన్ మోడలింగ్‌లోకి రావడానికి ప్రోత్సహించిన వనీజా అహ్మద్ వాయిస్ ఆఫ్ అమెరికా ఉర్దూకు చెప్పారు.

మిస్ యూనివర్స్ పోటీలు

ఫొటో సోర్స్, PIERRE PERRIN

ఫొటో క్యాప్షన్, జియా ఉల్ హక్

‘రాక్ అండ్ రోల్’ నుంచి ‘ఇస్లామిక్ రిపబ్లిక్’ దాకా..

‘‘మేమొక దేశంగా అనేక వైరుధ్యాలు కలిగి ఉన్నాం. మమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించే అంశాలు మహిళలు, అసహాయులే’’ అని కరాచీకి చెందిన రచయిత, వ్యాఖ్యాత రఫీ మహ్మద్ బీబీసీకి చెప్పారు.

‘‘పాకిస్తాన్ రాజ్యస్వభావం సామాజికంగా, వ్యవస్థాగతంగా వేళ్ళూనుకుపోయిన పితృస్వామ్య విలువల్లో కనిపిస్తుంది. ఇరికా రాబిన్ ఎదుర్కొన్న పోలీసింగ్ అనేది ఈ విలువల కొనసాగింపే’’ అంటారాయన.

కానీ గతంలో పాకిస్తాన్ చాలా ఉదార స్వభావంతో ఉండేది.

కరాచీలోని ఎల్ఫిన్‌స్టోన్ వీధిలో ఉండే ఓ క్లబ్‌లో క్యాబరే, విదేశీ బెల్లీ డ్యాన్సర్ల ప్రదర్శనలకు సంబంధించిన పత్రికా ప్రకటనలు వచ్చేవని 1950 నుంచి 1970 దాకా డాన్ వార్తాపత్రికల కాపీలు చెపుతున్నాయి.

ఈ నైట్ క్లబ్స్‌లో దౌత్యవేత్తలు, రాజకీయనాయకులు, ఎయిర్‌హోస్టెస్‌లు, యువత తరచూ కనిపించేవారు.

కరాచీలోని మెట్రోపోల్ హోటల్ కూడా పాటలకు, జాజ్ ప్రదర్శనలకు అనువైన స్థలంగా ఉండేది.

కానీ 1973లో పాకిస్తాన్ పార్లమెంట్ రూపొందించిన రాజ్యాంగం పాకిస్తాన్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటించి, ఇస్లామ్‌ను అధికారిక మతంగా ప్రకటించింది.

నాలుగేళ్ళ తరువాత సైన్యాధికారి జనరల్ జియా ఉల్ హక్, జుల్ఫీకర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని దించి వేసిన తరువాతి దశాబ్దాన్ని క్రూరమైన దశగా ఉద్యమకారులు, న్యాయవాదులు అభివర్ణిస్తుంటారు. ఇస్తామిక్ చట్టాలను అమలు చేయడం వల్ల పాకిస్తాన్ సమాజం భారీ మార్పులకు లోనైంది.

1980 మధ్య నాటికి జనరల్ జియా ఇస్లామిక్ చట్టాల పట్ల తన నిబద్ధతను ప్రకటించడానికి బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టే శిక్షను కూడా పునరుద్ధరించారు.

ప్రస్తుతం నైట్ క్లబ్‌లు, బార్‌లు చాలా దూరమైపోయాయి. మెట్రో‌పోల్ హోటల్ కూలిపోయే స్థితిలో ఉంది. డౌన్ రోడ్డులో ఒకప్పటి కాసినో అయి ఉండవచ్చని భావించే నిర్మాణం శిథిల స్థితిలో ఉంది.

కానీ స్వేచ్ఛాయుతమైన, సహనశీలమైన పాకిస్తాన్ కోసం తపన పోలేదు.

అయితే ఏది ఆమోదయోగ్యం, ఏది కాదు అనే హద్దులు దాటేవారిలో ఇరికా రాబిన్ కూడా ఒకరు.

సెయింట్ పాట్రిక్ హైస్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజీలో కామర్స్, ఎకనమిక్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె, తానేం తప్పు చేయలేదని కరాఖండిగా చెపుతున్నారు.

‘‘ప్రపంచ వేదికపై పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా నేను ఏ చట్టాన్నీ ఉల్లంఘించలేదు. ఇందుకు సంబంధించిన మూస ఆలోచనలను తగ్గించడానికి నా వంతు పనిచేస్తున్నాను’’ అని ఇరికా రాబిన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్: గణేషుడి పేరుతోనే ఈ లోయకు గనీష్ వ్యాలీ అనే పేరు వచ్చిందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)