ఇజ్రాయెల్ తెల్ల భాస్వరంతో గాజాపై దాడులు చేసిందా... ఈ స్మోక్ స్క్రీన్ ఆపరేషన్ ఎంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Getty Images
గత ఐదు రోజుల్లో గాజాపై ఇజ్రాయెల్ దాదాపు ఆరువేలకు పైగా రాకెట్ బాంబులు ప్రయోగించింది. అయితే గాజా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ జరిపే బాంబు దాడులలో తెల్ల భాస్వరాన్ని ఉపయోగించిందని మానవ హక్కుల సంస్థ 'హ్యూమన్ రైట్స్ వాచ్' ఆరోపించింది.
తెల్ల భాస్వరం దాడుల వల్ల ప్రజలు తీవ్రంగా గాయపడి ఉంటారని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో గాజా ఒకటి. ఈ ప్రాంతంలో తెల్ల భాస్వరం వాడకం పౌరులకు ప్రమాదమని, ఇది అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించడమేనని హ్యూమన్ రైట్స్ వాచ్ అంటోంది.
ఇదే సమయంలో 'గాజాలో తెల్ల భాస్వరం వాడకం గురించి తెలియదు'' అని ఇజ్రాయెల్ సైన్యం బదులిచ్చినట్లుగా రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. మరోవైపు లెబనాన్‌లో తెల్ల భాస్వరం వినియోగంపై ఆ దేశం స్పందించలేదు.
అక్టోబరు 10న లెబనాన్, అక్టోబర్ 11న గాజాలోని సిటీ ఓడరేవు, ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని రెండు గ్రామీణ ప్రాంతాల్లో ఫిరంగిల నుంచి తెల్లటి భాస్వరం విడుదలైందని, దానికి సంబంధించిన వీడియోలు చూసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.
"పౌరులపై తెల్ల భాస్వరం ప్రయోగిస్తే దానివల్ల శరీరం కాలుతుంది, అది జీవితకాలం నొప్పిని కలిగిస్తుంది" అని హ్యూమన్ రైట్స్ వాచ్‌లోని మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా డైరెక్టర్ లామా ఫాకిహ్ చెప్పారు.
యుద్ధభూమిలో 'స్మోక్ స్క్రీన్' సృష్టించడం కోసం తెల్ల భాస్వరం ఫిరంగులను ప్రయోగించడం ఆపివేయాలనుకుంటున్నట్లు 2013లో ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
యుద్ధంలో తెల్ల భాస్వరం వాడకాన్ని అప్పట్లో మానవ మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

ఫొటో సోర్స్, Getty Images
తెల్ల భాస్వరంపై ఆందోళన ఎందుకు?
తెల్ల భాస్వరం ఒక రసాయన పదార్థం. దీనికి మండే లక్షణం ఎక్కువ. ఆక్సిజన్ తగిలినపుడు ఇది మండుతుంది. దీన్ని ఫిరంగి షెల్స్, బాంబులు, రాకెట్ల ద్వారా ప్రయోగిస్తారు.
తెల్ల భాస్వరానికి ఆక్సిజన్ తాకితే రసాయన చర్య జరిగి 815 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిని ఉత్పత్తి చేస్తుంది.
ఇది కాంతితో పాటు దట్టమైన పొగను ఉత్పత్తి చేస్తుంది. ఈ తెల్ల భాస్వరం మనుషులపై పడి, దానికి ఆక్సిజన్ తగిలితే శరీరం కాలిపోతుంది.
భవనాలపై పడితే మంటలు చెలరేగుతాయి. నిర్మాణాలు దగ్ధమవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
తెల్ల భాస్వరం ఎలా ఉపయోగిస్తారు?
సాధారణంగా గ్రౌండ్ మిలటరీ ఆపరేషన్లలో రహస్యంగా ఏదైనా చేయడానికి 'స్మోక్ స్క్రీన్' సృష్టించడం కోసం తెల్ల భాస్వరం ఉపయోగిస్తారు.
వైట్ ఫాస్ఫరస్ ఇన్‌ఫ్రారెడ్ ఆప్టిక్స్, వెపన్ ట్రాకింగ్ సిస్టమ్‌లకు కూడా ఇది అంతరాయం కలిగిస్తుంది. యాంటీ ట్యాంక్ క్షిపణుల వంటి గైడెడ్ ఆయుధాల నుంచి సైనిక దళాలు రక్షించుకోవడానికి దీన్ని వాడుతుంటారు.
తెల్ల భాస్వరం అనేది భూ విస్ఫోటనం కంటే గాలిలో విస్ఫోటనం అయితే చాలా ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. అనంతరం ఏం జరుగుతుందో తెలియకుండా ఆ ప్రాంతాన్ని భాస్వరం కప్పేస్తుంది.
దహించే ఆయుధంగా కూడా తెల్ల భాస్వరాన్ని ఉపయోగిస్తారు. 2004లో ఇరాక్‌లో జరిగిన రెండో ఫల్లూజా యుద్ధంలో రహస్యంగా దాక్కున్న మిలిటెంట్లను బయటికి రప్పించడానికి తెల్ల భాస్వరం ప్రయోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
తెల్ల భాస్వరం ఎంత హాని చేస్తుంది?
తెల్ల భాస్వరం పడితే మనుషుల శరీరం కాలుతుంది. అది ఎముకల వరకు చేరుతుంది.
ఈ కాలిన గాయాలు మానడానికి చాలాసమయం పడుతుంది, దీంతో గాయాలకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
తెల్ల భాస్వరం కారణంగా మానవ శరీరంలో 10 శాతం కాలినా అది ప్రాణాంతకమే.
దాని చర్యలకు గురైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. శరీరంలోని అవయవాలు పనిచేయడం ఆగిపోవచ్చు.
ఈ గాయాల నుంచి బయటపడినా వారు జీవితాంతం నొప్పిని అనుభవిస్తారు. వారి శరీరంపై ఏర్పడిన మచ్చలు మానసికంగా కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
తెల్ల భాస్వరం మంటలు పడితే ఇళ్లు, భవనాలు, పంటలు నాశనమవుతాయి, పశువులు చనిపోతాయి.

ఫొటో సోర్స్, Getty Images
చట్టాలు ఏం చెబుతున్నాయి?
సాయుధ పోరాటాలలో తెల్ల భాస్వరం ఉపయోగమనేది అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది.
కన్వెన్షన్ ఆన్ సర్టెన్ కన్వెన్షనల్ వెపన్స్ (CCW) ప్రోటోకాల్ III ప్రకారం పౌరులు లేదా పౌర ప్రాంతాలపై తెల్ల భాస్వరం దహించే ఆయుధంగా ఉపయోగించడం నిషేధం.
అంతర్జాతీయ మానవతా చట్టం సూత్రాలకు అనుగుణంగా సిగ్నలింగ్, స్క్రీనింగ్, మార్కింగ్ కోసం మాత్రమే దీన్ని ఉపయోగించాలి.
అయితే, సాయుధ పోరాటాలలో తెల్ల భాస్వరం వాడకంపై చాలామంది విమర్శిస్తున్నారు.
పౌరులు, పర్యావరణానికి హాని కలగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలని, దానిపై పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















