కిబ్బుట్జ్: ఇజ్రాయెల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఈ కమ్యూనిటీ కథేంటి?

Kibbutz Givat Brenner

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిబ్బుట్జిమ్ కమ్యూనిటీ
    • రచయిత, రెడాషియాన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముండో

కఫార్ అజా, బెర్రీ, నహల్ ఓజ్, మగెన్..ఈ ప్రాంతాల గురించి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు.

ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడుల వలన ఇప్పుడు ఈ ప్రాంతాల గురించి కిబ్బుట్జిమ్ కమ్యూనిటీ గురించి తెలిసింది.

వీరి గురించి తెలుసుకోవడంతోనే ఇజ్రాయెల్ ఆవిర్భవించిన తక్కువ సమయంలోనే శక్తివంతమైన దేశంగా మారడం వెనుక వీరి పాత్ర ఏంటో తెలుస్తుంది. కిబ్బుట్జ్ అన్న పదం హిబ్రూ నుంచి స్వీకరించారు.

కిబ్బుట్జిమ్ చరిత్ర ఇజ్రాయెల్ ఏర్పాటుకు నాలుగు దశాబ్దాల ముందే మొదలైంది. ఆ సమయంలోనే దేశ ప్రగతిలో భాగమైన చాలా అంశాలపై వీరు దృష్టి సారించారు.

కేవలం వ్యవసాయ రంగంలోనే కాకుండా దేశ మేథో ప్రగతి, ఆర్థిక, రక్షణ, రాజకీయ రంగాల్లోనూ వీరి పాత్ర కీలకమైంది.

దశాబ్దాలపాటు దేశ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ప్రగతిపై బలమైన ముద్రవేసిన రాజకీయ నాయకులు, సైనికులు, కళాకారులను అందించి, మొత్తంగా బలమైన ఆధిక్యత చూపింది ఈ కమ్యూనిటీ.

యూదుల కోసం మెరుగైన ప్రపంచాన్ని నిర్మించుకోవాలనే ఆలోచనకు కార్యరూపాన్ని ఇవ్వడంలోనూ, బలమైన నాయకత్వాన్ని అందించడంలోనూ ఈ కమ్యూనిటీ ముందుంది.

ప్రార్థనల కన్నా భూమిని నమ్ముకుని అభివృద్ధి సాధించడాన్నే సూత్రంగా వీరు నమ్మారు. యూదుల కొత్త జీవన శైలికి నాంది పలికి, మరిన్ని కమ్యూనిటీల ఏర్పాటుకు ఆదర్శంగా మారింది కిబుట్జిమ్ కమ్యూనిటీ.

Kibbutz, కిబ్బుట్జ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెగానియాలో కిబ్బుట్జ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకున్న ఇళ్లు

ఇలా మొదలైంది..

'ప్రతి ఒక్కరు వారి వారి సామర్థ్యాలను తెలుసుకుని, అవసరాలకు అనుగుణంగా కలిసి సమానత్వంతో జీవించాలి' అన్న సూత్రం ఆధారంగా కిబ్బుట్జిమ్ ఏర్పడిందని చెప్పొచ్చు.

తొలి కిబ్బుట్జిమ్ కమ్యూనిటీ ఏర్పాటు 1909లో జరిగింది. ఒట్టోమన్ సామ్రాజ్యం ఆధీనంలోని కైనరెట్ సరస్సుకు దక్షిణాన ఉన్న భూమిని యూదుల జాతీయ నిధి ద్వారా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో ఇది ఏర్పాటైంది.

అందరికీ సమాన హక్కులు కలిగి, సాధారణమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కలలు కంటోన్న 12 మంది యూదుల బృందం తూర్పు యూరప్ నుంచి వలస వచ్చి, డెగానియాలో నివాసాలు ఏర్పాటు చేసుకుంది.

ఈ కమ్యూనిటీలో అందరూ సమానమే. ఉన్నది అందరికీ చెందుతుంది. చేసే పనికి విలువనిస్తూ, ప్రతి పనిని గౌరవించాలనే సూత్రంతో వీరు పనిచేస్తారు.

అందరూ అన్ని పనులు చేస్తారు. ఒకరోజు ఒకరు నిర్వహణ బాధ్యతలు చూస్తే, మరోరోజు వారు గిన్నెలు కడగడం కూడా చేస్తారు. అందరూ కలిసే అవసరాలకు అనుగుణంగా అన్ని సమకూర్చుకుంటారు.

ఆర్థిక సమానత్వం, అందరూ కలిసే వంట చేసుకోవడం,ఒకే రకమైన దుస్తులు ధరించడం, సమాన బాధ్యతలు నిర్వర్తించడం..ఇలా ఏ అంశంలోనూ ఏ ఒక్కరూ మిగతావారికంటే ఎక్కువ కాదు, తక్కువా కాదు.

isreal-kibbutz

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్యవసాయం చేస్తున్న కిబ్బుట్జ్ కమ్యూనిటీ మహిళలు

ఎడారి నేలపై పంటలు పండించారు..

తాము ఉన్న నేల సాగుకు అనుకూలమైనది కాదు. నీటి వనరులు తక్కువ. దీనితోపాటు కిబ్బుట్జ్ కమ్యూనిటీకి వ్యవసాయంపై అవగాహన లేదు. సాగుకు అవసరమైన శారీరకమైన శ్రమను కూడా వారు ఇది వరకు చేసింది లేదు. కానీ ఈ సవాళ్లన్నింటినీ అధిగమించారు. ఎడారిని వికసింపజేసిన వారిగా కిబ్బుట్జ్ కమ్యూనిటీని పరిగణిస్తారు.

క్రమేణా సాగుపై పట్టు సాధించి సాంకేతికంగా, మెలకువలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నారు.

1920, 1930ల సమయంలో పరిశ్రమల ఏర్పాటుతో ఓ విప్లవానికే నాంది పలికారు. ఉత్పత్తి, తయారీ రంగాల పరిశ్రమలతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్, మెటల్స్ తయారీలపై కూడా దృష్టి సారించారు.

ఇజ్రాయెల్ జనాభాలో 2.5% మాత్రమే ఉన్నప్పటికీ దేశ ఉత్పత్తిలో వీరి పాత్ర చెప్పుకోదగ్గదిగా మారింది. వ్యవసాయంలో 33%, పరిశ్రమలు (తయారీ రంగం)లో 6.3% వీరి నుంచే వస్తోంది.

అందుకే ఇజ్రాయెల్‌ ఏర్పాటులో కిబ్బుట్జిమ్‌ను పునాదిగా చెప్తారు.

కానీ వారి చుట్టూ మారుతోన్న పరిస్థితుల కారణంగా వాస్తవికతో, సిద్ధాంతాలలో రాజీపడుతూ జీవిస్తున్నారు.

అస్తిత్వం ప్రశ్నార్థకం..

మారుతున్న కాలం, కొత్త తరాల ఆలోచనా తీరు మారడంతో కిబ్బుట్జిమ్ సూత్రాలను అనుసరించి మనుగడ సాగించడం కష్టతరంగా మారింది. వ్యక్తిగత ప్రగతికి ప్రాధాన్యం పెరగడం వలన కూడా వీరి పట్టు సడలుతూ వస్తోంది.

1977లో కార్మిక ప్రభుత్వ పతనం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల కారణం చేత రెండు దశాబ్దాలుగా కిబ్బుట్జిమ్ కమ్యూనిటీ తీవ్రంగా ప్రభావితమైంది.

కొత్త తరాలలోని వారు సోషలిస్టు నియమాలను అనుసరించడానికి ఇష్టపడటం లేదు.

వ్యక్తిగత ప్రగతి, సాంప్రదాయ కుటుంబ జీవనానికి వ్యతిరేకంగా కిబ్బుట్జిమ్ కమ్యూనిటీ పాటించే సూత్రాలు, జీవనశైలిని విభేదించేవారు కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీల్లోని వారు మారుతున్న పరిస్థితులను అంగీకరించి, అందుకు అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వీరి అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. మార్పులను ఆహ్వానించడమా, లేదా పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోవడమా అన్న సందిగ్ధత మొదలైంది.

ఆర్థికంగా మనుగడ సాధించాలంటే కిబ్బుట్జిమ్ కమ్యూనిటీలో సమూల మార్పులు అనివార్యంగా మారింది.

Kibbutzim

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యాబోధనలోనూ వైవిధ్యత చూపిన కిబ్బుట్జిమ్ కమ్యూనిటీ

సామాజిక విప్లవానికి తెరలేచింది..

21వ శతాబ్దం ప్రారంభంలో ఇజ్రాయెల్‌లోని 270 కిబ్బుట్జిమ్‌లలో 179 కిబ్బుట్జిమ్‌‌లను ప్రైవేటీకరించారు.

వాటి ఆదర్శాలు చెదిరిపోయాయిగానీ, అవి తమ సంప్రదాయ భావజాలాన్ని మాత్రం పూర్తిగా వదిలేయలేదు.

దీని బదులుగా అవి ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, సొసైటీల మధ్య విభజనను గుర్తించారు.

కొత్త తరం నాయకులు సామాజిక బాధ్యత పట్ల ఆసక్తి చూపారు తప్ప, సమానత్వ సూత్రంపై అంతగా ఆసక్తి చూపలేదు.

కిబ్బుట్జ్ వ్యవస్థలో డిఫరెన్షియల్ పే (పనికి తగిన వేతనం) విధానాన్ని ప్రవేశపెట్టారు. మార్కెట్ ఆధారంగా పని చేయడం ప్రారంభించారు. మేనేజ్‌మెంట్ అనేది ప్రొఫెషన్ గా మారింది. సొసైటీని, బిజినెస్‌ను వేరు చేశారు.

వ్యక్తిగత ఆస్తిని పూర్తిగా తొలగించకుండా, ప్రైవేటీకరించిన కిబ్బుట్జిమ్ సభ్యులు తమ ఆదాయంలో ప్రోగ్రెస్సివ్ రేట్ విధానంలో కొంత చెల్లింపు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల సంపద వ్యత్యాసాలు తక్కువగా ఉంటాయి.

వృద్ధులు, జబ్బులతో బాధపడుతున్నవారు, అధిక వేతనాలు పొందలేని వారి కోసం ఒక కమ్యూనల్ ట్రెజరీని నిర్వహిస్తారు. ఇందులోని డబ్బును ఈ సభ్యులకు వైద్యం, విద్య, సాంస్కృతిక అవసరాలను ఉపయోగిస్తారు.

ఇలాంటి మార్పులు కిబ్బుట్జిమ్‌ను ఆర్థికంగా ఆదుకున్నాయి. వారిలో చాలామంది సంక్షోభ స్థితి నుండి బయటపడ్డారు. కొత్త సభ్యులు వీటిపట్ల ఆకర్షితులయ్యారు.

పాత కమ్యూనిటీ ఐడియాల నుంచి యువ ఇజ్రాయెలీలు ప్రేరణ పొందారు. వాళ్లు ఇర్బట్జిమ్('ఇర్' అంటే నగరం) అనే కొత్త మోడల్‌ను సృష్టించారు. దీనిలో సభ్యులు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో నివసిస్తూ తమ ప్రాంతంలోని జనాభాను బలోపేతం చేయడానికి కృషి చేస్తారు.

20వ శతాబ్దపు ఆరంభం నాటి సంప్రదాయ సామూహిక విధానాన్ని కొనసాగించిన వాటిలో బీరీ కిబ్బుట్జ్ ఒకటి. ఇక్కడే అక్టోబర్ 7న హమాస్ దాడి చేసి అక్కడున్న 1,100 మంది నివాసితులలో 120 మందిని చంపి, అనేక మందిని కిడ్నాప్ చేసింది.

కిబ్బుట్జ్ అనేది సమాజ జీవితంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రయత్నమని తత్వవేత్త మార్టిన్ బుబెర్ పేర్కొన్నారు. ‘ఈ ప్రయోగం విఫలం కాదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)