రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?

రుషికొండపై నిర్మాణాలు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖపట్నంలోని రుషికొండపై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న నిర్మాణాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనని గత రెండేళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా విశాఖను కేంద్రంగా చేసుకుని త్వరలో పాలన సాగిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు.

విశాఖలోని రుషికొండపై రూ. 270 కోట్ల పర్యాటక శాఖ నిధులతో భవనాలు నిర్మిస్తున్నారు.

అయితే, ఈ నిర్మాణాలు దేనికి చేపడుతున్నారనే విషయాన్ని వైసీపీ నాయకులు, మంత్రులు ఎవరు కూడా స్పష్టంగా చెప్పడం లేదు.

రూ.270 కోట్ల ప్రజా ధనంతో నిర్మిస్తున్న ఈ భవనాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది? సీఎం కార్యాలయమనో, కాదనో ఇటు టూరిజం శాఖ, అటు ప్రభుత్వ అధికారులు ఎందుకు చెప్పడం లేదు?

ప్రభుత్వం మితి మీరిన గోప్యత పాటించడంతో రుషికొండ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రుషికొండ నిర్మాణాల చుట్టూ తిరుగుతున్నాయి.

రుషికొండపై నిర్మాణాలు

ఫొటో సోర్స్, UGC

వివాదం ఎక్కడ మొదలైంది..?

రుషికొండ మీద 15 ఏళ్ల క్రితం హరిత బీచ్ పేరుతో రిసార్టులు నిర్మించారు. వీటిని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించింది. పర్యాటకులకు ఈ రిసార్టులను అద్దెకు ఇస్తుండేవారు.

అయితే, వీటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు 2021 మార్చి 12న కేంద్ర అటవీశాఖ నుంచి , మే 19న సీఆర్‌జెడ్ నుంచి అనుమతులను తీసుకుంది. దీని తర్వాత ఫైర్‌ సేఫ్టీ పర్మిషన్‌, జీవీఎంసీ నుంచి బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్‌, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి కూడా పర్యాటక శాఖ పర్మిషన్లు తీసుకుంది.

ఆ తర్వాత రుషికొండపై పాత నిర్మాణాల స్థానంలో కొత్తవి ప్రారంభించారు. అందులో భాగంగా కొండను కొంత భాగం తవ్వేశారు. ఈ నిర్మాణాలు సీఎం కార్యాలయం, నివాసం కోసమేనంటూ వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

ఈ విమర్శలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇప్పుడు రుషికొండపై నిర్మాణాలు దాదాపు పూర్తయిపోయాయి. త్వరలోనే సీఎం ఇక్కడికి వస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయినప్పటికీ, నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టత సమాధానం రాలేదు.

మరోవైపు రుషికొండపై పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తూ తవ్వకాలు చేపట్టారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అసలు అక్కడేం జరుగుతోందనే విషయాలు ప్రభుత్వానికి సంబంధించిన ఏ వెబ్‌సైట్‌లోనూ కనిపించడం లేదు.

2006లో వచ్చిన ఒక జీవో ప్రకారం సహజ సిద్ధంగా ఏర్పడిన ఏదైనా కొండను ధ్వంసం చేయడం గానీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు గానీ చేపట్టరాదు. కానీ రుషికొండపై ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పడం లేదని పర్యావేరణ వేత్త జయ హట్టంగడి బీబీసీతో అన్నారు.

రుషికొండపై నిర్మాణాలు

ఫొటో సోర్స్, UGC

రుషికొండ ఎలా మారింది?

రుషికొండ బీచ్ వైపు వెళుతుంటే కొండపై కొత్తగా నిర్మించిన భారీ భవనాలు కనిపిస్తాయి. పక్కనే కొండలో కొంత భాగం తవ్వేయడంతో అది ఎర్రగా కనిపిస్తోంది, మరికొంత భాగం గ్రీన్‌మ్యాట్‌తో కప్పేశారు. దీంతో ఈ నిర్మాణాలపై కొందరు పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు.

నగరాభివృద్ధి సంస్థల చట్టం ప్రకారం అప్పటి విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) 2006లో మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. దీనిపై ఆ సమయంలో ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అందులో కొండలను కాపాడాలి.. వాటిపై పచ్చదనం పెంచాలనే అంశం కూడా ఉంది.

“నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా దీనిపై పలుమార్లు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా అడ్డగోలుగా చట్టాలను కాదని కొండల్ని ధ్వంసం చేస్తోంది. పైగా రాష్ట్ర రాజధానిగా మారుస్తామంటున్నారు, అసలు రుషికొండ నిర్మాణాలపై ప్రజలకు కూడా నిజాలు చెప్పకుండా దాచేస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియపర్చండి” అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ నర్సింగరావు బీబీసీతో అన్నారు.

‘’రుషికొండలో నిర్మాణాలు జరుగుతున్న భూమి.. పర్యాటక శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాల కోసం ప్రభుత్వానికి అనుమతులు వచ్చాయి. ఇందులో కూడా నిర్మాణాలు చేపడుతోంది కేవలం 2.7 ఎకరాల లోపలే’’ అని పర్యాటక శాఖ ఉద్యోగి ఒకరు బీబీసీతో చెప్పారు.

రుషికొండపై నిర్మాణాలు సీఎం జగన్‌ నివాసం కోసమే కడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అవి ప్రభుత్వ భవనాలే అని.. రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటే ప్రతిపక్షాలకు వచ్చిన ఇబ్బంది ఏంటని అధికార పార్టీ వైసీపీ వాదిస్తోంది.

రుషికొండపై నిర్మాణాలు

ఫొటో సోర్స్, UGC

‘ఆ నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధమే’

రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలన్నీ పర్యావరణానికి విరుద్ధంగానే జరుగుతున్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. రుషికొండపై నిర్మాణాలు అక్రమమని ఇటు రాష్ట్రానికి, అటు కేంద్రానికి లేఖలు రాస్తూ, మరోవైపు సభలు, సదస్సుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు శర్మ.

అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చట్టం ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ పరిధిలోని కొండలను పరిరక్షించాలి. వాటిపై ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. గతంలో వుడా, ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ దీనిని మాస్టర్‌ప్లాన్‌లో సీఆర్‌జెడ్‌ కింద కూడా గుర్తించిందని శర్మ బీబీసీతో చెప్పారు.

“రుషికొండలో హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి, ఆ వ్యర్థాలను తీరం పొడవునా కిలోమీటర్ల మేర పడేసింది ఏపీటీడీసీ. ఇది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. రుషికొండపై నిర్మాణాల కోసం ఏపీటీడీసీ బోర్లు వేసి ఆ నీటిని వినియోగిస్తోంది. సీఆర్‌జెడ్‌ ప్రాంతంలో ఇలా బోర్లు వేయకూడదు. ప్రాథమికంగానే నిబంధనలు ఉల్లంఘించిన సంస్థకు నిర్మాణ అనుమతులు ఇవ్వడం ఏ విధంగానూ సరైన చర్య కాదు” అని ఈఏఎస్ శర్మ అన్నారు.

రుషికొండపై నిర్మాణాలు

ఫొటో సోర్స్, UGC

“రుషికొండపై సర్వే చేయాలి”

రుషికొండపై తమ ఆధీనంలో ఉందని చెప్పుకుంటున్న ఏపీటీడీసీకి భూ విస్తీర్ణంలో కచ్చితత్వం లేదని, ఒక్కోచోట ఒక్కోవిధంగా చెబుతోందని, అందులో ఏది వాస్తవమో తేల్చాల్సిన అవసరముందని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమెట్ ఛేంజ్ కార్యదర్శికి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు.

అధికారిక గ్రామ రికార్డుల్లో సర్వే నంబరు 19లో రుషికొండపై 85.2 ఎకరాలుగా చూపిస్తోంది. మరోవైపు ఏపీటీడీసీ రుషికొండ ప్రాజెక్టు భూమి విస్తీర్ణం 65.65 ఎకరాలుగా పేర్కొంది.

ఇంకో వైపు పర్యావరణ మంత్రిత్వ శాఖ కొండపై మొత్తం విస్తీర్ణం 61 ఎకరాలని ప్రస్తావించింది. ఈ విషయంలో క్లారిటీ లేదని శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రాజెక్టు నిర్మాణం కోసం దరఖాస్తు చేసిన ఏపీటీడీసీ పేర్కొన్న వివరాల్లో విశ్వసనీయత లేనందున, అక్కడ కొత్తగా జీవీఎంసీ సర్వే చేయాల్సిన అవసరముందన్నారు.

ఇలా అనేక అంశాల్లో అనుమానాలున్నా కూడా ప్రభుత్వం, పర్యాటకశాఖ రుషికొండపై ఏం జరుగుతుందోననే విషయంలో చెప్పకపోవడం తగినది కాదన్నారు.

'రాజుల కాలంలో ఉన్నామా?'

‘’అసలు సీఎం క్యాంపు కార్యాలయం, నివాసం కొండలపైనే ఉండాలని అనుకోవడమే చాలా విచిత్రంగా ఉంది. మనమేమైనా రాజుల కాలంలో ఉన్నామా లేదంటే ఈస్ట్ ఇండియా పాలనలో ఉన్నామా?’’ అని ఈఏఎస్ శర్మ ప్రశ్నించారు.

‘’అక్కడ ఏ నిర్మాణాలు జరుగుతున్నాయో, దేని కోసం ఉపయోగిస్తారో చెప్పడం ప్రభుత్వ బాధ్యత. కానీ, దాచి పెట్టడం చూస్తుంటే అక్కడేదో రహస్యం ఉందనే భావన వస్తుంది. నిజానికి అది సీఎం క్యాంప్ కార్యాలయమే, కాకపోతే కోర్టుల్లో కేసులు ఉన్నందున ప్రభుత్వం నేరుగా ఆ మాట చెప్పలేకపోతుంది. భవిష్యత్తులోనైనా కోర్టులు ఈ నిర్మాణాలకు బ్రేకులు వేయడం ఖాయం. ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించిందంటే మరింత చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం ఆ నిర్మాణాలు సీఎం ఆఫీసుకు సంబంధించినవే అని చెప్పలేకపోతోంది” అని శర్మ అభిప్రాయం వ్యక్తంచేశారు.

'ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం'

2023 అక్టోబర్ 11వ తేదీన ఏపీ ప్రభుత్వం జీవో నంబరు 2015 విడుదల చేసింది.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రం సామరస్య, సమతుల్య అభివృద్ధిని సాధించేందుకు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ చేయాలి.

అందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు విశాఖపట్నంలో రాత్రిపూట బస చేయడానికి తగిన వసతిని గుర్తించేందుకు త్రిసభ్య కమిటిని ఏర్పాటు చేస్తూ జీవో 2015ని విడుదల చేసింది.

ఈ కమిటీలో పట్టణాభివృద్ధి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక శాఖ కార్యదర్శులుంటారు.

రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలుగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఆరోగ్యం, విద్యా, ఇరిగేషన్, కనెక్టివిటీ పరంగా వెనుకబడి ఉన్నాయని జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది.

ఉత్తరాంధ్ర ప్రాంత సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని జీవోలో పేర్కొంది.

ఈ జీవో కూడా దొడ్డిదారిన సీఎంవోను, ఇతర అధికారుల కార్యాలయలు పెట్టేందుకే అంటూ టీడీపీ, జనసేన పార్టీలు విమర్శిస్తున్నాయి.

రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలు ఎందుకోసమో చెప్పలేకపోవడం ఏమిటని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు.

రుషికొండపై నిర్మాణాలు

ఫొటో సోర్స్, UGC

ఒక్కొక్కసారి ఒక్కోలా...

ఇంత వివాదం నడుస్తున్నా రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల విషయంలో ప్రభుత్వం మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనిపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు కౌంటర్​గా వివిధ సందర్భాల్లో మంత్రులు కొన్ని సమాధానాలు చెప్పారు.

గతంలో పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు “విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టార్ హోటల్ నిర్మిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు

“రుషికొండపై భవనాలు కట్టకూడదా? అక్కడ ముఖ్యమంత్రి ఉండకూడదా?” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మరో మంత్రి అమర్నాథ్, “అక్కడ నిర్మాణాలు ప్రభుత్వ అవసరాల కోసమే” అని అన్నారు.

ఈ ఏడాది ఆగస్ట్ 12న వైసీపీ అధికారిక ట్విటర్ ఖాతాలో “సీఎం క్యాంపు కార్యాలయంగా రుషికొండ” అంటూ ఫొటోలతో సైతం ట్వీట్ చేశారు. ఇది వైరల్ కావడంతో... అది పొరపాటున జరిగిందని చెబుతూ, ఆ ట్వీట్ ను తొలగించారు.

రుషికొండపై జరుగుతున్న విలాసవంతమైన నిర్మాణాలు సీఎం జగన్ కోసమేనని టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. త్వరలోనే ఈ నిర్మాణాల విషయం ప్రపంచానికి తెలిసే రోజు వస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)