టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?

పార్సీలు, చనిపోయిన వారి మృతదేహాలను వదిలివేసే ప్రదేశాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’ అంటారు.
పురాతన కాలం నుంచి పార్సీ కమ్యూనిటీ ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీన్ని ‘‘దఖ్మా’’ అని పిలుస్తారు.
మానవ శరీరం ప్రకృతి ఇచ్చిన బహుమతి అని పార్సీలు నమ్ముతారు. అందుకే మరణానంతరం దాన్ని ప్రకృతికే సమర్పించాల్సి ఉంటుందని భావిస్తారు
ప్రపంచవ్యాప్తంగా పార్సీలంతా అంత్యక్రియల్ని ఇదే విధంగా చేస్తారు. కోల్‌కతాలోనూ ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు.

కోల్‌కతాలో తొలి ‘టవర్ ఆఫ్ సైలెన్స్’ ఏర్పాటు
కోల్‌కతాలోని బెలెఘాటలో 1822లో తొలి టవర్ ఆఫ్ సైలెన్స్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. 1828లో పూర్తి చేశారు.
ఆ సమయంలో కోల్‌కతాలో పార్సీల జనాభా భారీగా ఉండేది.
కోల్‌కతాలోని ప్రముఖ వ్యాపారవేత్త నౌరోజీ సోరాబ్జి ఉమ్రిగర్ దీన్ని నిర్మించారు.
టవర్ ఆఫ్ సైలెన్స్ నిర్మించిన వారిని లేదా దానికి విరాళాలు ఇచ్చిన వారినే మరణానంతరం మొదటగా అక్కడికి చేరుస్తారని పరిశోధకులు, రచయిత ప్రొఫెసర్ మెహతా చెప్పారు.
కోల్‌కతాలోనూ ఇలాగే జరిగిందని అన్నారు. టవర్ ఆఫ్ సైలెన్స్‌ను నిర్మించిన వారి మృతదేహాలనే మొదటగా అక్కడికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
వారికి ఒక పెంపుడు కుక్క ఉండేది. యజమానులను అది చాలా ప్రేమించేది. యజమాని మరణానంతరం ఆ పెంపుడు కుక్క కూడా తినడం, నీళ్లు తాగడం మానేసింది. ఏడు రోజుల తర్వాత అది చనిపోయింది. తర్వాత దాని మృతదేహాన్ని కూడా ‘టవర్ ఆఫ్ సైలెన్స్’ బయట ఖననం చేశారు.
తూర్పు ఆసియాలో కోల్‌కతాలో తొలి ‘‘టవర్ ఆఫ్ సైలెన్స్’’ను నిర్మించారు. ఆ సమయంలో కోల్‌కతాను కలకత్తా అని పిలిచేవారు.
ఆ కాలంలో కేవలం రంగూన్, మలయ నుంచి మాత్రమే కాకుండా సింగపూర్ నుంచి కూడా మృతదేహాలను కలకత్తాలోని ‘‘టవర్ ఆఫ్ సైలెన్స్’’లోకి తీసుకొచ్చేవారని చెబుతుంటారు.
అక్కడ వదిలేసిన మృతదేహాన్ని రాబందులు, పక్షులు తింటాయి. వర్షం, ఎండవేడికి కొన్ని రోజులకు ఆ మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోతాయి.
మరణించిన తర్వాత కూడా జీవితంలో చివరి దాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహించడమే, ఈ రకంగా అంత్యక్రియలు నిర్వహించడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం.
రాబందులు, ఇతర పక్షులతో పాటు ఎండ వేడి కూడా ప్రభావితం చేస్తుందని కోల్‌కతాలోని పార్సీ అగ్ని దేవాలయం పూజారి జిమ్మీ హోమీ తారోపోర్వాల్ అన్నారు.
మృతదేహాలను పూడ్చిపెట్టడం, నదుల్లో వదిలేయడం వంటివి ప్రకృతికి చేటు చేస్తాయని పార్సీలు నమ్ముతారు. అందుకే ఏళ్లుగా ఆచరణలో ఉన్న ఈ ఆచారాన్నే వారు పాటిస్తారు.

‘టవర్ ఆఫ్ సైలెన్స్’ డిజైన్
ప్రతీ మృతదేహం ‘నాసో’కు మూలం అని కోల్‌కతాలోని పార్సీ కమ్యూనిటీకి చెందిన చారిటబుల్ ఫండ్ సీనియర్ ట్రస్టీ నూమీ మెహతా అన్నారు.
‘‘మా భాషలో నాసో అంటే కాలుష్యం. మృతదేహాల వల్ల ఏ ప్రదేశంలో కాలుష్యం ఏర్పడినా మేం అంగీకరించం.
మృతదేహాలను నదుల్లో వేస్తే నీరు, దహనం చేస్తే గాలి కలుషితం అవుతాయి. అందుకే మేం మృతదేహాలను ప్రకృతిలో వదిలేస్తాం’’ అని చెప్పారు.
బరువైన మృతదేహాలు అన్నింటికంటే పైభాగంలో, మహిళలు లేదా తక్కువ బరువుండే మృతదేహాలు మధ్యభాగంలో, పిల్లల శరీరాలు కింది భాగంలో ఉంచేలా ‘టవర్ ఆఫ్ సైలెన్స్’ నిర్మాణం ఉంటుంది.
రాబందులు, ఇతర పక్షులు తినగా మిగిలిపోయిన ఎముకలు కింద ఉన్న బావిలో పడతాయి. ఏడాదికి ఒకసారి లేదా రెండుసార్లు ఆ బావిలోని ఎముకలను తొలగించి వాటిని డిస్పోస్ చేస్తారు.

తగ్గిన పార్సీల సంఖ్య
కోల్‌కతాలో ఒకప్పుడు పార్సీల సంఖ్య భారీగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ 370 మంది పార్సీలు మాత్రమే మిగిలారు.
వారిలో 220 మంది 60 ఏళ్లకు పైబడినవారే. 30 మంది వయస్సు 20 ఏళ్ల కంటే తక్కువ ఉంటుంది.
అందుకే, ఇక్కడి ‘‘టవర్ ఆఫ్ సైలెన్స్’’లో చాలా తక్కువ మృతదేహాలు ఉంటాయి.
ఈ అంత్యక్రియల ప్రక్రియను ఇప్పటివరకు తాను మూడుసార్లు చూసినట్లు స్థానికురాలు బబ్లీ సమంత చెప్పారు.
‘‘ఆ సమయంలో అందరూ తెల్లటి దుస్తులు వేసుకున్నారు. మేం ఎప్పుడూ ‘టవర్ ఆఫ్ సైలెన్స్’కు వెళ్లలేదు. ఎందుకంటే అది అడవిలో ఉంటుంది.
ఒక భవనం మీద నుంచి నేను ఈ ప్రక్రియను చూశాను. మృతదేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారంతా ఏవో నినాదాలు చేస్తారు. తర్వాత ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లోకి వెళ్తారు. ఈ ప్రక్రియ మొత్తం అయ్యేవరకు వారంతా ఉమ్మడిగా అరుస్తూనే ఉంటారు’’ అని ఆమె వివరించారు.

మారుతున్న కొత్త తరం
కాలం మారుతోంది. రాబందులు కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి. మరోవైపు, ‘టవర్ ఆఫ్ సైలెన్స్’ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాభా కూడా పెరగడం మొదలైంది.
ప్రజల ఆలోచనా విధానం కూడా మారింది. కాబట్టి ఇప్పుడు పార్సీ ప్రజలు కూడా మృతదేహాలను కాల్చడం, పాతిపెట్టడం వంటివి చేస్తున్నారు.
‘‘మా నాన్న చనిపోయినప్పుడు మేం ఆయన మృతదేహాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్‌కు తీసుకెళ్లలేకపోయాం. అలా చేయడం ఇప్పుడు సాధ్యం కూడా కాదు.
రాబందుల సంఖ్య తగ్గిపోవడం వల్ల మృతదేహాలు సహజంగా డిస్పోస్ అవ్వడం లేదు. అందుకే మా నాన్న మృతదేహానికి దహన సంస్కారాలు చేయాలని మేం నిర్ణయించుకున్నాం. తర్వాత బూడిదను ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో పాతిపెట్టి, దానిపై ఒక మొక్కను నాటాం. ఏడాదికి ఒకసారి ఆ ప్రదేశానికి నేను వెళ్తా’’ అని గుల్నార్ మెహతా చెప్పారు.
పుస్తకాల్లో ఉన్నదాని ప్రకారం మాత్రమే మనకు ‘‘టవర్ ఆఫ్ సైలెన్స్’’ గురించి తెలుసు అని నిపుణురాలు జహాన్ మెహతా అన్నారు.
‘‘మనం అక్కడికి ఎక్కువగా వెళ్లం. బహుశా అంత్యక్రియలకు ఇది సరైన పద్ధతి కాకపోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను పర్యావరణ అనుకూలమైనదిగా పేర్కొనలేం. కాలంతో పాటు మనం కూడా ముందుకు సాగాలి’’ అని గుల్నార్ అన్నారు.
‘‘కొత్త తరం వారు దీన్ని అంగీకరిస్తారా? అంత్యక్రియలకు ఇది సరైన మార్గమేనా? ఇది సరైనదని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మనం అంతా నగరాల్లో నివసిస్తున్నాం. శరీర భాగాలు అక్కడక్కడ చెల్లాచెదురుగా పడిఉండటాన్ని చూడగలమా?’’ అని సన్యా మెహతా వ్యాస్ అన్నారు.
పార్సీ ఆచారంపై కొంతమందికి విశ్వాసం
కొత్త తరం పార్సీలు ఇప్పుడు ఈ ఆచారానికి దూరం అవుతున్నారు. కానీ, పార్సీ పూజారులు మాత్రం ఇప్పటికీ ఈ ఆచారాన్నే నమ్ముతున్నారు.
‘‘ఒకవేళ మీకు ఈ మతంపై నమ్మకం లేకపోతే, మీరు మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు దేవున్ని నమ్మకపోతే, ఏ ఆచారాన్ని పాటించకపోతే అది మీ వ్యక్తిగత నిర్ణయం.
కానీ, పార్సీల్లో చాలామంది వారి సంప్రదాయాలను పాటిస్తారు. అందుకే నేటికీ ‘‘టవర్ ఆఫ్ సైలెన్స్’’ ప్రాముఖ్యత ఇంకా కొనసాగుతుంది’’ అని జిమ్మీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














