అయోధ్య రామమందిరం నిర్మాణం ఏ దశలో ఉంది... ఇంతవరకూ ఈ ఆలయానికి విదేశీ విరాళాలు ఎందుకు రాలేదు?

ఫొటో సోర్స్, CHAMPAT RAI
- రచయిత, అనంత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ, జనవరిలో ఉంటుందని అంచనా.
వేడుకల కోసం ఆలయాన్ని, అయోధ్య నగరాన్ని సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇదే సమయంలో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద విదేశాల నుంచి విరాళాలు స్వీకరించేందుకు లైసెన్సు కోసం రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దరఖాస్తు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎఫ్‌సీఆర్‌ఏ కింద నిధులు తీసుకోవడంపై 2023 మే నెల నుంచి చర్చలు జరుగుతున్నాయి.
"చాలామంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఎన్నారైలు ఇండియాలోని బంధువులను నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. వారు కొంతమొత్తాన్ని తీర్థ ట్రస్ట్‌కు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే, దీనిపై దేశంలో నియమ, నిబంధనలు ఉన్నాయి" అని రామజన్మభూమి తీర్థ క్షేత్రం ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. అయితే, ఇక్కడి చాలా సంస్థలు ఎఫ్‌సీఆర్‌ఏని దుర్వినియోగం చేశాయని ఆయన ఆరోపిస్తున్నారు.
"మేం నిబంధనలు అనుసరిస్తున్నాం. ఎన్నారైలు, రామ భక్తుల కోరిక మేరకు ఎఫ్‌సీఆర్‌ఏలో రిజిస్ట్రేషన్ కోసం ఒక దరఖాస్తు సమర్పించాం" అని అన్నారు చంపత్ రాయ్.

ఫొటో సోర్స్, SHRI RAM JANMBHOOMI TEERTH KSHETRA
ఇప్పటి వరకు ఎంత విరాళం వచ్చింది?
విరాళాల గురించి అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాశ్ గుప్తా బీబీసీతో వివరాలు పంచుకున్నారు.
''ఆలయం ట్రస్టుగా మారి మూడేళ్లు గడుస్తోంది. ప్రస్తుతం ట్రస్టు ద్వారా ఎఫ్‌సీఆర్‌ఏ ప్రక్రియ పూర్తయింది. ఇక ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. నవంబర్ లేదా డిసెంబర్ నాటికి వస్తుందని భావిస్తున్నాం. విదేశాల్లో కూడా చాలామంది హిందువులున్నారు. విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లు ఇక్కడికి రాలేకపోతే విరాళం ఎలా ఇవ్వాలనేదే వారికి సమస్య. ఆలయ నిర్మాణానికి నిధులు ఎఫ్‌సీఆర్‌ఏ ద్వారా అందవచ్చు. విరాళం ద్వారా వచ్చే ప్రతి పైసాకు లెక్క ఉంటుంది, ప్రభుత్వ ఆడిట్ ఉంటుంది. మేం డబ్బును రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరుతో మాత్రమే తీసుకుంటాం. మరే ఇతర పేరుతో కాదు'' అని అన్నారు ప్రకాశ్ గుప్తా.
రామమందిరానికి ఎంత ఖర్చయిందో ప్రకాష్ గుప్తా వివరిస్తూ..
''ఆలయ నిర్మాణ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 2,000 కోట్లు. 2023 మార్చి నాటికి అయోధ్యలో ఆలయ నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు చేశారు. మార్చి నుంచి మరో రూ.500 కోట్ల నుంచి రూ. 600 కోట్లు ఖర్చయి ఉంటుందని అంచనా. జనవరిలో నిర్వహించనున్న సంప్రోక్షణకు ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు, మూడేళ్లలో రూ.4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఇచ్చారు.
వచ్చిన డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ఖర్చుల కోసం డబ్బును విడిగా బ్యాలెన్స్‌లో ఉంచుతారు. ప్రస్తుతం ఆలయం మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత రెండో అంతస్తు నిర్మించి, తర్వాత గోపురం నిర్మిస్తారు, ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, CHAMPAT RAI
విదేశాల నుంచి విరాళాలు ఎవరు తీసుకోవచ్చు?
ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొదటి మూడేళ్ల పాటు విదేశాల నుంచి పరిమిత మొత్తంలో మాత్రమే విరాళాలు తీసుకోవడానికి అనుమతి ఉంది.
అనంతరం ఐదేళ్ల పాటు బ్లాంకెట్ పర్మిషన్ ఇవ్వవచ్చు. దీని ద్వారా ఏ వ్యక్తి నుంచైనా ఎంత మొత్తమైనా అంగీకరించవచ్చు.
ఎఫ్‌సీఆర్‌ఏ నుంచి ఎవరు, ఎలా డబ్బు తీసుకోవచ్చనే విషయంపై హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉంది. దీని ప్రకారం
- విరాళం పొందే వ్యక్తి లేదా సంస్థ ఖచ్చితమైన సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, మతపరమైన లేదా సామాజిక కార్యక్రమం చేస్తూ ఉండాలి.
- వ్యక్తి లేదా సంస్థ తప్పనిసరిగా ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్/కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందాలి.
- వ్యక్తి లేదా సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏ ద్వారా నిధులను పొందాలంటే దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మాత్రమే అకౌంట్ ఓపెన్ చెయ్యాలి.
ఇంకా ఎవరు దరఖాస్తు చేశారు?
బాబ్రీ మసీదుకు బదులుగా అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో కేటాయించిన భూమిలో ఎలాంటి నిర్మాణ పనులు జరగడం లేదు.
ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అక్కడ మసీదుతో పాటు ఆసుపత్రి, కమ్యూనిటీ కిచెన్, మ్యూజియం నిర్మించబోతోంది .
ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.50 లక్షలు మాత్రమే జమయ్యాయని ఫౌండేషన్ అధికారులు తెలిపారు. నిధుల సమీకరణ ప్రారంభిస్తామని ఫౌండేషన్ చెబుతోంది.
'ధన్నిపూర్‌లో ఆసుపత్రి, కమ్యూనిటీ కిచెన్ నిర్మించి, సేవా కార్యక్రమాలు చేస్తాం. మేం దేశ, విదేశాల్లోంచి విరాళాలు తీసుకుంటాం. అందుకే మేం ఎఫ్‌సీఆర్‌ఏ అకౌంట్‌కు అప్లై చేశాం" అని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ అథర్ హుస్సేన్ సిద్ధిఖీ అన్నారు.
"మేం ఎఫ్‌సీఆర్‌ఏ అకౌంట్ తెరిచాం, ఇప్పటివరకు ఆ ఖాతాలో మాకు డబ్బు రాలేదు. ప్రస్తుతం మేం ఎవరి నుంచి నిధులు అడగలేదు. మాకు ఎవరూ ఇవ్వలేదు. మా ట్రస్టుకు మూడేళ్లు పూర్తయితే, అకౌంట్ బ్లాంకెట్ అనుమతికి అర్హత పొందుతుంది. అనంతరం ఐదేళ్ల పాటు మేం ఏదైనా చట్టబద్ధమైన వ్యక్తి లేదా సంస్థ నుంచి ఎంత మొత్తమైనా స్వీకరించగలుగుతాం" అని సిద్ధిఖీ తెలిపారు.
ఏపీలో 622 లైసెన్సులు
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను కఠినతరం చేశారు.
2017, 2021 మధ్య 6,677 ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ప్రభుత్వం రద్దు చేసింది.
2022 డిసెంబర్ 2న 'రాజీవ్ గాంధీ ఫౌండేషన్' ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.
'రాజీవ్ గాంధీ ఫౌండేషన్' నిబంధనలు ఉల్లంఘించడంతో రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అప్పట్లో తెలిపారు.
హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రద్దయిన 6,677 లైసెన్సులలో ఆంధ్రప్రదేశ్ నుంచి 622 సంస్థలు, మహారాష్ట్ర నుంచి 734 , తమిళనాడు నుంచి 755, ఉత్తరప్రదేశ్ నుంచి 635 ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
- నైట్‌క్లబ్స్, జూ, డ్రగ్స్ స్టోర్..ఒక జైలులో ఉండకూడని సౌకర్యాలన్నీ ఇక్కడ ఉంటాయి....
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














