అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ: మోదీ హిందూత్వ ఇమేజ్ ఇంకా పెరుగుతుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి భూమి పూజ సమయంలో ధోతీ, కుర్తా వేసుకొని మాస్క్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనిపించారు. ఆయన చిత్రాలు, దృశ్యాలు టీవీల్లో కనిపించిన వెంటనే ధోతి, కుర్తా రంగుపై చర్చ మొదలైంది.
ఇటీవల కాలంలో ఇలాంటి రంగు వస్త్రాలను మోదీ ఎప్పుడూ వేసుకోలేదు.
దీంతో 30 ఏళ్ల కిందటి ఫోటోను, ఇప్పటి ఫోటోకు కలిపి ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం కార్యకర్తగా మోదీ, ఇప్పుడు ప్రధాన మంత్రిగా మోదీల మధ్య తేడాపై చర్చ జరుగుతోంది.
ఎప్పుడూ కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారనే ఇమేజ్ మోదీకి ఉందని బ్రాండ్ గురు హరీశ్ బిజూర్ అన్నారు. "పరిస్థితికి తగినట్లు ఆయన వస్త్రాలు ధరిస్తారు. అందుకే ఆయన్ను సందర్భానికి తగిన బట్టలు వేసుకునే అప్రాప్రియేట్ డ్రెసర్‌గా కీర్తిస్తారు. ఫ్యాషనబుల్ డ్రెస్సర్‌గా కాదు".
"తను వేసుకునే వస్త్రాలపై మన దేశంతోపాటు విదేశాల్లోనూ చర్చ జరుగుతుందని మోదీకి తెలుసు. కావాలనే ఓ న్యూట్రల్ రంగు వస్త్రాలు ధరించారు. ఆ రంగు గేరువా అనే రంగుకు దగ్గర్లో ఉంది. అది అంత ఉత్తేజపరిచే రంగుకాదు. అందరూ కలసిమెలసి ఉండాలనే సందేశాన్ని ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు" అని హరీశ్ వ్యాఖ్యానించారు.
"నేను భారతీయున్ని. నేను హిందూని. నేను పక్షపాతిని కాదు అనే సందేశాలను మోదీ ఆ డ్రస్సుతో ఇచ్చారు".

ఫొటో సోర్స్, ANI
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఈ ట్రస్టును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
ట్రస్టు ఆహ్వానంపైనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు వచ్చారు. జై సీతారాం, సీతాపతి రామచంద్రకీ జై అనే నినాదాలతో మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టి, ముగించారు.
దీంతో సీపీఐ, అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి పదవిలో ఉంటూ భూమి పూజలో ఎలా పాల్గొంటారని వీరు ప్రశ్నించారు.
సుప్రీం కోర్టు తీర్పుతోనే బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదం ముగిసినప్పటికీ.. మోదీ రాజకీయ జీవితంలో ఇదొక మైలు రాయిగా మిగిలిపోతుంది. ఆయన రాజకీయ భవిష్యత్‌పై తాజా పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుంది? అని చర్చలు కూడా జరుగుతున్నాయి.
భారత చరిత్రలో ఓ సుదీర్ఘ అధ్యాయం నేటి కార్యక్రమంతో ముగిసిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు కొత్త అధ్యాయం మొదలవుతోందని అంటున్నారు.
"భయం లేనిచోట ప్రేమ ఉండదు. అనే విషయాన్ని రాముడు నమ్ముతాడు. అందుకే మన దేశం ఎంత శక్తిమంతమైతే.. అంత భయం లేకుండా ఉండగలం" అని తన ప్రసంగంలో మోదీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
నిర్ణయాత్మక సమయం
కరోనా సమయంలో ఇలాంటి భూమి పూజలో పాల్గొనడంతో ప్రపంచంలో నరేంద్ర మోదీ ఇమేజ్ ఎలా మారబోతుందో చెప్పలేమని సీనియర్ జర్నలిస్టు నిస్తులా హెబ్బార్ వ్యాఖ్యానించారు.
రాయిటర్స్ వార్తా సంస్థ కూడా కార్యక్రమంలో మోదీ పాల్గొన్న ఫోటోలను ట్వీట్‌చేసింది. అయితే క్యాప్షన్‌లో వివాదాస్పద హిందూ దేవాలయం భూమి పూజలో పాల్గొన్నారు అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సుప్రీం కోర్టు ఆదేశం తరువాత, ట్రస్టు ఆహ్వానంపైనే ఈ భూమి పూజకు మోదీ వెళ్లినప్పటికీ.. ఆయన హాజరు కావడం వివాదాస్పదమైంది.
"ప్రధాని నరేంద్ర మోదీ హిందూ భావజాలానికి ప్రాతినిథ్యం వహిస్తారని, ప్రభుత్వ విధానాలలోనూ దీనికి ప్రాధాన్యం ఇస్తారని ఇప్పటికే ప్రపంచమంతా చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాక కూడా ఆయన ఇమేజ్ అలానే ఉంటుంది" అని నిస్తులా చెప్పుకొచ్చారు.
"భారత్‌లో మాత్రం ఆయన ఒక హిందూత్వ నాయకుడిలా ముద్ర పడుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అడ్వాణీ, అటల్‌ల బీజేపీ పోరాడినా.. చివరకు మోదీనే దీనికి ముగింపు ఇచ్చారు. ఇప్పటి నుంచి మోదీకే దీనిపై క్రెడిట్ దక్కుతుంది" అని నిస్తులా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
"అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి.. ఈ మూడు ఆరెస్సెస్ ప్రధాన అజెండాలు. వీటిలో రెండు మోదీ హయాంలోనే పూర్తయ్యాయి. అలాగే ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా మోదీ ప్రభుత్వమే తీసుకొచ్చింది" అని నిస్తులా వ్యాఖ్యానించారు.
మోదీ రాజకీయ జీవితంలో తాజా కార్యక్రమానికి హాజరు కావడం మైలురాయేమీ కాదు. అయితే మోదీ చరిత్రలో గుర్తిండిపోయే అంశాలు మూడున్నాయి.
మొదటిది ఏమిటంటే.. రెండుసార్లు ఎవరి సాయం లేకుండానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. హిందూత్వ రాజకీయాలతోనూ అధికారంలోకి రావొచ్చని వీరు నిరూపించారు. హిందువులు వారి కులం ప్రకారం ఓట్లు వేస్తారని, అందుకే వారి ఓట్లు విడిపోతాయని భారత్‌లో నమ్మకం ఉండేది. మైనారిటీల మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యమని భావించేవారు.
రెండోది ఏమిటంటే.. ఏళ్ల తరబడి నలుగుతున్న అంశాలైన ఆర్టికల్ 370, రామ మందిర నిర్మాణాలను ఎలాగైనా పూర్తి చేస్తామని మాటిచ్చారు. దాన్ని వారు పూర్తి చేశారు కూడా..
మూడోది ఏమిటంటే.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన లాంటివి.
"కాంగ్రెన్‌ను పేదల పార్టీగా అందరూ భావించేవారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వంపైనా ఆ ముద్ర పడింది" అని నిస్తులా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, AFP/Money Sharma
2002నాటి అల్లర్ల మచ్చ ఆయనపై తొలగిపోతుందా?
"ఆ ఇమేజ్ ఎప్పుడో తుడుచి పెట్టుకుపోయింది. ఆ తరువాత మోదీ ఒక్క ఎన్నిక కూడా ఓడిపోలేదు. నేడు కూడా ఒవైసీ పార్టీని పక్కన పెడితే ఎవరూ ఆయన్ను విమర్శించలేదు. 25 ఏళ్ల క్రితం ఇది ఎవరైనా ఊహించగలరా? హిందూత్వ వ్యతిరేక రాజకీయాలకు నేటితో కాలం చెల్లింది" అని సీనియర్ జర్నలిస్టు ప్రదీప్ సింగ్ వ్యాఖ్యానించారు.
"మోదీ చరిత్రలో అది ఎప్పటికీ ఉండిపోతుంది. గుజరాత్‌లో హిందూ హృదయ సామ్రాట్‌గా ఆయనకు ఇమేజ్ ఉంది. ప్రపంచ మంతా ఆయన్ను అలానే చూస్తున్నారు. ఈ ఇమేజ్ ఈ కార్యక్రమంతో ఇంకా బలపడుతుంది" అని సీనియర్ విలేకరి నీరజా చౌధరి వ్యాఖ్యానించారు.
అయోధ్య తర్వాత, ఇప్పుడు ఏం జరుగుతుందనే అంశంపైనా చాలా ఆధారపడి ఉంటుంది.
"1992, డిసెంబరు 6 తర్వాత ఎన్నికల్లో రామ మందిర అంశం పెద్దగా పనిచేయలేదు. హిందూత్వ, జాతీయవాద అంశాలపైనే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. రామ మందిరంపై కాదు" అని నీరజ వ్యాఖ్యానించారు.
అయితే, అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో 2022లో యూపీలో జరగబోయే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రయోజనం పొందుతారా? అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు వస్తున్నాయని నీరజ అన్నారు.
2024 ఎన్నికల్లో రామ మందిర నిర్మాణాన్ని చూపించి బీజేపీ ఓట్లు దక్కించుకోగోలదా? అనేది మరో ప్రశ్న. లేదా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత.. కాశీ, మథురల విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ తెరమీదకు తీసుకొస్తుందా? లేదా హిందూ-ముస్లింల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండబోతుందా?
బాబ్రీ మసీదు కూల్చివేతను నేరంగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. అయితే ఈ విషయంలో ఇప్పటికీ ఎవరికీ శిక్షలు పడలేదు. "ఈ నేపథ్యంలో ఉత్తర భారత దేశంలో హిందు-ముస్లింల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? ముస్లింలకు న్యాయం జరుగుతుందా? లాంటి ప్రశ్నలు మళ్లీ ఉత్పన్నం అవుతాయి" అని నీరజ అన్నారు.
ఈ ప్రశ్నల సమాధానాలపైనే మోదీ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.

ఫొటో సోర్స్, ANI
రామ మందిర చరిత్రలో నేడు చాలా ముఖ్యమైనదని నీరజ అన్నారు. అయితే మోదీ రాజకీయ జీవితంలో దీనికి అంత ప్రాధాన్యం ఏమీ ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంకొక హామీని పూర్తి చేశారనే కోణంలోనే ప్రజలు చూస్తారని ఆమె అన్నారు.
నీరజ, నిస్తుల అభిప్రాయలతో మరో సీనియర్ జర్నలిస్టు అదితి ఫడ్ణీస్ కూడా ఏకీభవిస్తున్నారు. ఇది మోదీ జీవితంలో ఒక కార్యక్రమం మాత్రమేనని ఆమె అన్నారు.
"మోదీ ఇమేజ్ కూడా తను హిందూత్వ నాయకుడిలా ఉండాలని అనుకోరు. ఆయన సామాజిక, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసిన నాయకుడిలా నిలిచిపోవాలని ఆయన అనుకుంటారు. మోదీ, ఆయన ప్రభుత్వం పేదలకు చేసిన సేవలన్నీ అందరూ గుర్తుపెట్టుకోవాలని అనుకుంటారు. రామ మందిర నిర్మాణం కూడా అదే కోవలోకి వస్తుంది. అయితే మిగతా వాటితో పోలిస్తే దీని ప్రాధాన్యం తక్కువే" అని అదితి అన్నారు.
అయితే, దేశంలో హిందూత్వ రాజకీయాల చరిత్రలో మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక మైలురాయనే చెప్పాలని అదితి వివరించారు.
"మోదీ ఏం చెప్పినా, ఏం చేసినా.. దాని వెనుక హిందూత్వంతో సంబంధముంటుంది. కానీ మరోవైపు భారత్‌లో వినూత్న కార్యక్రమాలు, పథకాలు తామే తీసుకొచ్చామని ఆయన గర్విస్తుంటారు. ఉదాహరణకు సామాజిక భద్రతా పథకాలపై వేరేవారు క్రెడిట్ తీసుకుంటే ఆయనకు నచ్చదు".
అయితే, అదితి, నిస్తుల, నీరజల అభిప్రాయాలతో ప్రదీప్ సింగ్ ఏకీభవించడం లేదు. అయోధ్యను మోదీ సందర్శించడం ద్వారా ఆయన హిందూత్వ ఇమేజ్ ఇంకా బలపడిందని ఆయన అన్నారు. "ఇలా అనడం ద్వారా ఆయన్ను కేవలం హిందూత్వానికే పరిమితం చేయడంలేదు. ఆయన మిగతా విజయాలను తక్కువచేసి చూపట్లేదు".

ఫొటో సోర్స్, SANKET WANKHADE
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఎల్‌కే అడ్వాణీ ఇచ్చిన ప్రసంగాన్ని అదితి గుర్తుచేసుకున్నారు. సాంస్కృతిక జాతీయ వాదం గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
"ఈ పదానికి సరైన అర్థం అప్పట్లో ఎవరికీ తెలియదు. దానికి సరైన అర్థం ఇచ్చే సమయం ఇది" అని అదితి భావిస్తున్నారు.
భారత్‌లో అనేక మతాలకు చందినవారు జీవిస్తున్నారు. రాబోయే బిహార్ ఎన్నికల్లో.. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం ఎలా ఉండబోతోంది? ముస్లింల గాయాలను మరింత తీవ్రం చేస్తారా? లేదా అసలు పట్టించుకోరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చూడాల్సి ఉంది. అప్పుడే భారత్ సాంస్కృతిక జాతీయవాదాన్ని సరైన పద్ధతిలో పాటిస్తుందా? అని తెలుస్తుంది.
మోదీ ప్రసంగంలోనూ సాంస్కృతిక జాతీయవాదం భావజాలం కనిపించింది. "భిన్నత్వంలో ఏకత్వానికి రాముడు ప్రతీక. అందరూ రాముడికి కావాలి. రాముడు అందరికీ కావాలి. తులసీదాస్ రాముడు సుగుణాలు కలవాడు. నానక్, కబీర్‌ల రాముడు నిర్గుణుడు. స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీకి ఆయన రఘుపతి రాముడు. తమిళం, మలయాళం, బంగ్లా, పంజాబీ, కశ్మీరీలలోనూ రామ్ ఉన్నాడు" అని మోదీ అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ మందిరంతో చాలా ప్రయోజనం కలుగుతుందని అదితి అభిప్రాయపడ్డారు. "ఆయన వ్యక్తిగతంగా బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. కానీ బ్రాహ్మణులు మాత్రం ఆయన తమ వ్యతిరేకిగా భావిస్తుంటారు. తాజా కార్యక్రమంతో ఆయనపై ఉండే బ్రాహ్మణ వ్యతిరేక ఇమేజ్ తగ్గిపోతుంది. ఆయన్ను బ్రాహ్మణులు కూడా తమలో కలుపుకుంటారు".
నిజం చెప్పాలంటే.. రామ మందిర ఉద్యమంలో ప్రధాని మోదీకి ఎలాంటి పాత్రలేదు. ఈ విషయాన్ని ఆయన పార్టీకి చెందిన సుబ్రమణ్య స్వామి ఓ టీవీ లైవ్‌లో చెప్పారు. రామ మందిరం నిర్మించడానికి మార్గం సుగమం చేసినవారు రాజీవ్ గాంధీ, నరసింహారావు, వీహెచ్‌పీ సీనియర్ నాయకుడు అశోక్ సింఘాల్ అని ఆయన చెప్పారు.
70ఏళ్ల నుంచీ నలుగుతున్న ఈ వివాదం సుప్రీం కోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చి మందిర నిర్మాణం జరుగుతోంది. కానీ ప్రధాన మంత్రి మోదీనే అంతటికీ కారణమని ప్రజలు భావిస్తున్నట్లు నీరజ వ్యాఖ్యానించారు. మోదీ అక్కడకు వెళ్లడంతో ఆయనకు క్రెడిట్ కావాలని అనిపిస్తోందని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- అమెరికా దారిలోనే బ్రిటన్... చైనాపై కఠిన చర్యలకు సిద్ధం
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








