నైట్‌క్లబ్స్, జూ, డ్రగ్స్ స్టోర్...ఒక జైలులో ఉండకూడని సౌకర్యాలన్నీ ఇక్కడ ఉంటాయి....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రోనా రిస్కుయెజ్
- హోదా, బీబీసీ న్యూస్
లాటిన్ అమెరికాలో అత్యంత భయానకమైన క్రిమినల్ గ్రూపుల్లో ఒకటైన ‘ట్రెన్ డెరావువా’ వెనెజువెలాలోని టొకోరాన్ జైలులో భారీ స్థావరాన్నే ఏర్పాటుచేసుకుంది. దేశ అధ్యక్షుడు నికోలస్ మాదురో ఆదేశాలపై ఈ జైలును నియంత్రణలోకి తీసుకున్న తర్వాత లోపల ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
ప్రభుత్వ ఆపరేషన్ ప్రభావం ఇప్పటికీ జైలు పరిసరాల్లో కనిపిస్తోంది. జైలులో గడుపుతున్న తమ బంధువుల కోసం..మునుపటిలా డజన్ల మంది మహిళలు ఆహారం పొట్లాలు, బట్టలు తీసుకురావడం లేదు. అలానే చుట్టుపక్కల బీర్ షాపులు, ఇతర వ్యాపారాలు కూడా ప్రస్తుతం మూసి కనిపిస్తున్నాయి.
జైలు ముందు ఇటుకలతో ఏర్పాటుచేసిన చిన్నచిన్న బడ్డీలలోనూ ప్రస్తుతం ఎవరూ కనిపించడం లేదు. జైలుకు వచ్చే సందర్శకులు ఇక్కడ తమ ఫోన్‌లను ఉంచేవారు. మరోవైపు జైలులో లోపల కొన్ని భవనాల కూల్చివేత కూడా కొనసాగుతోంది.
టొకోరాన్ జైలును ప్రభుత్వం మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకుందని చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేకపోయాను. ఏడాది క్రితం నేను ఇక్కడకు వచ్చాను. ‘ట్రెన్ డెరావువా’కు పెట్టనికోటలాంటి ఈ జైలు ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నాను. ఎందుకంటే ఈ ఉపఖండాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సంస్థపై నేనొక పుస్తకం రాస్తున్నాను.
ఆ గ్యాంగ్ నాయకుడు, లాటిన్ అమెరికాలో ‘మోస్ట్ వాంటెడ్’ క్రిమినల్స్‌లో ఒకరైన నీనో గురేరో స్థావరంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ ఏం కనిపించాయో చూద్దాం.

ఫొటో సోర్స్, Glenn Requena
లోపల చూస్తే....
‘‘ఇక్కడకు రావడం ఇదే తొలిసారా?’’ అని జూలియో నన్ను అడిగారు. అక్కడున్న ఖైదీలలో జూలియో ఒకరు. టొకోరాన్, బిగ్ హౌస్, డేరావువా సెంటర్ లాంటి భిన్న పేర్లతో పిలుచుకునే ఆ జైలును నాకు ఆయన చూపించారు.
ఈ జైలును 1982లో టొకోరాన్ పట్టణంలో నిర్మించారు. వెనెజువెలా రాజధాని కరాకాస్‌కు 140 కి.మీ. దూరంలో 2.25 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 750 మంది ఖైదీలకు సరిపడేలా దీన్ని నిర్మించారు. అయితే, ట్రెన్ డెరావువా ఈ జైలును తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఇక్కడున్న ఖైదీల సంఖ్య 7,000 మందికిపైనే పెరిగింది.
‘‘లోపలంతా చూపించమంటారా?’’ అని జూలియో మరోసారి నన్ను అడిగారు. ఇక్కడ విలాసవంతమైన సౌకర్యాలను చూపిస్తా రండి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నిజానికి అసలు అప్పుడేం చూడబోతున్నానో నేను ఊహించనేలేదు.
లోపలకు వెళ్తున్నప్పుడు అక్కడున్నవి చూసి నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. టొకోరాన్ కేవలం జైలు మాత్రమే కాదు. అదొక థీమ్ పార్క్. హెచ్‌బీవో టెలివిజన్ సిరీస్ వెస్ట్‌వరల్డ్‌లో చూపించిన ప్రపంచాన్నే ప్రత్యక్షంగా చూస్తున్నానా అనిపించింది.
స్విమ్మింగ్ పూల్స్, జూ, స్పోర్ట్స్ ఫీల్డ్స్, చిన్న చిన్న ఇళ్లు, రెస్టారెంట్లు, బేస్‌బాల్ స్టేడియం, డ్రగ్ స్టోర్లు, మోటార్ సైకిల్స్, ఫైర్ ఆర్మ్స్.. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన చిత్రాలన్నీ ఆ రోజు నేను నేరుగా చూశాను.

ఫొటో సోర్స్, Reuters
ట్రెన్ డెరావువా నాయకుడు నీనో గురేరో గురించి జూలియో మాట్లాడుతూ.. ‘‘ఈ జైలును టొకోరాన్ అర్బనైజేషన్‌గా తీర్చిదిద్దేంత వరకూ తాను ప్రశాంతంగా నిద్ర పోలేనని గురేరో చెప్పేవారు’’ అని అన్నారు. సందర్శకులు కూర్చునే ప్రాంతంలో కూర్చోబెట్టి నాతో జూలియో మాట్లాడారు. అక్కడ టీవీ, చెక్క కుర్చీలు, టేబుల్స్ ఉన్నాయి.
వెనెజువెలాలో మధ్య తరగతి ప్రజలు జీవించే ప్రాంతాలను రెసిడెన్షియల్ ఏరియాలుగా పిలుస్తారు. ధనవంతులు జీవించే ప్రాంతాలను అర్బనైజేషన్లుగా చెబుతారు.
వెనెజువెలాలో విద్యుత్ కోతలు సర్వసాధారణం. అందుకే ఈ జైలు లోపల భారీ విద్యుత్ ప్లాంటు కూడా ఏర్పాటుచేశారు. లోపల పవర్ టెక్నీషియన్లు (వారు కూడా ఖైదీలే) కూడా ఉన్నారు. జీన్స్, రంగురంగుల షర్టులు వేసుకునే వీరు విద్యుత్ సరఫరా బాధ్యతలు చూసుకుంటారు.
‘‘ఇక్కడి టెక్నీషియన్లు చాలా బాగా పనిచేస్తారు. ఎందుకంటే చుట్టుపక్కల పట్టణాల్లో ఏదైనా విద్యుత్ సమస్యలు వస్తే, ఇక్కడుండేవారే మరమ్మతులు చేయడానికి వెళ్తుంటారు’’ అని జూలియో చెప్పారు.

ఫొటో సోర్స్, Glenn Requena
టొకోరాన్‌ను ‘అర్బనైజేషన్ కేంద్రం’గా మార్చాలని గురేరో ఎంత పట్టుదలతో ఉండేవారో లోపలున్న బిల్డింగ్స్, ఆహ్లాదాన్ని పంచే సదుపాయాలు చూస్తే అర్థమవుతుంది.
జైలులోని అన్ని ప్రాంతాలలోనూ ఏకే-15 లేదా ఏకే-103 అసాల్ట్ రైఫిల్స్, షాట్‌గన్స్, 9ఎంఎం హ్యాండ్ గన్స్ పట్టుకున్న సాయుధులు గస్తీ కాస్తుండేవారు. వీరిని ‘గారిటోరోస్’గా లోపల పిలుస్తుంటారు.
లోపల ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. దాని వెనుక దట్టమైన చెట్లలో జూను ఏర్పాటుచేశారు. జంతువులను చూసేకునేందుకు ఇక్కడ ఇద్దరు గార్డులు కూడా ఉన్నారు. అయితే, గురేరో ఎంతో ముద్దుగా చూసుకునే ఒక పాము లోపల తప్పి పోయిందని, మళ్లీ ఇలాంటివి జరగకూడదని ఆయన సిబ్బంది గట్టిగా చెప్పారని జూలియో చెప్పారు.
పక్షులు, కోతులు, ఆస్ట్రిచ్‌లు, కోళ్లు, గుర్రాలు, పందులు, పశువులు....ఇలా అన్నింటినీ ఇక్కడ పంజరాలు లేదా వాటికోసం సిద్ధంచేసిన గదుల్లో ఉంచారు. అంతేకాదు, ఇవి ఎలా ప్రవర్తిస్తారో సందర్శకులకు వివరించే బోర్డులు కూడా పెట్టారు.
ఇంకొంచెం ముందుకు వస్తే, కోళ్ల పందేల కోసం ఒక కాక్‌పిట్ కూడా ఉంది. తర్వాత బాస్కెట్ బాల్ స్టేడియం కూడా కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
చివరకు ఏమైంది?
గన్లు పట్టుకున్న ఇద్దరు సాయుధులు నా ప్రతి కదలికనూ మూడు మీటర్ల దూరం నుంచి గమనిస్తూ కనిపించారు. ప్రతి వంద మీటర్లు ముందు వెళ్లినప్పుడు ఇలాంటి సాయుధులు ఎదురుపడుతూ కనిపించారు. పెద్దపెద్ద మోటార్ బైక్‌ల మీద తిరిగేవారు దీనికి అదనం.
గుర్రాల పందేలు నిర్వహించే ప్రాంతాలు కూడా లోపల కనిపించాయి. ఆ తర్వాత కేవలం డ్రగ్స్ మాత్రమే విక్రయించే కౌంటర్లు కూడా. కొకైన్ నుంచి గంజాయి వరకూ చాలా రకాల మత్తుమందులు ఇక్కడ విక్రయించేవారు.
2016లో ఇక్కడి నుంచి లీకైన కొన్ని ఫొటోలు, వీడియోల్లో కనిపించినవన్నీ నేను అక్కడ చూశాను. టోకియో నైట్‌క్లబ్ కూడా లోపల కనిపించింది. ఇక్కడ టొకోరాన్ పార్టీలు నిర్వహించేవారు. వీటిని చూసేందుకు బయటివ్యక్తులు కూడా వచ్చేవారు.
అయితే, దీన్ని గుర్తుపట్టడం కాస్త కష్టంగా అనిపించింది. ఎందుకంటే దీనిపై ఒక నల్లని కవర్ కప్పి ఉంచారు. 2022లో ఈ నైట్‌క్లబ్‌లోకి బయటివారు రాకూడదని ప్రభుత్వం చెప్పడంతో లోపలి వారిని మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నామని ఓ వ్యక్తి నాతో అప్పుడు చెప్పారు.
బహుశా టొకోరాన్ కథ ముగింపు దశకు వచ్చిందని చెప్పేందుకు ప్రభుత్వం ఇచ్చిన సంకేతం అది కావచ్చు.
ఆ వెంటనే వాహనాల కొనుగోళ్ల కుంభకోణాలకు ముగింపు పలకాలని తన భాగస్వాములకు గురేరో చెప్పారు. ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో అమ్మే ఆ వాహనాల లావాదేవీలను భిన్నమైన జైళ్ల నుంచి నడిపించేవారు. అయితే, దీని వల్ల చాలా మంది సాధారణ ప్రజలు డబ్బులను పోగోట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Glenn Requena
‘‘మిలియనీర్ల జైలు ఇదీ’’
ఫ్రెంచ్ బ్రెడ్ బిగెట్‌ను తింటూ నాతో జూలియో మాట్లాడారు. అన్నివేళలా అతడికి ఇలాంటి బ్రెడ్ తినే అవకాశం దక్కదు. ఆయనను చూడటానికి సందర్శకులు చాలా అరుదుగా వస్తుంటారు.
అయితే, ఇక్కడ కొంతమంది పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని జూలియో నాకు చెప్పారు.
కొంతమందిని గొర్రె (షీప్)అని పిలుస్తుండేవారని, వీరిని మిగతావారితో పోలిస్తే చాలా చులకనగా చూస్తారని అన్నారు.
జైలులో కొన్ని ప్రాంతాల్లో తిరిగేందుకు మాత్రమే వీరికి అనుమతి ఉంటుంది. పబ్లిక్ పూల్స్, రెస్టారెంట్లు, నైట్‌క్లబ్‌లకు వెళ్లేందుకు వీరికి అనుమతి లేదు. మరోవైపు వారు ఎప్పుడూ లాంగ్ స్లీవ్స్ షర్టులు వేసుకోవాలి, టై కూడా కట్టుకోవాలి. వీరిలో కొందరు చూడటానికి పోషకాహార లోపంతో బాధపడినట్లుగా కనిపించారు.
‘‘ఈ జైలు మిలియనీర్ల కోసమే. అన్నీంటికీ ఇక్కడ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది’’ అని జూలియో చెప్పారు. ‘‘ఇక్కడ దెబ్బలు తినకుండా హాయిగా సౌకర్యాలన్నీ అనుభవించాలంటే వారానికి 15 డాలర్లు కట్టాల్సి ఉంటుంది’’ అని జూలియో చెప్పారు.
ఇతర సేవలకు 20 డాలర్ల నుంచి 30 డాలర్ల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Glenn Requena
జైలు లోపల గుస్సీ, నైక్ లాంటి బ్రాండ్ల ప్రకటనలు కూడా కనిపించాయి. అంటే జైలు లోపల డబ్బులు, సదుపాయాలు ఎలా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే, జైలు లోపల పెద్ద నాయకుల గదులు నేను అప్పుడు చూడలేకపోయాను. వీటిని చూసేందుకు ట్రెన్ డెరావువా నాయకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. లోపల వారి కోసం స్విమ్మింగ్ పూల్స్, బార్బెక్యూ రెస్టారెంట్లు ఉన్నట్లు అక్కడున్నవారు చెప్పారు.
అయితే, ప్రభుత్వం ఈ జైలును ఆధీనంలోకి తీసుకునేటప్పుడు ఇక్కడి వారి ప్రపంచం తలకిందులైనట్లుగా అయింది. ఈ ఆపరేషన్‌లో 11,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
‘‘జైలులో ఉండకూడని చాలా సదుపాయాలను మేం అక్కడ చూశాం’’ అని హోం మంత్రి రొమిజియో క్యాబెలోస్ అన్నారు.
ఇప్పుడు జూలియోను ఏం చేస్తారో తెలియదు. నీనో గొరేరోతోపాటు చాలా మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఈ జైలును ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంతో ఈ క్రిమినల్ గ్యాంగ్‌పై చావుదెబ్బ కొట్టినట్లయింది. అయితే, కొలంబియా, బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, బొలీవియా, చిలీ, అమెరికా లాంటి చోట్ల కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ గ్యాంగ్‌కు దీనితో అడ్డుకట్ట పడుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం.
ఇవి కూడా చదవండి:
- కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులా? కోచింగ్ సెంటర్లా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- నాందేడ్: ‘డాక్టర్లు లేరు, మెషీన్లు ఆగిపోయాయి.. పిల్లలు చనిపోయాక మా సంతకాలు తీసుకున్నారు’
- బంగారం కొనాలా? బంగారం బాండ్లు కొనాలా? ఏది లాభం?
- ఇందూరు సభ: ‘మీకో రహస్యం చెప్పనా’ అంటూ కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
- దేవ్ రతూడి: సైకిల్‌పై పాలు అమ్మిన ఈ భారతీయుడు, చైనా సినిమాల్లో విలన్‌గా ఎలా సక్సెస్ అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















