హైదరాబాద్ గాలి కాలుష్యం :‘‘ముక్కుకు బట్టలు కట్టుకుని వస్తున్నారు...ఇక్కడ ఎలా బతుకుతున్నారని అడుగుతున్నారు’’

హైదరాబాద్ శివారు పాశమైలారానికి చెందిన బాలమ్మ
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ శివారు పాశమైలారానికి చెందిన బాలమ్మ
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతిని‌ధి

‘‘ఎవరైనా మా ఊరికి వస్తే, మూతికి బట్టలు కట్టుకుని వస్తారు. ఈ వాసనను మీరెలా తట్టుకుంటున్నారని అడుగుతుంటారు. ఇల్లు విడిచి పెట్టి పోయేట్టు ఉందా..? అయినా ఊరు విడిచి ఎక్కడికి పోగలం బిడ్డా..? ’’ అని బీబీసీతో వాపోయారు హైదరాబాద్ శివారు పాశమైలారానికి చెందిన బాలమ్మ.

ఆమె వయసు సుమారు 70 ఏళ్లు. అదే గ్రామంలో దాదాపు యాభై ఏళ్లుగా ఉంటున్నట్లు చెప్పారు.

గాలి కాలుష్య సమస్య తీవ్రతను తెలుసుకునేందుకు పటాన్ చెరు సమీపంలో ఉన్న పాశమైలారానికి బీబీసీ ప్రతినిధి వెళ్లినప్పుడు.. ఊరి ప్రారంభంలోని నీళ్ల ట్యాంకు సమీపంలోని ఓ ఇంటి బయట కూర్చుని ఉన్నారామె.

‘‘ఈ సమస్య ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. రానురానూ మాకు ఆ వాసనలు తెలియకుండా కూడా అయిపోయాయి.

బయట నుంచి ఎవరైనా వస్తే వాసనలకు ఉండలేరు. మాకు అలవాటు అయిపోయింది.

ఈ కంపెనీలోళ్లు చేస్తున్న పనికి ఊళ్లో ఉండల్నా లేక వెళ్లిపోవాలో అర్థం కావడం లేదు’’ అని ప్రశ్నించారు బాలమ్మ.

అక్కడికి సమీపంలో ఉన్న బోరులోంచి వచ్చే నీటిని వాసన చూడాలని మమ్మల్ని బాలమ్మ అడిగారు.

బోరు నుంచి వస్తున్న నీటిని వాసన చూసినప్పుడు దుర్వాసన వస్తోంది. అంటే అక్కడ గాలి మాత్రమే కాదు, భూగర్భంలోని నీరు కూడా కలుషితంగా ఉన్నట్లు మాకు అర్థమైంది.

బొల్లారం
ఫొటో క్యాప్షన్, బొల్లారం

పారిశ్రామిక వాడల చుట్టూ ఇదే సమస్య

పాశమైలారం మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టూ ఉన్న చాలా కాలనీల ప్రజలు ఘాటు రసాయన వాసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ముఖ్యంగా రాత్రిళ్లు, తెల్లవారుజామున కాలనీలను ఘాటు వాసనలు కమ్మేస్తున్నాయి.

హైదరాబాద్ నగరం చుట్టుపక్కల పటాన్ చెరు, పాశమైలారం, బొల్లారం, జీడిమెట్ల, నాచారం, బాలానగర్, కాటేదాన్‌లలో తదితర పారిశ్రామికవాడలు ఉన్నాయి.

గతంలో ఇవి నగరానికి దూరంగా ఉన్నప్పటికీ, జనావాసాలు పెరిగిపోవడంతో నగరంలో ఇవి అంతర్భాగంగా మారాయి.

దీనివల్ల ఆయా పరిశ్రమల నుంచి వచ్చే వాసనలతో గాలి కలుషితంగా మారుతోంది.

ఈ సమస్య అధ్యయనం చేసేందుకు పాశమైలారం, పటాన్ చెరు, బాచుపల్లి, నల్లగండ్ల, బొల్లారం ప్రాంతాలలో బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించింది.

బీబీసీ ప్రతినిధి ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు గాలిలో కొన్ని చోట్ల తీవ్ర దుర్గంధం వస్తోంది.

నల్లగండ్ల ప్రాంతంలో ఉదయాన్నే గాలి కాలుష్యంతో పొగమంచు దుప్పటిలా ఏర్పడుతోంది.

ఇది ఆకాశంలో ఒక పొర(లేయర్)లా ఏర్పడుతోంది.

పారిశ్రామిక వాడ

ఏమిటీ కాలుష్య కారకం?

హైదరాబాద్ శివారులో ఉన్న పారిశ్రామిక వాడల్లో ఫార్మా, డ్రగ్, బల్క్ డ్రగ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి.

ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమలు 180-200 వరకు ఉన్నట్లు పీసీబీ అధికారులు చెబుతున్నారు.

వాటిల్లో ఏవైనా ఉత్పత్తులు తయారు చేసినప్పుడు విడుదలయ్యే పొగ విపరీతమైన వాసన వేస్తోంది.

ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్(వీవోసీ) ఎక్కువగా ఉండటంతో రసాయన వాసనలు ఎక్కువగా వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయంపై బాచుపల్లి హిల్ కౌంటీలో ఉండే పర్యావర‌‍ణ ఇంజినీర్ పి.నందకిశోర్ బీబీసీతో మాట్లాడారు.

‘‘కొన్ని రకాల పొల్యూటెంట్స్(కాలుష్య కారకాలు) వందల కిలోమీటర్లు గాలిలో ప్రయాణించగలవు.

ఘాటు రసాయన వాసనలు అనేవి పది నుంచి పదిహేను కిలోమీటర్లు వెళ్లగలవు.

దీనికి సోర్స్(కాలుష్య కారక పరిశ్రమ) ఒకచోట ఉండొచ్చు. కానీ అది వెళ్లే పరి‌‍ధి ఎక్కువగా ఉంటుంది.

అందుకే నల్లగండ్ల, గచ్చిబౌలి.. ఇటు బాచుపల్లి, జేఎన్టీయూ వరకు కూడా వాసనలు వ్యాపిస్తున్నాయి.’’ అని చెప్పారు.

డబ్ల్యూ.జి.ప్రసన్నకుమార్
ఫొటో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్ పీసీబీ) సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూ.జి.ప్రసన్నకుమార్

నేరుగా గాల్లోకి దట్టమైన పొగ

పరిశ్రమల నుంచి వచ్చే పొగను నేరుగా విడుదల చేసేందుకు వీలుండదు.

ముందుగా ప్రత్యేక ఛాంబర్లలో పంపించాలి. అక్కడ శుద్ధి చేసిన తర్వాత ప్రత్యేక పొగ గొట్టాల ద్వారా విడుదల చేయాలి.

ఈ పొగ గొట్టాలు లోపల జిగ్ జాగ్ తరహాలో ఉండాలి. అప్పుడే కాలుష్య కారకాలను గ్రహించే వీలుంటుందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్ పీసీబీ) సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూ.జి.ప్రసన్నకుమార్ చెప్పారు.

‘‘పరిశ్రమల నుంచి విడుదలయ్యే పొగ ప్రత్యేకంగా శుద్ధి చేయడానికి వీలుగా వ్యవస్థలు ఉంటాయి. అక్కడ పొగ శుద్ధి చేసిన తర్వాత గాల్లోకి వదులుతుంటారు. పీసీబీ తరఫున ఎప్పటికప్పుడు మా టీమ్‌లు తనిఖీ చేస్తుంటాయి’’ అని ఆయన బీబీసీతో అన్నారు.

అయితే, పరిశ్రమల నుంచి వచ్చే పొగను నేరుగా గాల్లోకి విడిచిపెడుతుండటంతో రసాయన ఘాటు వాసనలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

పాశమైలారం, బొల్లారం, జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో బీబీసీ పర్యటించినప్పుడు కొన్ని పరి‌‍శ్రమల నుంచి దట్టమైన పొగలు రావడం కనిపించింది.

ఆ పొగ వచ్చినప్పుడు సమీపంలో తీవ్ర దుర్వాసన వచ్చింది.

ప్రత్యేకంగా కాలుష్యపు పొగను శుద్ధి చేసి విడిచిపెడుతున్న ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు.

రోషన్ మిరింద
ఫొటో క్యాప్షన్, రోషన్ మిరింద

అర్ధరాత్రి.. తెల్లవారుజామున.. భారీ వర్షంలో…

ఘాటు వాసనలు కొన్ని సమయాల్లోనే వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు.

సాయంత్రం లేదా అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున లేదా వర్షాలు కురిసినప్పుడు లేదా దట్టంగా మేఘాలు కమ్ముకున్నప్పుడు ఘాటు వాసనలు వస్తుంటాయని కొందరు బీబీసీకి చెప్పారు.

ఈ విషయంపై బాచుపల్లిలో నివాసం ఉండే రోషన్ మిరింద బీబీసీతో మాట్లాడారు.

‘‘దుర్వాసనలు రావడానికి ప్రత్యేకించి టైం అంటూ ఉండదు. సాయంత్రం లేదా రాత్రి‌‍ళ్లు వస్తుంది. అది చాలా తీవ్రంగా ఉంటుంది. కెమికల్ ల్యాబ్ నుంచి వచ్చిన దుర్వాసనను పోలి ఉంటుంది. గాలి వాటంను బట్టి వేర్వేరు దిశల్లోకి ఆ వాసన వెళుతుంది.

గంట లేదా రెండు గంటలు ఉంటుంది. అమ్మో.. ఆ టైమ్‌లో ఏ మాత్రం తట్టుకోలేం. మొత్తం కిటికీలు, తలుపులు మూసివేసి ఇంట్లో ఉంటాం.నాకు ఆస్తమా ఉండటంతో ఊపిరి ఆడనంత పని అవుతోంది’’ అని చెప్పారు.

మరోవైపు ఇదే విష‌యంపై పాశమైలారానికి చెందిన రాకేశ్ బీబీసీతో మాట్లాడారు.

‘‘వాతావరణం చల్లబడినప్పుడు ఈ ఘాటు వాసనలు మొదలవుతాయి. వర్షాలు పడ్డప్పుడు.. సాయంత్రం పూట, ఉదయం పూట పొగ వదులుతుంటారు.

ఒక్కోసారి బాగా ఎక్కువగా వస్తుంది. కొన్నిసార్లు నార్మల్‌గా ఉంటుంది. మరికొన్ని సార్లు బీభత్సంగా వస్తుంది. ఈ సమయంలో ముక్కు పనిచేయదు.

మేం యువకులం కాబట్టి తట్టుకోగలం. కానీ ఊళ్లో ముసలివాళ్లు వాసనలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నారు.’’ అని చెప్పారు.

పర్యావరణ ఇంజినీర్ నందకిశోర్
ఫొటో క్యాప్షన్, పర్యావరణ ఇంజినీర్ నందకిశోర్

పీసీబీలో ఫిర్యాదు చేసినా..

బాచుపల్లి, నిజాంపేట, నల్లగండ్ల, మదీనాగూడ, పటాన్ చెరు, హఫీజ్ పేట, అమీన్ పూర్, పాశమైలారం, బొల్లారం, నాచారం తదితర 80కిపైగా ప్రాంతాల ప్రజలు ఈ గాలి కాలుష్యంతో సతమతమవుతున్నారు.

ఈ సమస్యపై బాచుపల్లి చుట్టపక్కల ఉన్న 53 కాలనీ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పిటిషన్ దాఖలు చేశాయి.

‘’53 సంఘాలు కలిసి పిటిషన్ వేసి రెండేళ్లు అవుతోంది. దానిపై పీసీబీలో విచారణ జరుగుతోంది.

ప్రధానంగా కాలుష్య కారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించాలని అడుగుతున్నాం’’ అని చెప్పారు పర్యావరణ ఇంజినీర్ నందకిశోర్.

అసలు ఈ ఘాటు వాసనలను గుర్తించడం సా‌‍ధ్యమేనా?

రసాయన ఘాటు వాసనలు గుర్తించే ప్రత్యేకమైన పరికరాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

పీసీబీ వద్ద ఉన్న మెషిన్లు వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీ) సహా కొన్ని రకాల కాలుష్య కారకాలనే గుర్తించే వీలుందని చెప్పారు నందకిశోర్.

కంప్యూటర్ మోడలింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ కాలుష్యాన్ని పీసీబీ అధికారులు లెక్కించాలని అన్నారు

‘‘ఏ రెసిడెన్షియల్ సొసైటీలో ప్రాబ్లమ్ రిపోర్ట్ అయ్యిందో అక్కడ టెడ్లర్ బ్యాగ్ ఒకటి ఇవ్వొచ్చు.

ఏ టైమ్‌లో అయితే పొల్యుషన్ గాలిలో ఉందో.. అప్పుడు పీసీబీ అధికారులు వచ్చి గాలిని పట్టి జీసీఎంఎస్ అనే యంత్రంలోకి పంపించాలి.

అప్పుడు కాలుష్య కారకం ఏమిటనేది తెలుసుకునే వీలుంటుంది. ఇది చాలా కచ్చితత్వంతో జరగాలి.

పీసీబీ అధికారులు లేదా టాస్క్ ఫోర్స్ సిబ్బంది వచ్చే సమయానికి దుర్వాసన తగ్గిపోతోంది. అందుకే కాలుష్య కారకాలు గుర్తించలేకపోతున్నారు.

ఒకవేళ కాలుష్య కారకాన్ని గుర్తిస్తే దాన్ని బట్టి ఏ పరిశ్రమ నుంచి వస్తుందో ఇట్టే తెలుసుకునే అవకాశం ఉంటుంది.’’ అని నందకిశోర్ చెప్పారు.

దీనిపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్ పీసీబీ) సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ బీబీసీతో మాట్లాడారు.

‘‘గాలి కాలుష్యం ఎక్కువ ఉంటే మాకు ఫిర్యాదులు చేస్తుంటారు. ట్విటర్, ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు తీసుకుంటాం. దీనికితోడు 24 గంటల ఆన్‌లైన్ మానిటరింగ్ సెల్ ఉంది.

మాకు వచ్చే ఫిర్యాదులు బట్టి ఏ రోజుకారోజు మా వద్ద ఉండే రీజనల్ ఆఫీసర్లు, టాస్క్ ఫోర్స్ టీంలు, మానిటరింగ్ టీం, క్విక్ రియాక్షన్ టీం సంబంధిత ప్రదేశానికి వెళ్లి గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంటాయి. ఇందుకు అవసరమైన పరికరాలు కూడా ఉన్నాయి.

ఇంతవరకు రాత్రిపూటే ఆయా టీంలు పనిచేసేవి. ఈ మధ్యకాలంలో పగటి పూట కూడా పనిచేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాం’’ అని చెప్పారు.

అలాగే లైసెన్సుల వి‌‍ధానంలోనూ ప్రతిసారి తనిఖీ చేసేప్పుడు డేటాను క్రోడీకరించామని, దానివల్ల పరిశ్రమల సమస్త సమాచారం తమ వద్ద ఉంటుందని చెప్పారు.

ఏదైనా ఫిర్యాదు వస్తే గత సమాచారం కూడా తెలుసుకుని చర్యలు తీసుకునే వీలుంటుందని తెలిపారు.

కాలుష్య పొగలు

గాలి కాలుష్యం హైదరాబాద్ లో 14 రెట్లు అధికం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం చూసుకుంటే ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం 2.5 రేణువులు 5 మైక్రోగ్రాములు ఉండాలి.

తాజాగా అక్టోబరులో ఐక్యూ ఎయిర్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో పీఎం 2.5 రేణువులు ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో ఏకంగా 70.4 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలింది.

ఇది నిర్దేశిత ప్రమాణాల కన్నా ఏకంగా 14 రెట్లు అధికం.

పరిశ్రమల నుంచి వచ్చే విషవాయువులను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సరిగ్గా గుర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తుండటమే సమస్య తీవ్రతకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాడ్‌లో రియల్ టైం గాలి కాలుష్యాన్ని ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)