ఫిల్లీస్ లాతోర్: ప్రమాదకరమైన ఆపరేషన్లు చేసిన లేడీ సీక్రెట్ ఏజెంట్

- రచయిత, సాంషియా బర్గ్
- హోదా, బీబీసీ న్యూస్
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సర్ విన్‌స్టన్ చర్చిల్ ‘సీక్రెట్ ఆర్మీ’ బృందంలో పనిచేసిన ఏజెంట్ ఫిల్లీస్ లాతోర్ 102 ఏళ్ల వయసులో గత వారం మరణించారు.
జర్మనీ కూటమి దేశాలను దెబ్బ తీసే లక్ష్యంతో ఏర్పాటైన సీక్రెట్ ఆర్మీలో ఫ్రాన్స్‌లో పని చేసిన 39 మంది మహిళా సీక్రెట్ ఏజెంట్స్‌లో ఫిల్లీస్ ఒకరు.
ఆమె మరణం తర్వాత యూకె ప్రభుత్వం ఫిల్లీస్ జీవితం, చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ గురించిన వివరాలు బహిర్గతం చేసింది. అందులో చాలా విషయాలు ఆమె ధైర్య సాహసాలు, ప్రమాదకరమైన ఆపరేషన్లంటే ఏమాత్రం వెనకాడకుండా పనిలోకి దిగిన తీరుని తెలుపుతున్నాయి.
విన్‌స్టన్ చర్చిల్ ఏర్పాటు చేసిన ఈ ఆర్మీలోని ఏజెంట్లను స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్స్ (SOE) అని పిలిచేవారు. ‘జెనివీవ్’ అన్న కోడ్ నేమ్‌తో ఫిల్లీస్ పనిచేశారు.

ఫొటో సోర్స్, NATIONAL ARCHIVES
నిత్యం ప్రమాదాలతోనే..
1944లో జర్మనీ ఆక్రమిత పశ్చిమ ఫ్రాన్స్‌లోని ప్రాంతం అది. ఫిల్లీస్ తన ఇంట్లో కూర్చుని తన ఎదురుగా ఉన్న వైర్‌లెస్ సెట్ నుంచి ముఖ్యమైన రహస్యాన్ని మోర్స్ కోడ్‌లో లండన్‌కు పంపిస్తున్నారు.
జర్మనీ ఆక్రమించిన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోరాడుతున్న ఫ్రాన్స్‌కు బ్రిటన్ నుంచి ఆయుధాలు, పరికరాలు అవసరం. దానితోపాటు జర్మనీ సైనికుల శిబిరాలపై వైమానిక దాడులు (RAF) చేయడానికి ఆ ప్రదేశాల సమాచారం కూడా కావాలి. ఆ సమాచారాన్నే పంపుతున్నారు ఫిల్లీస్.
సరిగ్గా అప్పుడే ఇద్దరు జర్మన్ సైనికులు ఆహారం కోసం ఫిల్లీస్ ఇంట్లోకి ప్రవేశించారు. అప్రమత్తమైన ఫిల్లీస్, ఏమాత్రం కంగారుపడకుండా వైర్‌లెస్ సెట్‌ను దాచారు. వారు దగ్గరగా రాబోతుండగా, తనకు స్కార్లెట్ జ్వరం వచ్చిందని, ఊరు విడిచి వెళ్తున్నానని చెప్పారు.
అప్పట్లో స్కార్లెట్ విషజ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో సైనికులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇలాంటి చాలా ప్రమాదాల నుంచి రెప్పపాటులో తప్పించుకుని, ఆపరేషన్లు పూర్తి చేశారు ఫిల్లీస్. జర్మనీ ఆక్రమిత ప్రమాదకరమైన ప్రాంతంలోనే ఉంటూ, సీక్రెట్ ఏజెంట్‌గా చాలా సమాచారాన్నే లండన్‌కు పంపారు ఫిల్లీస్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె ధైర్య సాహసాలు, సేవలను గుర్తిస్తూ అత్యున్నత ఎంబీఈ (మోస్ట్ ఎక్సెలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్) అవార్డును కూడా పొందారు.
సాహసాలంటే ఎంతో ఇష్టం..
నేషనల్ ఆర్కైవ్స్‌లో ఫిల్లీస్ లాతోర్ యుద్ధ సమయంలో ఎస్ఓఈగా చేసిన సాహసాల గురించి సమాచారం విడుదల చేసింది.
1921లో సౌత్ ఆఫ్రికాలో జన్మించారు ఫిల్లీస్. నాలుగేళ్లకే తల్లిదండ్రులను కోల్పోవడంతో బెల్జియంలో కాంగోలో ఉండే బంధువు సంరక్షణలో పెరిగారు. ఆమె బంధువు ఏనుగుల దంతాల రవాణాను అడ్డుకునే పని చేసేవారు.
ఫిల్లీస్ ఆయనతో కలిసి అన్ని ప్రాంతాలకు వెళ్లడం వలన ప్రయాణాలు, సాహసాలంటే ఇష్టం ఏర్పడింది. ఆమె గురించిన రిపోర్ట్‌లో “ఎప్పుడూ బెల్జియం కాంగో గురించే మాట్లాడుతూ ఉండేది” అని ఉంది.
ఫిల్లీస్ ఇంగ్లీష్. ఫ్రెంచ్, కొంత అరబిక్, స్వాహిలీ, కికుయు భాషలు మాట్లాడుతారు. 16 ఏళ్ల వయసులో కెన్యాలోని బోర్డింగ్ స్కూల్‌లో చేరారు. 1941లో వుమెన్స్ ఆక్సిలరీ ఎయిర్ ఫోర్స్ (WAAF)లో బెలూన్ ఆపరేటర్‌గా చేరారు. సాహసాలు చేయడానికి ఇష్టపడేవారని, 1943లో ఎస్ఓఈ శిక్షణ తీసుకున్నారని రిపోర్ట్‌లో ఉంది.
మహిళా ఏజెంట్ల సామర్థ్యాలను అక్కడి పురుష ట్రైనర్లు తక్కువ అంచనా వేసేవారని రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేసిన మహిళా ఏజెంట్లపై పలు పుస్తకాలు రాసిన క్లేర్ ముల్లే అన్నారు.
"ఫిల్లీస్ ట్రైనింగ్ రిపోర్ట్‌లు సానుకూలంగా ఏంలేవు. ఆమె ఫీల్డ్‌లో పనిచేయడానికి అర్హురాలు కాదన్నట్లుగా ఉన్నాయి. కానీ ఫ్రాన్స్‌లో ఆమె అసాధారణమైన సేవలు అందించింది" అని క్లేర్ అన్నారు.
ఆమె గురించిన నివేదిక ప్రకారం ఫిల్లీస్ సాధారణమైన అమ్మాయి, ధైర్యవంతురాలు. ఓ చోట కూర్చుని చేసే పనులంటే ఇష్టపడదు. పిల్లల మనస్తత్వం, వాస్తవ జీవితంపై అంత అవగాహన లేని అమ్మాయి అని పేర్కొన్నారు.
"మరో ట్రైనర్ అయితే ఫిల్లీస్ గురించి రాస్తూ, ఆమెకు చక్కటి భార్య అయ్యే లక్షణాలు ఉన్నాయని రాశారు" అని క్లేర్ అన్నారు.
శిక్షణ అనంతరం ఫిల్లీస్‌ను సైంటిస్ట్ అన్న పేరుతో ఉన్న ఏజెంట్ల నెట్‌వర్క్‌లో నియమించారు. హెడ్ క్వార్టర్స్‌తో సంప్రదించడానికి ఫిల్లీస్ ‘స్మోక్ గెట్స్ ఇన్ యువర్ ఐస్’ (SMOKEGETSINYOUREYES) అనే కీవర్డ్‌ను వాడేవారు. ఫ్రాన్స్ విభాగపు ఏజెంట్ నెట్‌వర్క్‌కు సారధ్యం వహించిన బైసాక్ ఈ బృందపు బాధ్యతలు చూసేవారు.

ఫొటో సోర్స్, NATIONAL ARCHIVES
శత్రువుల మధ్యన పని..
1 మే 1944లో ఫ్రాన్స్‌కి వెళ్లిన ఫిల్లీస్, మరో ఏజెంట్‌తో కలిసి కాన్, వైర్‌ల ప్రాంతాల్లో పర్యటించారు. జర్మనీ రహస్య పోలీసు వ్యవస్థ గెస్టపోకు వీరి గురించి సమాచారం తెలియడంతో అర్థరాత్రి సమయంలో తమ ఆచూకీ తెలియకుండా ఆధారాలన్ని నాశనం చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు.
ఫిల్లీస్ నిరంతరంగా ప్రయాణించారని, ఇందుకు ఏమాత్రం వెనకాడలేదని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఫిల్లీస్ తన ఇంటర్వ్యూల్లో తాను కోడ్స్‌ను ఎలా దాచుకునేవారో వివరించారు. జుట్టుముడికి ఉపయోగించే సూదికి కోడ్స్ రాసిన సిల్క్ క్లాత్‌ను చుట్టి దానిని షూలేస్‌లోకి చొప్పించేదానినని ఆమె చెప్పారు.
ఆపరేషన్ సమయంలో ఫిల్లీస్ మొత్తం 17 వైర్‌లెస్ సెట్లను వాడారు. ఫ్రాన్స్‌లోకి వెళ్లిన కొన్ని వారాల్లోనే 135 సందేశాలు పంపారు.
ఆ తరువాత అమెరికన్లు మరింత చురుగ్గా ఫ్రాన్స్‌లో పనిచేయడం మొదలైంది. ఆ సమయంలో ఏజెంట్లు ఇబ్బందులు పడ్డారు. ఫిల్లీస్ మైదాన ప్రాంతాల్లోనే సమాచారాన్ని పంపండం మొదలుపెట్టారు.
1944 ఆగస్టు నెలలో అమెరికా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఫిల్లీస్ వారిని సంప్రదించారు. అయితే తొలుత ఆమెను జైలులో ఉంచారు. ఆమె ఎవరో తెలుసుకున్నాక విడిచిపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
అవకాశాల కోసం..
ఫ్రాన్స్ నుంచి బ్రిటన్‌కు చేరుకున్న ఫిల్లీస్ మళ్లీ పని కోసం వెతికారు. తిరిగి WAAFకు వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆ తరువాత ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఆమె ఇష్టపడే పని దొరక్కపోవడంతో జర్మనీకి ఎస్ఓఈగా వెళ్లేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
మరోసారి శిక్షణ పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా ప్యారాచ్యూట్ శిక్షణను ఎంతో ఇష్టంగా పూర్తిచేశారని ఆమె ట్రైనర్ రిపోర్ట్ ఇచ్చారు.
కానీ రెండోసారి ఆపరేషన్‌కు వెళ్లడానికి ఫిల్లీస్‌కు అవకాశం చిక్కలేదు. దీంతో ఆమె నిరాశకు గురయ్యారు.
జూన్ 1945కు చెందిన ఓ నోట్‌లో జర్మనీ పతనం అనంతరం ఫిల్లీస్ తీవ్రమైన నరాల ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు. ఆమెను పరీక్షించిన సైకియాట్రిస్ట్ ఆమెకు విశ్రాంతి అవసరమని, విధుల నుంచి తప్పించాలని చెప్పారు. అలా ఆమె సాహసాలు ముగిశాయి.
సెప్టెంబర్ 1945లో ఫిల్లీస్‌కు ఎంబీఈ అవార్డు అందజేశారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫిల్లీస్ వివాహం చేసుకుని కెన్యా, ఫిజీ, ఆస్ట్రేలియాల్లో కొన్నాళ్లపాటు ఉన్నారు. అనంతరం న్యూజిల్యాండ్‌లో స్థిరపడ్డారు.
ఫ్రాన్స్‌లో సీక్రెట్ ఏజెంట్‌గా సేవలందించిన 39 మహిళా ఏజెంట్లలో ఫిల్లీస్ ఒకరు. వీరిలో ఎక్కువకాలం జీవించిన ఫిల్లీస్, 102 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి..
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు: నాలుగేళ్లలో రెండు సార్లు కొత్త సిలబస్, ఇప్పుడు ‘ఐబీ’.. మరి టీచర్ల సంగతేంటి?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














