ఇజ్రాయెల్‌పై మెరుపుదాడిలో హమాస్ మాస్టర్ మైండ్స్ వీరే

హమాస్ మిలిటెంట్ సంస్థ
ఫొటో క్యాప్షన్, హమాస్ సంస్థ ప్రస్తుతం ప్రముఖ నేతలు అబ్దుల్లా బర్గౌతి, మహమ్ముద్ అల్ డేఫ్‌ , యాహ్యా అల్ ఇబ్రహీం అల్ సిన్వర్
    • రచయిత, లినా అల్షావాబ్కే
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఇజ్రాయెల్ మొసాద్ వంటి శక్తిమంతమైన నిఘా వ్యవస్థలతో చురుగ్గా వ్యవహరిస్తుందన్న పేరు ఉంది. అలాంటి ఇజ్రాయెల్ నిఘా, రక్షణ వ్యవస్థలనే సవాల్ చేస్తూ, అక్టోబర్ 7 ఉదయాన వేలకొద్దీ రాకెట్లతో మెరుపుదాడి చేసింది హమాస్.

దీంతో హమాస్ మెరుపుదాడి ‘ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్’ వెనుక ఉన్నదెవరు? దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌ను ఎదిరిస్తూ హమాస్‌ను ముందుకు నడిపిస్తున్న నాయకులు ఎవరు? అన్న ప్రశ్న ఆసక్తిగా మారింది.

హమాస్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు చాలామంది నాయకులు సంస్థను శక్తిమంతంగా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు.

వారిలో ప్రస్తుతమున్న ప్రముఖ హమాస్ నాయకులెవరు? ఇజ్ అల్ దిన్ అల్ కస్సమ్ బ్రిగేడ్స్‌కు చెందిన రాజకీయ, మిలటరీ కమాండర్లు ఎవరు?

Al-Deif
ఫొటో క్యాప్షన్, 'ది గెస్ట్' హమాస్ లీడర్ అల్ డేఫ్‌

మృత్యుంజయుడు, ‘ది గెస్ట్’ మహమ్ముద్ అల్ డేఫ్‌

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని అల్ అక్సా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని హమాస్ వేలకొద్దీ రాకెట్లతో దాడులు మొదలుపెట్టింది.

మొసాద్ వంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నా కూడా, వాటిని అధిగమించి ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలటరీ సంస్థ శక్తిసామర్థ్యాల గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

‘‘అల్ డేఫ్‌’’, ‘‘అబు ఖలేద్’’ అనే పేర్లు కూడా ఉన్న వ్యక్తి మహమ్ముద్ దియాబ్ అల్-మస్రీ.

హమాస్ సంస్థకు చెందిన మిలటరీ సంస్థ ఇజ్ అల్-దిన్ అల్-కస్సమ్ బ్రిగేడ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన 1965లో గాజాలో పుట్టారు.

పాలస్తీయన్లకు ఈయన ఒక ‘‘మాస్టర్‌మైండ్’’గా తెలుసు.

గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి బయోలజీలో ఆయన బ్యాచిలర్ డిగ్రీ పొందారు. నటన, థియేటర్‌పై ఈయనకు ఆసక్తి ఉంది. ఒక కళా బృందాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు.

హమాస్ ప్రకటన, స్థాపన వెంటనే అల్ డేఫ్‌ దానిలో చేరిపోయారు.

1989లో ఇజ్రాయెల్ అధికారులు అల్ డేఫ్‌ను అరెస్ట్ చేశారు. ఎలాంటి విచారణ లేకుండానే 16 నెలలు జైలులో ఉన్నారు.

ఈ సమయంలోనే అల్ డేఫ్‌ జకారియా అల్ షోర్బగీ, సాలాహ్ షెహాద్‌లతో కలిసి ఇజ్రాయెల్ సైనికులను అపహరించేలా ప్రత్యేకంగా హమాస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

అదే ఇజ్ అల్-దిన్ అల్- కస్సమ్ బ్రిగేడ్స్.

జైలు నుంచి విడుదల తర్వాత హమాస్ మిలటరీ సైన్యం నిర్మాణంలో ఇజ్ అల్-దిన్ అల్- కస్సమ్ బ్రిగేడ్స్ కీలకంగా మారింది. అల్ డేఫ్‌ దీని వ్యవస్థాపకులలో ఒకరు.

గాజా నుంచి ఇజ్రాయెల్ లోకి హమాస్ మిలిటెంట్లు వెళ్లేందుకు వీలుగా సొరంగాలను నిర్మించిన ఇంజనీర్ కూడా అల్ డేఫ్‌నే. ఆ తర్వాత ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడిని చేపట్టారు.

హమాస్ బాంబు తయారీదారు యాహ్యా అయాష్ హత్య ఎన్నో ప్రతీకార దాడులకు అల్ డేఫ్‌ ప్రణాళికలు రచించి, అమలు చేసినట్లు ఆయనపై సీరియస్ అభియోగాలున్నాయి.

1996 ప్రారంభంలో బస్సు బాంబు దాడుల్లో 50 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. 1990 మధ్య కాలంలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులను పట్టుకుని చంపడంలో అల్ డేఫ్‌ ప్రమేయం ఉందని తెలిసింది.

2000 సంవత్సరంలో అల్ డేఫ్‌ను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది.

రెండో ఇంతిఫాదా ఉద్యమ సమయంలో జైలు నుంచి తప్పించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అల్ డేఫ్‌ అజ్ఞాతంలోనే ఉంటూ హమాస్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు కేవలం ఆయనకు చెందిన మూడు ఫొటోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దానిలో ఒకటి చాలా పాతది, రెండోది ముఖానికి మాస్క్ వేసుకున్న ఫోటో, మూడోది షాడో ఫోటో.

2002లో ఆయనను చంపేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. కానీ, అల్ డేఫ్‌ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, తన ఒక కంటిని పోగొట్టుకున్నారు.

తన ఒక కాలును, చేతిని కూడా పోగొట్టుకున్నట్లు ఇజ్రాయెల్ చెప్పింది. పలు హత్యా ప్రయత్నాల తర్వాత ఆయన మాట్లాడేందుకు కూడా కష్టమవుతుందని తెలిపింది.

2014లో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అల్ డేఫ్‌ను హతమొందించడంలో ఇజ్రాయెల్ సైన్యం మరోసారి విఫలమైంది. కానీ, అతని భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు.

డేఫ్‌ అనే పదానికి అరబిక్‌లో ‘గెస్ట్(అతిథి)’ అని అర్థం. తాను ఎక్కువ కాలం పాటు ఒకే చోట ఉండరు కనుక ఈ నిక్ నేమ్‌ను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యం బారి నుంచి తనని తాను కాపాడుకునేందుకు ప్రతి రాత్రి ఆయన ఒక కొత్త ప్రాంతంలో నిద్రపోతూ ఉంటారు.

మర్వాన్ ఇస్సా
ఫొటో క్యాప్షన్, 'ప్లాస్టిక్‌ను కూడా ఇనుముగా మార్చగల' ది షాడో మర్వాన్ ఇస్సా

మర్వాన్ ఇస్సా

ది షాడో మ్యాన్ అని పిలిచే మర్వాన్ ఇస్సాను అల్ డేఫ్‌కు కుడిభుజంగా చెప్తారు. ఇజ్ అల్-దిన్ అల్- కస్సమ్ బ్రిగేడ్స్‌కు డిప్యూటీ కమాండర్‌గా, హమాస్ పొలిటికల్, మిలటరీ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు మర్వాన్ ఇస్సా.

ఇంతిఫాదాగా పిలిచే ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొన్న ఇస్సాను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసి ఐదేళ్లపాటు జైల్లో ఉంచింది. హమాస్‌లో ఈయన చిన్న వయసులోనే చేరారు.

ఇస్సాను చేతల మనిషిగా, మాస్టర్ మైండ్‌‌గా వర్ణించింది ఇజ్రాయెల్. ఇతను చాలా తెలివైన వాడని, ప్లాస్టిక్‌ను మెటల్‌గా కూడా మార్చేయగలగడని ఇజ్రాయెల్ చెప్పింది.

ఇస్సా జీవించి ఉన్నంతవరకు హమాస్ బ్రెయిన్ వార్ కొనసాగుతూనే ఉంటుందని పేర్కొంది.

విశేషమైన బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా అవతరించిన ఇస్సా.. క్రీడారంగాన్ని తన వృత్తిగా ఎంచుకోలేదు.

హమాస్ సంస్థలో చేరిన అభియోగాలపై 1987లో ఇస్సాను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది.

ఆ తర్వాత పాలస్తీనా అథారిటీ కూడా 1997లో ఇస్సాను నిర్బంధించింది.

2000 సంవత్సరంలో అల్ అక్సా ఇంతిఫాదా ఉద్యమ ప్రారంభమయ్యేంత వరకు కూడా బయటికి రాలేకపోయారు.

విడుదల తర్వాత నుంచి ఇస్సా హమాస్‌లో చురుగ్గా పనిచేశారు.

అల్ కస్సమ్ బ్రిగేడ్స్‌లో సైన్య వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు.

దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇస్సాను మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది.

2006లో అల్ కస్సమ్ బ్రిగేడ్స్ ముఖ్య నేతలతో, అల్ డేఫ్‌తో జనరల్ స్టాఫ్ మీటింగ్ నిర్వహించిన సమయంలో ఇస్సాను చంపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించింది. కానీ గాయాలతో బయటపడ్డారు.

2014, 2021 సంవత్సరాల్లో గాజాను ఆక్రమించుకునేందుకు జరిపిన దాడుల్లో రెండు సార్లు ఇస్సా నివాసంపై యుద్ధ విమానాలతో దాడులు చేసింది.

ఈ దాడుల్లో ఇస్సా సోదరుడు మరణించారు.

2011 వరకు ఇస్సా ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఆ తరువాత అతడి ఫొటో బయటకు వచ్చింది.

2012లో జరిగిన ‘‘షేల్ స్టోన్స్’’ నుంచి ప్రస్తుతం చేపట్టి ‘‘అల్-అక్సా ఫ్లడ్’’ వరకు ఎన్నో దాడులకు ప్లాన్ చేయడంలో ఇస్సా కీలకంగా వ్యవహరించారు.

యాహ్యా ఇబ్రహీం అల్-సిన్వర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన యహ్యా సిన్వర్‌

యాహ్యా ఇబ్రహీం అల్-సిన్వర్

ప్రస్తుతం హమాస్ సంస్థ నాయకుడిగా, దాని పొలిటికల్ బ్యూరో అధినేతగా కొనసాగుతున్న యాహ్యా ఇబ్రహీ అల్ సిన్వర్ 1962లో జన్మించారు.

మజ్ద్ పేరుతో హమాస్ సెక్యురిటీ సర్వీస్‌ను యహ్యా సిన్వర్ ఏర్పాటు చేశారు.

ఈ విభాగం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, నిఘా వ్యవస్థల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుంది.

ఇప్పటివరకు సిన్వర్ మూడు సార్లు అరెస్టయ్యారు. తొలిసారి 1982లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు నాలుగు నెలల పాటునే ఆయన్ని ఇజ్రాయెల్ బలగాలు అదుపులో ఉంచారు.

1988లో మూడోసారి అరెస్టైన సమయంలో ఇజ్రాయెల్ న్యాయస్థానం సిన్వర్‌కు నాలుగు జీవిత ఖైదులను విధించింది.

సిన్వర్ జైలులో ఉన్న సమయంలో హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన మిస్సైల్ దాడిలో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షాలిత్‌ను బందీగా పట్టుకుంది.

గిలాద్ షాలిత్‌ను ప్రతి ఒక్కరి వ్యక్తిగా చెబుతుంటారు. అందుకే ఆయన్ని విడిపించేందుకు ఇజ్రాయెల్ అవసరమైన చర్యలన్నింటిన్ని తీసుకుంది.

సైనికుడిని విడిపించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌తో చర్చలు జరిపింది. అయితే ఇజ్రాయెల్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సిన్వర్‌తోపాటు 1000 మంది ఫతా, హమాస్‌‌ ఉద్యమకారులను విడుదల చేస్తేనే గిలాద్ షాలిత్‌ను వదిలేస్తామని హమాస్ డిమాండ్ చేసింది.

ఆ ఒప్పందం ప్రకారం 2011లో సిన్వర్ విడుదలయ్యారు.

సిన్వర్ విడుదలైన తర్వాత, హమాస్ సంస్థలో ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా మారారు. దాని పొలిటికల్ బ్యూరో సభ్యుడయ్యారు.

2015 సెప్టెంబర్‌లో అమెరికా సిన్వర్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.

2017 ఫిబ్రవరి 13న గాజా స్ట్రిప్‌లో హమాస్ మూవ్‌మెంట్ పొలిటికల్ బ్యూరోకి అధినేతగా ఆయన ఎంపికయ్యారు.

అబ్దుల్లా బర్గౌతీ
ఫొటో క్యాప్షన్, బంగాళదుంపల నుంచి విషపదార్థాలు సృష్టింగల అబ్దుల్లా ఘలీగ్ బర్గౌతీ

అబ్దుల్లా బర్గౌతీ

అబ్దుల్లా ఘలీబ్ అల్ బర్గౌతీ 1972లో కువైట్‌లో జన్మించారు.

1990లో రెండో గల్ఫ్ యుద్ధ సమయంలో జోర్డాన్‌కు వెళ్లి, అక్కడే పౌరసత్వం పొందారు.

సౌత్ కొరియన్ యూనివర్సిటీ మూడు సంవత్సరాలు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ అభ్యసించేందుకు చేరడానికి ముందు పేలుడు పదార్థాలను తయారు చేయడం నేర్చుకున్నారు.

పాలస్తీనాకు వెళ్లడానికి అనుమతి పొందడంతో తన చదువులను మధ్యలోనే ఆపేశారు.

కస్సమ్ బ్రిగేడ్స్‌లో చేరిన తర్వాత బాంబులు, డిటొనేటర్లు, విషపదార్థాల తయారీలో చురుగ్గా పనిచేశారు.

తన కజిన్ బిలాల్ అల్ బర్గౌతిని వెస్ట్‌ బ్యాంకులోని ఒక మారుమూల ప్రంతానికి తీసుకెళ్లి, పేలుడు పదార్థాల తయారీలో తనకున్న నైపుణ్యాలను ప్రదర్శించేంత వరకు కూడా ఎవరికీ కూడా వీటి తయారీలో ఆయన సామర్థ్యం గురించి తెలియదు.

అబ్దుల్లా బర్గౌతి నైపుణ్యాలను బిలాల్, కమాండర్‌కు చెప్పారు. ఆ తర్వాత కస్సమ్ బ్రిగేడ్స్‌లో చేరేందుకు అబ్దుల్లా బర్గౌతికి పిలుపువచ్చింది.

పేలుడు పదార్థాలను, పొటాటోల నుంచి విషపదార్థాలను తయారు చేయడం, డిటోనేటర్ల తయారీలో అబ్దుల్లా బర్గౌతి దిట్ట.

అబ్దుల్లా తన పట్టణంలో సైనిక ఆయుధాల తయారీ కోసం ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని పెట్టారు.

2003లో ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు అబ్దుల్లాను అరెస్ట్ చేసి, మూడు నెలలపాటు విచారించారు.

అబ్దుల్లా నిర్వహించిన ఆపరేషన్లలో 66 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా, 500 మంది గాయపడ్డారు.

అబ్దుల్లా నేరాలపై విచారణ జరిపిన న్యాయస్థానం మొత్తంగా 67 జీవిత ఖైదులు, 5200 ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.

ఇజ్రాయెల్ న్యాయ చరిత్రలోనే ఏ నిందితుడికి ఇంతటి సుదీర్ఘమైన శిక్ష విధించలేదు. అబ్దుల్లా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ సమయంలో తన జీవితం, చేపట్టిన ఆపరేషన్ల గురించి వివరిస్తూ పుస్తకం రాశారు. అప్పటి నుంచి అబ్దుల్లాను ‘‘ది షాడో ప్రిన్స్’’ గా వ్యవహరిస్తున్నారు.

ఇస్మాయిల్ అబ్దుల్ హనియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హమాస్ పొలిటికల్ బ్యురో అధినేత, పాలస్తీనా పదవ ప్రధాని ఇస్మాయిల్ హనియా

ఇస్మాయిల్ హనియా

పాలస్తీనా శరణార్థుల శిబిరంలో జన్మించిన ఇస్మాయిల్ హనియా, హమాస్ సంస్థ ప్రముఖ నాయకుల్లో ఒకరిగా ఎదిగారు.

హమాస్ పొలిటికల్ బ్యూరో అధ్యక్షుడిగా, పాలస్తీనా నేషనల్ అథారిటీ ప్రధానిగా కూడా పనిచేశారు. 2006 వరకు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అబు అల్-అబ్ద్ ‌గా ఇస్మాయిల్ అబ్దెల్ సలాం హనియాను పిలుస్తుంటారు.

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్యనున్న నో మ్యాన్స్ ల్యాండ్ మర్జ్ అల్-జుహుర్‌కి ఆయన్ను బహిష్కరించారు.

1992లో అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఏడాదంతా అక్కడే ఉన్నారు ఇస్మాయిల్.

ఏడాది బహిష్కరణ తర్వాత గాజాకి తిరిగి వచ్చారు. 1997లో హమాస్ మూవ్‌మెంట్ మత పెద్ద షేక్ అహ్మద్ యాసిన్ కార్యాలయంలో అధినేతగా ఆయన ఎంపిక చేశారు. ఇది ఆయన్ను మరింత బలోపేతం చేసింది.

2006 ఫిబ్రవరి 16న హమాస్ పాలస్తీనా ప్రధానమంత్రిగా ఇస్మాయిల్‌ను నామినేట్ చేసింది. అదే నెలలో 20వ తారీఖు ఆయన ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు.

ఆ తర్వాత ఏడాది గాజా స్ట్రిప్‌ను ఇజ్ అల్-దిన్ అల్-కస్సమ్ బ్రిగేడ్స్ నియంత్రణలోకి తీసుకున్న తర్వాత, పాలస్తీనా నేషనల్ అథారిటీ ప్రెసిడెంట్ మహమ్ముద్ అబ్బాస్, ఇస్మాయిల్ హనియాను పదవి నుంచి తొలగించారు.

తన తొలగింపును అన్యాయంగా వర్ణిస్తూ ప్రెసిడెంట్ నిర్ణయాన్ని ఖండించారు హనియా.

తన ప్రభుత్వం కార్యకలాపాలను కొనసాగిస్తుందని నొక్కి చెప్పారు. పాలస్తీనా ప్రజలపై తమకున్న బాధ్యతలను విడిచిపెట్టి పారిపోమని చెప్పారు.

2017 మే 6న హమాస్ పొలిటికల్ బ్యురోకి అధినేతగా ఎంపికయ్యారు.

2018లో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఇస్మాయిల్ హనియాను కూడా ఉగ్రవాదిగా పేర్కొంది.

ఖలీద్ మెషాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హమాస్ వ్యవస్థాపక పొలిటికల్ బ్యూరో మెంబర్ ఖలీద్ మెషాల్

ఖలీద్ మెషాల్

‘అబు అల్-వాలిద్’గా చెప్పుకునే ఖలీద్ మెషాల్, 1956లో వెస్ట్ బ్యాంకులోని సిల్వాద్ గ్రామంలో జన్మించారు.

ఆయన, తన కుటుంబం కువైట్‌కు వెళ్లడానికి ముందు అక్కడే ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.

హమాస్ సంస్థ వ్యవస్థాపకులలో ఒకరిగా ఖలీద్‌ మెషాల్‌కు పేరుంది. ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి రాజకీయ విభాగ సభ్యుడిగా ఉన్నారు. 2004లో షేక్ అహ్మద్ యాసిన్ మరణించిన తర్వాత హమాస్ నేతగా ఎంపికయ్యారు.

1997లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సూచనలను అనుసరించి మొసాద్ నిఘా సంస్థ ఖలీద్‌ను హత్యచేసేందుకు ప్రయత్నించింది.

అందులో భాగంగానే నకిలీ కెనడా పాస్‌పోర్టులతో పది మంది మొసాద్ ఏజెంట్లు జోర్డాన్‌లోకి ప్రవేశించారు. జోర్డాన్ రాజధాని అమ్మన్‌లో ఖలీద్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో విషపూరితమైన ఇంజెక్షన్‌తో ఆయనపై దాడి చేశారు.

అప్పటికే మొసాద్ ఏజెంట్లు ఖలీద్‌పై జరపబోయే హత్య కుట్రను గుర్తించిన జోర్డాన్ అధికారులు ఆ ఏజెంట్లలో ఇద్దర్ని అరెస్ట్ చేశారు.

యాంటీడోట్ ఇవ్వాల్సిందిగా అప్పటి జోర్డాన్ ప్రధాని కింగ్ హుస్సెన్ బిన్ తలాల్ ఇజ్రాయెల్ ప్రధానిని కోరారు. తొలుత బెంజిమిన్ నెతన్యాహు అందుకు నిరాకరించారు.

కానీ ఈ హత్యాయత్నం రాజకీయంగా చర్చకు దారితీయడంతో, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇజ్రాయెల్ ప్రధానిని సంప్రదించి, ఒప్పించారు. యాంటీడోట్‌ను జోర్డాన్‌కు పంపారు జెంజిమిన్.

11 ఏళ్ల వయసులో పాలస్తీనా భూభాగాన్ని విడిచివెళ్లిన ఖలీద్ మెషాల్, మళ్లీ 7 డిసెంబర్ 2012లో గాజా స్ట్రిప్‌ను సందర్శించారు.

తొలిసారిగా గాజా స్ట్రిప్‌కు వచ్చిన ఆయనకు పాలస్తీనా నేతల నుంచి ఘన స్వాగతం లభించింది.

రాఫా క్రాసింగ్ నుంచి గాజా నగరంలోకి ప్రవేశించేంత వరకున్న రోడ్డు మార్గంలో పెద్ద సంఖ్యలో పాలస్తియన్లు హాజరై, ఆయనకు ఘన స్వాగతం పలికారు.

2017 మే 6న షురా కౌన్సిల్ ఇస్మాయిల్ హానియాను తన పొలిటికల్ బ్యూరో నేతగా ఎంపిక చేసింది.

మహ్ముద్ అల్ జహార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హమాస్ ఏర్పాటైన ఆరు నెలల్లోనే ఇజ్రాయెల్ చేతికి చిక్కిన మహమూద్ అల్ జహార్‌

మహమూద్ అల్ జహార్

1945లో గాజా నగరంలో జన్మించారు మహమూద్ అల్ జహార్. ఈయన తండ్రి పాలస్తీనీయుడు, తల్లి ఈజిప్టు దేశస్తురాలు. అయితే ఐదేళ్ల వరకు ఈజిప్టులోని ఇస్మైలియా పట్టణంలో పెరిగారు.

చదువు గాజా, ఈజిప్టులలో జరిగింది. కైరోలోని ఐన్ షామ్స్ యూనివర్సిటీ నుంచి 1971లో జనరల్ మెడిసిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ, 1976లో జనరల్ సర్జరీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు.

గ్రాడ్యుయేషన్ తర్వాత గాజా, ఖాన్ యూనిస్‌లలోని ఆసుపత్రుల్లో వైద్యుడిగా సేవలందించారు.

అయితే, రాజకీయ కార్యకలాపాల్లో ఉంటున్నారని ఇజ్రాయెల్ అధికారులు విధుల నుంచి తొలగించారు.

హమాస్ ప్రముఖ నాయకులలో అల్ జహార్ కూడా ఒకరుగా పేరొందారు.

హమాస్ సంస్థ ఏర్పాటు తర్వాత అల్ జహార్‌ను ఆరు నెలలపాటు ఇజ్రాయెల్‌లో జైలులో ఉంచారు. హమాస్ సంస్థ ఏర్పాటైన ఆరు నెలల్లోనే ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు.

1992లో ఇజ్రాయెల్ బహిష్కరణకు గురైన వారిలో అల్ జహార్ కూడా ఒకరు. మర్జ్ అల్ జుహుర్ ప్రాంతంలో ఏడాదిపాటు ఉన్నారు.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ 'మొసాద్' చేసిన 5 డేంజరస్ ఆపరేషన్స్ ఇవే...

గాజాలో 2005లో జరిగిన ఎన్నికల్లో హమాస్ విజయం సాధించింది. ఇస్మాయిల్ హానియా ప్రధానిగా ఏర్పాటైన ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.

ఆ సమయంలో అధ్యక్షులు మహ్ముద్ అబ్బాస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

2003లో అల్ జహార్‌‌ను చంపడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించింది. గాజాకు సమీపంలోని అల్ రిమాల్‌లో ఉన్న అల్ జహార్ నివాసంపై ఎఫ్-16 విమానం 50 కేజీల బాంబ్‌ను జారవిడిచింది.

ఈ దాడిలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. కానీ, పెద్ద కుమారుడు ఖాలెద్ మరణించాడు.

15 జనవరి 2008లో అల్ జహార్ రెండో కుమారుడు, అల్ కస్సమ్ బ్రిగేడ్ సభ్యుడిగా ఉన్న హొస్సాం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో మరణించారు.

అల్ జహార్ సాహిత్యకారులు కూడా. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాసిన ఇస్లామిక్ పొలిటికల్ డిస్కోర్స్ పుస్తకానికి సమాధానమిస్తూ ‘నో ప్లేస్ అండర్ ది సన్’, ‘ది ప్లాబ్లెం ఆఫ్ అవర్ కంటెంపరరీ సొసైటీ-ఏ ఖురానిక్ స్టడీ’, ‘నావెల్ఆన్ ది పేవ్‌మెంట్’ అన్న పుస్తకాలను రాశారు.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడి ‘ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్’ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ వీరే..

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)