IND vs PAK : కోహ్లీ, రోహిత్‌లను అడ్డుకుని పాకిస్తాన్ గెలుస్తుందా... చిరకాల ప్రత్యర్థుల మధ్య మరో ప్రపంచకప్ సమరం ఎలా ఉండబోతోంది?

రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ (ఎడమ), పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్
    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, అహ్మదాబాద్

క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీ మళ్లీ మొదలవుతోంది. వరల్డ్ కప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో ఆతిథ్య భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ జరుగనుంది.

శనివారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ఈ టోర్నమెంట్‌లో ‘‘బ్లాక్‌బస్టర్ ఈవెంట్’’గా అభివర్ణిస్తున్నారు.

మ్యాచ్‌కు వేదికైన 1,32,000 సీట్ల సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోతుందని అంచనా. రెండు జట్ల మధ్య సమరంగా పేర్కొనే ఈ మ్యాచ్‌ను టీవీల్లో లక్షలాది మంది వీక్షిస్తారు.

వరల్డ్ కప్‌ను భారత్, పాక్‌ జట్లు ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టాయి. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి.

అయితే, భారత్-పాకిస్తాన్‌ల మధ్య పోటీ ఎలాంటిదంటే, గత మ్యాచ్‌ల ప్రదర్శనలు తదుపరి మ్యాచ్ విజయానికి ఏమాత్రం హామీ ఇవ్వవు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే నైపుణ్యం, సంసిద్ధత, వ్యూహాలకు అంతిమ పరీక్ష. అలాగే నరాల తెగే ఉత్కంఠకు వేదిక.

భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులు మైదానంలో ఒక యుద్ధంలా భావిస్తారు. ఎంతో ఉద్వేగానికి గురవుతారు.

అభిమానుల ఉద్వేగాలతో కలిగే ఒత్తిడిని పక్కనబెట్టి దీన్ని కూడా ఒక సాధారణ మ్యాచ్‌లా భావించి ఆడటం క్రికెటర్ల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగుతుంది. వన్డే వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌దే విజయం.

కానీ, పాక్ జట్టు అనూహ్యమైనది. ఊహకు అందని విధంగా ఆడుతుంది.

బాబర్ ఆజమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ ఎక్కువగా బాబర్ ఆజమ్‌పై ఆధారపడుతుంది

బాబర్ ఆజమ్ ప్రత్యేకత ఏంటంటే...

సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌లో వరల్డ్ నంబర్ వన్ టీమ్ హోదాలో పాకిస్తాన్ అడుగుపెట్టింది. అయితే, సెమీఫైనల్లోనే ఓడిపోయింది.

కానీ, తమదైన రోజున పాక్ జట్టు ఎంతటి పటిష్టమైన జట్టునైనా ఓడించగలదు.

పాక్ బ్యాటింగ్ మొత్తం కెప్టెన్ బాబర్ ఆజమ్ చుట్టే తిరుగుతుంది. అతని అద్భుతమైన స్ట్రోక్ ప్లే చూడటానికి ఎంతో బాగుంటుంది. సునాయాసంగా ఆటలో గేర్లను మార్చే సామర్థ్యం అందరిలోకెల్లా అతన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది.

బాబర్ ఆజమ్ చాలా ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను మొదలుపెడతాడు. ఏం జరుగుతుందో ప్రత్యర్థులకు అర్థం అయ్యే లోగా ఆయన స్కోరు 50 లేదా 60లకు చేరుతుంది. తర్వాత ఇష్టానుసారంగా ఫోర్లు, సిక్సర్లు బాదడం మొదలుపెడతాడు. అలాగే మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితులున్నా మైదానంలో ప్రశాంతంగా కనబడతాడు.

వన్డేల్లో బాబర్ ఆజమ్ సగటు స్కోరును కూడా భారత్ గమనించాల్సి ఉంటుంది. 2019 వరల్డ్ కప్ నుంచి చూస్తే అంతర్జాతీయ వన్డేల్లో బాబర్ ఆజమ్ సగటు స్కోరు 70గా ఉంది.

ఒకవేళ బాబర్ ఆజమ్ ధాటిగా ఆడితే భారత్‌కు కష్టాలు తప్పవు. కానీ, ఇక్కడ బాబర్ ఒక్కడే భారత్‌కు సమస్య కాదు.

వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఇప్పుడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మంగళవారం శ్రీలంక విధించిన 344 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అతను అజేయంగా 131 పరుగులు చేశాడు.

అబ్దుల్లా షఫీఖ్ కూడా ఆ మ్యాచ్‌లో సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌తో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

ఫఖర్ జమాన్, ఇమాముల్ హఖ్ కూడా భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టగలరు.

బాబర్, రిజ్వాన్ త్వరగా పెవిలియన్ చేరితే తర్వాత వీరంతా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగలరా? అనేది చూడాలి.

ఒకవేళ పాకిస్తాన్ టాప్ ఆర్డర్‌ను త్వరగా కూల్చగలిగితే, మిడిలార్డర్‌ మీద భారత్ దృష్టి సారిస్తుంది.

అయితే, పాకిస్తాన్ బ్యాటింగ్ విఫలమైనా లేదా అంచనాలకు తగినట్లు రాణించలేకపోయినా ఆ లోపాన్ని వారి బౌలింగ్ విభాగం భర్తీ చేస్తుంది.

షాహీన్ అఫ్రిదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాహీన్ షా అఫ్రిదీ, పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాడు

‘‘పేస్ బౌలర్ల ఫ్యాక్టరీ’’

శ్రీలంకతో మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు ప్రభావవంతంగా కనిపించలేదు. ఫీల్డింగ్ లోపాలు కూడా వారికి ఇబ్బందిగా మారాయి.

కానీ, భారత్‌తో మ్యాచ్‌లో ప్రతీ ఒక్కరూ తమలోని అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటారు. ఈ కోరికే తదుపరి మ్యాచ్‌లో పాక్ బౌలర్లు తిరిగి పుంజుకునేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

మామూలుగా పాకిస్తాన్‌ను ‘‘పేస్ బౌలర్ల ఫ్యాక్టరీ’’గా పిలుస్తుంటారు. అక్కడ మెరుపు వేగం లేదా అద్భుతమైన స్వింగ్ సామర్థ్యాలు ఉండే ఫాస్ట్ బౌలర్లు నిరంతరం తయారు అవుతుంటారు.

షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో ఈ రెండు లక్షణాలు ఉంటాయి. పిచ్‌పై సరైన ప్రాంతంలో నిలకడగా బౌలింగ్ చేయడం, బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించే అతని నైపుణ్యాల గురించి ఇప్పుడు అందరికీ తెలుసు.

షాహీన్ అఫ్రిదీపై ఆరంభంలోనే ఎదురుదాడి చేయడం లేదా ఆచితూచి ఆడటం వంటి ప్రత్యేక వ్యూహాలను భారత్ రచిస్తోంది.

గాయంతో యువ బౌలర్ నసీమ్ షా జట్టుకు దూరం అయ్యాడు. అయితే నసీమ్ స్థానంలో హారిస్ రవూఫ్ లేదా హసన్ అలీ, షాహీన్ అఫ్రిదీకి బౌలింగ్‌లో తోడు కానున్నారు.

పాక్ స్పిన్ బౌలింగ్ విభాగం ముఖ్యంగా షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్‌లపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.

అయితే, పేస్ బౌలర్ల తరహాలో స్పిన్నర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్ విభాగానికి పాక్ బౌలింగ్ దాడిని, ముఖ్యంగా స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యం ఉంది.

బుధవారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో 63 బంతుల్లోనే సెంచరీ చేసి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆటలోని క్లాస్‌ను, విధ్వంసాన్ని ప్రదర్శించాడు.

పాక్‌తో మ్యాచ్‌లో లెఫ్ట్ హ్యాండర్ ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

రోహిత్‌ ఓపెనింగ్ భాగస్వామి అయిన శుభ్‌మన్ గిల్ అనారోగ్యం బారిన పడ్డాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న గిల్ మ్యాచ్‌కు దూరం కావడం భారత్‌కు ఎదురుదెబ్బే. కానీ, గిల్ స్థానాన్ని భర్తీ చేయగల బెంచ్ బలం భారత్‌కు ఉంది.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌కు గట్టి ప్రత్యర్థి విరాట్ కోహ్లి

భీకర ఫామ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి

రోహిత్ శర్మ పరుగులు సాధించడం భారత అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు, మెరుపు సిక్సర్లు, చక్కటి పుల్ షాట్లు ఆడిన రోహిత్ శర్మ, తను మంచి ఫామ్‌లో ఉన్నట్లు సంకేతాలు పంపాడు.

ఒకవేళ రోహిత్ ధాటి ఇలాగే కొనసాగితే అతనొక్కడే పాకిస్తాన్‌కు విజయాన్ని దూరం చేయగలడు.

ఓపెనర్‌ అయినప్పటికీ చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌లు ముగించడాన్ని రోహిత్ ఇష్టపడతాడు.

2019 వరల్డ్ కప్‌లో రోహిత్ 5 సెంచరీలు చేశాడు. ఒక వరల్డ్ కప్ టోర్నీలో ఒక క్రికెటర్ చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. రోహిత్ శర్మ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్.

కానీ, పాకిస్తాన్ ఒకవేళ రోహిత్‌ను త్వరగా అవుట్ చేయగలిగితే, వారు క్రికెట్ దిగ్గజ ఆటగాళ్ల (ఆల్ టైమ్ గ్రేట్స్)లో ఒకరైన విరాట్ కోహ్లిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పాకిస్తాన్‌కు కోహ్లి కొరకరాని కొయ్య. గత నెలలో ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై కోహ్లి సెంచరీ సాధించి భారత్‌ రికార్డు విజయం సాధించడంలో సహాయపడ్డాడు.

2022 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై అతను ఆడిన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌ను కొందరు ఎప్పటికీ మర్చిపోలేరు.

పాక్ విధించిన 160 పరుగుల లక్ష్యఛేదనలో కోహ్లి 82 పరుగులు సాధించిన ఆ ఇన్నింగ్స్‌ భారత్ మ్యాచ్‌ను వశం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది.

జట్టుకు అవసరమైన ప్రతీసారి కోహ్లి నిలబడి పోరాడతాడు. చివరి వరకు పోరాడే అతని సామర్థ్యం, క్రీజులో మరో ఎండ్‌లో ఉండే ఆటగాడికి ప్రేరణగా నిలుస్తుంది. ఇటీవల కేఎల్ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో పాక్‌పై కేఎల్ రాహుల్ కూడా సెంచరీ చేశాడు.

గత వారం ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ తొలిమ్యాచ్‌లో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడినప్పుడు అందరూ కోహ్లి వైపే ఆశగా చూశారు.

కోహ్లి మళ్లీ ఆపద్బాంధవుడిగా మారి 85 పరుగులతో జట్టును ఆదుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లికి జతగా మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ ఉన్నాడు.

వీరిద్దరూ కఠిన వికెట్‌ మీద ఆస్ట్రేలియా నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో దాదాపు చివరి వరకు నిలబడ్డారు. రాహుల్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.

రోహిత్, రాహుల్, కోహ్లిల తర్వాత బ్యాటింగ్‌కు దిగే శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు కూడా అవసరమైనప్పుడు నెమ్మదిగా, కుదిరినప్పుడల్లా ధాటిగా ఆడగలరు.

వీరి తర్వాత డేంజరస్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరిద్దరూ ఇన్నింగ్స్ చివర్లో కూడా విజృంభించి మ్యాచ్‌లను భారత్ ‌వైపు తిప్పేయగలరు.

జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత పేస్ దళానికి బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు

పటిష్ట బౌలింగ్ లైనప్

దాయాదుల మధ్య పోరుగా అందరూ పిలిచే భారత్-పాక్ మ్యాచ్‌ను తరచుగా భారత బ్యాట్స్‌మెన్‌కు, పాక్ బౌలర్లకు మధ్య పోటీగా చూస్తారు.

కానీ, ఇప్పుడు అలా కాదు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చగల బౌలింగ్ లైనప్ ఇప్పుడు భారత్ సొంతం.

జస్‌ప్రీత్ బుమ్రా లయను అందిపుచ్చుకుంటే అతని బౌలింగ్‌లో ఆడటం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా అసాధ్యమే. గాయం నుంచి కోలుకొని సుదీర్ఘకాలం తర్వాత జట్టులోకి పునరాగమనం చేసినప్పటి నుంచి బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు.

పేస్ బౌలింగ్ దళంలోని మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ కూడా అవసరమైనప్పుడు వికెట్లు పడగొట్టగలరు.

కానీ, నరేంద్ర మోదీ స్టేడియంలోని వికెట్, స్పిన్‌కు అనుకూలిస్తే భారత్ ముగ్గురు పేసర్లతో వెళ్లకపోవచ్చు.

ఇక స్పిన్ విభాగానికొస్తే కుల్దీప్ యాదవ్ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. అతను తిరిగి జట్టులోకి రావడమే సంచలన విషయం.

ఆసియా కప్‌లో ప్రతీ పరుగుకు పాకిస్తాన్ బ్యాటర్లు చెమటోడ్చేలా చేశాడు. 5 వికెట్లను సాధించాడు. భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

రవీంద్ర జడేజా, వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌లు కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌, పాక్ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోగలదు.

కానీ, ఇప్పుడు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా? లేదా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవాలా? అనేది రోహిత్‌కు కఠిన నిర్ణయంగా మారుతుంది.

ఇరు జట్లు చివరి వరకు తమ వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉంది. శనివారం, అభిమానులకు మరో మంచి మ్యాచ్ చూసే అవకాశం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)