భూమిని ఢీకొట్టబోయే బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించిన నాసా స్పేస్‌షిప్ 'ఒసిరిస్-రెక్స్', ఆ శాంపిల్స్ ఫోటోలు ఇవే...

ఫొటో సోర్స్, NASA
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
భూమిని ఢీకొట్టబోయే బెన్నూ గ్రహశకలం నమూనాలను నాసా విడుదల చేసింది. ఒసిరిస్-రెక్స్ వ్యోమనౌక ద్వారా నాసా ఈ గ్రహశకలం నమూనాలను సేకరించి సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చింది. వాటి ఫొటోలను ఇటీవల విడుదల చేసింది.
టెక్సాస్‌లోని ప్రత్యేకమైన ల్యాబ్‌లో ఈ క్యాప్సుల్‌లో ఉన్న బెన్నూ గ్రహశకల నమూనాలను పరిశీలిస్తున్నారు. క్విక్ లుక్ పేరిట ఏర్పడిన బృందం తొలి దశ పరిశోధనలు జరుపుతోంది.
ఈ బృందంలో ఒకరైన యూకె సైంటిస్ట్ డా. ఆష్లే కింగ్ బీబీసీతో మాట్లాడారు.
తాను అంతరిక్షం నుంచి తీసుకువచ్చిన బెన్నూ గ్రహశకల నమూనాను ప్రత్యక్షంగా చూశానని ఆయన తెలిపారు.
“అది చాలా గొప్పగా ఉంది. మేము ఇప్పటివరకు చూసిన వాటన్నింటినిలోనూ ఇదే అద్భుతం” అంటూ క్వానిస్టర్ తెరిచిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.
“మేం సరైన గ్రహశకలాన్నే పట్టుకోగలిగాం” అని ఆయన బీబీసీతో చెప్పారు.
న్యాచురల్ హిస్టరీ మ్యూజియం (NHM) నిపుణులు, ఐదుగురు ఇతర నిపుణులతో కూడిన ‘క్విక్ లుక్’ బృందం క్యాప్సుల్‌ను తెరిచి, గ్రహశకల నమూనాలను మూడు రోజుల పాటు విశ్లేషించింది.
4.5 బిలియన్ సంవత్సరాల క్రితం కార్బన్, నీరు వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్న బెన్నూ వంటి గ్రహశకలాలే భూమి ఏర్పడటానికి కారణం అయి ఉంటాయన్న సిద్ధాంతం ఒకటి ఉంది. దీని ప్రకారం, భూమిపై నీటితో సముద్రాలు, జీవరాశి మనుగడకు అవసరమైన ఇతర పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ కోణంలో పరిశోధనలు జరపడానికి బెన్నూ గ్రహశకలాల నమూనాలు ఉపయోగపడనున్నాయి.
నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఇటీవల జాన్సన్ స్సేస్ సెంటర్‌లో ప్రసంగించిన సమయంలో “మనం ఎక్కడి నుంచి వచ్చాం? అసలు మనం ఎవరం? ఈ సృష్టిలో మన స్థానం ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం” అని అన్నారు.

ఫొటో సోర్స్, NASA
ఎంత పరిమాణం ఉంటుంది?
క్యాప్సుల్ గ్రహశకల నమూనాను ఎంత పరిమాణంలో తీసుకువచ్చిందన్న దానిపై శాస్త్రవేత్తలు ఇంకా స్పష్టతనివ్వలేదు.
ఒసిరిస్-రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ బెన్ను గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాను క్రాఫ్ట్ లోపలి భాగంలోని క్యానిస్టర్‌లో భద్రపర్చింది. ఈ క్యాప్సుల్ 24 సెప్టెంబర్‌లో యూటా ఏడారిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎంత పరిమాణంలో నమూనా సేకరించారో ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.
ఇది బహుశా 250 గ్రాముల వరకు ఉండొచ్చని బృందం అంచనా వేస్తోంది. దీనిని నిర్ధారించడానికి మరికొద్ది రోజుల సమయం పట్టొచ్చు.
తొలుత డా.కింగ్, ఆయన తోటి శాస్త్రవేత్తలు ఇన్నర్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన కణాలపై తొలిదశ ప్రయోగాలు నిర్వహించారు. ట్యాగ్-సామ్ (టచ్ అండ్ గో శాంపిల్ అక్విజిషన్ మెకానిజం)గా పిలిచే ఈ ప్రయోగ దశలో క్యానిస్టర్ ఉపరితలంపై ఉన్న ధూళిని పరిశీలించారు.
“క్యానిస్టర్‌ను తెరిచిన సమయంలో నల్లటి పౌడర్ అంతటా వ్యాపించింది. అది చూడటానికి అద్భుతంగా ఉండటమే కాక, మాలో ఉత్సాహాన్ని నింపింది” అని డా. కింగ్ అన్నారు.
“అప్పటివరకు మేమంతా కూర్చుని ఉన్నాం. క్యానిస్టర్ తెరిచే సమయంలో అందరూ లేచి, స్క్రీన్‌నే చూస్తూ ఉన్నారు. అంతా సజావుగా సాగుతోంది. మేం ఇంకా చాలా చేయాల్సి ఉంది” అని అన్నారు.
ఆ ధూళిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో పరిశీలించారు. ఎక్స్‌రే వివర్తనం, ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీల పద్ధతులు, CTస్కాన్ ద్వారా కూడా పరిశీలన చేసినట్లు తెలిపారు.
ఆ పరిశోధనల్లో ఆ ధూళి బరువులో 5% వరకు కార్బన్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

ఫొటో సోర్స్, NASA
ధూళిలో నీటి ఉనికి..
పరిశోధనల డేటాను పరిశీలించిన సందర్భంలో కార్బన్ ఉనికిని గుర్తించిన క్షణాన అంతా ‘అద్భుతం’ అని అనుకున్నామని నాసా గడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఎనలిస్ట్ డా. డేనియల్ గాల్విన్ అన్నారు.
‘క్విక్ లుక్’ బృందం ధూళిలో కార్బొనేట్లతోపాటు ఇతర ఖనిజాలను కూడా గుర్తించారు.
ఒరిసిస్-రెక్స్ ప్రాథమిక పరిశీలకులు డా.డాంటే లారెట్టా గ్రహశకల నమూనాలోని మట్టి ఖనిజాల్లో నీటి ఉనికిని గుర్తించినట్లు తెలిపారు.
“వాటి స్ఫటిక నిర్మాణాల్లో నీరు ఉంది” అని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా కాస్మోకెమిస్ట్ తెలిపారు.
“దీనర్థం ఏంటంటే నీరు ఉంది అని. ఎలాగైతే బెన్నూ గ్రహశకంలో నీరు వచ్చిందో, అలాగే భూమిపై కూడా నీరు చేరింది. సముద్రాలు, సరస్సులు ఏర్పడటానికి ఇదే కారణం. భూమిపై జీవరాశి మనుగడకు ఇదే కారణం” అని అన్నారు.

ఫొటో సోర్స్, NASA
ఈ నమూనాను ఏం చేస్తారు?
నాసా ప్రయోగించిన ఒసిరిస్ -రెక్స్ వ్యోమనౌక భూమికి 330 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్నూ గ్రహశకలం నుంచి 2020 అక్టోబర్‌లో నమూనాను సేకరించింది. ఈ నమూనా మూడేళ్ల అంతరిక్ష ప్రయాణం అనంతరం భూమిని చేరింది.
సాల్ట్ లేక్ సిటీ దక్షిణాన ఉన్న మిటటరీ టెస్ట్ రేంజ్‌లో ఈ క్యాప్సుల్‌ను సురక్షితంగా దించగలిగింది నాసా.
క్యానిస్టర్ నుంచి పూర్తి నమూనా సేకరించిన అనంతరం, అందులో కొంత భాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు అందజేస్తారు. సుమారు 100 మిల్లీ గ్రాముల నమూనా యూకెలోని NHMలో డా.కింగ్ బృందం తదుపరి పరిశోధనలు,ఆక్స్‌ఫర్డ్, మాంచెస్టర్ యూనివర్సిటీల సహకారంతో సాగే పరిశోధనల కోసం అందుబాటులో ఉంచుతారు.
మార్చ్ నెలలో జరగబోయే లూనార్ అండ్ ప్లానిటరీ సైన్స్ కాన్ఫరెన్స్ (LPSC)లో నివేదిక అందజేయడమే లక్ష్యంగా అధ్యయనాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఉనికిలో లేని, భవిష్యత్తులో రాబోయే నూతన ఆవిష్కరణలు, అధునాతన ల్యాబ్‌లలో రాబోయే శాస్త్రవేత్తల పరిశోధనల కోసం నాసా ఈ నమూనాలో 75% భద్రపర్చనుంది.
“ఈ మిషన్ కోసం అభివృద్ధి చేసిన సైన్స్ ఫలితం ఎలా ఉందో మనం చూశాం. అంతరిక్షం నుంచి నమూనా కూడా సేకరించి, పరిశోధిస్తున్నాం. ఒసిరిస్ -రెక్స్ నుంచి మనం సాధించబోయే జ్ఞాన సంపదకు ఇది నాంది” అని జాన్సన్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ ఎలీన్ స్టాన్స్‌బరీ అన్నారు.
ఇవి కూడా చదవండి..
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














