స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీం కోర్టు తీర్పు నేడే... ఈ కేసులో ఇంతవరకూ ఏం జరిగింది?

స్వలింగ సంపర్కుల వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మరికొన్ని గంటల్లో తీర్పు వెలువరించనుంది.

స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోలేకపోవడం, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని, వారిని ‘‘ రెండో శ్రేణి పౌరులుగా (సెకండ్ క్లాస్ సిటిజన్స్)’’ మార్చుతుందని పిటిషనర్లు అంటున్నారు.

స్వలింగ సంపర్కుల వివాహాలను ప్రభుత్వంతో పాటు మతపెద్దలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని చెబుతున్నారు.

ఒకవేళ కోర్టు తీర్పు స్వలింగ వివాహాలకు అనుకూలంగా వస్తే, భారత్‌లోని లక్షలాది మంది ఎల్‌జీబీటీక్యూప్లస్ ప్రజలకు పెళ్లి చేసుకునే హక్కు లభిస్తుంది.

ఇది భారతీయ సమాజంలో అనేక మార్పులకు దారి తీస్తుంది. దత్తత, విడాకులు, వారసత్వం వంటి చాలా ఇతర చట్టాలను మార్చాల్సిన అవసరం తలెత్తుతుంది.

ఏప్రిల్, మే నెలల్లో అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, స్వలింగ సంపర్క వివాహాల చట్టబద్ధతను కోరుతూ నమోదైన పిటిషన్లపై విచారణ జరిపింది.

ఈ బెంచ్‌కు నేతృత్వం వహించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, దీనిని ఒక ప్రాధాన్యం గల అంశమని అన్నారు.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోర్టులో వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. కోర్టు ఈ కేసు తీర్పును మే 12న రిజర్వ్ చేసింది.

మతపరమైన వ్యక్తిగత చట్టాల జోలికి వెళ్లబోమని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కానీ, వేర్వేరు కులాలు, వేర్వేరు మతాల పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించే ప్రత్యేక చట్టంలో ఎల్‌జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీని చేర్చవచ్చో, లేదో పరిశీలిస్తామని చెప్పారు.

స్వలింగ సంపర్కుల వివాహం

ఫొటో సోర్స్, Getty Images

పిటిషనర్లు ఎవరు? వారికి ఏం కావాలి?

స్వలింగ జంటలు, ఎల్‌జీబీటీక్యూ ప్లస్ కార్యకర్తలు, ఇతర సంస్థలు దాఖలు చేసిన 21 పిటిషన్లను కోర్టు విచారించింది.

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక అని, కేవలం ఆడ-మగ మధ్య సంబంధం కాదని పిటిషనర్ల తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు.

కాలక్రమేణా వివాహంలో వస్తున్న మార్పులను ప్రతిబింబించేలా చట్టాలను మార్చాలని వారు అన్నారు.

స్వలింగ జంటలు కూడా వివాహంతో వచ్చే గౌరవాన్ని కోరుకుంటారని తమ వాదనలు వినిపించారు.

తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి కల్పిస్తుందని, లైంగికత ఆధారంగా వివక్షను నిషేధిస్తుందని కోర్టులో పిటిషనర్లు పదే పదే వాదించారు.

పెళ్లి చేసుకోలేకపోవడం వల్ల స్వలింగ జంటలు, బ్యాంకుల్లో ఉమ్మడి ఖాతాలను నిర్వహించలేకపోతున్నారని, పిల్లల దత్తత, ఉమ్మడిగా ఇల్లు కొనుగోలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నొక్కి చెప్పారు.

విచారణ సందర్భంగా జడ్జిలు, స్వలింగ జంటల ఆందోళనల పట్ల సానుభూతితో కనిపించారు. వారి సమస్యలను పరిష్కరించడానికి మీరేం చేయాలనుకుంటున్నారని ప్రభుత్వాన్ని అడిగారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా

ప్రభుత్వం ఏం చెప్పింది?

స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పించడం పార్లమెంట్ పరిధిలోని అంశమని పేర్కొంటూ, ఈ కేసును కోర్టు విచారించడాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది.

ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ కేసులో దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టేయాలని కోర్టును కోరారు.

భిన్న లింగాలకు చెందిన ఆడ, మగ వ్యక్తుల మధ్య మాత్రమే వివాహం జరుగుతుందని ఆయన వాదనలు వినిపించారు.

ఈ కేసులో పిటిషన్లను దాఖలు చేసిన వారిని ఉద్దేశిస్తూ, ‘‘వారంతా పట్టణాల్లోని కేవలం కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నారు’’ అంటూ విమర్శించారు.

భారత్‌లోని అన్ని ప్రధాన మతాలకు చెందిన పెద్దలంతా ఉమ్మడిగా స్వలింగ సంపర్కుల వివాహాలను వ్యతిరేకించారు.

పెళ్లి అనేది వినోదం కాదని వారు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం, మత పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ జడ్జిలు ఈ కేసును విచారణకు స్వీకరించారు.

మతపరమైన వ్యక్తిగత చట్టాల జోలికి వెళ్లబోమని పేర్కొంటూ, 1954 ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేసి అందులో ఎల్‌జీబీటీక్యూ ప్లస్ ప్రజలను చేర్చవచ్చా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.

స్వలింగ సంపర్కుల వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యేక వివాహ చట్టం ఏంటి?

భారత్‌లో ముస్లిం వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం వంటి మతపరమైన వ్యక్తిగత చట్టాల కింద పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతుంటాయి.

కానీ, ఒకే మతం లేదా ఒకే కులానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహాలను మాత్రమే ఈ చట్టాల ప్రకారం ఆమోదిస్తారు. అంటే, మొదట్లో ఒక హిందూ, ఒక ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు పెళ్లి చేసుకోవాలనుకుంటే వారిలో ఎవరో ఒకరు తమ మతాన్ని మార్చుకోవాల్సి ఉండేది.

‘‘ఇది చాలా సమస్యాత్మక భావన. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను ఓడిస్తుంది. భారత రాజ్యాంగం ద్వారా లభించిన మీకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కును కూడా హరిస్తుంది’’ అని లాయర్ అక్షత్ బాజ్‌పాయ్ అన్నారు.

కాబట్టి, స్వాతంత్ర్యానంతరం వేర్వేరు మతాలు, కులాల వివాహాల కోసం ఒక చట్టపరమైన యంత్రాంగాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

‘‘1954 ప్రత్యేక వివాహా చట్టాన్ని పార్లమెంట్ తీసుకొచ్చింది. పెళ్లి చేసుకోవడానికి మతాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదని ఈ చట్టం నొక్కి చెబుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛలో ఈ చట్టం ఒక గొప్ప ముందడుగు’’ అని బాజ్‌పాయ్ చెప్పారు.

ప్రత్యేక వివాహ చట్టం

ఫొటో సోర్స్, Getty Images

చట్టంలో పురుషుడు, స్త్రీ అనే పదాల స్థానాన్ని ‘స్పౌస్’ అనే పదంతో భర్తీ చేస్తే వివాహ సమానత్వం లభిస్తుందని కోర్టులో పిటిషనర్లు వాదించారు.

కానీ, విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ ఒక్క చట్టంలో మార్పులు తీసుకురావడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని స్పష్టమైంది.

విడాకులు, దత్తత, వారసత్వం, మెయింటనెన్స్‌లతో పాటు ఇతర సమస్యలను నియంత్రించే డజన్ల కొద్దీ చట్టాలు మతపరమైన వ్యక్తిగత చట్టాల పరిధిలోకి వస్తాయి.

కాబట్టి ఈ ఒక్క చట్టంలో మార్పులు చేయడం సరిపోదని స్పష్టమైంది.

‘‘ఇదొక అరుదైన పరిస్థితి. ఈ తీర్పును వెలువరించడానికి అత్యున్నత స్థాయి రాజనీతి అవసరం’’ అని బాజ్‌పాయ్ అన్నారు.

స్వలింగ వివాహాలు

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు ముందు ఉన్న ఇతర మార్గాలు ఏంటి?

కోర్టు తీర్పు ఎలా వస్తుందనే అంశాన్ని ఊహించడం చాలా కష్టం.

కానీ, స్వలింగ జంటలకు ఉమ్మడి బ్యాంకు ఖాతాలు తెరవడం, ఇన్సూరెన్స్ పాలసీలల్లో భాగస్వామిని నామినేట్ చేయడం, ప్రాపర్టీలో సహ-యాజమాన్యం ఇవ్వడం వంటి సామాజిక, చట్టపరమైన హక్కులను కల్పిస్తారని అందరూ ఊహిస్తున్నారు.

స్వలింగ జంటలకు ఈ హక్కులు కల్పించే అంశాన్ని ప్రభుత్వం కూడా పరిశీలిస్తోందని కోర్టులో సొలిసిటర్ జనరల్ మెహతా చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆమోదించిన లెక్కల ప్రకారం, దాదాపు 140 మిలియన్ల ఎల్‌జీబీటీక్యూ ప్లస్ ప్రజలు ఉన్న దేశంలో సుప్రీం కోర్టు వెలువరించే తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)