LGBTQ వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుతున్న ఒక లెస్బియన్ యాక్టివిస్ట్ కథ

- రచయిత, ఉమాంగ్ పొద్దర్
- హోదా, బీబీసీ న్యూస్
స్వలింగ సంపర్కుల వివాహాలపై భారత సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పు కోసం మాయాశర్మ ఎంతో ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నారు. 16 ఏళ్ల వైవాహిక జీవితం నుంచి 1990లలో బయటకు వచ్చేటప్పుడు, స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుతూ తాను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని ఎల్‌జీబీటీక్యూ యాక్టివిస్ట్ మాయా శర్మ అసలు ఊహించలేదు.
ప్రస్తుతం 70 ఏళ్ళకు పైబడిన మాయ తన జీవిత భాగస్వామి(మహిళ)తో కలిసి వడోదరలో జీవిస్తున్నారు. ఒకవేళ స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించినా, తన జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడంలేదని ఆమె చెప్పారు. అయితే, ఈ కేసు ద్వారా ఎల్‌జీబీటీక్యూ బంధాలకు చట్టబద్ధత ఇచ్చినట్లు అవుతుందని ఆమె భావిస్తున్నారు.
ఒక పురుషుడితో కలిసి జీవించడం దగ్గర మొదలుపెట్టి ‘లెస్బియన్’గా తన లైంగికతను గుర్తించడం వరకూ ఆమె జీవితానికి, ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆమె ప్రయాణమిదీ.

ఫొటో సోర్స్, Vikalp foundation
అలా మొదలైంది...
రాజస్థాన్ అజ్‌మేర్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసుకుని బీఏ చేసేందుకు 1960లలో దిల్లీకి మాయ వచ్చారు. 1983లో మహిళ హక్కుల సంస్థ ‘సహేలీ’ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడే ‘‘వైవాహిక జీవితం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించేవారు, సమాజం తమపై రుద్దే కట్టుబాట్ల నుంచి స్వేచ్ఛా వాయువులను పీల్చాలనుకునే వారిని’’ ఆమె కలిశారు.
మొదట్నుంచీ మాయకు మహిళలంటే చాలా ఇష్టం. ‘‘చిన్నప్పుడు కూడా అమ్మాయిలతో నాకు చాలా బలమైన స్నేహం ఉండేది. స్కూలుకు వెళ్లేటప్పుడే మా టీచర్లలో ఒకరితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది’’ అని ఆమె చెప్పారు.
కాలం గడిచేకొద్దీ మహిళలపై తన ప్రేమను ఈ ప్రపంచానికి చెప్పడం చాలా కష్టమని ఆమెకు అర్థమైంది. అయితే, ఉద్యోగం వల్ల తనలో చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చేవని ఆమె చెప్పారు.
1988లో ఇద్దరు మహిళా పోలీసులు పెళ్లి చేసుకున్నారు, లెస్బియన్ జంట కలిసి జీవిస్తోంది.. లాంటి వార్తలను ఆమె చూశారు. ‘‘ఆ వార్తలు విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది’’ అని మాయ చెప్పారు. అయితే, ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయడం, మరికొందరు ఆత్మహత్యలు చేసుకోవడం చూసి ఆమె చాలా బాధపడ్డారు.
‘‘ఆ కాలంలో అసలు ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ లాంటివేమీ లేవు. మా గురించి ఒకరికి ఒకరికి తెలుసు. కానీ, ప్రపంచం సంగతి పక్కన పెడితే, అప్త మిత్రుల దగ్గర ఈ విషయం చెప్పడం కూడా చాలా కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘లెస్ దెన్ గే’
ఎల్‌జీబీటీక్యూ ప్రస్థానంలో కీలకమైన 1991నాటికి 70 పేజీల నివేదిక ‘ద పింక్ బుక్’ విడుదలైన సమయం ఇప్పటికీ మాయకు గుర్తుంది.
‘లెస్ దెన్ గే’ పేరుతో ఆ నివేదిక విడులైంది. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించడం, అసలు స్వలింగ సంపర్కమే భారత్‌లో లేదని చెప్పడం లేదా దీన్నొక వ్యాధిగా చూడటం.. లాంటి పరిస్థితుల్లో ఆ నివేదిక వచ్చింది.
‘‘భారత్‌లోని గే, లెస్బియన్ జీవితంపై విడుదలైన తొలి డాక్యుమెంట్’’గా దాన్ని భావిస్తున్నారు. సెక్షన్ 377ను కొట్టివేయాలని, స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌కు సవరణ చేయాలని కూడా ఆ రిపోర్టులో కోరారు.

ఫొటో సోర్స్, Vikalp foundation
ప్రేమలో పడ్డారిలా
అదే సమయంలో తన 16 ఏళ్ల వైవాహిక జీవితానికి మాయ ముగింపు పలికారు. ‘‘ఒక రోజు నా చిన్న సూట్‌కేస్ ప్యాక్ చేసుకొని, నడుచుకుంటూ వచ్చేశాను’’ అని ఆమె చెప్పారు. అలా ఆమె తన ఇంటిని వదిలి దిల్లీలోని సర్వెంట్ క్వార్టర్స్‌కు వచ్చేశారు.
తన సెక్సువాలిటీ వల్ల ఆ పెళ్లికి ఆమె వీడ్కోలు పలకలేదు. ఎందుకంటే ఆ విషయంపై అప్పటికి ఆమెకు పూర్తి అవగాహన రాలేదు.
పెళ్లి అనేది అణచివేతకు మారుపేరులా మారిందని ఆమె భావించేవారు. ‘‘అసలు అది ఎంత అణచివేస్తోందో నేను జీర్ణించుకోలేకపోయేదాన్ని’’ అని ఆమె చెప్పారు.
ఈ విషయంలో ఎంచుకున్న వృత్తే తనకు దారి చూపింది. ‘‘సహేలీ నాకు చాలా ధైర్యం ఇచ్చింది. భిన్నంగా ఆలోచించేలా అదే నాకు దారిచూపింది’’ అని ఆమె వివరించారు.
ఆ తర్వాత ఆమె ఒక మహిళతో ప్రేమలో పడ్డారు. ‘‘నా జీవితంలో అదొక అద్భుతమైన ఘట్టం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మనసుకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడటం మరొక ఎత్తు’’ అని ఆమె చెప్పారు.
తన భాగస్వామి గురించి ప్రతిచిన్న విషయమూ ఆమెకు గుర్తుంది. ‘‘ఆమెను నా గురువుగా భావించేదాన్ని’’ అని మాయ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
లెస్బియన్లకు గుర్తింపు
1990ల్లో ఎల్‌జీబీటీక్యూలపై చర్చ ఎక్కువైంది. 1994లో తిహార్ జైలులో కండోమ్‌లను పంచడాన్ని కిరణ్ బేడీ నిలిపివేసినప్పుడు, దీన్ని స్వలింగ సంపర్కాన్ని అడ్డుకునే చర్యగా చాలా మంది భావించారు. ఈ విషయంపై నిరసనలు కూడా చోటుచేసుకున్నాయి.
‘‘ఆ నిరసన ప్రదర్శనలో నేను కూడా పాల్గొన్నాను’’ అని మాయ చెప్పారు.
మొదట్లో కొన్ని మహిళా హక్కుల సంస్థలు కూడా ఎల్‌జీబీటీక్యూ వర్గానికి మద్దతు పలికేవి కాదు. ‘‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆఫ్ ఇండియన్ విమెన్‌కు విమలా ఫరూఖీ.. స్వలింగ సంపర్కాన్ని పశ్చిమ దేశాల సంస్కృతిగా చెప్పేవారు’’ అని మాయ గుర్తుచేసుకున్నారు.
‘‘అలాంటి మాటలతో నాకు విశ్రాంతి అనేదే లేకుండా అనిపించేది. అప్పటికి నా వయసు కూడా తక్కువేమీ కాదు’’ అని ప్రపంచం తమ కమ్యూనిటీని ఆమోదించాలని ఎలా కోరుకునేవారో మాయ గుర్తుచేసుకున్నారు.
కానీ, పరిస్థితులు నెమ్మదిగా మారుతూ వచ్చాయి. 1997లో రాంచీలో ‘విమెన్స్ మూమెంట్ కాన్ఫెరెన్స్’ నిర్వహించారు. ఆ డిక్లరేషన్‌లో ‘లెస్బియన్ రైట్స్’ గురించి కూడా ప్రస్తావించారని మాయ గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైర్ సినిమా
1998లో ‘ఫైర్’ సినిమా విడుదలైంది. దీనిలో ఇద్దరు మహిళల మధ్య శారీరక సంబంధాన్ని చూపించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంలో ఇదొక మైలురాయి.
ముంబయి, దిల్లీ, సూరత్‌లలో ఈ సినిమా ప్రదర్శించే కొన్ని థియేటర్లను ధ్వంసం చేశారు. కొన్ని రోజులపాటు వార్తల్లో ఎల్‌జీబీటీక్యూ వర్గాలపై చాలా చర్చ జరిగింది.
‘‘మేం చాలా ప్రేమ, గర్వంతో ఒక పోస్టర్‌ను రూపొందించాం. దానిపై ‘ఇండియన్, ఇంకా లెస్బియన్’ అని కూడా రాశాం’’ అని మాయ గుర్తుచేసుకున్నారు. రీగల్ సినిమా హాల్ బయట కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహించామని ఆమె చెప్పారు.
ఆ మరుసటి రోజు ఉదయం వార్తా పత్రికల శీర్షికల్లో ‘లెస్బియన్’ అనే పేరు ప్రధానంగా కనిపించింది. ‘‘అయితే, ఆ పదం మమ్మల్ని చాలా భయపెట్టింది. ఎందుకంటే మాలో చాలా మంది గురించి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి తెలియదు. కాబట్టి అసలు ఏం జరుగుతుందోనని భయమేసేది’’ అని మాయ గుర్తుచేసుకున్నారు.
కానీ, ఆ నిరసనలు తనలో ధైర్యాన్ని నింపాయి. ‘‘భయాన్ని అధిగమించినప్పుడు, మిమ్మల్ని వేరొకరు ఆవహించినట్లు అనిపిస్తుంది. అసలు వారు నన్నేం చేయగలరు? అని మీకే అనిపిస్తుంది’’ అని ఆమె చెప్పారు.
‘‘ఇలాంటి చిన్నచిన్న ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
వడోదరకు పయనం
2000 మొదట్లో ఒక ట్రేడ్ యూనియన్ కోసం మాయ పనిచేసేవారు. అయితే, ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం ఆమె పోరాటం చేయడాన్ని ఆ యూనియన్ అనుమతించేది కాదు. ‘‘వారు నాపై చాలా కోపంతో ఉండేవారు. మా యూనియన్‌కు చెడ్డపేరు తెస్తున్నావని అనేవారు. అందుకే ఆ ఉద్యోగాన్ని మానేయాల్సి వచ్చింది’’ అని ఆమె చెప్పారు.
చివరగా ఆమె వడోదరకు వచ్చేశారు. వికల్ప్ విమెన్స్ గ్రూపులో ఆమె చేరారు. మహిళలు, ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ వృత్తిలో తనకు ఎదురైన అనుభవాలపై 2006లో ఒక పుస్తకాన్ని కూడా ఆమె రాశారు. ‘లవింగ్ విమెన్: బీయింగ్ లెస్బియన్ ఇన్ అండర్‌ప్రివిలైజ్డ్ ఇండియా’ అనే పేరుతో వచ్చిన ఈ పుస్తకంలో గ్రామాల్లో జీవిస్తున్న కొంతమంది లెస్బియన్ మహిళల కథలు రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
377 కొట్టివేత కోసం
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకూడదనే పోరాటానికి 1990ల్లోనే పునాదులు పడ్డాయి. అయితే, 2000లోనే ఈ విషయం కోర్టులకు చేరింది.
2003లో ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని సెక్షన్ 377ను కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించింది.
ఈ పోరాటంలో మాయ ప్రధాన పాత్ర పోషించారు. ‘‘మేం యుద్ధ క్షేత్రంలో సైనికుల్లా మారి కమ్యూనిటీ కోసం మద్దతు కూడగట్టాం. విక్రమ్ సేఠ్ లాంటి ప్రముఖుల మద్దతు కూడా కూడగట్టాం’’ అని ఆమె చెప్పారు.
2009లో సెక్షన్ 377లో కొన్ని నిబంధనల్లో దిల్లీ హైకోర్టు కొన్ని మార్పులు చేసి, అమలు చేయాలని సూచించింది. ‘‘సెక్షన్ 377ను దిల్లీ హైకోర్టు మళ్లీ అమలు చేయాలని చెప్పడంతో కుంగుబాటుకు గురైనట్లుగా అనిపించింది’’ అని ఆమె వివరించారు.
కానీ, కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు కూడా మేలు చేస్తాయి. ‘‘అప్పటివరకూ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ చెల్లాచెదురుగా ఉండేది. దీని తర్వాత అందరూ ఒకతాటిపైకి వచ్చారు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
377 కొట్టివేత..
377 సెక్షన్‌పై దిల్లీ హైకోర్టు తీర్పును 2013లో సుప్రీం కోర్టు పక్కన పెట్టేసింది. దీనికి కొన్ని నెలలకే సుప్రీం కోర్టు మరో చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ట్రాన్స్‌జెండర్లను ‘థర్డ్ జెండర్’గా గుర్తించాలని దీనిలో స్పష్టంచేసింది.
అయితే, 2018 అక్టోబర్ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి అతిపెద్ద విజయం తెచ్చిపెట్టింది. మొత్తంగా సెక్షన్ 377నే సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇక స్వలింగ సంపర్కం భారత్‌లో నేరం కాదని కోర్టు స్పష్టంచేసింది.
అప్పటికే తన గుర్తింపును సగర్వంగా చెప్పుకునే మాయకు ఆ తీర్పు మరింత నైతిక బలం అందించింది.
‘‘ఇది చాలా అసహజైనది, అనైతికమైనదని ఎవరైనా చెబుతారేమోనని భయం ఎప్పుడూ వెంటాడేది. మొత్తానికి మేం నేరస్థులం కాదని సుప్రీం కోర్టే చెప్పడంతో చాలా సాంత్వన లభించింది’’ అని మాయ చెప్పారు.
ఎల్‌జీబీటీక్యూ ఆమోదించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అయితే, చేయాల్సిందని ఇంకా చాలా ఉంది. ‘‘చట్టంలో మార్పులు చేయడం చాలా ముఖ్యం. అయితే, వీటి ప్రభావం నెమ్మదిగా కనిపిస్తుంది’’ అని ఆమె అన్నారు.
వడోదరలో ఉంటున్నప్పుడే తన ప్రస్తుత పార్ట్‌నర్‌ను మాయ కలిశారు. రోజులు చాలా సంతోషంగా గడుస్తున్నాయని ఇప్పుడామె చెబుతున్నారు. ‘‘ఎందుకంటే నేను కమ్యూనిటీలోనే పనిచేస్తున్నాను. రోజూ కమ్యూనిటీ వారిని కలుస్తున్నాను. ప్రేమలో కూడా ఉన్నాను’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లికి మార్గం
స్వలింగ సంపర్కం నేరం కాదని పరిగణించడం, ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు నివ్వడంతో ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ పెళ్లి వైపు చూడటం మొదలుపెట్టింది.
2020 జనవరిలో ఈ హక్కు కోసం ఓ గే జంట పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత దిల్లీ, ఒడిశా హైకోర్టులు, సుప్రీం కోర్టులోనూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. 2023 జనవరిలో ఈ పిటిషన్లన్నీ సుప్రీం కోర్టు కలిపి విచారణ చేపడతామని స్పష్టంచేసింది.
అయితే, పెళ్లి అంటే ఇప్పటికీ మాయకు ఇష్టం లేదు. అయితే, ఎల్‌జీబీటీక్యూ వివాహాలను చట్టబద్ధం చేయడం ద్వారా ఆస్తి పంపకాల్లో ఎల్‌జీబీటీక్యూ ప్రతినిధులకు సముచిత హక్కులు ఇవ్వాలని ఆమెతోపాటు మరికొందరు కలిసి 2023 ఫిబ్రవరిలో చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
‘‘నేను ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ పెళ్లిళ్లను ప్రోత్సహించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే పెళ్లి అంటే చాలా సంబంధాలు ఉంటాయి. అందుకే ఈ సంబంధాన్ని నేను పార్ట్‌నర్‌షిప్ అని పిలవాలని అంటాను’’ అని ఆమె చెప్పారు.
తన పిటిషన్‌లో కుటుంబాన్ని ఎంచుకునే హక్కు కూడా ఉండాలని ఆమె కోరారు. ‘‘కొన్ని కుటుంబాల్లో స్వలింగ సంపర్కుల పిల్లలు చాలా హింసను చూస్తుంటారు. వారికి కూడా మద్దతు పలికే కుటుంబాలు ఉండాలి కదా?’’ అని ఆమె అన్నారు.
సుప్రీం కోర్టు ఏం తీర్పు ఇచ్చేటప్పటికీ, పరిస్థితులు మారుతాయని మాయ ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘కోర్టులు గుర్తించడం ఒకటైతే, సమాజంలో మార్పు రావడం మరొక ముఖ్యమైన అంశం’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి..
- స్పై డెత్స్: మజ్జోరే సరస్సు పడవ మునకలో గూఢచారుల మరణాలపై అనేక సందేహాలు
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















