ఇజ్రాయెల్ హిజ్బొల్లా మధ్య తీవ్ర స్థాయిలో దాడులు, ఇది మరో యుద్ధానికి దారి తీస్తుందా? హిజ్బొల్లా చరిత్ర ఏంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, డేవిడ్ గ్రిట్టన్, జరోస్లవ్ లుకివ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
హిజ్బొల్లా డ్రోన్, రాకెట్ దాడులను అడ్డుకునేందుకు దక్షిణ లెబనాన్ మీద ముందస్తు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఆదివారం ఉదయం జెట్ విమానాలు హిజ్బొల్లా ప్రయోగించిన వేలాది రాకెట్లను ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు ఫైటర్లు మరణించారని హిజ్బొల్లా దాని మిత్ర పక్షాలు వెల్లడించాయి.
తమ సీనియర్ కమాండర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై 320 రాకెట్లు, మరో డ్రోన్లను ప్రయోగించినట్లు హిజ్బొల్లా తెలిపింది. ఈ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ నేవీ సైనికుడు మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ చెప్పింది.
ఈ దాడుల తీవ్రత మరింత పెరక్కుండా ఉండేందుకు తాము కృషి చేస్తున్నామని అమెరికా తెలిపింది.
2023 అక్టోబర్ 7 తర్వాత గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాతి రోజు నుంచి ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో దాదాపు ప్రతీ రోజు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
అమెరికా మద్దతుతో కైరోలో జరుగుతున్న శాంతి చర్చల తాజా రౌండ్లో ఎలాంటి పురోగతి లేదు.
శాంతి చర్చల ప్రక్రియలో ఇజ్రాయెల్ కొత్తగా పెట్టిన షరతులను తాము తిరస్కరిస్తున్నామని, ఇజ్రాయెల్ తాను హామీ ఇచ్చిన అంశాల మీద వెనక్కి వెళుతోందని ఆరోపించింది. జులై ప్రారంభంలో చివరి దశ చర్చల తర్వాత తమ విధానంలో మార్పు వచ్చిందన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది.
ఇరాన్ మద్దతు ఉన్న పాలస్తీనా గ్రూపుకు మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు హిజ్బొల్లా పేర్కొంది. ఇజ్రాయెల్, బ్రిటన్ హమాస్, హిజ్బొల్లాను నిషేధిత తీవ్రవాద సంస్థలుగా ప్రకటించాయి.
2023 అక్టోబర్ నుంచి జరిగిన దాడుల్లో 560 మంది చనిపోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో ఎక్కువ మంది హిజ్బుల్లో ఫైటర్లే ఉన్నారు. ఇజ్రాయెల్‌లో 26 మంది పౌరులు, 23 మంది సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులకు రెండు వైపులా దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

ఫొటో సోర్స్, EVN
ఇది కథకు ముగింపు కాదన్న నెతన్యాహు
ఆదివారం తెల్లవారు జామున స్థానిక కాలమానం ప్రకారం 04.30 గంటలకు ఇజ్రాయెల్ హిజ్బొల్లా మీద భీకర దాడి చేసింది. 2006 తర్వాత ఈ రెండింటి మధ్య పెద్ద దాడి ఇదే.
దక్షిణ లెబనాన్‌లోని 40కి పైగా ప్రాంతాల్లో సుమారు 100 యుద్ధ విమానాలు "వేల సంఖ్యలో హిజ్బొల్లా రాకెట్ లాంచర్ బారెల్స్‌పై దాడి చేసి ధ్వంసం చేశాయని" ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
హిజ్బొల్లా పెద్ద ఎత్తున వైమానిక దాడికి సిద్ధమవుతోందని తమకు సమాచారం అందడంతో తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.
ఖియామ్‌లో కారుపై డ్రోన్ దాడిలో ఒకరు మరణించారని, తిరి గ్రామంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారని లెబనీస్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
“ఈ రోజు జరిగింది ఈ కథకు ముగింపు కాదు” అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు.
“మేము పూర్తి స్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ మా ప్రజలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాము” అని ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి కాట్జ్ చెప్పారు

ఫొటో సోర్స్, EPA
హిజ్బొల్లా ఏర్పాటు ఎలా జరిగింది? ఏ లక్ష్యంతో ఏర్పాటైంది?
ఇరాన్ మద్దతుతో ఏర్పడిన షియా ఇస్లామిక్ పారా మిటలరీ, రాజకీయ పార్టీలను నడిపిస్తోన్న సంస్థ హిజ్బొల్లా. లెబనాన్‌లో ఉనికిలో ఉన్న ఈ సంస్థకు 1992 నుంచి హసన్ నజ్రల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హిజ్బొల్లా అంటే ‘దేవుని అంశ’ అన్న అర్థం వస్తుంది.
1980ల్లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన సమయంలో రూపుదిద్దుకున్నహిజ్బొల్లా సంస్థ, అప్పటి నుంచి ఆర్థిక, మిలటరీ వనరులను మెరుగుపర్చుకుంటూ బలమైన శక్తిగా ఎదిగింది. దక్షిణ లెబనాన్‌లోని షియాల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పోరాటం చేస్తున్నట్లుగా ప్రకటించుకుంది.
2000లో ఇజ్రాయెల్ లెబనాన్ నుంచి వెనక్కు తగ్గిన సమయంలో నిరాయుధీకరణను వ్యతిరేకిస్తూ, మిలటరీ సామర్థ్యాన్ని బలపర్చుకుంది. ఆ తరువాత జరిగిన పరిణమాల్లో లెబనాన్ రాజకీయాల్లోనూ ప్రవేశించి, ‘ది రెసిస్టెన్స్ బ్లాక్ పార్టీ’ ఏర్పాటు చేసి, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగేలా, ‘వీటో’ అధికారాన్ని దక్కించుకుని లెబనాన్‌లో రాజకీయంగానూ శక్తివంతమైంది.
హిజ్బొల్లా సంస్థ ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు లక్ష్యంగా పలు రాకెట్లు, బాంబు దాడులకు పాల్పడింది. పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, అరబ్ లీగ్(AL) దేశాలు హిజ్బొల్లాను ‘తీవ్రవాద సంస్థ’గా గుర్తించాయి.

ఇజ్రాయెల్‌తో శత్రుత్వం
2011లో సిరియాలో తలెత్తిన ఘర్షణలో, సిరియా అధ్యక్షులు బషర్ అల్-అస్సాద్‌కు మద్దతుగా తన మిలటరీ సైన్యాన్ని పంపింది. సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని అణిచివేసి, ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలోనూ సాయం చేసింది.
సిరియాలోని ఇరాన్‌కు సంబంధం ఉన్న ప్రాంతాలు, హిజ్బొల్లామిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే, వాటిని ఇజ్రాయెల్ ధ్రువీకరించడానికి నిరాకరించింది.
సిరియాలోని షియా అధ్యక్షుడికి మద్దతు ఇవ్వడం, ఇరాన్‌తో బలమైన సంబంధాలు కొనసాగించడం వలన ఇరాన్ శత్రు దేశమైన సౌదీ అరేబియాతోపాటు గల్ప్ అరబ్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడుల్లో సుమారు 1,400మందికి పైగా మరణించారు.
ఈ నేపథ్యంలో హిజ్బొల్లా, ఇజ్రాయెల్‌ల మధ్య కూడా ఉద్రిక్తత పెరిగింది.
ఇజ్రాయెల్‌పై పోరుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా హిజ్బొల్లాప్రకటించింది.
రాజకీయ, భద్రత, మిటలరీ, రాజకీయ పరంగా హిజ్బొల్లా లెబనాన్‌లో పట్టు సాధించినప్పటికీ, శత్రు దేశాల నుంచి పాలనాపరంగా విమర్శలను ఎదుర్కొంది. అయినా లెబనాన్ ఆర్మీ కన్నా కూడా ఎక్కువ సైన్యం, ఆయుధాలతో బలంగా మారింది.
షియా కమ్యూనిటీల మద్దతు ఉన్నహిజ్బొల్లాను కొంతమంది దేశానికి ముప్పుగా కూడా చెప్తారు.

ఫొటో సోర్స్, Reuters
మూలాలు.. ఏర్పాటు
హిజ్బొల్లామూలాలను కచ్చితంగా చెప్పడం కష్టమైనప్పటికీ, 1982లో పాలస్తీనా మిలిటెంట్లు చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై దండెత్తిన సమయంలో ఊపిరిపోసుకుంది.
అమల్ ఉద్యమానికి దూరమై, తీవ్రవాదానికి అనుకూలంగా ఉన్న షియా నాయకులు దీనికి మద్దతు పలికారు. ఇలా ఏర్పాటైన సంస్థకు ఇరాన్‌లోని బెక్కా వ్యాలీలో ఉండే విప్లవ నాయకుల నుంచి ఆయుధ, సైన్య, వ్యవస్థీకృత సాయం అందింది. ఈ సంస్థేక్రమంగా హెజ్బొల్లాగా మారింది.
ఈ సంస్థ ఇజ్రాయెల్ మిలటరీతోపాటు లెబనాన్ ఆర్మీ, విదేశీ సైన్యంపై దాడులకు పాల్పడింది. 1983లో యూఎస్ మెరైన్ బ్యారక్, యూఎస్ ఎంబసీలపై జరిగిన బాంబు దాడుల వెనుక ఉన్నది హెజ్బొల్లానే అని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో 258 అమెరికన్లు, 58 మంది ఫ్రెంచ్ సైనికులు మరణించారు. ఈ దాడుల తర్వాత పాశ్చాత్య దేశాలు శాంతి స్థాపన కోసం పంపిన దళాలను ఉపసంహరించుకున్నాయి.
1985లో ప్రచురించిన బహిరంగ లేఖలో ముస్లింల భూభాగాలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ పూర్తి నిర్మూలన, అమెరికా, రష్యాలు ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున ఆ దేశాలను శత్రువులుగా పేర్కొంటూ హిజ్బొల్లాసంస్థ, తన ఏర్పాటును ధ్రువీకరించింది.
1990లలో సిరియా మిలటరీ ఆధ్వర్యంలో శాంతిస్థాపన జరిగిన తరువాత, హిజ్బొల్లాదక్షిణ లెబనాన్‌లో గెరిల్లా పోరాటాలు కొనసాగించింది. లెబనాన్ రాజకీయాల్లోనూ కీలకంగా మారి, 1992లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసింది.
2000లో ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నేపథ్యంలో ఆ విజయాన్ని తన ఖాతాల్లో వేసుకుంది హిజ్బొల్లా. నిరాయుధీకరణపై వచ్చిన ఒత్తిడిని వ్యతిరేకించి, షెబ్బా భూములు, ఇతర వివాద ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాల మోహరింపును కారణంగా చూపిస్తూ, తన సాయుధ బలగాలను విస్తృతం చేసుకుంది.
2006లో సీమాంతర దాడులకు పాల్పడి, ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులను చంపడంతోపాటు, ఇద్దరిని కిడ్నాప్ చేసింది. ఈ దాడి ఉద్రిక్తతలకు దారి తీసి, ఇజ్రాయెల్ గట్టిగా స్పందించింది.
దక్షిణ లెబనాన్‌తోపాటు బేరూత్‌లోని హిజ్బొల్లాస్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.
హిజ్బొల్లాప్రతిదాడిగా ఇజ్రాయెల్‌పై 4000 రాకెట్లు ప్రయోగించింది. 34 రోజులపాటు కొనసాగిన ఈ ఘర్షణల్లో లెబనాన్‌లో 1125 మంది మరణించగా, వీరిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉన్నారు. అటు 119 ఇజ్రాయెల్ సైనికులు, 45మంది పౌరులు కూడా మరణించారు.
ఈ ఘర్షణల నుంచి బయటపడిన హిజ్బొల్లామరింత బలపడింది. అనంతరం ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు, లెబనాన్ ఆర్మీల నిరంతర పర్యవేక్షణ వలన మళ్లీ ఎలాంటి దాడులు జరగలేదు.

ప్రాబల్యం..
2008లో పాశ్చాత్య దేశాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హెజ్బొల్లాను అణిచివేయడానికి ప్రయత్నించింది. బేరూత్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చీఫ్ తొలగింపు, ప్రైవేట్ కమ్యూనికేషన్లపై నిషేధం వంటి చర్యలతో ప్రయత్నాలు చేసింది.
ఇందుకు ప్రతీకారంగా రాజధాని బేరూత్ నిర్భంధం, సున్నీ మద్దతు సంస్థలపై పోరాటం వంటి వ్యూహాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఈ ఘర్షణల్లో 81మంది చనిపోవడమే కాక, లెబనాన్‌లో కొత్త అంతర్యుద్ధానికి దారి తీశాయి. ప్రభుత్వం వెనక్కు తగ్గి హెజ్బొల్లాతో చర్చలు జరిపింది. చర్చల అనంతరం జరిగిన ఒప్పందాలను అనుసరించి హిజ్బొల్లాఅధికారాన్ని పంచుకోవడంతోపాటు, ‘వీటో’ అధికారాన్ని కూడా పొందింది.
2009 పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వంలో భాగమైంది.
ఏడాది తర్వాత హిజ్బొల్లాసెక్రటరీ జనరల్ షేక్ హసన్ నజ్రల్లా హిజ్బొల్లాసంస్థ రాజకీయ లక్ష్యాలను పేర్కొంటూ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. 1985లో విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్న కొన్ని అంశాలను సవరిస్తూ, ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
- గాజా: 'మురికి నీళ్లు తాగుతున్నా, నాకు వేరే ఆప్షన్ లేదు'
- ఇజ్రాయెల్ తెల్ల భాస్వరంతో గాజాపై దాడులు చేసిందా... ఈ స్మోక్ స్క్రీన్ ఆపరేషన్ ఎంత ప్రమాదకరం?
- ఫిల్లీస్ లాతోర్: ప్రమాదకరమైన ఆపరేషన్లు చేసిన లేడీ సీక్రెట్ ఏజెంట్
- నైట్‌క్లబ్స్, జూ, డ్రగ్స్ స్టోర్...ఒక జైలులో ఉండకూడని సౌకర్యాలన్నీ ఇక్కడ ఉంటాయి....
- ఇజ్రాయెల్‌పై మెరుపుదాడిలో హమాస్ మాస్టర్ మైండ్స్ వీరే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















