గాజా యుద్ధం: అమెరికా శాంతి ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఏమిటి, ఇజ్రాయెల్, గాజా ఏమంటున్నాయి?

అమెరికా, ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుని కలిసిన అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్
    • రచయిత, జెరెమీ హొవెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గాజాలో త్వరలోనే కాల్పుల విరమణ అమలవుతుందని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ చెప్పారు. ఆగస్టు 19న ఇజ్రాయెల్ శాంతి ప్రతిపాదనలను అంగీకరించిందని ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్ హమాస్ మధ్య శత్రుత్వానికి ముగింపు పలకడం, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ నుంచి హమాస్ తీసుకెళ్లిన బందీలను అప్పగించడం ఈ ఒప్పందంలో ప్రధాన అంశాలు. ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రావడానికి, ఇజ్రాయెల్, హమాస్ అభ్యంతరాలను పరిష్కరించేందుకు అమెరికా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్
ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బందీల విడుదలపై హమాస్, ఇజ్రాయెల్‌ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి

శాంతి ప్రణాళికలో ఏముంది?

ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయెల్‌లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2024 మేలో సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం శాంతి ఒప్పందాన్ని అమల్లోకి తీసుకు వచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు.

ఈ ఒప్పందం మూడు దశల్లో అమల్లోకి రానుంది.

మొదటి దశలో భాగంగా ఆరు వారాల పాటు “పూర్తి స్థాయి కాల్పుల విరమణ” అమల్లోకి వస్తుంది. గాజాలో జనావాసాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగుతుంది. ఇదే సమయంలో కొంతమంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది.

ఇందులో మహిళలు, జబ్బు పడినవాళ్లు, గాయపడిన వారు, వృద్ధులు ఉంటారు. బందీలకు బదులుగా ఇజ్రాయెల్ తమ దేశ జైళ్ళలో ఉన్న పాలస్తీనా ఖైదీలను కొందరిని విడుదల చేస్తుంది.

హమాస్ వద్ద ఇప్పటికీ 100 మందికి పైగా బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. వారిలో 71 మంది బతికే ఉన్నారని అంటోంది. 2023 అక్టోబర్ 7 కంటే ముందే హమాస్ చెరలో నలుగురు ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నారు. వారిలో ఇద్దరు చనిపోయి ఉండవచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది.

2023లో వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ 105 మంది బందీలను విడుదల చేసింది. వీరికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్ల నుంచి 240 మంది పాలస్తీనా ఖైదీలు స్వేచ్ఛ పొందారు.

శాంతి ఒప్పందంలో గాజా పునర్నిర్మాణానికి అవసరమైన ప్రణాళిక పొందు పరిచే అవకాశం ఉంది.

“బందీల విడుదల విషయంలో అమెరికా ప్రతిపాదనలకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి మరోసారి స్పష్టం చేశారు” అని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆగస్టు 19న ఒక ప్రకటనలో పేర్కొంది.

గాజా, ఇజ్రాయెల్, హమాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శాంతి ఒప్పందంలో భాగంగా గాజా పునర్నిర్మాణ పథకాన్ని చేర్చే అవకాశం ఉంది.

శాంతి ఒప్పందంలో ఎవరేం కోరుతున్నారు?

కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇప్పటికీ అనేక అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని భావిస్తున్నారు.

కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగడాన్ని హమాస్ వ్యతిరేకిస్తోంది.

హమాస్ పునరేకీకరణ, ఆయుధాల సేకరణ వంటి వాటిని అడ్డుకోవడానికి గాజాలో తమ బలగాలు ఉండటం అవసరం అనేది ఇజ్రాయెల్ వాదన.

అయితే ఈ ప్రతిపాదలనకు హమాస్ అంగీకరించడం లేదు.

ఇజ్రాయెలీ బందీలకు బదులుగా ఇజ్రాయెల్ విడుదల చేసే పాలస్తీనా ఖైదీల సంఖ్య విషయంలోనూ రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి.

“ఇది నిర్ణయాత్మక క్షణం, బహుశా చాలా ఉత్తమమైనది కూడా, బందీలను వెనక్కి తీసుకువచ్చేదుకు ఇదే ఆఖరి అవకాశం కావచ్చు. కాల్పుల విరమణతో ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను తిరిగి తీసుకురావచ్చు” అని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆగస్టు 19న ఇజ్రాయెల్‌లో ఉన్నప్పుడు చెప్పారు.

ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి విస్తృత ఆమోదం లభించిన తర్వాత ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులతో చర్చించేందుకు ఆంటోని బ్లింకెన్ కైరో చేరుకున్నారు.

గాజా, హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వైదొలగాలంటున్న హమాస్

‘కొత్తగా చర్చలు అవసరం లేదు’

“ఈ ఏడాది జులై 2న మధ్యవర్తుల ద్వారా కుదిరిన ఒప్పందాన్ని మేము అంగీకరించాం. అందువల్ల మళ్లీ కొత్తగా చర్చలు ఏమీ అవసరం లేదు. బెంజమిన్ నెతన్యాహు డిమాండ్ల మీద చర్చించాల్సిన అవసరం లేదు” అని ఖతార్ సభ్యుడు బసీమ్ నయీమ్ చెప్పారు.

శాంతి ఒప్పందం పట్ల హమాస్ “ఇప్పటికీ ఆసక్తి”తో ఉందని ఆయన చెప్పారు. “మేము వీలైనంత సరళంగా, సానుకూలంగా ఉన్నాం. అయితే ఇజ్రాయెల్ దీన్ని చేతకానితనంగా, బలహీనతగా భావిస్తోంది. అందుకే ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తోంది. కాల్పుల విరమణ వారికి ఇష్టం లేదు. స్వీయ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం నెతన్యాహు ఈ ప్రాంతాన్ని తగలబెట్టాలని అనుకుంటున్నారు” అని బసీమ్ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ స్పందించింది. హమాస్ పూర్తిగా మొండి వైఖరితో వ్యవహరిస్తోందని, శాంతి చర్చల బృందంపై ఒత్తిడి పెంచుతోందని టెల్ అవీవ్ ఆరోపించింది.

ఇజ్రాయెల్, హమాస్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శాంతి ఒప్పందం, బందీల విడుదలకు అనుకూలంగా ఆందోళన చేస్తున్న ఇజ్రాయెలీలు

ఇప్పటిదాకా ఏం జరిగింది?

2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మందిని హతమార్చింది. 251 మందిని బందీలుగా తీసుకెళ్లింది.

ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసింది. ఈ యుద్ధంలో 40,130 మంది చనిపోయారని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య శాఖ తెలిపింది.

యుద్ధంలో భాగంగా అనేక హమాస్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. తమ దాడుల్లో సొరంగాల్లో దాచిన అనేక రాకెట్లు, క్షిపణులు లభించాయని, పదుల సంఖ్యలో టెర్రరిస్టుల్ని తుదముట్టించామని ఇజ్రాయెల్ బలగాలు ప్రకటించాయి.

ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ బలగాల దాడిలో సోమవారం నాడు( 19-08-2024) ఆరుగురు మరణించారని, గాజా సిటీలో మరో నలుగురు చనిపోయారని పాలస్తీనియన్ మీడియా రిపోర్ట్ చేసింది.

ఇదిలా ఉంటే, త్వరలోనే శాంతి ఒప్పందం అమల్లోకి వస్తుందని బ్లింకెన్ చెబుతున్నారు. అయితే దీని మీద తమకు పెద్దగా ఆశలు లేవని ఇజ్రాయెల్, హమాస్ వర్గాలు బీబీసీకి చెప్పాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

వీడియో క్యాప్షన్, దాడుల్లో ఇప్పటికి 9 మంది పాలస్తీనీయుల మృతి

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)