ఒక్క కత్తెర 36 విమానాలను క్యాన్సిల్ చేయించింది

- రచయిత, గావిన్ బట్లర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జపాన్‌లోని ఒక విమానాశ్రయంలో బోర్డింగ్ గేట్‌ల సమీపంలో ఉన్న ఓ దుకాణంలో కత్తెర కనిపించకపోవడం తీవ్ర గందరగోళానికి దారితీసింది.
కత్తెర కనిపించకపోవడంతో భద్రత కారణాలతో ఏకంగా 36 విమానాలు రద్దు చేశారు. మరో 201 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
హక్కైడోలోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్ దేశీయ టెర్మినల్‌లో శనివారం ఉదయం ఇది జరిగింది.
రెండు గంటల పాటు భద్రతా తనిఖీలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో నిరీక్షించాల్సి వచ్చింది.
న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్ నిర్వహణ బాధ్యతలను హక్కైడో ఎయిర్‌పోర్టు చూస్తోంది.
డిపార్చర్ లాంజ్‌లోని ప్రయాణికులను పదేపదే తనిఖీలు చేశారు. దీంతో అక్కడ భారీ క్యూలు ఏర్పడ్డాయి.
పోయిన కత్తెర దొరక్కపోవడంతో రోజంతా తనిఖీలు కొనసాగాయి. అయితే, కత్తెర దొరకనప్పటికీ విమానాల రాకపోకలను మాత్రం పునరుద్దరించారు.

కత్తెర ఏమైంది?
పోయిందనుకున్న కత్తెర మరుసటి రోజు (ఆదివారం) అదే దుకాణంలో అధికారులకు దొరికింది.
దుకాణంలో ఒక వర్కర్‌కు ఆ కత్తెర దొరికినట్లు హక్కైడో ఎయిర్‌పోర్టు సోమవారం ప్రకటించింది.
అయితే, కనిపించకుండా పోయిన కత్తెర, దుకాణంలో దొరికిన కత్తెర ఒకటేనని నిర్ధరించుకునేంత వరకు బయటికి ప్రకటించలేదని అధికారులు తెలిపారు.
విమానాల రద్దు, ఆలస్యం కారణంగా చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
"మాకు వేచి ఉండటం తప్ప, వేరే మార్గం లేదు" అని ఒక ప్రయాణికుడు ఆ సమయంలో స్థానిక మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజల నుంచి ప్రశంసలు..
ఘటనపై దర్యాప్తు జరిపి, మళ్లీ ఇలాంటివి చోటుచేసుకోకుండా జాగ్రత్తపడాలని హక్కైడో విమానాశ్రయ అధికారులను జపాన్ రవాణా, పర్యాటక మంత్రిత్వ శాఖ సూచించింది.
‘స్టోరేజ్, మేనేజ్‌మెంట్ వ్యవస్థలో లోపం వల్ల ఇది జరిగిందని గుర్తించాం’ అని హక్కైడో విమానాశ్రయం పేర్కొంది.
‘హైజాకింగ్, ఉగ్రవాదం వంటి ఘటనలకూ ఇలాంటి వాటితో సంబంధం ఉండొచ్చని విమానాశ్రయానికి తెలుసు. కాబట్టి నిర్వహణ, భద్రతను మెరుగుపరచడానికి కృషి చేస్తాం’’ అని తెలిపింది.
ఈ సంఘటనపై విమానాశ్రయం ప్రతిస్పందించిన తీరును ఎక్స్‌లో నెటిజన్లు ప్రశంసించారు. జపాన్ గగనతల భద్రతపై వారి విశ్వాసాన్ని ఇది పునరుద్ఘాటించిందని తెలిపారు.
"న్యూ చిటోస్ సురక్షితమైన విమానాశ్రయం అని నాకు మరోసారి అర్థమైంది" అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.
ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ ఓఏజీ ప్రకారం జపాన్‌లోని అత్యంత రద్దీ విమానాశ్రయాలలో న్యూ చిటోస్ ఒకటి. ప్రపంచంలో అత్యధికంగా ప్రయాణించే దేశీయ విమాన సర్వీసులలో టోక్యో, సపోరో మార్గానిది రెండో స్థానం. ఈ మార్గానికీ న్యూచిటోస్ సర్వీసులు అందిస్తోంది. 2022లో కోటిన్నర మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














